You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
అలిగి ఇంటి నుంచి వెళ్లిపోయిన కొడుకును 23 ఏళ్ల తర్వాత కలుసుకున్న కన్నతల్లి, ఎన్నో అడ్డంకులు అధిగమించి..
- రచయిత, సెల్వకుమార్, హర్మన్‌దీప్ సింగ్
- హోదా, బీబీసీ ప్రతినిధులు
- ప్రచురణ
- చదివే సమయం: 9 నిమిషాలు
(హెచ్చరిక: ఈ కథనంలోని వివరాలు మిమ్మల్ని కలచివేయొచ్చు).
''నా కొడుకు కోసం వెతుకుతూ ఏళ్ల తరబడి ఏడ్చాను. నేను పూజించే దేవుడు నా కొడుకును కాపాడి నాకు తిరిగి ఇచ్చాడు. మా అబ్బాయి కాళ్లకు సంకెళ్లు వేసి, హింసిస్తున్న దృశ్యాలు చూసినప్పుడు నేను తినలేకపోయాను. నిద్రపోలేకపోయాను. ఇప్పుడు 23 ఏళ్ల తర్వాత నా కొడుకును చూడబోతున్నాననే ఆలోచన చాలా సంతోషంగా ఉంది.''
పంజాబ్‌లో, పాకిస్తాన్ సరిహద్దుల్లో సంవత్సరాల తరబడి వెట్టిచాకిరీలో బందీ అయిన తన కొడుకును రక్షించి చట్టపరంగా తనతో పాటు తీసుకురావడానికి జులై 25, ఉదయం కోయంబత్తూరు నుంచి రైలులో బయలుదేరుతున్నప్పుడు తల్లి సుందరి బీబీసీతో చెప్పిన మాటలివి.
సుందరి ప్రయాణం ఎలాంటి ఆటంకాలు లేకుండా కొనసాగింది. తన కొడుకు ప్రకాశం దొరకడానికి సాయం చేసిన ముత్తయ్య సహాయంతోనే రైలులో పంజాబ్‌కు ప్రయాణించిన సుందరి 23 సంవత్సరాల తర్వాత జులై 28న ఆయన్ను కలుసుకున్నారు. కొడుకును గట్టిగా కౌగిలించుకుని ఆనందంతో కన్నీళ్లు పెట్టుకున్నారు. తన చేతులతో ఆయనకు అన్నం తినిపించారు.
తమిళనాడులోని విరుదునగర్ జిల్లాకు చెందిన సుందరి, ఆమె భర్త రామ్మూర్తి జీవనోపాధి కోసం 30 ఏళ్ల కిందట తమ ఇద్దరు కుమారులతో కోయంబత్తూరుకు వచ్చారు. వారు మొదట కౌండంపాళయంలోని ఎరుగంపెని ప్రాంతంలో నివసించారు.
పెద్ద కొడుకు ప్రకాశం నాలుగో తరగతితో చదువు ఆపేశారు. 2003లో ఆయనకు 16 ఏళ్ల వయసున్నప్పుడు, బైక్ విషయంలో తమ్ముడితో గొడవ జరిగింది. కోపంతో ఇంటి నుంచి వెళ్లిపోయారు. కుటుంబ సభ్యులు ఆయన కోసం చాలా చోట్ల వెతికినప్పటికీ ఆచూకీ దొరకలేదు. పోలీసులకు ఫిర్యాదు చేశారు. దానివల్ల కూడా ప్రయోజనం లేకపోయింది.
పంజాబ్‌లో వెట్టిచాకిరీలో మగ్గిపోయిన ప్రకాశం
కొన్నేళ్ల తర్వాత వాళ్లు నీలాంబూర్ ఆచ్చాంకుళం ప్రాంతానికి మారిపోయారు. ఎలక్ట్రికల్ అసిస్టెంట్‌గా, వాచ్‌మన్‌గా పనిచేసిన రామ్మూర్తి 2021లో క్యాన్సర్‌తో మరణించారు. సుందరి, ఆమె చిన్న కొడుకు ప్రభు అద్దె ఇంట్లో నివసిస్తున్నారు. ఆవులను మేపుతూ, కౌలుకి భూమి తీసుకుని కూరగాయలు పండిస్తూ జీవిస్తున్నారు.
