You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
ఎవా పెరాన్: ఈ అర్జెంటీనా ప్రథమ మహిళ భౌతికకాయాన్ని పాలకులే దొంగిలించి, 16 ఏళ్ల పాటు రహస్యంగా తిప్పారు...ఏమిటా కథ?
- రచయిత, ఫియోనా మెక్‌డొనాల్డ్
- హోదా, బీబీసీ ప్రతినిధి
- ప్రచురణ
- చదివే సమయం: 6 నిమిషాలు
(గమనిక: ఈ కథనంలోని కొన్ని వివరాలు మిమ్మల్ని కలవరపెట్టవచ్చు)
ఎవా పెరాన్ అర్జెంటీనా ప్రథమ మహిళ. ఆమె 1952 జూలైలో మరణించారు. అరవై సంవత్సరాల తర్వాత, 'ఆమె భౌతికకాయం మాయం కావడం, 16 ఏళ్ల పాటు ప్రపంచవ్యాప్తంగా అక్కడ ఇక్కడ అంటూ సాగిన దాని ప్రయాణం'పై బీబీసీ ప్రత్యేక కథనం అందించింది.
జూలై 26, 1952లో ఎవా పెరాన్ మరణించిన కొన్ని గంటలకే, డాక్టర్ పెడ్రో అరా తన పనిని ప్రారంభించారు.
రష్యన్లు లెనిన్, స్టాలిన్ పార్థివదేహాలను భద్రపరిచిన పద్ధతిలోనే, ఈయన అర్జెంటీనా ప్రథమ మహిళ శరీరాన్ని ఎంబామింగ్ (కుళ్లిపోకుండా భద్రపరచడం) చేసే బాధ్యతను తీసుకున్నారు.
ప్రజలు ఎంతో ప్రేమగా 'ఎవిటా' అని పిలుచుకునే ఆమె భౌతికకాయాన్ని కార్మిక శాఖ భవనంలో ఉంచారు. అక్కడ నిర్మించాలనుకున్న కార్మికుల స్మారక చిహ్నం కింద ఉండే గాజు శవపేటికలో ఆమెను శాశ్వతంగా ఉంచాలని ప్రణాళిక వేశారు.
అయితే, మూడు సంవత్సరాల తర్వాత, సెప్టెంబర్ 1955లో ఆమె భర్త, అధ్యక్షుడు జువాన్ పెరాన్‌పై సైన్యం తిరుగుబాటు చేసింది. దీంతో ఆయన పదవి కోల్పోయి ప్రవాసంలోకి వెళ్లారు.
ఎవా పెరాన్ భౌతికకాయాన్ని దొంగిలించాలని కొత్త ప్రభుత్వం నిర్ణయించడంతో, ఆ తర్వాత ఆ డెడ్‌బాడీ 16 ఏళ్ల పాటు అటూ ఇటు తిరగడానికి దారితీసింది.
ఆమె మృతదేహాన్ని కొన్నాళ్లు సైనిక నిఘా కేంద్రంలో ఉంచారు, తర్వాత కొంతకాలం వ్యాన్‌లో దాచారు, మిలాన్‌లో పూడ్చిపెట్టారు, మాడ్రిడ్‌కు తరలించారు. చివరికి అత్యంత కట్టుదిట్టమైన భద్రత గల సమాధిలో ఉంచడానికి బ్యూనస్ ఎయిర్స్‌కు తిరిగి తీసుకువచ్చారు.
సైనిక నియంతల భయం
ఎవా పెరాన్ 33 సంవత్సరాల వయసులో గర్భాశయ క్యాన్సర్‌తో మరణించిన తర్వాత, భర్త ఆమె భౌతికకాయాన్ని ఎంబామింగ్ చేయించడానికి రాజకీయ కారణాలు ఉన్నాయి. పేద గ్రామీణ నేపథ్యం, ప్రథమ మహిళగా ఆమె చేసిన సేవా కార్యక్రమాలు కార్మిక వర్గంలో ఆమెకు విపరీతమైన ఆదరణను తెచ్చిపెట్టాయి.
"ఆ శరీరాన్ని భద్రపరచడం ద్వారా, ఆ ఆదరణను అలాగే ఉంచాలని ఆయన భావించారు" అని పెరానిజం చరిత్రకారిణి ఫ్లావియా ఫియోరుచ్చి 2012లో బీబీసీతో చెప్పారు.
"పెరాన్, ఆయన రాజకీయ సిద్ధాంతమైన 'పెరానిజం' చిహ్నాలకు ఇచ్చే ప్రాముఖ్యతతో కూడా దీనికి సంబంధం ఉంది, వారికి ఎవిటా ఒక చిహ్నం" అన్నారామె.
