'ల్యూటియల్ అగ్లీస్': పీరియడ్స్ దశలో కలిగే ఈ భావన ఏంటి? ఇది మహిళలపై ఎలా ప్రభావం చూపుతుంది?

    • రచయిత, ఎల్లా కిప్లింగ్
    • హోదా, బీబీసీ ప్రతినిధి
  • ప్రచురణ
  • చదివే సమయం: 7 నిమిషాలు

"నాకు మాత్రమే ఇలా అనిపిస్తోందా? బతికి ఉన్న వాళ్లలో నేను మాత్రమే అసహ్యంగా కనిపిస్తున్నానా?"

టిక్‌టాక్‌ వీడియోలో కెమెరాను చూస్తూ 30ల్లో ఉన్న ఓ మహిళ అడిగుతున్న వీడియో అది. అందులో వీడియో మీద "POV: Girls in their luteal phase" అనే క్యాప్షన్ కనిపిస్తోంది.

ఈ వీడియోను 24 లక్షల మంది చూశారు. వందల మంది కామెంట్ చేశారు.

"నాకూ అచ్చం ఇలాగే అనిపిస్తోంది" అని ఓ మహిళ రాశారు. "ఇంత కచ్చితంగా ఉండటం నాకు కోపం తెప్పిస్తోంది" అని మరొకరు కామెంట్ చేశారు.

సోషల్ మీడియాలో ఇలాంటి వీడియోలు వేల సంఖ్యలో ఉన్నాయి. వాటిలో మహిళలు "ల్యూటియల్ అగ్లీస్" గురించి బాధపడుతున్నారు.

"ల్యూటియల్ అగ్లీస్" అంటే రుతు చక్రంలోని రెండో భాగమైన లూటల్ దశలో హార్మోన్ల మార్పుల వల్ల మహిళలు తాము అందవికారంగా ఉన్నామనే మానసిక భావన.

ఈ దశ మహిళ రుతుచక్రం రెండో భాగంలో జరుగుతుంది. నెలసరి ప్రారంభమైనప్పుడు ముగుస్తుంది. ఈ సమయంలో ఈస్ట్రోజెన్ స్థాయిలు గణనీయంగా తగ్గుతాయి.

మరి "ల్యూటియల్ అగ్లీస్" అన్నది నిజంగానే ఉంటాయా?

హార్మోన్ స్థాయిల్లో మార్పు వల్ల ఈ సమయంలో మహిళల రూపం, నిద్ర, మానసిక స్థితిలో మార్పులు కనిపించవచ్చని మహిళల హార్మోన్ల నిపుణురాలు డాక్టర్ లూయిస్ న్యూసన్ చెబుతున్నారు.

"మన హార్మోన్లు మన చర్మాన్ని ప్రభావితం చేస్తాయి. మన కొల్లాజెన్‌ను కూడా ప్రభావితం చేస్తాయి. అందువల్ల చాలా మందికి చర్మం మరింత పొడిగా మారుతుంది. ముఖ కాంతి తగ్గుతుంది, మొటిమలు రావచ్చు" అని న్యూసన్ వివరించారు.

"వారికి పొట్ట ఉబ్బరం రావచ్చు. వక్షోజాల ఆకారంలో కూడా మార్పులు రావచ్చు" అని ఆమె చెప్పారు.

‘‘నా మెదడు స్లో మోషన్‌లో పని చేస్తున్నట్లు అనిపిస్తోంది’’

టిక్‌టాక్ వీడియోల్లో చెప్పిన విషయాలు తనకు కూడా వర్తిస్తాయని 25ఏళ్ల ఎలెనా స్పావెన్ చెప్పారు. తన రుతుచక్రం రెండో భాగంలో తన పొట్ట ‘బాగా ఉబ్బినట్లు’ అనిపిస్తోందని ఆమె చెప్పారు.

"నా చర్మం కాంతి కోల్పోయి కళావిహీనంగా అనిపిస్తుంది. మొత్తంగా చూస్తే మరింత అలసిపోయినట్టుగా కనిపిస్తుంది. అలాగే నా ఛాతీ మరింత బరువెక్కినట్లు అనిపిస్తుంది. నొప్పిగా ఉంటుంది" అని ఆమె చెప్పారు.

పీరియడ్స్ రావడానికి కొన్ని రోజుల ముందు ఈస్ట్రోజన్ స్థాయిలు తగ్గి ప్రొజెస్టెరోన్ స్థాయి పెరగడం వల్ల ఇలా జరుగుతుంది. హార్మోన్లలో ఇలాంటి మార్పుల వల్ల శరీరంలో ఆయిల్ ఉత్పత్తి పెరుగుతుందని యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ లండన్‌లో రీ ప్రొడక్టివ్ అండ్ మాలిక్యులర్ జెనెటిక్స్‌లో అసోసియేట్ ప్రొఫెసర్ డాక్టర్ హెలెన్ ఓనీల్ వివరించారు.