తిరుప్పూర్‌కు చెందిన జర్నలిస్ట్ ముత్తయ్య సుందరిని వెతుక్కుంటూ వచ్చారు. ప్రకాశం పంజాబ్‌లోని ఒక సంరక్షణ కేంద్రంలో ఉన్నారని జూన్ నెలాఖరులో ఆమెతో చెప్పారు. ప్రకాశం ఫోటో చూపించి.. ఫోన్, వీడియో కాల్ ద్వారా మాట్లాడించారు. అప్పుడే సుందరికి తన కొడుకు బతికే ఉన్నాడని తెలిసింది.
పాకిస్తాన్ సరిహద్దుల్లో పంజాబ్‌లోని అమృత్‌సర్ జిల్లా అజ్నాలా గ్రామంలోని ఒక వ్యవసాయ క్షేత్రంలో ప్రకాశం 15 ఏళ్లకు పైగా వెట్టిచాకిరీలో ఉన్నారని ఆయన్ను రక్షించిన సంస్థ చెబుతోంది.
తమిళనాడులోని ప్రకాశం కుటుంబం కోసం అన్వేషణ
పటియాలాలోని అప్నా ఫోర్స్ సేవా సొసైటీ అనే స్వచ్ఛంద సంస్థ 2022లో ప్రకాశంను అక్కడి నుంచి రక్షించింది.
15 ఏళ్లకు పైగా ప్రకాశం అక్కడ బందీగా వెట్టిచాకిరీకి ఎలా గురయ్యారో ఆ సంస్థ బీబీసీ పంజాబీ ప్రతినిధికి వివరించింది.
పశువుల కాపరిగా ఉన్నప్పుడు ఆయనకు తగినంత ఆహారం, దుస్తులు, ఉండడానికి స్థలం లేదా జీతం ఏదీ ఇవ్వలేదు. ఆయన పారిపోకుండా రాత్రిపూట ఒక ఇనుప మంచానికి గొలుసులతో కట్టేసేవారు.
ఆయన్ను ఎలా కొట్టి, హింసించారో వివరించడంతో పాటు ఆ సమయంలో ప్రకాశం పరిస్థితికి సంబంధించిన ఫోటోలు, వీడియోలు కూడా ఆ సంస్థ తీసి భద్రపరిచింది. పంజాబీ అయిన సుభాశ్ చంద్ర ఆ ఫోటోలను ముత్తయ్య ద్వారా బీబీసీకి ఇచ్చారు.
హరియాణా అసెంబ్లీ కార్యదర్శిగా పదవీ విరమణ చేసిన సుభాశ్ చంద్ర సంరక్షణ కేంద్రాలను సందర్శించి, అక్కడి పరిస్థితులను పరిశీలించే సమయంలో ప్రకాశంను కలిశారు. ఆ సమయంలో, ప్రకాశం తక్కువ మాటలు మాత్రమే మాట్లాడగలిగారు. తన రాష్ట్రం తమిళనాడు అని చెప్పిన ప్రకాశం, ఆ తర్వాత తన స్వస్థలం ముంబయి అని కూడా చెప్పడంతో అసలు ఏ రాష్ట్రానికి చెందినవారో తెలుసుకోవడం సాధ్యం కాలేదు.
శారీరక, మానసిక చికిత్స తర్వాత, కొద్దిగా మాట్లాడటం మొదలుపెట్టిన ప్రకాశం తన స్వస్థలం కోయంబత్తూరు అని చెప్పారు. దీంతో, చెన్నైలోని సచివాలయంలో పనిచేసే తన స్నేహితుడు బాలకిషన్‌కు ప్రకాశం గురించి చెప్పిన సుభాశ్, ఆయన కుటుంబాన్ని గుర్తించడంలో సాయం చేయమని కోరారు.
బాలకిషన్ తిరుప్పూర్‌లోని పల్లడంలో నివసిస్తున్న తన సోదరుడు ముత్తయ్యకు ఈ విషయం చెప్పారు. స్థానిక వార్తాపత్రికలో జర్నలిస్టుగా పనిచేస్తున్న ముత్తయ్య.. బాలకిషన్ ఇచ్చిన సమాచారం ఆధారంగా ఎరుగంపెని ప్రాంతంలో స్వయంగా విచారణ జరిపారు. కానీ, ఆయనకు ఎలాంటి సమాచారం లభించలేదు.
కొన్ని నెలల తర్వాత ప్రకాశం తన స్వస్థలం అరుప్పుకోట్టై సమీపంలోని పూమాలైపట్టి అని చెప్పారు.
