ఉద్యమాన్ని విరమించడంలో సీజేపీ తొందరపడిందా.. ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా తరువాత ఇప్పుడు సీజేపీ దగ్గర సరైన అస్త్రమే లేదా?

ప్రచురణ
చదివే సమయం: 9 నిమిషాలు

కొద్దిరోజుల కిందట దేశంలో వేల మంది యువత తమ డిమాండ్లను నెరవేర్చాలంటూ వీధుల్లోకి వచ్చి ఉద్యమించారు.

వీధుల్లోకి వచ్చిన వారిలో విద్యార్థులే కాదు వారి తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు కూడా ఉన్నారు.

రోజులు గడుస్తున్న కొద్ది సమాజంలోని విభిన్న వర్గాల ప్రజలు కూడా ఈ ఉద్యమంలో చేరారు. ఈ ఉద్యమానికి కాక్రోచ్ జనతా పార్టీ (సీజేపీ) ముఖచిత్రంగా మారింది.

ప్రశ్నాపత్రాల లీకేజీ ఆగాలి, పేపర్ లీక్‌ కేసుల్లో దోషులుగా తేలిన వారికి కఠిన శిక్షలు ఉండాలి, పరీక్షల నిర్వహణ వ్యవస్థలో సంస్కరణలు రావాలి, జవాబుదారీతనం ఉండాలనే డిమాండ్లతో సీజేపీ, యువత వీధుల్లోకి రాగా వారికి సామాజిక కార్యకర్త సోనమ్ వాంగ్‌చుక్ కూడా తోడయ్యారు.

ఉద్యమం పెద్దది అవుతుండటంతో నిరసనకారులతో ప్రభుత్వం చర్చలు జరిపింది. తర్వాత కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాల్సి వచ్చింది.

పరీక్షల వ్యవస్థలో సంస్కరణలు తెస్తామని హామీ ఇచ్చిన ప్రభుత్వం.. పేపర్ లీక్‌లను అరికట్టడానికి బిల్లును ప్రవేశపెట్టింది. దీన్ని పార్లమెంట్ కూడా ఆమోదించింది.

ఇదంతా గమనిస్తే యువత చేసిన ఈ ఉద్యమం విజయవంతం అయిందని అనిపిస్తుంది. ప్రభుత్వం కూడా ఆ మేరకు చర్యలు తీసుకుంది. మరి, ఇక ఇంతటితో ఈ విషయం ముగిసిపోవాలి.

నిజానికి పరిస్థితి ఇలాగే ఉందా మరి?

ఎందుకంటే కేవలం శిక్షలను పెంచడం వల్ల పేపర్ లీక్‌లు ఆగిపోతాయా అని ప్రతిపక్షాలు ప్రశ్నిస్తున్నాయి.

పేపర్ లీకేజీకి సంబంధించి 2024 నుంచే కఠిన శిక్షలు, జరిమానాలు విధించే చట్టం అమల్లో ఉంది. అయినా కూడా 2026లో నీట్ పేపర్ లీక్ అయింది. అలాంటప్పుడు కేవలం శిక్షా కాలాన్ని, జరిమానా మొత్తాన్ని పెంచినంత మాత్రాన పేపర్ లీక్‌లను ఎంతవరకు అడ్డుకోగలరనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి.

కేవలం చట్టాన్ని కఠినంగా మార్చడం కోసం తాము ఉద్యమించలేదని, వ్యవస్థ మారాలనే ఉద్దేశంతో ఈ ఉద్యమం జరిగిందని సీజేపీ అంటోంది.

అదే సమయంలో... వరుసగా పేపర్ లీకులు అవుతుంటే దీనికి రాజకీయ, పరిపాలనాపరమైన బాధ్యత ఎవరిదని ప్రతిపక్షాలు అడుగుతున్నాయి. కొత్త చట్టాలు తెస్తే సరిపోతుందా? ప్రభుత్వానికి ఉన్న జవాబుదారీతనం ముగిసిపోతుందా అని ప్రశ్నిస్తున్నాయి.

ఇక్కడితోనే అయిపోలేదు.. సీజేపీ ఈ ఉద్యమాన్ని విరమించడంపై కూడా చాలా మంది ప్రశ్నలు లేవనెత్తారు.

