You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
డివోర్స్ రింగ్: 'ఇది నా స్వేచ్ఛా ప్రకటన' అంటూ విడాకుల ఉంగరాలు ధరిస్తున్న మహిళలు.. ఏంటీ కొత్త ట్రెండ్ ?
- రచయిత, లూసీ హుకర్
- హోదా, బీబీసీ ప్రతినిధి
- ప్రచురణ
- చదివే సమయం: 4 నిమిషాలు
డెబ్ మారినో వేలిపై మెరిసిపోతున్న బంగారు ఉంగరంలో పొదిగిన వజ్రాలు అందరి దృష్టినీ ఆకర్షిస్తున్నాయి.
‘‘అవును, ఇది మధ్యవేలికే తొడుక్కున్నాను. ఎందుకూ అంటే, ఎందుకు ధరించకూడదు?’’ అని ఫ్లోరిడాకు చెందిన ఈ బ్లాగర్ తన టిక్‌టాక్ అకౌంట్‌లో పోస్ట్ చేశారు.
నిశ్చితార్థం ఉంగరాన్ని వదిలేస్తే తనకు లేని బాధ ఇతరులలో ఎక్కువగా కనిపించే అవకాశం ఉందని 34 ఏళ్ల డెబ్ అంటున్నారు.
పైగా, ఆ వివాహం వల్లే తనకు కుమార్తె జన్మించింది. అలాంటి ఉంగరాన్ని ధరించకుండా పక్కన పెట్టేయడం కూడా అనవసరమే అనిపించిందని ఆమె అన్నారు.
"దాన్ని పెట్టెలో బంధించి ఉంచాలనిపించలేదు. వజ్రాలు ఎంతో విలువైనవి" అని డెబ్ అన్నారు.
ప్రపంచవ్యాప్తంగా నగల తయారీదారులు ప్రోత్సహిస్తున్న కొత్త ట్రెండ్‌లో డెబ్ కూడా భాగమయ్యారు. జీవితంలో కొత్త అధ్యాయానికి గుర్తుగా మహిళలు ప్రత్యేకంగా ధరించే ఈ ఉంగరాన్ని 'డివోర్స్ రింగ్' అని అంటున్నారు.
డెబ్ తన నిశ్చితార్థపు ఉంగరంలోని వజ్రాన్ని తన కొత్త ఉంగరానికి ఒక చివర అమర్చారు. మరో చివర తన కుమార్తెకు ప్రతీకగా నీలం ధరించారు. ఇందుకోసం 3 వేల డాలర్లు (సుమారు రూ. 2.8 లక్షలు) ఖర్చు చేసారు.
విడాకుల ప్రక్రియ సాధారణంగా ఖర్చుతో కూడుకున్నది కావడంతో, ఇంత మొత్తం వెచ్చించడం చిన్న విషయం కాదు.
ఉంగరాన్ని తిరిగి అమ్మేస్తే అసలు ధరలో 30 శాతం మాత్రమే లభిస్తుంది. అందుకే పాత ఆభరణానికి కొత్త రూపం ఇవ్వడాన్ని చాలామంది మెరుగైన పెట్టుబడిగా భావిస్తారు.
ఈ ఏడాదిని ఫ్యాషన్ ప్రపంచం 'హాట్ డివోర్సీ సమ్మర్' అని పిలుస్తోంది. స్వేచ్ఛను ఆస్వాదించే జీవనశైలికి, ఎవరేమనుకున్నా డోంట్ కేర్ అనే ధోరణికి ప్రతీకగా దాన్ని చెబుతున్నారు. డెబ్ ధరించిన ఉంగరం కూడా అదే భావనకు అద్దం పడుతోంది.
డివోర్స్ రింగ్ అనేది ఆర్థిక స్వతంత్రానికి కూడా ఒక గుర్తుగా నిలుస్తుందని బ్రిటన్‌కు చెందిన అమికబుల్ సంస్థ సహ వ్యవస్థాపకురాలు కేట్ డేలీ తెలిపారు. ఆ సంస్థ విడాకులలో మధ్యవ్యర్తిత్వాన్ని వహించే సేవలనందిస్తుంది.
"విడాకుల తర్వాత జీవితం మొత్తం ఒక్కసారిగా తలకిందులైనట్లే అనిపిస్తుంది. ఆర్థిక పరిస్థితిపైనా తీవ్రమైన ఒత్తిడి పడుతుంది" అని ఆమె చెప్పారు.
అలాంటి సమయంలో ఒక మహిళ కొత్త ఉంగరం కొనాలని నిర్ణయించుకుంటే, అది తన ఆర్థిక నిర్ణయాలను తానే తీసుకుంటోందని ఎవరినీ అనుమతి అడగాల్సిన అవసరం లేదనేందుకు సంకేతమని డేలీ పేర్కొన్నారు.
"దీన్ని తేలిగ్గా తీసేయడం చాలా సులభం. కానీ చాలా కాలం తర్వాత మీరు చేసే మొదటి పెద్ద ఖర్చు ఇదే కావచ్చు. అలాగే చాలా కాలం తర్వాత పూర్తిగా మీరే స్వయంగా తీసుకునే అతిపెద్ద ఆర్థిక నిర్ణయం కూడా కావచ్చు" అని ఆమె అన్నారు.
