You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
ఫెమోస్ఫియర్: శృంగారాన్ని పక్కనబెట్టి 'అధిక విలువ' ఉన్న పురుషుల కోసం వెతుకుతున్న మహిళలు
- రచయిత, డాలియా వెంచురా
- హోదా, బీబీసీ ప్రతినిధి
- ప్రచురణ
- చదివే సమయం: 9 నిమిషాలు
‘‘పురుషుడు జెంటిల్‌మెన్‌లా ఉండాలి, స్త్రీని ప్రసన్నం చేసుకోవాలి. ఆమె అందంగా తయారవ్వాలి, బిల్లు మాత్రం ఆయనే చెల్లించాలి. చొరవ కూడా ఆయనే తీసుకోవాలి. ఆమె కాస్త కఠినంగా ఉన్నట్లు నటించాలి. ముందస్తు కమిట్‌మెంట్ లేకుండా సెక్స్ అస్సలు వద్దు’’
పూర్వ కాలంలో కఠినమైన ప్రేమ నిబంధనలు ఉన్నప్పుడు లేదా మహిళా విముక్తి ఉద్యమం, ఆ తర్వాతి లైంగిక విప్లవం తెచ్చిన మార్పుల తర్వాత చాలామంది మహిళలు ఇలాంటి సలహాలనే వింటూ వచ్చారు.
ఉదాహరణకు, ఎల్లెన్ ఫెయిన్, షెర్రీ ష్నైడర్ రాసిన ది రూల్స్ హ్యాండ్‌బుక్ (1995) పుస్తకం కలల రాకుమారుడిని ఆకర్షించే వ్యూహాలను అందించి పెద్ద విజయం సాధించింది. అందులో మొదట తనే మాట్లాడకుండా ఉండటం, అస్సలు ఫోన్ చేయకపోవడం, ఎప్పుడూ బిల్లు కట్టకపోవడం, మొదటి డేట్స్‌లో గాఢమైన ముద్దులు కూడా పెట్టుకోకపోవడం వంటి నియమాలు ఉన్నాయి.
కానీ, ఇప్పుడు మనం ఇంటర్నెట్ యుగంలో ఉన్నాం. అలాగే నిరాశా నిస్పృహల యుగంలో కూడా. పరిస్థితులన్నీ చాలా వేగంగా, కాస్త ఇబ్బందికరంగా మారుతున్నాయి.
ఆధునిక ఆల్గారిథమ్‌లు, సామూహిక అసంతృప్తికి అమ్మమ్మల సలహాలు తోడైనప్పుడు ఏం మిగులుతుంది?
ఫెమోస్ఫియర్
ఇన్‌ఫ్లుయెన్సర్లు, ఫోరమ్‌లు, పాడ్‌కాస్ట్‌లు, సలహాలతో కూడిన 'ఫెమోస్ఫియర్' వ్యవస్థ.. మహిళలు తమ ప్రేమను పునరాలోచించుకోవాలని పిలుపునిస్తోంది. వారిని ఎలాంటి రొమాంటిక్ భ్రమల్లో ఉంచకుండా, సంబంధాలను ఎదుర్కొనే విధానాన్ని మార్చుకోమని చెబుతోంది.
అంతకుమించి, "పింక్ పిల్" తీసుకోమని ప్రోత్సహిస్తోంది.
'ది మ్యాట్రిక్స్' సినిమాలోని ప్రసిద్ధ 'రెడ్ పిల్' భావన ఆధారంగానే దీనిని తీసుకున్నారు. ఆ సినిమాలో కంటికి కనిపించని నిజాన్ని తెలుసుకోవడానికి ఈ 'రెడ్ పిల్' ను ఒక సంకేతంగా చూపిస్తారు.