ఉద్యమాన్ని సీజేపీ చాలా త్వరగా ముగించిందా? ప్రభుత్వం ఇచ్చిన హామీలను అతిగా నమ్మేశారా? గ్రౌండ్ లెవెల్లో మార్పులు అమల్లోకి వచ్చేదాకా ఆగి ఉండాల్సిందేమో అని కొందరు విద్యార్థులు, సామాజిక కార్యకర్తలు అంటున్నారు.

బీబీసీ న్యూస్ హిందీ కార్యక్రమం 'ది లెన్స్'లో కలెక్టివ్ న్యూస్‌రూమ్ డైరెక్టర్ ఆఫ్ జర్నలిజం ముకేశ్ శర్మ ఇవే అంశాలను విశ్లేషించారు.

ఈ కార్యక్రమంలో సీజేపీ అధికార ప్రతినిధి అశుతోష్ రాంకా, ద మోజో స్టోరీ ఎడిటర్ బర్ఖా దత్, ద ట్రిబ్యూన్ అసోసియేట్ ఎడిటర్ అదితి టాండన్ పాల్గొని తమ అభిప్రాయాలను పంచుకున్నారు.

'అసలు సమస్య ఎక్కడ ఉందో ప్రభుత్వం దాని గురించి మాట్లాడటం లేదు'

పేపర్ లీక్‌లను అడ్డుకోవడానికి తెచ్చిన కొత్త చట్టాన్ని ప్రభుత్వం చాలా గొప్పదిగా చెప్పుకుంటోంది.

దేశ యువత సమస్యలను, పేపర్ లీక్ సమస్యలను ఈ ప్రభుత్వం, వ్యవస్థ అంగీకరించడం అన్నింటికంటే చాలా సంతోషించాల్సిన విషయమని సీజేపీ అధికార ప్రతినిధి అశుతోష్ రాంకా అన్నారు.

పేపర్లు లీక్ కాకుండా అడ్డుకునేలా వ్యవస్థలో మార్పులు తీసుకురావడం వదిలేసి, పేపర్ లీక్ అయిన తర్వాత చేయాల్సిన చర్యలకే ప్రభుత్వం ప్రాధాన్యమిస్తోందని ఆయన పేర్కొన్నారు.

''పార్లమెంట్ ఆమోదించిన బిల్లులో మీరు పేపర్ లీకైన తర్వాత పరిస్థితి గురించే వివరించారు. ఫాస్ట్ ట్రాక్ కోర్టులు, కఠినమైన శిక్షలు, భారీ జరిమానాలు ఇవన్నీ దానికి సంబంధించినవే. అసలు పేపర్ లీక్‌ను అడ్డుకోవడానికి మీరు ఏం చేస్తున్నారనే దానిపై చర్చ జరగడం లేదు.

ఎన్‌టీఏలో సంస్కరణలు, ఎస్‌ఎస్‌సీని చట్టబద్ధమైన సంస్థగా మార్చడం, ఎగ్జామ్ క్యాలెండర్- సిలబస్‌లో పారదర్శకత, కోచింగ్ సెంటర్లు, వెండర్ల వ్యవహారాలు, బ్లాక్‌లిస్ట్ అయిన వెండర్లను ఎలా నిరోధించాలి, పరీక్షల ప్రక్రియను మొదటి నుంచి చివరి వరకు ఎలా బలోపేతం చేయాలి, ఎగ్జామ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ను ఎలా మెరుగుపరచాలి అనే విషయాలపై చర్చించనంత వరకు ఈ పేపర్ లీక్‌ల సమస్య పరిష్కారం కాదు'' అని ఆయన వ్యాఖ్యానించారు.

సీజేపీ తదుపరి అడుగు ఏంటి?

జులై 25న ప్రభుత్వంతో చర్చల తర్వాత అంగీకారం కుదిరిన పాత డిమాండ్లను నెరవేర్చుకోవడమే ప్రస్తుతానికి తమ మొదటి ప్రాధాన్య అంశమని అశుతోష్ రాంకా చెప్పారు.