ఆమె మరణించిన తర్వాత వారాల్లోనే ఆ విషయం స్పష్టమైంది. పారాఫిన్, గ్లిజరిన్ ఇంజెక్షన్ సాంకేతికతను ఉపయోగించి ఎవిటా శరీరం ప్రాణంతో ఉన్నట్లుగా ఉండేలా డాక్టర్ పెడ్రో అరా ఎంబామింగ్ చేశారు.
కాంగ్రెస్‌లో 14 రోజుల పాటు ఉంచిన ఆమె శవపేటికను చూడటానికి ఇరవై లక్షల మంది వచ్చారు. బతికున్నప్పుడు ఆమె పొందిన అభిమానం మరణానంతరం కూడా కొనసాగాయి.
ఎవిటా శరీరం ఒక చిహ్నంగా మారడమే తర్వాతి 16 ఏళ్ల పాటు సాగిన సుదీర్ఘ ప్రయాణానికి కారణమైంది. 1955లో పెరాన్ పదవి కోల్పోయినప్పుడు, జనరల్ పెడ్రో అరాంబురు నేతృత్వంలోని నియంతృత్వ ప్రభుత్వం పెరానిజం గుర్తులను పూర్తిగా అణచివేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఆమె మృతదేహం తిరుగుబాటుకు ఒక ఆయుధంగా (ప్రతీకగా) మారుతుందని ఆ ప్రభుత్వం భయపడింది.
ఇటలీకి రహస్యంగా తరలింపు
పెరానిస్టులు దానిని తిరిగి దక్కించుకోవడానికి ప్రయత్నిస్తారేమోననే భయంతో, ఆర్మీ ఇంటెలిజెన్స్ సర్వీస్ హెడ్ లెఫ్టినెంట్ కల్నల్ కార్లోస్ మూరి కోయినిగ్ ఆ భౌతికకాయాన్ని బ్యూనస్ ఎయిర్స్ అంతటా తిప్పారు. ఎవిటా మృతదేహాన్ని రాజధాని వీధుల్లో నిలిపిన వ్యాన్‌లో, ఒక సినిమా స్క్రీన్ వెనుక, నగర నీటి సరఫరా కేంద్రంలో దాచినట్లు ప్రచారం జరిగింది. అది ఎక్కడికి వెళ్లినా, అక్కడికి జనాలు పూలు, కొవ్వొత్తులతో వచ్చేవారు.
ఆ తర్వాత మృతదేహాన్ని కోయినిగ్ తన కార్యాలయానికి తరలించారు. అక్కడ ఆయన శవపేటికను నిలువుగా నిలబెట్టి, వచ్చే సందర్శకులకు చూపించేవారని చెబుతారు. ఆయనకు ఆ శవంపై ఒక విధమైన వ్యామోహం ఏర్పడినట్లు ప్రచారం జరిగింది.
"నాకు ఆయన మిలిటరీ స్కూల్ రోజుల నుంచి తెలుసు. ఆయన పూర్తిగా సాధారణ వ్యక్తిగా ఉండేవారు, కానీ ఆ మృతదేహం చేతికి చిక్కిన తర్వాత ఆయనకు పిచ్చి పట్టింది" అని కల్నల్ హెక్టార్ కాబానిల్లాస్ 1997 నాటి 'ఎవిటా, లా తుంబా సిన్ పాజ్' డాక్యుమెంటరీలో పేర్కొన్నారు.
"ఎవిటా కథలలో కల్పితాలు, నిజాలు ఎప్పుడూ కలిసిపోతుండటం వల్ల అసలు నిజాన్ని తెలుసుకోవడం కష్టం" అని అర్జెంటీనా విద్యావేత్త సిసిలియా మాకోన్ 2012లో బీబీసీతో చెప్పారు.
అయితే 1957లో కోయినిగ్‌ను విధుల నుంచి తొలగించడానికి ముందు, ఆయన తన సంరక్షణలో ఉన్న ఆ భౌతికకాయంపై తీవ్రమైన వ్యామోహాన్ని పెంచుకున్నారనేది ఒక కథనం.
