You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
ఒకే వీర్యదాతకు పుట్టామని దశాబ్దాల తరువాత తెలుసుకున్న ఆ ముగ్గురు మహిళలు ఏం చేశారంటే..
- రచయిత, జెమ్మా డన్‌స్టాన్
- హోదా, బీబీసీ ప్రతినిధి
- ప్రచురణ
- చదివే సమయం: 5 నిమిషాలు
మీ జీవితం సాఫీగా సాగుతుండగా, ఏ 25వ ఏటో, 30వ ఏటో, మీరు తండ్రి అనుకున్న వ్యక్తి అసలు మీ నాన్నే కాదని తెలిస్తే ఎలా ఉంటుంది
నతాషా, జెమ్మా, హెలెన్‌లు సరిగ్గా ఇలాంటి పరిస్థితినే ఎదుర్కొన్నారు.
పుట్టిన కొన్ని దశాబ్దాల తరువాత, ఈ ముగ్గురు మహిళలు డీఎన్‌ఏ పరీక్షలు చేయించుకున్నాక, తామంతా ఒకే వీర్యదాత వల్ల పుట్టామని తెలుసుకున్నారు.
అయితే వీరు 1991లో పుట్టారు. అప్పటికీ వీర్యదాన విధానాలపై ఎలాంటి అజమాయిషీ లేదు. ఎలాంటి నిబంధనలు అమల్లో లేవు.
వారు తమను తాము "స్పెర్మ్ సిస్టర్స్"గా పిలుచుకుంటున్నారు. తమకు కొత్తగా లభించిన సోదరీ బంధాన్ని కలిసి అన్వేషిస్తున్నవారు, తొలిసారి కలిసిన సందర్భాన్న గుర్తు చేసుకుంటూ "అది ఒక నమ్మలేని కథలా అనిపించింది. ఏదో మాయలా అనిపించింది. ఆనందబాష్పాలు వచ్చాయి" అని వివరించారు.
జెమ్మా, హెలెన్ హిక్స్‌లు బెర్క్‌షైర్‌లో కలిసి పెరిగారు. తమను పెంచిన తండ్రే తమ బయోలాజికల్ తండ్రి అని వారు భావించారు.
అయితే కొన్నేళ్లకు వారు ఒక వీర్యదాత ద్వారా జన్మించినట్లు తెలుసుకున్నారు. అయితే తాము ఒకే దాత ద్వారా జన్మించారో లేదో అప్పట్లో ఉన్న పరిమిత రికార్డుల కారణంగా తెలుసుకోలేకపోయారు.
"ఆ రోజుల్లో వీర్యదానం వ్యవస్థపై ఎలాంటి నియంత్రణ ఉండేది కాదు. చాలామంది తల్లిదండ్రులకు వీర్యదానంతో పుట్టిన పిల్లలను తమ సొంత పిల్లల్లా పెంచాలని, వారికి తమ పుట్టుక గురించి నిజం చెప్పద్దని సూచించేవారు" అని సర్రేలో నివసిస్తున్న 36 ఏళ్ల జెమ్మా తెలిపారు.
బ్రిటన్‌లో సంతానోత్పత్తి నియంత్రణ సంస్థ హ్యూమన్ ఫర్టిలైజేషన్ అండ్ ఎంబ్రియాలజీ అథారిటీ 1991 సంవత్సరం ఆగస్టులో ఏర్పాటైంది. అనంతరం ఈ వ్యవస్థకి సంబంధించి మార్గదర్శకాలు అమల్లోకి వచ్చాయి.
జెమ్మా, హెలెన్‌లకు డీఎన్‌ఏ పరీక్ష ద్వారా తమకి ఒకే బయోలాజికల్ తండ్రి ఉన్నట్లు నిర్ధరణ కావడమే కాకుండా, తమతో పాటు, అదే వీర్యదాత వల్ల పుట్టిన సోదరిమణులను గురించి కూడా తెలుసుకున్నారు.
"నాకు శారీరకంగా కూడా చాలా వింతగా అనిపించేది. నేను ఎవరో నాకు తెలియనట్లుగా అనిపించేది. నేను చేసే ప్రతి చిన్న విషయాన్ని కూడా నా జన్యువుల ప్రభావమేనా అని ప్రశ్నించుకోవడం మొదలుపెట్టా" అని జెమ్మా చెప్పారు.
హాంప్‌షైర్‌లో నివసిస్తున్న 35 ఏళ్ల హెలెన్‌కు మొదట షాక్‌లా అనిపించినా తర్వాత ఈ విషయం ఒక స్పష్టతను ఇచ్చిందని తెలిపారు.