హార్మోన్ల మార్పు సమయంలో మీ శరీరం ఎక్కువ ద్రవాలను నిల్వ ఉంచుతుంది.

దీనివల్ల మీ ముఖం మరింత ఉబ్బినట్టుగా కనిపించడం, శరీరం మొత్తం లావైనట్లు అనిపించడం, వక్షోజాలు సున్నితంగా మారి ఉబ్బిపోవడం జరగవచ్చు.

ల్యూటియల్ దశలో తనకు నీరసంగా "ఉత్సాహం లేనట్టు" అనిపిస్తుందని లండన్‌లో అతిథ్య రంగంలో పనిచేస్తూ నటి కూడా అయిన ఎలెనా చెప్పారు.

"నా మెదడు స్లో మోషన్‌లో పని చేస్తున్నట్లు అనిపిస్తుంది. నేను తడబాటుకు గురయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అలాగే చాలా ఎక్కువగా మర్చిపోతుంటాను" అని ఆమె చెప్పారు

"ఇతరులతో కలవాలని అనిపించదు. అలాగే మనసంతా ఏదోలా ఉంటుంది"అని అన్నారు.

రుతుచక్రం గురించి మహిళలు మాడ్లాడుతున్నప్పటికీ, చాలామందికి దాని గురించి ఏం చేయాలో తెలియదని న్యూసన్ చెబుతున్నారు.

"ఈ మహిళలు నిజంగానే బాధపడుతున్నారు. అది వారి ఉద్యోగం, రోజువారీ పనులు, దైనందిన జీవితం లాంటి వాటిని ప్రభావితం చేస్తోంది" అని ఆమె అన్నారు.

మహిళల సమస్యల విషయంలో స్పందన కూడా నిరాశ కలిగించేదిగా ఉందని ఆమె చెప్పారు.

"అయ్యో, మీ టెస్టోస్టెరాన్ తగ్గింది, జిమ్‌కి వెళ్లొద్దు, రోజంతా దుప్పటి కప్పుకుని విశ్రాంతి తీసుకోండి’’ అని పురుషులకు చెబుతారా? మహిళలు దీన్ని భరించాల్సి రావడం అస్సలు ఆమోదయోగ్యం కాదు" అని న్యూసన్ అన్నారు.

ల్యూటియల్ దశలో మీ సంబంధాలు కూడా మారవచ్చని న్యూసన్ చెబుతున్నారు. ఫ్రీలాన్స్ జర్నలిస్ట్ హెన్రియెట్టా ఈ పరిస్థితిని అనుభవిస్తున్నారు.

"ప్రశాంతంగా ఉండి, ఎప్పుడూ నవ్వుతూ, నవ్విస్తూ ఉండే నా భాగస్వామిపై నాకు చిరాకు రావడమ, నేను కాఫీ తాగకపోవడం, తినకపోవడం లాంటివి నా ల్యూటియల్ దశలో జరిగే అవకాశం ఎక్కువ" అని 30ఏళ్ల హెన్రియెట్టా చెప్పారు.

ఇది ఆమె స్నేహ సంబంధాలపైనా ప్రభావం చూపుతోంది.

"నా స్నేహితులతో ఉంటే నేను అవసరానికి మించి వ్యక్తిగత విషయాలు పంచుకుని తర్వాత పశ్చాత్తాపపడతాను. లేదా వారి నుంచి పూర్తిగా దూరంగా ఉండి తర్వాత చింతిస్తా" అని ఆమె అన్నారు.

నిరాశ, నిస్పృహ

ల్యూటియల్ దశలో తనకు చాలా నిరాశ, నిస్పృహతో ఉన్నట్లు అనిపిస్తుందని హెన్రియెట్టా చెప్పారు. దీంతో పాటు తాను పనికిరానిదానిననే భావన కలగడం లేదా ఇబ్బంది కలిగించే అనుభవాల జ్ఞాపకలు మళ్లీమళ్లీ గుర్తుకు వస్తుంటాయని అన్నారు.

ఉద్యోగం చేసేటప్పుడు చూపు మసకబారడం, మాట్లాడేటప్పుడు ‘సాధారణ పదాలు’ కూడా గుర్తుకు తెచ్చుకోవడంలో ఇబ్బంది పడడం, ఏకాగ్రత లేకపోవడం వంటి లక్షణాలు ఇబ్బందికరంగా ఉంటాయని ఆమె చెప్పారు.

ఈ సమస్య గురించి మరింత అవగాహన అవసరమని ఆమె భావిస్తున్నారు.

"హార్మోన్లు మహిళల ఆరోగ్యంపై ఎలా, ఎందుకు ప్రభావం చూపుతాయనే విషయంలో ఇప్పటికీ అపోహలు ఉన్నాయి" అని ఆమె అన్నారు.

నెలసరి మొదలవగానే ఆమె హాయిగా ఉన్నట్లు భావిస్తారు.

ల్యూటియల్ దశ అనేది మహిళలు కేవలం "అలా ఒక్కసారిగా బయటపడగలిగేది కాదు" అని న్యూసన్ చెబుతున్నారు.