''నిరసనకారులపై దిల్లీ, బీజేపీ పాలిత రాష్ట్రాల్లో నమోదైన ఎఫ్‌ఐఆర్‌లను వెనక్కి తీసుకోవాలి. అరెస్టు చేసిన వారిని వెంటనే విడుదల చేయాలి. కానీ, ప్రభుత్వం నుంచి వీటిపై ఇప్పటివరకు లిఖితపూర్వక హామీ రాలేదు'' అని ఆయన తెలిపారు.

దీనిపై ప్రభుత్వం నుంచి త్వరలోనే లిఖిత పూర్వక హామీ రాకపోతే మళ్లీ దిల్లీలో నిరసనలకు దిగడానికి తాము సిద్ధంగా ఉన్నామని ఆయన స్పష్టం చేశారు.

హోం మంత్రి అమిత్ షా పాత్ర

నిరసనల్లో పాల్గొన్న విద్యార్థులపై పోలీసుల వైఖరిపై పార్లమెంటులో వరుస ప్రశ్నలు అడుగుతున్నారు. పోలీసు చర్యలకు హోం మంత్రి అమిత్ షాను బాధ్యుడిగా చేస్తూ ఆయన రాజీనామా చేయాలంటూ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తోంది. పార్లమెంట్‌కు హోం మంత్రి హాజరు కాకపోవడంపై కూడా కాంగ్రెస్ ప్రశ్నిస్తోంది.

దిల్లీ పోలీసులు, హోం మంత్రిత్వ శాఖ పరిధిలోకే వస్తారు కాబట్టి దీనికి పూర్తి బాధ్యత హోం మంత్రిదే అని అశుతోష్ రాంకా అన్నారు.

''పిల్లలపై పెల్లెట్ గన్స్ ఉపయోగించారు. ఈ దాడులకు సంబంధించిన స్పష్టమైన ఆధారాలు కూడా వచ్చాయి. పిల్లలను ఏ విధంగా కొట్టారో, వారిని ఎలా వేధించారో, వీధుల్లో ఎలా ఈడ్చుకెళ్లారో, వారి తలలు పగలగొట్టారో అందరూ చూశారు. వీటన్నింటికీ హోం మంత్రే సమాధానం చెప్పాలి.

ఇదంతా హోం మంత్రి ఆదేశాల మేరకే జరిగి ఉంటే.. ఆయన నుంచే సమాధానం కోరతాం. అవసరమైతే ఆయన రాజీనామాను డిమాండ్ చేస్తాం.

మేం పోలీసులు చేసిన దౌర్జన్యాలకు సంబంధించి ఆధారాలన్నీ సేకరిస్తున్నాం. దీని కోసం ఒక పోర్టల్ కూడా ప్రారంభించాం. పరిమితులు దాటి ప్రవర్తించిన ప్రతి పోలీసు అధికారిని కోర్టులో నిలబెడతాం. ఈ పని కోసం మేం దేశంలోనే అత్యుత్తమ లాయర్లను నియమించుకున్నాం'' అని ఆయన వివరించారు.

జంతర్ మంతర్ వేదిక నుంచి సోనమ్ వాంగ్‌చుక్‌ను తరలించడం ఒక టర్నింగ్ పాయింట్ అని ‘ద ట్రిబ్యూన్’ అసోసియేట్ ఎడిటర్ అదితి టాండన్ చెప్పారు.

సొంత ఇంటెలిజెన్స్ ఏజెన్సీల ద్వారా ప్రభుత్వానికి ఫీడ్‌బ్యాక్ వచ్చి ఉంటుందని ఆమె అభిప్రాయపడ్డారు.

''పార్లమెంట్ మార్చ్ రోజున ఏం జరిగిందో అందరూ చూశారు. ఈ మార్చ్‌కు ప్రభుత్వం సిద్ధంగా లేదనేది స్పష్టం. ఇది చాలా పెద్ద ఉద్యమంగా మారబోతోందని ప్రభుత్వం అర్థం చేసుకుంది. దీన్నుంచి బయటపడటానికి వ్యూహాలు రచించడం ప్రారంభించి, సీజేపీతో చర్చలు మొదలుపెట్టింది'' అని ఆమె చెప్పారు.

బీజేపీ సీనియర్ నేత మురళీ మనోహర్ జోషి, మోహన్ భాగవత్ చేసిన హెచ్చరికల గురించి కూడా ఆమె ప్రస్తావించారు.

"దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన విద్యార్థులు ఇన్నిరోజులుగా దిల్లీ వీధుల్లో నిరసనలు తెలుపుతుండటం చూస్తుంటే చాలా బాధగా ఉంది. పరీక్షల నిర్వహణపై విద్యార్థులకు ఉన్న అనుమానాలు, ఆందోళనలు సమంజసమైనవే. వాటిని సున్నితంగా పరిష్కరించాల్సిన అవసరంఉంది'' అని ఎక్స్‌లో మురళీ మనోహర్ జోషి ట్వీట్ చేశారు.

ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భాగవత్ హైదరాబాద్‌లో ప్రసంగిస్తూ చేసిన వ్యాఖ్యలను కూడా అదితి టాండన్ ప్రస్తావించారు.

''జెన్ జీ అనేది మనం ప్రేమగా మాట్లాడాల్సిన తరం. వారిపై మన అభిప్రాయాలను రుద్దలేం. వారిని మీ చట్రంలోకి లాగలేరు.

వారు తమ తల్లిదండ్రులను నిలదీస్తున్నారు. ఈ వ్యవస్థను ప్రశ్నిస్తున్నారు. చివరికి ప్రతిపక్షాన్ని కూడా వదలట్లేదు. కాబట్టి వారితో మాట్లాడే తీరు, మీ కమ్యూనికేషన్ పద్ధతిని మార్చుకోవాలి. పాతకాలపు పద్ధతుల్లో వారితో మాట్లాడతామంటే కుదరదు'' అని మోహన్ భాగవత్‌ను ఉటంకిస్తూ అదితి చెప్పారు.

సీజేపీ ఉద్యమాన్ని ముగించడంలో తొందరపడిందా?

ఈ ఉద్యమం వల్ల మోదీ ప్రభుత్వానికి ఒక పెద్ద షాక్ తగిలిందనేది ఒప్పుకోవాల్సిందేనని సీనియర్ జర్నలిస్ట్, ద మోజో స్టోరీ ఎడిటర్ బర్ఖాదత్ అన్నారు.

''ఎవరి ఒత్తిళ్లకు లొంగి నిర్ణయాలు తీసుకోరని మోదీ ప్రభుత్వానికి పేరుంది. కానీ, ఇప్పుడు స్వయంగా ప్రధాని ఇన్‌స్టాగ్రామ్‌లో వీడియోలు పెట్టాల్సిన పరిస్థితి వచ్చింది. ప్రభుత్వానికి ఎదురైన ఈ సవాలు వల్ల కాంగ్రెస్‌తో పాటు మిగతా ప్రతిపక్షాలకు రాజకీయంగా మేలు జరుగుతుంది'' అని ఆమె అన్నారు.

ప్రభుత్వం ఇచ్చిన మాటను నమ్మి సీజేపీ ఉద్యమాన్ని ముగించడంలో తొందరపడిందని, ఉద్యమ ఫలితాల కోసం వేచి ఉండాల్సింది అని కొందరు విద్యార్థులు, విశ్లేషకులు భావిస్తున్నారు.

ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయడమే ఒక స్పష్టమైన విజయమని అశుతోష్ రాంకా అన్నారు.

''గడిచిన 12 ఏళ్లలో ఈ దేశంలో ఏ కేంద్ర మంత్రి కూడా ఇలా రాజీనామా చేయడాన్ని మనం చూడలేదు. రెండు నెలల ఉద్యమం సాధించిన ఈ విజయం చాలా పెద్దదని నేను భావిస్తున్నా.

రెండో విషయం ఏంటంటే, ప్రభుత్వంలో ఉన్న ఒక సీనియర్ మంత్రి అందరి ముందుకు వచ్చి నిరసనకారుల డిమాండ్లన్నీ ఒప్పుకున్నామని చెప్పాక, ప్రభుత్వం తన మాటకు కట్టుబడి ఉండకపోతే అది ఎంత పెద్ద విషయం అవుతుందో ఆలోచించండి. అప్పుడు కేంద్ర ప్రభుత్వం చెప్పే ఏ మాటకూ విలువ ఉండదు. అప్పుడు ఇక ప్రభుత్వాన్ని అసలు నమ్మడమే కుదరదు'' అని అశుతోష్ వివరించారు.