ఆ తర్వాత ఎవా పెరాన్ మృతదేహాన్ని మాయం చేసే బాధ్యతను కాబానిల్లాస్‌కు అప్పగించారు. ఆయన 1957లో దానిని ఇటలీకి పంపించడానికి ఏర్పాట్లు చేశారు. మిలాన్‌లోని ఒక స్మశానవాటికలో 'మరియా మాగీ డి మాగిస్ట్రిస్' అనే పేరుతో ఎవిటాను పూడ్చిపెట్టారు. అయినప్పటికీ, ఎవా పెరాన్ మద్దతుదారులు ఆమెను మరచిపోలేదు. బ్యూనస్ ఎయిర్స్ గోడలపై "ఎవా పెరాన్ మృతదేహం ఎక్కడ ఉంది?" అని రాస్తూ నిరసనలు తెలిపారు. ఆ భౌతికకాయాన్ని తిరిగి తీసుకురావడం అర్జెంటీనాలోని పెరానిస్టులకు ఒక ప్రధాన నినాదంగా మారింది.
సైన్యం ఎవిటా భౌతికకాయాన్ని మాయం చేయడం వల్లనే దానికి మరింత ప్రాముఖ్యత చేకూరిందని ఫియోరుచ్చి భావించారు.
"ఎవిటా మృతదేహానికి కలిగించిన బాధ, కార్మిక వర్గానికి జరిగిన అన్యాయానికి ఒక చిహ్నంగా మారింది" అన్నారు.
భౌతికకాయం తిరిగొచ్చింది
1971లో అర్జెంటీనాలో మళ్లీ ప్రజాస్వామ్య పాలనను తీసుకురావాలని కొత్త ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. పెరానిస్టులపై ఉన్న ఆంక్షలను సడలించింది. ఎవిటా మృతదేహాన్ని జువాన్ పెరాన్‌కు అప్పగించడానికి అంగీకరించింది.
మాడ్రిడ్ శివార్లలోని ఒక విల్లాలో తన మూడవ భార్య ఇసాబెల్‌తో కలిసి ప్రవాసంలో జీవిస్తున్న మాజీ నియంతకు, ఆ భౌతికకాయాన్ని ఒక వెండి శవపేటికలో ఉంచి అప్పగించారు.
అప్పట్లో జువాన్ పెరాన్ సన్నిహితుడైన కార్లోస్ స్పాడోని ఆ మృతదేహాన్ని మొదట చూసినవారిలో ఒకరు. "జనరల్ పెరాన్, తోటమాలి, నేను కలిసి శవపేటిక నుంచి మృతదేహాన్ని బయటకు తీశాం" అని కార్లోస్ 2012లో బీబీసీతో చెప్పారు.
"మేం మృతదేహాన్ని ఒక మార్బుల్ టేబుల్‌పై పడుకోబెట్టాం. మా చేతులన్నీ మట్టితో నిండిపోయాయి. అందువల్ల ఆ శరీరాన్ని శుభ్రం చేయాల్సి వచ్చింది. ఇసాబెల్ ఒక కాటన్ గుడ్డ, నీళ్లతో ఆ పనిని చూసుకున్నారు. అంతకు మించి ఏమీ ఉపయోగించలేదు. చాలా జాగ్రత్తగా చేశారు. ఇసాబెల్ ఆమెకున్న పొడవైన దువ్వెనతో కొద్దికొద్దిగా దువ్వి, ఆపై బ్లో-డ్రై చేశారు" అని ఆయన అన్నారు.
ఆ తర్వాత ఏం జరిగిందనే దానిపై మళ్లీ కొన్ని కథనాలు ప్రచారంలోకి వచ్చాయి. ముఖ్యంగా మాజీ ప్రభుత్వ మంత్రి జోస్ లోపెజ్ రెగాకు ఉన్న మంత్రతంత్రాల నమ్మకాల చుట్టూ కథలు అల్లారు.
ఒక కథనం ప్రకారం, ఎవిటాకు ఉన్న రాజకీయ శక్తి ఇసాబెల్‌కు కూడా అబ్బాలనే ఉద్దేశంతో, ఎవా పెరాన్ మృతదేహం పక్కన పడుకోవాలని ఆ పెరానిస్ట్ రాజకీయనాయకుడు ఇసాబెల్‌కు చెప్పారు. ఇటువంటి నమ్మకాలు ఎవిటా అనుచరులకు ఆమెపై ఉన్న దాదాపు దైవభక్తిని ప్రతిబింబిస్తాయి. తన భర్తతో కలిసి అధికారంలోకి వచ్చిన ఆ మాజీ డ్యాన్స్ హాల్ గర్ల్, తనను ఆరాధించే వారికి ఒక ఆధ్యాత్మిక నాయకురాలిగా మారారు. వారికి ఆమె భౌతికకాయం చాలా పవిత్రమైనది. అయితే, పెరానిజం వ్యతిరేకులు ఆమెను తీవ్రంగా అసహ్యించుకునేవారు.