సెరీ ఎవాన్స్ తయారు చేయించుకున్న డివోర్స్ రింగ్ పాత ఉంగరానికి కొత్త రూపం కాదు. అది కొత్త జీవితానికి నాంది. ఆమె కుడిచేతి ఉంగరం వేలిపై ధరించిన ఆర్ట్ డెకో శైలిలోని ప్లాటినం ఉంగరంలో మూడు పెద్ద వజ్రాలు పొదిగి ఉన్నాయి.
"దీన్ని నేను నా యూఎస్‌ఏ రింగ్ అని పిలుస్తాను" అని ఆమె నవ్వుతూ అన్నారు. "ఇది నా స్వేచ్ఛా ప్రకటన" అంటారు సెరీ.
వేల్స్‌కు చెందిన 58 ఏళ్ల సెరీ నిరుడు తన భర్తతో విడిపోయిన తర్వాత 3 వేల పౌండ్ల (సుమారు. 3.8 లక్షలు) విలువైన ఈ ఉంగరాన్ని కొన్నారు.
విడాకులకు పరిహారంగా వచ్చిన డబ్బుతో కాదని, తన సొంత సంపాదనతో, నిరసన భావంతో ఈ ఉంగరాన్ని కొన్నట్లు ఆమె చెప్పారు.
పెన్సిల్వేనియాకు చెందిన అలెక్స్ ప్రోయి.. తన ఐదో వివాహ వార్షికోత్సవం సందర్భంగా పొందిన ఉంగరంలోని బంగారం, వజ్రాలతో తయారు చేసిన కొత్త ఉంగరాన్ని రెండు వారాల కిందటే తీసుకున్నారు. విడాకుల తర్వాత ఆమె ఇప్పటికీ ఎన్నో భావోద్వేగాలతో సతమతవుతున్నారు.
31 ఏళ్ల వయసులో తాను స్వలింగ సంపర్కురాలినని వెల్లడించిన అనంతరం, ఏడేళ్ల వైవాహిక జీవితానికి ఆమె ముగింపు పలికారు. "నేను యువతిగా ఎదుగుతున్న కాలంలో నా మాజీ భర్త నా జీవితంలో ఎంతో కీలకమైన పాత్ర పోషించారు" అని ఆమె గుర్తు చేసకున్నారు.
"ఆ జ్ఞాపకాన్ని నా వెంటే ఉంచుకోవాలనుకుంటున్నాను" అన్నారామె.
ఆమె ఉంగరంలో ఏడు చిన్న వజ్రాలు, అలల ఆకారంలోని డిజైన్‌తో ఉన్నాయి. జీవితంలో విధిగా ఎదురయ్యే ఎత్తుపల్లాలను అవి సూచిస్తాయని ఆమె అన్నారు.
విడాకుల తర్వాత సంపాదన కోసం మళ్లీ సేల్స్ ఉద్యోగంలో చేరాల్సి వచ్చిందని, జీవితాన్ని మొదటి నుంచి ఎలా నిర్మించుకుందో ఈ ఉంగరం తనకు గుర్తు చేస్తుందని ఆమె చెప్పారు.
"విడాకులనేది చాలా చేదు అనుభవం. మళ్లీ కొత్త జీవితాన్ని ప్రారంభించినప్పుడు అది ఎలా సాగుతుందో తెలియదు. సొంతంగా ఆర్థికంగా నిలదొక్కుకోగలరా లేదా అన్నదీ తెలియదు" అని ఆమె అంటారు.
రెడ్డిట్‌లో తమ వివాహ, నిశ్చితార్థ ఉంగరాలపై జరిగే చర్చల్లో కొందరు ఇప్పటికీ వాటిని ధరిస్తున్నట్లు చెప్పారు. కొందరు ఎదుటివారి నుంచి అవాంఛిత ఆసక్తిని దూరంగా ఉంచేందుకు వాటిని ఉపయోగిస్తున్నట్లు తెలిపారు. మరికొందరు వాటిని ఎవరికీ కనిపించకుండా సొరుగులో దాచిపెట్టినట్లు వెల్లడించారు.
మరికొందరు మాత్రం తమ ఉంగరాలను చెత్తబుట్టలోనో, సముద్రంలోనో లేదంటే కారు కిటికీలోంచి బయటికో విసిరేశామని చెప్పారు.
అయితే కొత్త జీవితానికి గుర్తుగా ఏదో ఒక ఖర్చు చేయాలని చాలామంది భావిస్తున్నట్లు ఆ చర్చలు సూచిస్తున్నాయి. భారీ విహారయాత్రలు, టాటూలు, పెద్ద పెద్ద బ్రాండ్ల షూలు కొనడం, ఇంట్లో మార్పులు చేయడం వంటి మార్గాలను ఎంచుకుంటున్నారు.
ఇటీవలే విడాకులు తీసుకున్న ఓ మహిళ పడకగదిని పూర్తిగా మార్చేయాలని నిర్ణయించుకున్నారు.
"ఆ ఉంగరం అమ్మడం వల్ల వచ్చిన డబ్బుతో కొన్న మంచంపైనే ఇప్పుడు కొత్త భాగస్వాములతో మంచి శృంగార జీవితాన్ని గడుపుతున్నాను" అని ఆమె పోస్టు చేసారు.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్, ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)