ఆ సమాచారం ఆధారంగా ముత్తయ్య చాలా నెలల పాటు అనేక మందిని విచారించారు. జూన్‌లో పూమాలైపట్టికి చెందిన వాసుకితో మాట్లాడారు.
సుందరి సోదరి కూతురైన వాసుకి.. ప్రకాశం తన అన్నయ్య అని గుర్తించి సుందరికి సమాచారం అందించారు. మూడేళ్ల అన్వేషణ తర్వాత ముత్తయ్య గత నెలలో సుందరిని కలిసి ప్రకాశం బతికే ఉన్నారని, పంజాబ్‌లో ఉన్నారని చెప్పారు.
ఆ తర్వాత జూలై మొదటి వారంలో ముత్తయ్య, ప్రకాశం తమ్ముడు ప్రభు, వారి ఇంటి పక్కనుండే సుందరలింగంతో కలిసి పంజాబ్‌లోని పటియాలాలో ఉన్న అప్నా ఫోర్స్ సేవా సొసైటీలో ప్రకాశంను కలవడానికి వెళ్లారు. కానీ, ప్రకాశం తల్లి సరైన పత్రాలతో వస్తేనే ఆయన్ను అప్పగించగలమని సొసైటీ నిర్వాహకులు చెప్పారు.
2005లో తీసుకున్న కుటుంబ రేషన్ కార్డులో ప్రకాశం పేరు ఉందన్న విషయం తప్ప సుందరి దగ్గర మరే ఇతర ఆధారాలు లేవు. తన కొడుకును తిరిగి తీసుకురావడానికి సాయం చేయాలని కోరుతూ సుందరి కోయంబత్తూరు జిల్లా కలెక్టర్‌కు వినతిపత్రం దాఖలు చేశారు.
కోయంబత్తూరు జిల్లా కలెక్టర్ పవన్ కుమార్ క్రియప్పనవర్ దాన్ని పరిశీలించి వెంటనే పంజాబ్ ప్రభుత్వ అధికారులతో మాట్లాడారు. అవసరమైన డాక్యుమెంట్లను అందించాలని వివిధ శాఖల అధికారులను ఆదేశించారు.
కొడుకును చూడగానే తల్లి ఏమన్నారంటే...
ప్రకాశం చదువుకున్న పాఠశాల నుంచి, విరుదునగర్ జిల్లా నుంచి ఆయనకు సంబంధించిన కొన్ని డాక్యుమెంట్లను కేవలం రెండు రోజుల్లోనే అధికారులు సేకరించారు. కోయంబత్తూరు కలెక్టర్ పవన్ కుమార్ ఆ డాక్యుమెంట్లన్నంటినీ జత చేసి, వాటితో పాటు ఒక లేఖను పటియాలా డిప్యూటీ కమిషనర్ హిమాన్షు అగర్వాల్‌కు పంపించారు.
తమిళనాడు ప్రభుత్వ అధికారులు జరిపిన దర్యాప్తులో ప్రకాశం సుందరి కుమారుడని నిర్ధరణ అయిందని, ఆయన్ను అప్పగించాలని సిఫార్సు చేశారు. వెట్టిచాకిరీకి గురైన ప్రకాశానికి చట్ట ప్రకారం అందాల్సిన నష్టపరిహారం అందేలా చర్యలు తీసుకోవాలని కూడా ఆయన ఆ లేఖలో ప్రస్తావించారు.
ఈ లేఖతో పాటు సుందరిని తీసుకుని ముత్తయ్య రైలులో పంజాబ్ వెళ్లారు. వారు అక్కడికి చేరుకున్నాక, చండీగఢ్ తమిళ్ సంఘం ప్రధాన కార్యదర్శి రాజశేఖర్‌తో సహా పలువురు నిర్వాహకులు సహాయం అందించారు.
జులై 28న అందరూ పాటియాలా జిల్లాలోని అజ్నాలాలో ఉన్న అప్నా ఫోర్స్ సేవా సొసైటీకి వెళ్లారు.
అక్కడ ప్రకాశంను లాంఛనంగా అప్పగించే పత్రాలపై సొసైటీ నిర్వాహకులు సంతకాలు తీసుకున్నారు.
23 ఏళ్ల తర్వాత తల్లీకొడుకులు కలుసుకున్నప్పుడు హృదయాన్ని కదిలించే ఘటన జరిగింది.
సిక్కులు ధరించే తలపాగా కట్టుకున్న ప్రకాశంను లోపలి నుంచి తీసుకొచ్చారు.