పింక్ పిల్ విషయానికి వస్తే, ఆ నిజం దాగి లేదు, కేవలం ముసుగులో ఉంది. పురుషులు, మహిళల మధ్య ఉండే సంబంధాలు సహజంగానే పురుషులకు అనుకూలంగా, అసమతుల్యంగా ఉంటాయనేది వారి వాదన. అందుకే మగవారి ప్రవర్తనా తీరును గుర్తించడం నేర్చుకోవాలని, తమ ప్రమాణా ( స్టాండర్డ్స్) లను పెంచుకోవాలని, హానికరమైన సంబంధాలకు దూరంగా ఉండాలని సూచిస్తారు.
ఈ సినిమా రూపకాన్ని అప్పటికే 'మ్యానోస్ఫియర్' వాడుకుంది. మహిళల వల్ల తమకు ముప్పు ఉందని భావిస్తూ, దూకుడు వైఖరితో, దూషణలతో స్పందించే రకరకాల పురుషుల సమూహమే ఈ మ్యానోస్ఫియర్. వారి దృష్టిలో 'రెడ్ పిల్' అంటే స్త్రీల మోసాలను, పురుషులకు నష్టం కలిగిస్తున్న వ్యవస్థను గుర్తించి అప్రమత్తమవ్వడం.
ఈ పదాలను ఫెమోస్ఫియర్ తిరిగి తనదైన శైలిలో మార్చుకోవడం విచిత్రమేమీ కాదు. చివరికి చూస్తే, ఇది ఆ పురుషుల చీకటి ప్రపంచం చూపే దూకుడుకు ఒక రకమైన ప్రతిచర్యే. ఈ రెండు పరిణామాలను గమనించినప్పుడు వాటి మధ్య ఉన్న పోలికలు, అలాగే లోతైన వ్యత్యాసాలు త్వరగానే స్పష్టమవుతాయి.
'ఫెమోస్ఫియర్' అనే పదాన్ని సృష్టించిన డాక్టర్ జిల్లీకే చెప్పిన అత్యంత ముఖ్యమైన వ్యత్యాసం ఏంటంటే.. మ్యానోస్ఫియర్ లాగా ఇది "నిజ జీవితంలో సామాజిక ముప్పును గానీ, హింసను గానీ సృష్టించదు"
"కొన్ని సమూహాలు వారి వ్యూహాలను, భాషను ప్రతిబింబించినా, లేదా మగవారు మహిళలను తక్కువ చేసి చూసినట్లే వీరు కూడా మగవారిని తక్కువ చేసి మాట్లాడినంత మాత్రాన, ఇవి రెండూ సమానం కావు" అని జిల్లీకే బీబీసీ ముండోతో అన్నారు.
మ్యానోస్ఫియర్ అనేది మహిళలపై పురుషులు చేసే హింస తీవ్రరూపం దాల్చడమేనని, అది ఒక దీర్ఘకాలిక సామాజిక సమస్య అని లౌబరో విశ్వవిద్యాలయానికి చెందిన ఫెమినిస్ట్ కల్చరల్, మీడియా స్టడీస్ నిపుణురాలైన జిల్లీకే వివరించారు.
"ఫెమోస్ఫియర్ వల్ల పురుషులపై మహిళలు పెద్ద ఎత్తున హింసకు పాల్పడే సామాజిక పరిస్థితులు సమాజంలో లేవు" అన్నారామె.
సోషల్ మీడియా ద్వారా మహిళలు తమ అనుభవాలను పంచుకునే అవకాశం లభించిందని జిల్లీకే పేర్కొన్నారు.
అనేక ప్రాంతాల్లో ఇలాంటి ఒకే రకమైన పోలికలను చూసిన తర్వాత, "మగవారంతా ఎప్పటికీ మారరని, సామాజికంగా లేదా మానసికంగా వారిని మార్చడం అసాధ్యమనే ఆలోచనకు వారు వచ్చారు. అందుకే మహిళలంతా ఒకటై, ప్రణాళికలు వేసుకుంటూ పూర్తిగా స్వార్థపూరితంగా వ్యవహరించడం మొదలుపెట్టారు" అని ఆమె చెప్పారు.