ఉద్యమాన్ని విరమించడంలో సీజేపీ తొందరపడిందనే విషయంతో బర్ఖాదత్ విభేదిస్తున్నారు. ఆ సమయానికి అది సరైన నిర్ణయమేనని ఆమె అభిప్రాయపడుతున్నారు.

''ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా ప్రకటన తర్వాత.. ఇక నిరసన కొనసాగించడానికి సీజేపీ దగ్గర పెద్దగా బలమైన కారణమేమీ మిగలదు. ఒకవేళ అలాగే కొనసాగిస్తే.. అంత పెద్ద డిమాండ్‌ను ఒప్పుకున్నా కూడా వీళ్లింకా పట్టు విడవట్లేదని ప్రజలు అనుకోవడం మొదలుపెడతారు'' అని బర్ఖాదత్ అభిప్రాయపడ్డారు.

యువతకు, ప్రధాని మోదీతో పాటు బీజేపీకి మధ్య దూరం పెరిగిందా?

విద్యాశాఖ మంత్రి పదవికి రాజీనామా చేశాక ధర్మేంద్ర ప్రధాన్ పార్లమెంటుకు వచ్చినప్పుడు.. ఎన్డీయే నాయకులు ఆయనకు మద్దతుగా నినాదాలు చేశారు. చాలామంది ఆయనను పొగడ్తలతో ముంచెత్తారు.

అయితే, ఆయన రాజీనామా సీజేపీకి కేవలం ప్రతీకాత్మక విజమయేనా అంటే పేరుకే దక్కిన విజయంగా భావించవచ్చా? వ్యవస్థ మళ్లీ పాతపద్ధతిలోనే నడుస్తుందా?

జంతర్ మంతర్ నుంచే కాదు దేశవ్యాప్తంగా రోడ్లపైకి వచ్చిన యువత అంతా సమష్టిగా చేసిన ఏకైక డిమాండ్ ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా అని, దాన్ని పేరుకే దక్కిన విజయంగా చెబుతూ యువత పోరాటాన్ని చిన్నది చేయకూడదని అశుతోష్ అన్నారు.

సీజేపీ అధికారి ప్రతినిధితో పాటు జెన్ జీపై బీజేపీ ఎంపీ కంగనా రనౌత్ వ్యాఖ్యల నేపథ్యంలో బీజేపీ నుంచి సీజేపీ ఎలాంటి హామీని కోరుతోంది?

అహంకారం వల్ల ఎవరికీ మేలు జరుగదని అశుతోష్ అన్నారు.

''ఎంతటివారినైనా అహంకారం చిత్తు చేస్తుంది. బీజేపీ ఈ రెండు నెలల్లో నేర్చుకోవాల్సిన విషయం ఏంటంటే, కాస్త తగ్గి ఉండటం. ఈ దేశ ప్రజల పట్ల కాస్త వంగి, వారి మాట వినాలి'' అని ఆయన వ్యాఖ్యానించారు.

కంగనా రనౌత్ వ్యాఖ్యలతో బీజేపీ కూడా ఇబ్బంది పడిందని బర్ఖాదత్ అన్నారు. అయితే, చాలామంది ఇది బీజేపీ వ్యూహంలో భాగమేనని కూడా అంటున్నారని ఆమె చెప్పారు. అధిష్టానం అనుమతి లేకుండా కంగనా అలా మాట్లాడలేరని ఆమె అన్నారు.

యువత చేసిన ఈ ఉద్యమాన్ని బట్టి చూస్తే ప్రధాని మోదీ వారికి కాస్త దూరమయ్యారని అనిపిస్తోందా?

ప్రధాని మోదీ యువతకు మళ్లీ దగ్గరవ్వడానికి ప్రయత్నిస్తున్నారనే విషయం ఆయన నుంచి వచ్చిన మూడు సెల్ఫీ వీడియోల ద్వారా అర్థమవుతోందని బర్ఖాదత్ అభిప్రాయపడ్డారు.