ఆయన్ను చూడగానే సుందరి గట్టిగా కౌగిలించుకుని ఏడ్చేశారు.
"ఎందుకు ఇక్కడికి వచ్చావు... ఇన్నేళ్లుగా మమ్మల్ని ఎందుకు ఏడిపించావు?
నేను పూజించే దేవుడే నిన్ను మా దగ్గరికి తిరిగి పంపించాడు. లేకపోతే నువ్వు ఇక్కడే ఉండిపోయేవాడివి. నేను నిన్ను ఎప్పటికీ చూడలేకపోయేదాన్ని" అని అంటూ విలపించారు.
తల్లిని చూసినప్పుడు ఒక్క మాట కూడా మాట్లాడని ప్రకాశం ఆమె పాదాలపై పడి కౌగిలించుకున్నారు. తన కొడుకును కాపాడిన సేవా సొసైటీ నిర్వాహకులకు సుందరి చేతులు జోడించి నమస్కరించారు.
"మీరు మాకు దేవుళ్లతో సమానం" అని అన్నారు.
అక్కడ వారికి భోజనం వడ్డించినప్పుడు, ఎన్నో సంవత్సరాల తర్వాత తన కొడుక్కి చిన్నపిల్లాడికి తినిపించినట్టు తన చేత్తో సుందరి అన్నం తినిపించారు.
అనంతరం వారిని పటియాలా జిల్లా డిప్యూటీ కమిషనర్ కార్యాలయానికి తీసుకెళ్లారు. అక్కడ జిల్లా డిప్యూటీ కమిషనర్ హిమాన్షు అగర్వాల్ తల్లీకొడుకులతో మాట్లాడారు.
"తమిళనాడుకు చెందిన ప్రకాశం తన కుటుంబంతో తిరిగి కలవడం సంతోషం. ఆయన 23 సంవత్సరాల క్రితం తన ఇంటి నుంచి అదృశ్యమై ఎలాగో పంజాబ్‌కు చేరుకున్నారని ఇటీవలే గుర్తించాం'' అని పటియాలా డిప్యూటీ కమిషనర్ హిమాన్షు అగర్వాల్ బీబీసీతో చెప్పారు.
"ఆయన్ను వెట్టిచాకిరీకి గురిచేసినట్టు సమాచారం అందింది. బాధితుడికి నిబంధనల ప్రకారం నష్టపరిహారం అందేలా చూడాలని, అలాగే ఆయనతో వెట్టిచాకిరీ చేయించుకున్న వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కార్మిక సంక్షేమ శాఖ, సాంఘిక సంక్షేమ శాఖ అధికారులకు ఆదేశాలిచ్చాం" అని డిప్యూటీ కమిషనర్ తెలిపారు.
ఆయన్ను ఎలా గుర్తించారంటే...
తల్లీకొడుకులు తిరిగి కలవడంలో కీలకపాత్ర పోషించిన హరియాణా శాసన సభ మాజీ కార్యదర్శి సుభాష్ చంద్ర "నేను దేశంలోని వివిధ ప్రాంతాల్లోని 22 స్వచ్ఛంద సంస్థలతో కలిసి పనిచేస్తున్నాను. ఈ సంస్థలు రక్షించిన, గుర్తుతెలియని వ్యక్తులను వారి కుటుంబాలతో తిరిగి కలిపేందుకు కృషి చేస్తున్నాను" అని అన్నారు.
"ప్రకాశం 2022 మే నెలలో ఈ ఆశ్రమానికి వచ్చారు. ఆ సమయంలో ఆయన రెండు మూడు పదాలు మాత్రమే మాట్లాడగలిగేవారు. నేను చెప్పిన మాటలనే ఆయన తిరిగి చెప్పేవారు. గత మూడేళ్లగా నేను ప్రకాశంను ఆయన కుటుంబం గురించి అడుగుతున్నాను. ఈ ఏడాది మే నెలలో ఆయన 'అరుప్పుకోట్టై', 'పూమాలైపట్టి', 'ఆనైకుళం' అనే పదాలను పలికారు" అని సుభాష్ చంద్ర బీబీసీకి వివరించారు.
ప్రకాశం చెప్పిన ప్రదేశాల పేర్లను ఆయన గూగుల్‌లో వెతగ్గా ఆ ప్రదేశాలు విరుదునగర్ జిల్లాలో ఉన్నాయని తేలింది. సుభాష్ విరుదునగర్ అని చెప్పగానే ప్రకాశం తలూపారు. ఆ తర్వాత తాను తన స్నేహితుడి ద్వారా ముత్తయ్యను సంప్రదించానని, ముత్తయ్య సుందరి ఉన్న ప్రదేశాన్ని కనుగొన్నారని సుభాష్ చంద్ర చెప్పారు.