"మ్యానోస్ఫియర్‌కు సమానమైన మహిళా కూటమి ఏదీ లేదు. పురుషులపై ఎలా దాడి చేయాలో, వారిని ఎలా హింసించాలో ఇతర మహిళలకు నేర్పించే వారు ఇక్కడ లేరు" అని బీబీసీ ఆఫ్రికాతో మహిళా హక్కుల కార్యకర్త, డిజిటల్ ప్లాట్‌ఫారమ్స్ నిపుణురాలు ఒన్యన్యేచి ఎజెనోవి అన్నారు.
"మేం మహిళలకు సాధికారతను నేర్పుతున్నాం, తమను తాము రక్షించుకుంటూ హక్కులు, సమానత్వం కోసం పోరాడేలా ప్రోత్సహిస్తున్నాం" అన్నారామె.
ఫెమోస్ఫియర్‌లోని అన్ని సిద్ధాంతాలతో ఏకీభవించకపోయినా, అది సాగుతున్న విధానాన్ని అర్థం చేసుకోగలనని ఎజెనోవి చెప్పారు. బీబీసీ కూడా దీనిని అర్థం చేసుకోవడానికి ప్రయత్నించింది.
పింక్ పిల్
మనం 'పింక్ పిల్' తీసుకుంటే మొదట అర్థమయ్యేది ఏంటంటే.. మహిళలు ఎన్ని పోరాటాలు చేసినప్పటికీ, ప్రపంచం ఇప్పటికీ పురుషులకే అనుకూలంగా నడుస్తోంది. వేతనాల్లో, పెన్షన్లలో వ్యత్యాసాలు ఇంకా భారీగానే ఉన్నాయి. ఉన్నత స్థానాలను అందుకున్న మహిళలు ఏ రంగంలోనైనా చాలా తక్కువ మంది ఉన్నారు. గృహ హింస, అత్యాచారాలు, వేధింపులు లేదా లైంగిక దాడుల కేసులపై న్యాయవ్యవస్థ ఇప్పటికీ సరైన రీతిలో స్పందించడం లేదు.
దీనికి తోడు, ఫెమోస్ఫియర్ ప్రకారం, గతంలోని ఫెమినిస్టులు మహిళలను మగవారిలా ప్రవర్తించమని ప్రోత్సహించారు. చివరికి అది పురుషులకే మేలు చేసింది. ఉదాహరణకు, పురుషులు ఆశించేది కేవలం తాత్కాలిక శారీరక సంబంధాలు మాత్రమేనని వారంటారు. అలాగే మహిళలు ఉద్యోగాలు చేస్తున్నప్పటికీ.. వైవాహిక జీవితంలో ఇంటి పని, కుటుంబ మానసిక భారం వంటివి ఎక్కువగా వారిపైనే పడుతున్నాయని వేలెత్తి చూపుతారు.
ఇందులో మీకు సంప్రదాయ ఫెమినిజం ఛాయలు కనిపిస్తుంటే, మీరు అనుకున్నది నిజమే. వాస్తవానికి ఫెమోస్ఫియర్‌లోని చాలామంది ప్రముఖులు తాము ఫెమినిస్టులమేనని ప్రకటించుకుంటారు. కానీ, ఈ పరిస్థితులపై వారి ప్రతిచర్యలు, వ్యూహాలు వేరుగా ఉంటాయి.
"వారు సమానత్వ సూత్రాన్ని తిరస్కరిస్తారు. ఎందుకంటే అది వారికి ఉపయోగపడలేదు. కాబట్టి వాస్తవికంగా ఉండాలనే ఆలోచనే దీని వెనుక ఉన్న మూల తత్వం. మీరు ఈ భయంకరమైన వాస్తవాన్ని గ్రహించి మేల్కోవాలి" అని జిల్లీకే చెప్పారు.
లింగ సమానత్వం అనేది అందుకోలేని ఒక భ్రమ అని భావిస్తే, "సమాజంలో పురుషులు, మహిళలకు చాలా స్పష్టమైన, భిన్నమైన పాత్రలు ఉంటాయనే సంప్రదాయ ఆలోచనను అంగీకరించడం మినహా మీరు చేయగలిగింది ఏమీ లేదు" అన్నారు.