'దగ్గరయ్యేందుకు మోదీ ప్రయత్నాలు కొనసాగుతాయి. ప్రస్తుతానికైతే దూరం ఉంది. ఇది కేవలం పరీక్షల వ్యవహారానికి సంబంధించినది మాత్రమే కాదు, పోలీసులు ప్రవర్తించిన తీరు పట్ల ప్రజల్లో చాలా ఆక్రోశం ఉంది' అని బర్ఖాదత్ అన్నారు.

సీజేపీ ఇక ముందు ఏం చేయబోతోంది?

సీజేపీ ముందుముందు ఏం చేస్తుంది? రాజకీయ పార్టీ పెట్టాలని ఆలోచిస్తోందా? అనే ప్రశ్న చాలామంది మనస్సుల్లో నలుగుతోంది.

దీనిపై అశుతోష్ స్పందిచారు.

''ప్రస్తుతానికి మమ్మల్ని మేం సంఘటితం చేసుకునే పనిలో ఉన్నాం. దేశంలోని చాలా నగరాల నుంచి ప్రజలు తమ ప్రాంతాలకు రావాలని, అక్కడి విద్యార్థులను కలవాలని, వారి సమస్యలను లేవనెత్తాలని కోరుతున్నారు. ప్రస్తుతం మా ఫోకస్ దానిపైనే ఉంది. మేం దేశ యువతకు ఒక నమ్మకమైన గొంతుగా మారాలని అనుకుంటున్నాం'' అని ఆయన అన్నారు.

అయితే రాజకీయ పార్టీ పెట్టే అంశంపై కూడా ఆయన స్పందించారు.

''ఏ విషయాన్ని మనం కొట్టిపారేయలేం. ప్రజా జీవితంలోకి వచ్చాక నేను ఇదే విషయాన్ని నేర్చుకున్నా. ఏం జరగనుందో ముందు ముందు చూద్దాం'' అని అశుతోష్ చెప్పారు.

బహుశా సీజేపీకి కూడా ఈ ప్రశ్నకు కచ్చితమైన సమాధానం ఏంటో తెలియదని బర్ఖా దత్ అభిప్రాయపడుతున్నారు.

"ఈ ఉద్యమానికి రాజకీయ పార్టీలకు అతీతంగా మద్దతు లభించింది. ఇప్పుడు ఒక పొలిటికల్ పార్టీగా మారితే... ఈ ఉద్యమం పట్ల ఉన్న గౌరవం తగ్గిపోయే అవకాశం ఉంది" అని బర్ఖాదత్ అభిప్రాయపడ్డారు.

సోనమ్ వాంగ్‌చుక్‌కు తాము జీవితాంతం రుణపడి ఉంటామని అశుతోష్ అన్నారు.

'ఆయన ఒక తరాన్ని జాగృతం చేశారు. వారికి పోరాడే ధైర్యాన్ని ఇచ్చారు. వారి గొంతును అందరికీ వినపడేలా చేశారు' అని అశుతోష్ వ్యాఖ్యానించారు.

ప్రభుత్వం తీసుకొచ్చిన ఈ కొత్త చట్టం అర్థం లేనిదని గానీ, దీనికి ఏ ప్రాధాన్యతా లేదని గానీ తాను చెప్పనని బర్ఖాదత్ అన్నారు.

కానీ, విద్యార్థులు చేసిన నిరసన పేపర్ లీక్, నీట్ వ్యవహారాన్ని దాటి చాలా ముందుకు వెళ్లిపోయిందని, ఇది వారి ఆర్థిక భవిష్యత్‌కు సంబంధించిన పోరాటమని ఆమె అన్నారు.

''విద్యార్థుల నిరసనలను కేవలం నీట్ కోణంలోనే చూడటం తప్పుదారి పట్టించడమే అవుతుంది. దేశంలో 18 నుంచి 29 ఏళ్ల మధ్య ఉన్న యువత దాదాపు 32 కోట్లు ఉన్నారు. ఈ పరిస్థితి బీజేపీని మాత్రమే కాదు, ప్రతి ప్రభుత్వాన్ని మేల్కోవాలని సూచిస్తోంది. చదువుకునే యువతకు కళ్లముందు భవిష్యత్తు ఏమీ కనిపించడం లేదు. కూడు, గూడు, గుడ్డ అనేవి వారికి చాలా ముఖ్యమైన అంశాలు'' అని ఆమె స్పష్టం చేశారు.

( బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,  ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)