‘తిరిగి వస్తాడని నా భర్త నమ్మాడు’
పంజాబ్‌లో జర్నలిస్టులు సుందరిని అడిగిన ప్రశ్నలను చండీగఢ్ తమిళ సంఘం కార్యనిర్వాహకులు ఇరుపక్షాలకు అనువదించి వివరించారు.
"మా అబ్బాయి మాతో ఉన్నప్పుడు బాగానే ఉన్నాడు. తన తమ్ముడితో గొడవపడి వెళ్లిపోయాడు. వాడిని అలా వెట్టిచాకిరీలో బంధించి ఉంచడాన్ని చూసినప్పుడు అలా ఉంచిన వ్యక్తిపై నాకు చాలా కోపం వచ్చింది" అని అన్నారు.
"నా భర్త చనిపోయేంత వరకు కొడుకు రాలేదని బాధపడ్డారు. కానీ, వాడు బతికే ఉంటాడని నమ్మారు. ప్రకాశం అంటే సూర్యుడు అని, సూర్యుడు ఎప్పటికీ మాయమవడు అని ఆయన చెబుతూ ఉండేవారు. నేను కూడా అది నమ్మాను. కానీ, కరోనా కాలంలో ఎంతోమంది చనిపోయినప్పుడు వాడు కూడా చనిపోయి ఉంటాడని అనుకున్నాను. వాడు బతికే ఉన్నాడని తెలిసిన క్షణంలో, దేవుడు కాపాడాడని నాకు అర్థమైంది" అని సుందరి అన్నారు.
"నేను నా కొడుకుని ఊరికి తీసుకెళ్లి మంచి ఆహారంపెట్టి బలంగా తయారుచేస్తాను. అమ్మాయి దొరికితే పెళ్లి చేస్తాను. లేకపోతే నేను చనిపోయేంత వరకు జాగ్రత్తగా చూసుకుంటాను. ముత్తయ్య, సుభాష్ చంద్ర, సేవా సొసైటీ వాళ్లు లేకపోతే నా కొడుకు నా దగ్గరికి చేరేవాడు కాదు. వారందరికీ నేను జీవితాంతం రుణపడి ఉంటాను'' అని సుందరి చెప్పారు.
"మేము ప్రకాశం కుటుంబాన్ని గుర్తించడానికి చాలా కష్టపడ్డాం. ఇప్పుడు తల్లీకొడుకులు తిరిగి కలుసుకున్నారు కాబట్టి జీవితంలో ఒక మంచి పని చేశామనే సంతృప్తి కలుగుతోంది" అని బీబీసీతో ముత్తయ్య అన్నారు.
"ప్రకాశంను తల్లితో తిరిగి కలిపేందుకు దేవుడు మమ్మల్ని ఒక సాధనంగా ఉపయోగించుకున్నాడు. చండీగఢ్ తమిళ్ సంఘం కూడా మాకు ఎంతో సహాయపడింది. పంజాబ్‌లో ప్రకాశం లాంటి వెట్టిచాకిరి కార్మికులు ఎంతోమంది ఉన్నారని సేవా సొసైటీ నిర్వాహకులు వివరించినప్పుడు, వారు అనుభవించిన అఘాయిత్యాల గురించి తెలుసుకున్నప్పుడు చాలా బాధ కలిగింది. వెట్టిచాకిరి లేని ప్రపంచాన్ని నిర్మించడానికి ప్రతిఒక్కరూ ఏకం కావాలి. ప్రకాశంను కాపాడినట్టుగానే ప్రతి ఒక్కరినీ కాపాడాలి" అని ఆయన అన్నారు.