మ్యానోస్ఫియర్ లాగే, ఫెమోస్ఫియర్‌లో కూడా స్త్రీ పురుషుల లింగ భేదాలు శారీరకంగా, మానసికంగా విభిన్నమైనవని భావిస్తారు. అయితే మ్యానోస్ఫియర్ దీనిని మహిళలు తక్కువ అనేదానికి నిరూపణగా చూస్తే, ఫెమోస్ఫియర్ మాత్రం పురుషులే సమస్య అనడానికి ఆధారంలా చూస్తుంది.
కానీ, పాత పద్ధతుల్లో ఈ వ్యవస్థపై రాజకీయ పోరాటాలు చేసే బదులు.. ప్రస్తుత పరిస్థితుల్లోనే మహిళలు వ్యక్తిగత స్వార్థంతో ఎలా లబ్ధి పొందాలో ఫెమోస్ఫియర్ వివరిస్తుంది.
ప్రతి మహిళ తనను తాను కాపాడుకుంటూ, అవాంఛనీయ పరిస్థితుల్లో పడకుండా ఉంటే మార్పు వస్తుందనేది ఇక్కడి ప్రధాన ఆలోచన. ఎందుకంటే తక్కువ విలువ కలిగిన పురుషులకు బాధితులు దొరకరు.
ఇలాంటి పరిస్థితుల్లో, సోషల్ మీడియా వేదికగా సాగుతూ.. పుస్తకాల రూపంలోనూ కనిపిస్తున్న ఈ ప్రపంచంలో ప్రయాణించాలంటే మనం అర్థం చేసుకోవాల్సిన కొన్ని ముద్రలు(లేబుల్స్) ఉన్నాయి.
అధిక విలువున్న వారి కోసం..
ఫెమోస్ఫియర్ అనేది విభిన్న సమూహాల కలయిక. కాబట్టి, ఏదో ఒక ఇన్‌ఫ్లుయెన్సర్‌తో లేదా 'ఫీమేల్ డేటింగ్ స్ట్రాటజీ' వంటి పాడ్‌కాస్ట్ వేదికలతో గుర్తింపు పొందిన అన్ని గ్రూపులు కచ్చితంగా ఒకే విధమైన నియమాలను పాటించవు. కానీ, ఈ వ్యవస్థను క్షుణ్ణంగా అర్థం చేసుకోవాలంటే.. ఆయా వేదికల్లో బాగా ప్రాచుర్యం పొందిన కొన్ని ముద్రలు, వర్గీకరణల గురించి తెలుసుకోవడం అవసరం.
ఫెమోస్ఫియర్‌లో మహిళలు జిమ్‌కు వెళ్లడం, చదువుకోవడం, చక్కగా దుస్తులు ధరించడం, తమ మానసిక బాధల నుంచి కోలుకోవడం ద్వారా తమను తాము అత్యుత్తమ రూపంలోకి మార్చుకోవాలని ప్రోత్సహిస్తారు.
దీనితో పాటు వారు 'డి-సెంటర్' అవ్వాలి. అంటే, తమ జీవితం మొత్తం కేవలం ప్రేమ చుట్టూనే తిరిగేలా చేసుకోకుండా, పురుషులను తమ జీవితానికి కేంద్రబిందువుగా మార్చకుండా, తమ ఆర్థిక స్వాతంత్ర్యంపై, మానసిక ప్రశాంతతపై దృష్టి పెట్టాలి.
ఇక్కడ లక్ష్యం అధిక విలువ ఉన్న మహిళ MAV (ముజెర్ డె ఆల్తో వాలోర్-అధిక విలువ ఉన్న మహిళ)గా మారడం, వ్యక్తిగత ఎదుగుదలను ప్రపంచానికి ఇచ్చే బహుమతిలా కాకుండా, పురుషుడి నుంచి కూడా దానికి సమానమైన పెట్టుబడిని ఆశించే ఒక వ్యూహాత్మక ఆస్తిగా చూడటం ప్రారంభించినప్పుడు ఇది సాధ్యమవుతుంది.