ఐదు మీటర్ల లోతున సమాధి
జువాన్ పెరాన్ 1973లో ఇసాబెల్‌ను వైస్ ప్రెసిడెంట్‌గా నియమించుకొని, అర్జెంటీనాలో తిరిగి అధికారంలోకి వచ్చారు. ఎవిటా భౌతికకాయం అప్పటికీ స్పెయిన్‌లోనే ఉంది. కానీ 1974లో జువాన్ అకస్మాత్తుగా మరణించిన తర్వాత, ఆమె మృతదేహాన్ని బ్యూనస్ ఎయిర్స్‌కు తీసుకువచ్చారు.
ఎవిటా మృతదేహానికి జరిగిన నష్టాన్ని సరిచేసే పని కోసం డొమింగో టెల్లెచియాను రాజధానిలోని ఒక బార్‌లో ఉన్నప్పుడు మొదటిసారి సంప్రదించారు.
"నల్లటి దుస్తులు ధరించిన ఇద్దరు లోపలికి వచ్చారు" అని టెల్లెచియా 2012లో బీబీసీతో చెప్పారు.
"వారు తలుపులు బార్లా తెరిచి మా వైపు చూశారు. ఆ రోజుల్లో మనుషులను పట్టుకెళ్లి మాయం చేసేవారు, వారు మళ్లీ కనిపించేవారు కాదు, అందుకే అది చాలా ప్రమాదకరమైన సమయం" అన్నారాయన.
కళాఖండాలు, పురాతన వస్తువులు, మానవ అవశేషాలను పునరుద్ధరించే నిపుణుడు టెల్లెచియా. ప్రభుత్వ డెత్ స్క్వాడ్‌లకు భయపడిన ఆయన, ఆ ఇద్దరు వ్యక్తులు కేవలం డ్రైవర్లని తెలిసి ఊపిరి పీల్చుకున్నారు. వారు ఆయనను ఎవా పెరాన్ మాజీ వ్యక్తిగత వైద్యుడు ఆస్కార్ ఇవానిస్సేవిచ్ వద్దకు తీసుకెళ్లారు.
"ఆయన నాతో, 'మేం మీకోసం ఒక పని అనుకున్నాం. ఎవా పెరాన్ భౌతికకాయాన్ని మీరు పునరుద్ధరించాలి' అన్నారు" అని టెల్లెచియ గుర్తుచేసుకున్నారు.
ప్రమాదాలు ఉంటాయని తెలిసినప్పటికీ టెల్లెచియా ఆ పనిని అంగీకరించారు.
"ఆ పని చేయడం అంటే మృతదేహాన్ని మాయం చేసిన వ్యక్తులకు వ్యతిరేకంగా నిలబడటమే. చాలామంది అసలు ఎవిటా మళ్లీ కనిపించకుండా ఉంటేనే బాగుండని కోరుకున్నారు. దీనివల్ల నాకు సమస్యలు వస్తాయని తెలుసు" అని టెల్లెచియా చెప్పారు.
"బెదిరింపులు వచ్చాయి, ఫోన్ ద్వారా హెచ్చరించారు, నా కారును తగులబెట్టారు" అన్నారు.
అర్జెంటీనాలో తరువాతి ప్రభుత్వాల హయాంలో క్రూరత్వం, హింసలు పెరిగిపోవడంతో టెల్లెచియా ఆ తర్వాత ప్రవాసంలోకి వెళ్లారు.
ఎట్టకేలకు అక్టోబర్ 1976లో, కేవలం కొద్దిమంది సమక్షంలో ఎవిటాను సమాధి చేశారు. ఆమె అవశేషాలకు ఇకపై ఎటువంటి అంతరాయం కలగకుండా ఉండేందుకు ఆ సమాధిని కట్టుదిట్టం చేశారు. మార్బుల్ సమాధి నేలలో ఒక రహస్య గదికి దారితీసే తలుపును ఏర్పాటు చేశారు. ఆ గదిలో.. ఆమె శవపేటిక ఉన్న మరొక గదికి దారితీసే రెండో తలుపు ఉంది. ఆమె మరణించిన 24 సంవత్సరాల తర్వాత కూడా, ఎవిటా అనే చిహ్నానికి ఉన్న ప్రాబల్యం వల్ల ఆమె భౌతికకాయాన్ని భూమికి 5 మీటర్ల లోతులో పూడ్చిపెట్టాల్సి వచ్చింది.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్, ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)