గ్లాస్గో కామన్వెల్త్ గేమ్స్: భారత్ ఖాతాలో 39 పతకాలు, 4వ స్థానానికి చేరిక

ప్రచురణ
చదివే సమయం: 4 నిమిషాలు

గ్లాస్గో కామన్వెల్త్ గేమ్స్-2026 ఆదివారం నాడు చివరిరోజుకు చేరుకున్నాయి. భారత్ ఖాతాలో ఇంకా మూడు పతకాల పోటీలు మిగిలి ఉన్నాయి. ఇవి కాకుండా జూడోలో కూడా భారత ఆటగాళ్ల నుంచి పతకాల ఆశలు ఉన్నాయి.

భారత్ ఇప్పటివరకు 39 పతకాలు సాధించి, పతకాల పట్టికలో నాలుగో స్థానానికి చేరుకుంది. ఈసారి భారత్ అత్యుత్తమ ప్రదర్శన బాక్సింగ్‌లోనే నమోదైంది. ఈ విభాగంలో భారత ప్లేయర్లు 7 బంగారు, 3 రజత పతకాలు గెలిచారు.

కామన్వెల్త్ గేమ్స్ చరిత్రలోనే బాక్సింగ్‌లో భారత్‌కు ఇది అత్యంత విజయవంతమైన ప్రదర్శన. వెయిట్‌లిఫ్టింగ్, జూడో, బాక్సింగ్‌లలో భారత్ చక్కని ప్రదర్శన కనబరిచింది.

మరోవైపు పారా గేమ్స్‌లోనూ భారత్ సరికొత్త చరిత్ర సృష్టించింది. 3 బంగారు, 2 రజత, 2 కాంస్య పతకాలతో కలిపి మొత్తం 7 పతకాలు గెలుచుకుంది. కామన్వెల్త్ గేమ్స్ పారా క్రీడల చరిత్రలో భారత్ సాధించిన మొత్తం పతకాల రికార్డుకు ఇది సమానం.

పదో రోజున 16 పతకాలు సాధించడంతో భారత్ మొత్తం పతకాల సంఖ్య 39కి చేరింది. ఇందులో 13 బంగారు, 17 రజత, 9 కాంస్య పతకాలు ఉన్నాయి. ప్రస్తుతం పతకాల పట్టికలో భారత్ నాలుగో స్థానంలో కొనసాగుతోంది.

ఇక పతకాల పట్టికలో 158 పతకాలతో ఆస్ట్రేలియా అగ్రస్థానంలో ఉండగా, 102 పతకాలతో ఇంగ్లండ్ రెండో స్థానంలో, 59 పతకాలతో కెనడా మూడో స్థానంలో ఉన్నాయి.

గుల్‌వీర్ సింగ్ రికార్డు

భారత అథ్లెట్ గుల్‌వీర్ సింగ్ శనివారం చరిత్ర సృష్టించాడు. 5000 మీటర్ల పరుగు పందెంలో పతకం సాధించిన మొదటి భారతీయుడిగా నిలిచాడు. అంతకుముందు కామన్వెల్త్ గేమ్స్‌లో ఈ విభాగంలో ఏ భారతీయ పురుషుడు లేదా మహిళ కూడా పతకం సాధించలేదు.

27 ఏళ్ల గుల్‌వీర్ ఒకే కామన్వెల్త్ గేమ్స్‌లో అథ్లెటిక్స్‌లో ఒకటికి పైగా పతకాలు సాధించిన మొదటి భారతీయ ట్రాక్ అండ్ ఫీల్డ్ అథ్లెట్‌గా నిలిచాడు.

గుల్‌వీర్ అంతకుముందు పురుషుల 10,000 మీటర్ల పరుగు పందెంలో రజత పతకం గెలిచి చరిత్ర సృష్టించాడు. కామన్వెల్త్ గేమ్స్‌లో ఈ విభాగంలో భారత్‌కు ఇదే తొలి పతకం.

ఆ తర్వాత ఆయన 5,000 మీటర్ల పరుగు పందెంలోనూ చక్కని ప్రదర్శన చేసి, కాంస్య పతకాన్ని సొంతం చేసుకున్నాడు. అతను 13 నిమిషాల 24.95 సెకన్ల సమయంలో రేసు పూర్తి చేశాడు.

కెన్యాకు చెందిన మాథ్యూ కిప్‌చుంబా కిప్‌సాంగ్ 13:23.61 సెకన్ల సమయంతో గోల్డ్ మెడల్ గెలుచుకున్నాడు

పురుషుల విభాగంలోనూ విజయం

పురుషుల బాక్సింగ్ విభాగంలో సచిన్ సివాచ్, అంకుష్ సత్తా చాటారు. ఇక, శనివారం లవ్లినా, జాదూమణి సింగ్ మినహా మిగిలిన భారతీయ బాక్సర్లందరూ తమ ఫైనల్ మ్యాచ్‌లలో విజయం సాధించారు. లవ్లినా ఆస్ట్రేలియాకు చెందిన ప్రస్తుత వరల్డ్ కాంస్య పతక విజేత ఎమ్మా సూ గ్రీన్‌ట్రీ చేతిలో 1-4 తేడాతో ఓటమిని ఎదుర్కొంది.

57 కిలోల విభాగంలో ప్రస్తుత ప్రపంచ ఛాంపియన్ జాస్మిన్ లంబోరియా, అనుభవజ్ఞురాలైన ఐరిష్ బాక్సర్ మికాయెలా వాల్ష్‌పై చక్కని ప్రదర్శన కనబరిచింది.

న్యూదిల్లీ కామన్వెల్త్ గేమ్స్ 2010లో భారత్ ఇప్పటివరకు అత్యుత్తమ ప్రదర్శన చేసింది. ఆ సమయంలో భారత్ 38 గోల్డ్, 27 సిల్వర్, 36 బ్రాంజ్ మెడల్స్‌తో కలిపి మొత్తం 101 పతకాలను గెలుచుకుంది

భారతీయ ఆటగాళ్ల ప్రదర్శన 2030లో అహ్మదాబాద్‌లో జరగబోయే కామన్వెల్త్ గేమ్స్ కోసం కూడా అంచనాలను బాగా పెంచింది.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,  ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)