ఒకవేళ ఇంత కష్టపడిన తర్వాత కూడా ఆమె పురుషుల నుంచి వచ్చే అల్పమైన విషయాలను అంగీకరిస్తూ, ప్రేమ కోసం ప్రాధేయపడితే.. ఫెమోస్ఫియర్ ఆమెను హైలెవెల్ పిక్-మీ గా లేదా అమాయక మహిళగా వర్గీకరిస్తుంది.
ఈ విధంగా, స్థాయిని పెంచుకున్న మహిళ అంటే తన సొంత సౌందర్య, సామాజిక, మానసిక పెట్టుబడిని అంచనా వేసుకుని, తన విలువ ఏంటో తెలుసుకున్న మహిళ. ఆమె డేటింగ్ మార్కెట్‌లో ఇతరుల చేతిలో దోపిడీకి గురికాదు.
ఇలాంటి ఎంఏవీ మహిళలు HAV (హోంబ్రెస్ డె ఆల్తో వాలోర్ - అధిక విలువ ఉన్న పురుషులు) కోసం వెతుకుతారు.
ఈ మహిళల సిద్ధాంతం ప్రకారం, హెచ్ఏవీనే ఆదర్శ పురుషుడు. కుటుంబాన్ని పోషించేవారు, ఆర్థికంగా స్థిరపడినవారు, మానసికంగా పరిణతి చెందినవారు, గౌరవప్రదమైనవారు, నమ్మకస్థుడు, రక్షణగా నిలిచేవారు, ఉదార స్వభావం కలవారు.
దీనికి భిన్నంగా ఉండే తక్కువ విలువ ఉన్న పురుషుడు (ఎల్‌వీఎం), లోభిగా ఉంటాడు లేదా ఒక మహిళను పోషించడానికి అవసరమైన ఆర్థిక సామర్థ్యం, మానసిక స్థిరత్వం, రక్షణ కల్పించే గుణం ఆయనకు ఉండవు. ఆయన వృద్ధి చెందాలని అనుకోడు లేదా తాను ఏమీ ఇవ్వకుండానే ఎదుటివారి నుంచి శ్రద్ధను ఆశిస్తారు.
ఈ నిర్వచనాల్లో మరెన్నో విషయాలు ఇమిడి ఉన్నాయి, ఇంకా చాలా పదాలు కూడా ఉన్నాయి. కానీ చివరికి ఇక్కడ ఒకే ఒక సమీకరణం ఉంటుంది: ఏ బంధంలోనైనా పురుషుడే దాని విలువను పెంచాలి (యాడ్ అవ్వాలి) కానీ తగ్గించకూడదు (మైనస్ అవ్వకూడదు).
అందుకే, కాస్త విరుద్ధంగా అనిపించినప్పటికీ.. సాధికారత సాధించిన మహిళలతో నిండిన ఇలాంటి అనేక వేదికలలో ఎక్కువగా భాగస్వామిని ఎలా వెతుక్కోవాలనే వ్యూహాల గురించే మాట్లాడుకుంటారు.
కాకపోతే, కాస్త జాగ్రత్తగా.
పాటించాల్సిన నియమాలు
"మగవారంతా ఒకేలా ఉంటారు" అనే స్టేట్‌మెంట్‌పై ప్రశ్నిస్తే...
దానికి ఆ మహిళలు ఇచ్చే సమాధానం ఇది: "మగవారంతా ఒకేలా ఉండరని మాకూ తెలుసు. కానీ, నేను మీకు ఒక మిఠాయి బ్యాగ్ ఇచ్చి, అందులో పది శాతం విషం కలిపానని చెబితే... తినడానికి ముందు ప్రతిదానిని మీరు ఎంతో జాగ్రత్తగా పరిశీలించరా?".
ఎలాంటి జాలి చూపకుండా కచ్చితంగా ఆ జాగ్రత్తలు పాటించాలనేదే వారి సలహా. ఉదాహరణకు, వీరు విధించుకునే ప్రమాణాలు అస్సలు రాజీ పడలేనివి: తప్పు చేసిన పురుషుడికి ఒక ఎంఏవీ మహిళ ఎట్టి పరిస్థితుల్లోనూ రెండో అవకాశం ఇవ్వదు.