"నన్ను ఒక విచిత్రమైన ప్రశాంతత అలుముకుంది. నా జీవితంలోని కొన్ని సందర్భాలను నెమరు వేసుకున్నప్పుడు చాలా విషయాలపై క్లారిటీ వచ్చింది" అని ఆమె అన్నారు.
ఆ తర్వాత వారు అదే వీర్యదాత ద్వారా జన్మించిన మరో ఇద్దరు సోదరీమణులతో కూడా కనెక్ట్ అయ్యారు. వారిలో ఎస్సెక్స్‌లో నివసిస్తున్న 36 ఏళ్ల నతాషా గోల్డ్‌స్టీన్ ఒపాసియాక్ ఒకరు.
21 ఏళ్ల వయసులో తాను వీర్యదాత ద్వారా జన్మించిన విషయం తెలుసుకున్నప్పటికీ, 31 ఏళ్ల వయసులోనే డీఎన్‌ఏ పరీక్ష చేయించుకున్నారామె.
"నాలోని మరో సగం ఎలా ఉందో తెలుసుకోవాలనే ఆసక్తితోనే పరీక్ష చేయించుకున్నాను. నాకు తోబుట్టువులు దొరుకుతారని కలలో కూడా అనుకోలేదు" అని ఆమె అన్నారు.
"మీకు బంధువులు ఉన్నారని ఒక ఈమెయిల్ నోటిఫికేషన్ వచ్చింది. అదేదో టిండర్ నోటిఫికేషన్‌లానే అనిపించింది. మీకు మ్యాచ్ అయిందని, ఇదిగో మీ సవతి సోదరీమణులు అని ఆ నోటిఫికేషన్ చెప్పింది" అని ఆమె అన్నారు.
హెలెన్, జెమ్మాలు నతాషాను సంప్రదించగా, నెల రోజుల్లోనే ఈ ముగ్గురు కలుసుకోవాలని నిర్ణయించుకున్నారు.
‘‘మేము మొదటిసారి కలవగానే అయిస్కాంతాల్లా కలిసిపోయాం’’ అని జెమ్మా గుర్తు చేసుకున్నారు.
"నతాషాతో టేబుల్ వద్ద కూర్చున్న నిమిషం వ్యవధిలోనే మేము ఒకేలా మాట్లాడతామని, అనేక విషయాలపై మాకు ఏకాభిప్రాయం ఉందని గుర్తించాం. అది కొంచెం విచిత్రంగానే ఉన్నప్పటికీ అద్భుతంగా అనిపించింది" అని ఆమె చెప్పారు.
15 ఏళ్ల కిందట లీడ్స్‌లోని ఒకే విశ్వవిద్యాలయంలో జెమ్మా, నతాషా ఒకే హాస్టల్లో నివసించారు.
"చిన్నప్పటి నుంచి ఒకరికొకరం దూరంగా ఉండటం చాలా బాధాకరం. మేము కలిసి తిరగగలిగే, కలిసి పుట్టినరోజు వేడుకలు జరుపుకునే అవకాశాలను కోల్పోయాం. ఇంకా ఎంతో కోల్పోయామని అనిపిస్తుంది" అని జెమ్మా అన్నారు.
ముగ్గురిలోనూ సృజనాత్మకతతో సహా ఎన్నో పోలికలు ఉన్నాయి. జెమ్మా ఆర్ట్స్‌ను, హెలెన్ సంగీతాన్ని, నతాషా డాన్స్ ను నేర్చుకున్నారు. ముగ్గురూ ఏదో ఒక సమయంలో తమ రంగంలో టీచర్‌గా పనిచేశారు.
తమ వారసత్వాన్ని తెలుసుకోవడం వ్యక్తిత్వంపై ఎలా ప్రభావం చూపుతుందో ముగ్గురు సోదరీమణులు వివరించారు.
జెమ్మా, హెలెన్‌లను పెంచిన తండ్రి వెల్ష్ మూలాలు కలిగినవారు. చిన్నప్పటి నుంచి వారు వేల్స్‌ను సందర్శిస్తూ, వేల్స్ రగ్బీ జట్టుకు అభిమానిస్తూ పెరిగారు.
"వెల్ష్ గుర్తింపు మా పెంపకంలో చాలా ముఖ్యమైన భాగం" అని జెమ్మా తెలిపారు.
యాదృచ్ఛికంగా డీఎన్‌ఏ పరీక్షలో వారి వీర్యదాత కూడా కొంతవరకు వెల్ష్ మూలాలు కలిగి ఉన్నట్లు తేలింది.
తమ బయోలాజికల్ తండ్రి ఎవరో వారు తెలుసుకోగలిగారు. ఆయనను సంప్రదించగా ఆయన ఎంతో ఆప్యాయంగా స్పందించినట్లు వారు తెలిపారు.