కీలకపాత్ర పోషించిన ఇద్దరు ఐఏఎస్‌లు
"ఇది మానవత్వానికి దక్కిన విజయం. ఇందులో తమిళ్ సంఘం భాగస్వామ్యం కావడం నాకు సంతోషంగా ఉంది. ప్రకాశంను చట్టబద్ధంగా ఆయన తల్లితో తిరిగి కలిపే విషయంలో కోయంబత్తూరు జిల్లా కలెక్టర్ పవన్ కుమార్ చేసిన కృషి అపారమైనది. సుందరి పిటిషన్ దాఖలు చేసిన వెంటనే, ఆయన ఇక్కడి తమిళ ఐఏఎస్ అధికారి, పంజాబ్ ఉన్నత విద్యాశాఖ డైరెక్టర్ అయిన అరవింద్ కుమార్‌తో మాట్లాడారు. ఆయన పటియాలా డిప్యూటీ కమిషనర్‌తో మాట్లాడి అవసరమైన సహాయం అందించాలని సిఫార్సు చేశారు" అని చండీగఢ్ తమిళ్ సంఘం ప్రధాన కార్యదర్శి రాజశేఖర్ బీబీసీతో చెప్పారు.
పటియాలా డిప్యూటీ కమిషనర్ హిమాన్షు అగర్వాల్.. ఆ తర్వాత కార్మిక, సాంఘిక సంక్షేమ శాఖ అధికారులకు ఒక అధికారిక లేఖ రాశారని, దానివల్ల అప్పగింత ప్రక్రియ వేగవంతమైందని రాజశేఖర్ చెప్పారు.
ప్రకాశంతో వెట్టిచాకిరీ చేయించుకున్న వ్యవసాయ క్షేత్ర యజమాని మూడున్నర లక్షల రూపాయల నష్టపరిహారం చెల్లించడానికి అంగీకరించారని, దానికి అదనంగా ప్రభుత్వ నష్టపరిహారం కూడా అందుతుందని అధికారులు తమకు చెప్పారని ఆయన అన్నారు. అయితే, నష్టపరిహారానికి సంబంధించిన ఈ సమాచారాన్ని బీబీసీ స్వతంత్రంగా ధ్రువీకరించలేకపోయింది.
జులై 25న, సుందరి తన కొడుకును కలవడానికి పంజాబ్‌కు వెళ్లేందుకు కోయంబత్తూరు రైల్వే స్టేషన్ నుంచి బయలుదేరినప్పుడు బీబీసీ ఆమెతో మాట్లాడింది. ఆ సమయంలో సుందరి మాట్లాడుతూ, "నా కొడుకును ఎప్పుడు చూస్తానా అని చాలా ఆత్రుతగా ఉన్నాను. నేను ఇంత దూరం రైలులో ఎప్పుడూ ప్రయాణించలేదు. కానీ, నా కొడుకును తీసుకురావడానికి వెళ్తున్నాను కాబట్టి ఈ ప్రయాణం నాకు ఏ మాత్రం కష్టంగా అనిపించలేదు'' అని అన్నారు.
ప్రకాశంను కలిసిన తర్వాత బీబీసీతో సుందరి మాట్లాడారు.
"నేను నా కొడుకుని చూశాను. నాకు చాలా సంతోషంగా ఉంది. నేను పునర్జన్మ ఎత్తినట్లు అనిపిస్తోంది. 23 ఏళ్ల క్రితం నేను అతన్ని ఎలా చూశానో, ఇప్పటికీ అలాగే ఉన్నాడు. తమిళం మాట్లాడతాడో లేదో అని నేను ఆందోళన చెందాను. నాతో చాలా చక్కగా తమిళంలో మాట్లాడాడు."
" ఇకపై నన్ను విడిచిపెట్టి ఎక్కడికీ వెళ్లనని చెప్పాడు. మాకంటే ఎక్కువగా అతని అక్కచెల్లెళ్లు (సుందరి అక్కచెల్లెళ్ల కూతుళ్లు) నా కొడుకుని చూడాలని ఆత్రుతగా ఉన్నారు. ప్రకాశంను ఊరికి తీసుకువెళ్లాలి. నా కొడుకు జీవితంలో చాలా కష్టాలు పడ్డాడు. ఇకపై అతన్ని జాగ్రత్తగా చూసుకోవడమే నా ఏకైక బాధ్యత" అని సుందరి చెప్పారు.
బీబీసీ ప్రకాశంతో మాట్లాడినప్పుడు, ఆయన మామూలుగా మాట్లాడలేకపోతున్నట్లు అర్ధమైంది. అడిగిన ప్రశ్నలకు మాత్రమే సమాధానమిస్తూ మాట్లాడిన ప్రకాశం, "నేను మా అమ్మను చూశాను. నాకు చాలా సంతోషంగా ఉంది. నా కుటుంబాన్ని మళ్లీ చూస్తానని నేను అనుకోలేదు" అని అన్నారు.
( బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్, ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)