మొదటి డేట్ కోసం ఒక పురుషుడు తక్కువ ఖర్చుతో కూడిన పనులను ప్రతిపాదిస్తే (అంటే వాకింగ్ వెళ్లడం లేదా కాఫీ తాగడం లాంటివి), లేదా ఖర్చులను చెరో సగం పంచుకుందామని చెబితే.. అతడిని వెంటనే పక్కన పెట్టేస్తారు.
ఇంతకీ పురుషుడే ఎందుకు బిల్లు కట్టాలి?
పురుషులకు సాధారణంగా ఉండే ఎక్కువ సంపాదన శక్తి నుంచి మొదలుకొని.. ఆ డేట్ కోసం ఒక మహిళ మేకప్, డిపిలేషన్ (వ్యాక్సింగ్), డ్రెస్, హెయిర్ స్టైల్ కోసం ఎంత పెట్టుబడి పెట్టిందో లెక్కగట్టడం వరకు దీనికి అనేక కారణాలు చెబుతారు.
ఇవి కూడా లెక్కగడతారా?.. అవును, అయితే ఏంటి?.. ఇదే వారి వాదన.
మానసిక వైరాగ్యం, స్వీయ నియంత్రణే వారి ప్రధాన ఆయుధాలు: వారు ఎవరి ఆమోదం కోసమో లేదా ఒంటరితనం అనే భయంతోనో బంధాల్లో వ్యవహరించరు.
ఒక పురుషుడు తన ప్రయత్నాన్ని తగ్గించినా లేదా అనుమానాస్పద ప్రవర్తనను చూపించినా.. ఎంఏవీ మహిళ ఎలాంటి డ్రామాలు, వివరణలు, ఏడుపులు లేకుండా అక్కడి నుంచి తప్పుకుంటారు. ఆమె తన శ్రద్ధను ఒక పరిమితమైన వనరుగా భావిస్తారు.
ఇక ప్రేమలో పడటం, మోసపోవడం లాంటి వాటికి ఇక్కడ అస్సలు చోటు లేదు.
ఇదంతా ఒక రకమైన లావాదేవీలతో కూడిన, కృత్రిమమైన, భయంకరమైన ఆటలా అనిపించినప్పటికీ.. ఇక్కడ ఆసక్తికరమైన విషయం ఏంటంటే, ఈ వడపోతలు ఒక రకమైన మానసిక బుల్లెట్ ప్రూఫ్ జాకెట్‌లా పనిచేస్తాయి. తమతో కలిసి కూర్చునే పురుషుడు ఎలాంటి నార్సిసిస్ట్, మోసగాడు లేదా వేధింపులకు గురిచేసేవాడు కాకుండా చూసుకోవడానికి ఇవి ఉపయోగపడతాయి.
ఉదాహరణకు, నార్సిసిస్టులు, వేధింపులకు పాల్పడే స్వభావం ఉన్నవారు 'లవ్ బాంబింగ్' ( ప్రేమను కురిపించడం) అనే వ్యూహాన్ని ఉపయోగిస్తారు. మొదటి వారంలోనే నువ్వే నా ప్రాణం అని చెప్పడం, కవితలు, విపరీతమైన శ్రద్ధ, అంచనాలతో వారిని ముంచెత్తడం చేస్తుంటారు.
దీనివల్ల వచ్చే ప్రమాదాల గురించి పలువురు మహిళా కంటెంట్ క్రియేటర్లు హెచ్చరిస్తుంటారు. తమ ఫాలోవర్లు మానసికంగా కాస్త దూరంగా ఉండాలని సూచిస్తుంటారు. కాలక్రమేణా కనిపించే స్పష్టమైన, వాస్తవాల ఆధారంగానే పురుషుడి తీరును అంచనా వేయాలని వారు చెబుతారు. దీనివల్ల వేధింపులకు గురిచేసేవారు చేసే మానసిక మోసాలను లేదా మాయాజాలాన్ని ముందే అడ్డుకోవచ్చని సూచిస్తారు.