ప్రజలు ఈ లక్షణాలను "కేవలం ప్రీమెనుస్ట్రువల్ సిండ్రోమ్" అని కొట్టిపారేయవచ్చని ఇద్దరు పిల్లల తల్లి షార్లెట్ డాడ్స్ చెబుతున్నారు. ఆమె లక్షణాల్లో కడుపు ఉబ్బరం, ముఖంపై మొటిమలు, అలాగే ఏకాగ్రత లోపం ఉన్నాయి.

క్లయింట్లతో పని చేసే సమయంలో ఇవి ఆత్మవిశ్వాసాన్ని దెబ్బ కొడతాయని ఆమె చెబుతున్నారు.

షార్లెట్ డాడ్స్ ఇంటి నుంచి బేకింగ్ వ్యాపారాలను నిర్మించుకోవడంలో ప్రజలకు సహాయపడే బేకింగ్ బాసెస్ అనే బిజినెస్ గ్రూప్‌ను నిర్వహిస్తున్నారు.

"మీరు నా లాగే స్వయం ఉపాధి చేసుకుంటూ ఉంటే, మీ హార్మోన్లు మారుతున్నాయనే కారణంతో మీ క్యాలెండర్ ఒక్కసారిగా ఆగిపోలేదు" అని ఆమె అన్నారు.

ల్యూటియల్ దశ లక్షణాలను ఎలా ఎదుర్కోవాలి

రుతుచక్రం గురించి మరింత అవగాహన, చర్చ అవసరమని, ల్యూటియల్ దశ గురించి తన 24 ఏళ్ల వయసులో సోషల్ మీడియా గురించి తెలుసుకున్నట్లు ఎలెనా చెప్పారు.

"తమ శరీరాలు ఎలా పనిచేస్తాయనే ప్రాథమిక అంశాల గురించి మహిళలకు అవగాహన చాలా తక్కువ" అని ఓనీల్ చెప్పారు.

దీని వల్ల చాలామంది మహిళలు సహాయం కోసం టిక్‌టాక్‌ను ఆశ్రయిస్తున్నారు.

24 లక్షల మంది చూసిన ఓ వీడియోలో ఓ యువతి ఇలా ప్రశ్నించారు. "అమ్మాయిలూ మీ ల్యూటియల్ దశలో మెరుగ్గా అనిపించుకోవడానికి మీరు ఏమి చేస్తారు? నిజంగా ఇక నేను తట్టుకోలేకపోతున్నాను"

ఈ వీడియోలో వేల కొద్దీ కామెంట్లు వచ్చాయి. "వదులుగా ఉండే బట్టలు ధరించండి. అద్దాన్ని చూడకుండా ఉండండి" అని ఒకరు కామెంట్ చేస్తే, "చాక్లెట్ తినండి" అని మరొకరు చెప్పారు.

ల్యూటియల్ దశలో "నా భర్తను దూరంగా ఉంచుతాను" అని ఒకరు కామెంట్ చేశారు "ఒక వైన్ సీసాతో" టెలివిజన్ చూస్తూ దాన్ని ఎదుర్కొంటామని ఇంకొకరు చెప్పారు.

అయితే ఈ సలహా నిజానికి హాని కారకం కావచ్చు. మరి మహిళలు తమ ల్యూటియల్ దశ లక్షణాలను ఎలా ఎదుర్కోవాలి?

  • ఇది "తాత్కాలిక దశ" అని అర్థం చేసుకోవడం ముఖ్యమని ఓనీల్ చెబుతున్నారు.
  • ల్యూటియల్ దశలో పోషకాహారం కీలకమని తగినంత నీరు తాగడం ఉబ్బరం తగ్గించడంలో సహాయపడుతుందని ఆమె అన్నారు.
  • ఉప్పు ఎక్కువగా ఉన్న ఆహారాలను తగ్గించడం, మద్యం తాగకపోవడం, అలాగే శారీరక కదలికను కొనసాగించడం కూడా సహాయపడతాయి.
  • ప్రాసెస్డ్ ఫుడ్, మద్యానికి దూరంగా ఉంటే వాపు తగ్గుతుందని న్యూసన్ వివరించారు.
  • ల్యూటియల్ దశలో మీరు ప్రత్యేకంగా ఇబ్బంది పడుతున్నట్లయితే ఆరోగ్య నిపుణుడిని తప్పకుండా సంప్రదించాలని, మహిళలు తమ అవసరాల కోసం తామే ముందుకు వచ్చి మాట్లాడాలని న్యూసన్ ప్రోత్సహిస్తున్నారు.

"మొదటి, రెండో, మూడో అపాయింట్‌మెంట్‌లో తమకు ఆమోదయోగ్యంగా అనిపించే సాయం లభించకపోతే వారు మరొకరిని కలవాలి. ఈ లక్షణాలు సాధారణంగా వాటంతట అవే తగ్గిపోవు" అని ఆమె చెప్పారు.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,  ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)