1991 నుంచి బ్రిటన్‌లో లైసెన్సు పొందిన క్లినిక్‌ల ద్వారా వీర్యదాత చికిత్సల ఫలితంగా 85 వేల మందికి పైగా జన్మించినట్లు హ్యూమన్ ఫర్టిలైజేషన్ అండ్ ఎంబ్రియాలజీ అథారిటీ తెలిపింది.
2005లో బ్రిటన్ చట్టాల్లో వచ్చిన మార్పుల కారణంగా వీర్యం, అండాలను అజ్ఞాతంగా దానం చేయడం ఇకపై సాధ్యం కాదు.
దీంతో అండం, వీర్య దానం ద్వారా జన్మించిన పిల్లలు 18 ఏళ్లు నిండిన తర్వాత తమ దాతకు సంబంధించిన సమాచారం తెలుసుకుని వారిని సంప్రదించేందుకు ప్రయత్నించవచ్చు.
ముగ్గురూ తమను తాము విడదీయలేని "స్పెర్మ్ సిస్టర్స్"గా భావిస్తున్నారు. అదే పేరుతో ఒక పాడ్‌కాస్ట్‌ను కూడా ప్రారంభించారు.
"ముగ్గురమూ చాలా ఒంటరితనాన్ని అనుభవించాం. ఈ విషయంపై మాట్లాడటం ద్వారా సమాధానాలు కనుగొనగలమని, ఒకరినొకరం బాగా తెలుసుకోగలమని భావించాం" అని నతాషా తెలిపారు.
"ఈ పాడ్‌కాస్ట్ ద్వారా మేము మా సహోదర బంధాన్ని నిర్మించుకున్నాం" అని ఆమె చెప్పారు.
ఈ పాడ్‌కాస్ట్ వల్ల హెలెన్‌తో తన బంధం మరింత బలపడిందని జెమ్మా అన్నారు.
దాతల ద్వారా జననం గురించి అవగాహన పెంచేందుకు కూడా ఈ ముగ్గురు ఆసక్తి చూపుతున్నారు. ఈ విషయం గురించి చాలామంది ఓపెన్‌గా చర్చించుకోరని నతాషా అన్నారు.
వీర్యదాత ద్వారా తాను జన్మించిన విషయాన్ని ఇతరులకు చెప్పినప్పుడు, దానర్థమేంటో తెలియక అయోమయమైన స్పందనలు వస్తాయని ఆమె చెప్పారు.
ప్రస్తుతం మెరుగైన నిబంధనలు ఉన్నప్పటికీ, దాతల ద్వారా జన్మించిన పిల్లలందరికీ తగిన రక్షణ లేదని వారు పేర్కొన్నారు.
తమకు ఇంకా ఎంతమంది సోదరులు లేదా సోదరీమణులు ఉన్నారో ఈ ముగ్గురికీ తెలియదు. వారు జన్మించిన సమయంలో ఒక దాత గరిష్ఠంగా 10 కుటుంబాలకే వీర్యదానం చేయాలన్న నిబంధన అమల్లో లేదు.
ఇటీవల బీబీసీ వేల్స్ దర్యాప్తులో సామాజిక మాధ్యమ వేదికలు, యాప్‌ల ద్వారా నియంత్రణలేని వీర్యదానం విస్తృతంగా పెరుగుతోందని వెలుగులోకి వచ్చింది.
"దాతల వివరాలు వారికి తెలిసేలా చేయడానికి, వ్యవస్థను నియంత్రించడానికి హ్యూమన్ ఫర్టిలైజేషన్ అండ్ ఎంబ్రియాలజీ అథారిటీ ఎంతో కృషి చేసింది" అని జెమ్మా తెలిపారు.
"చట్టాలు ఎంతో మెరుగుపడ్డాయి. కానీ ఫేస్‌బుక్ వంటి వేదికల ద్వారా జరిగే వీర్యదానాల పెరుగుదలతో ఆ కృషి మళ్లీ వెనక్కి వెళ్లుతున్నట్లు అనిపిస్తోంది.
మేము ఎలాంటి నియమాలు లేని కాలంలో జన్మించాం. ఇప్పటికీ పరిస్థితి అంత భిన్నంగా అనిపించడం లేదు. దాతల ద్వారా జన్మించే తదుపరి తరం పిల్లల కోసం మేము ఒక గొంతుకగా మారగలిగితే, ఈ విషయాన్ని రహస్యంగా ఉంచాలా వద్దా అనే విషయంలో తల్లిదండ్రులు మరోసారి ఆలోచించేలా చేయగలమని ఆశిస్తున్నాం" అని ఆమె అన్నారు.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్, ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)