ఒకవేళ ఆ పురుషుడు తన మాటలను సుదీర్ఘకాలం పాటు గౌరవప్రదమైన, రక్షణ నిచ్చే ప్రవర్తనతో నిరూపించుకోలేకపోతే.. సదరు మహిళ మానసికంగా ఆయన బంధంలో చిక్కుకోకముందే ఈ వడపోత విధానం ఆయన్ను బయటకు నెట్టేస్తుంది.
మొదటి డేట్స్ కోసం ఈ గురువులు విధించే కఠినమైన నియమాలను మీరు గమనిస్తే.. అవి లైంగిక దాడుల నివారణ కోసం పోలీసులు, బాధితులకు మద్దతు ఇచ్చే సంస్థలు అందించే మార్గదర్శకాలతో సరిపోలుతాయి:
మొదటి కొన్నినెలల వరకు ఒక పురుషుడి ఇంటికి వెళ్లడం గానీ, లేదా ఆయన్ను తమ ఇంటికి ఆహ్వానించడం గానీ పూర్తిగా నిషిద్ధం. అలాగే ఆయన కారులో ఎక్కకూడదు. మహిళ తన సొంత రవాణా మార్గాల ద్వారానే రద్దీగా ఉండే ఒక బహిరంగ ప్రదేశానికి చేరుకోవాలని వారు డిమాండ్ చేస్తారు.
ఇవన్నీ కేవలం 'కఠినంగా నటించడానికి' ఉపయోగపడే వ్యూహాల్లా అనిపించినప్పటికీ.. లాజిస్టిక్స్ పరంగా చూస్తే, ఒక మహిళ తన ప్రయాణ నియంత్రణను పూర్తిగా తన చేతుల్లోనే ఉంచుకోవడానికి ఇవి గ్యారెంటీ ఇస్తాయి. దీనివల్ల ఒక తెలియని ప్రాంతంలో చిక్కుకుపోయి లైంగిక లేదా శారీరక దాడికి గురయ్యే ప్రమాదం తప్పుతుంది.
నిరాశ, వైరాగ్యాల మధ్య..
ఫెమోస్ఫియర్‌లో ఇలాంటి పరస్పర విరుద్ధమైన ధోరణులు కనిపించడం చాలా సహజం.
ప్రేమ గురించి వారు మాట్లాడే భాష మనల్ని కాస్త దిగ్భ్రాంతికి గురిచేసినప్పటికీ.. హఠాత్తుగా వారు చెప్పే కొన్ని విషయాలు మన ఆలోచనలతో ఏకీభవించేలా చేస్తాయి. పురుషులను కేవలం ఒక వాణిజ్య విలువ కలిగిన వస్తువులా వారు చూస్తున్నప్పుడు.. అదే సమయంలో తమను కూడా గౌరవించాలని, గుర్తించాలని వారు కోరుకుంటున్నట్లు మనం గమనించవచ్చు. వారి మాటలు ఒకవైపు మనకు కోపం తెప్పించినా, మరోవైపు మనల్ని నవ్వించేలా కూడా ఉంటాయి.
జిల్లీకే ప్రకారం, ఫెమోస్ఫియర్ ఒక నిజమైన సామాజిక సమస్యకు ప్రతిరూపంగా నిలుస్తుంది. స్త్రీ పురుషుల మధ్య జరిగే డేటింగ్ ప్రక్రియ మహిళలకు నిజంగానే చాలా కష్టతరంగా మారిందని ఆమె అంటారు. మహిళలపై ద్వేషాన్ని పెంచే పోర్నోగ్రఫీ సాధారణం కావడం, మానవ ప్రవర్తనలోని అత్యంత చెత్త కోణాలను బయటకు తీసే డేటింగ్ యాప్‌లు విస్తరించడం, లైంగిక హింస ముప్పు నిరంతరం పొంచి ఉండటమే దీనికి కారణం.
అయితే, ఈ సమస్యకు ఆ వ్యవస్థ చూపే పరిష్కారంలోనే అసలు లోపం ఉందని జిల్లీకే అంటున్నారు.
"అత్యాచారం, లైంగిక హింస అనేవి కొందరు పురుషులలో సహజంగా ఉండే ప్రవర్తనలుగా ఇక్కడ చూస్తారు. సమాజంలో అలాంటి వారు ఎప్పుడూ ఉంటూనే ఉంటారు కాబట్టి, అలాంటి తక్కువ విలువ కలిగిన పురుషులను నివారించడం మినహా మీరు చేయగలిగింది ఏమీ లేదు".
అంటే, సమాజం మారవచ్చు అనే ఆలోచనకు ఇక్కడ అస్సలు చోటు లేదు. ఇక్కడ హింస అనేది దాదాపు ఒక శారీరక ధర్మం, అనివార్యమైన విషయంగా మారిపోతుంది.
ఫెమోస్ఫియర్ అనేది కొన్ని ఫెమినిస్ట్ ఆలోచనల విచిత్రమైన, సంక్లిష్టమైన కలయిక అని జిల్లీ కే అభిప్రాయపడ్డారు. వారి ప్రాథమిక వాదనలతో ఏకీభవించకుండా ఉండటం కష్టమే అయినా, సదరు సమస్యలకు వారు చూపే పరిష్కారాలు మాత్రం చాలా తిరోగమనంగా (వెనక్కి నెట్టేలా) ఉంటాయని ఆమె అంటారు.
"దీనిని వర్ణించడానికి 'గందరగోళం' అనే పదం అత్యంత సరైనదని నేను భావిస్తున్నాను" అన్నారామె.
జిల్లీకే ప్రధానంగా విచారం వ్యక్తం చేసే విషయం ఏంటంటే.. "ఇది చాలా వాస్తవికమైన ఆలోచనలా అనిపించినప్పటికీ, చివరికి తీవ్రమైన నిరాశాకు దారితీస్తుంది. మనం రాజకీయాలను వదిలేయాలని, సమాజాన్ని మెరుగుపరిచేందుకు చేసే ఎలాంటి ప్రయత్నాలనైనా విరమించుకోవాలనే ఆలోచనను ఇది కలిగిస్తుంది".
ఇదే విషయాన్ని 'ఫెమినిజం' అని యువతులు అర్థం చేసుకుంటుండటంపై ఆమె ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
స్త్రీ పురుషులు ఎల్లప్పుడూ ఒకరితో ఒకరు యుద్ధం చేసుకుంటూనే ఉంటారని, సమాజంలో ఏదీ మారదనే ఈ నైరాశ్య దృక్పథాన్ని అంగీకరించని ఇతర మహిళా గ్రూపులు కూడా ఉన్నాయని జిల్లీకే గుర్తుచేశారు.
కానీ, "ప్రస్తుత డిజిటల్ మీడియాలో ఇటువంటి ప్రతికూల లేదా తీవ్రమైన లాజిక్‌లను సులభంగా ఆకర్షించే గుణం ఏదో ఉంది" అని ఆమె అన్నారు.
చివరికి ఫెమోస్ఫియర్ అనేది ఇక్కడే ఆగిపోతుంది: ఒకవైపు స్వీయ సహాయక పుస్తకంలా, మరోవైపు యుద్ధ ప్రకటనలా కనిపిస్తూ.. గుండెకు ఒక రక్షణ కవచాన్ని తొడుగుతామని ప్రమాణం చేస్తుంది. కానీ, అంతర్గతంగా మాత్రం, ఇది కూడా ఏనాటి నుంచో సాగుతున్న సాధారణ ప్రేమకథల లాగే ఒకే ఒక విషయాన్ని ఆశిస్తూ ఉంటుంది: ఎప్పటికైనా ఒక మంచి, విలువైన వ్యక్తి తన జీవితంలోకి రాకపోతాడా అని.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్, ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)