‘‘ఆ మార్ఫింగ్ ఫోటోల్లో ఉన్నది నేను కాదని తెలుసు... కానీ వాటిని చూసి తీవ్రంగా కలత చెందా’’

    • రచయిత, ఫ్రాంకీ పెక్
    • హోదా, బీబీసీ ప్రతినిధి
  • ప్రచురణ
  • చదివే సమయం: 4 నిమిషాలు

"ఆ ఫోటోలు చూసి తీవ్ర కలత చెందాను. కానీ, అదే సమయంలో అందులో ఉన్నది నేను కాదని నాకు తెలుసు" అని సారా చెప్పారు.

ఆమె పెళ్లి ఫోటోలను దొంగిలించి, వాటిని నగ్నంగా మార్ఫింగ్ చేసిన ఒక వ్యక్తి దుశ్చర్య.. చివరకు ఆన్‌లైన్‌లో సాగుతున్న అంతర్జాతీయ బాలల లైంగిక వేధింపుల భారీ నెట్‌వర్క్‌ను ఛేదించడానికి దారితీసింది.

ఈ కేసు జనవరి 2024లో ప్రారంభమైంది. తన వివాహ ఫోటోలను డిజిటల్‌గా మార్ఫింగ్ చేసి, నగ్నంగా లేదా లోదుస్తులతో ఉన్నట్లు సృష్టించారని భాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేశారు. బాధితురాలి గుర్తింపును రక్షించడానికి 'సారా' అని పేరు మార్చాం.

ఈ ఘటనకు పాల్పడిన వ్యక్తి సౌత్‌సీలోని హైలాండ్ రోడ్‌కు చెందిన 30 ఏళ్ల ఈథన్ ఆర్చర్డ్‌గా పోలీసులు గుర్తించారు. నిందితుడు బాధితురాలికి ముందే పరిచయం ఉన్న వ్యక్తి.

ఈ విచారణలో భాగంగా అధికారులు అత్యంత భయంకరమైన ఒక వెబ్‌సైట్‌ను కనుగొన్నారు. అందులో 10 లక్షలకు పైగా పిల్లల లైంగిక వేధింపుల చిత్రాలను షేర్ చేసినట్లు గుర్తించారు.

ఈ కేసులో ఆర్చర్డ్‌కు మూడు సంవత్సరాల నాలుగు నెలల జైలు శిక్ష పడింది. సారాకు సంబంధించిన 100కు పైగా మార్ఫింగ్ చిత్రాలను లైంగిక హింసను వివరించే విషయాలతో కూడిన వెబ్‌సైట్‌లో అప్‌లోడ్ చేశారు.

ఆ చిత్రాలను అప్‌లోడ్ చేసింది తనే అనే విషయాన్ని దాచిపెట్టి, సారాకు ఆ ఫోటోల గురించిన సమాచారాన్ని నిందితుడే స్వయంగా అందించడం గమనార్హం.

'అన్నీ ప్రైవేట్ ఫోటోలే'

"నా మొదటి ఆలోచన, ఇది ఎవరు చేశారు? ఈ ఫోటోలు ఎవరికి దొరికాయి? ఎందుకంటే నా ఫేస్‌బుక్‌లో ఇవన్నీ ప్రైవేట్‌గా ఉన్నాయి, ఎవరూ వీటిని చూడలేరు. అందుకే నాకు చాలా గందరగోళంగా అనిపించింది" అని సారా చెప్పారు.

"నా వివాహ ఫోటోలను ఇలా వాడటంతో నేను తీవ్ర మనోవేదనకు గురయ్యాను. అందులో ముఖం నాదే, కానీ శరీరం నాది కాదు. నా గౌరవానికి భంగం కలిగినట్లు అనిపించింది. అదే సమయంలో, అది నేను కాదని నాకు తెలుసు" అన్నారామె.

నిందితుడు ఆర్చర్డ్ తనకు తెలిసిన మరో ఇద్దరు మహిళలకు సంబంధించిన నకిలీ నగ్న చిత్రాలను కూడా సృష్టించి, షేర్ చేసినట్లు దర్యాప్తు అధికారులు ఆ తర్వాత కనుగొన్నారు. అంతేకాకుండా, వారిపై హింసాత్మక, అసభ్యకరమైన లైంగిక వివరణలను కూడా ఆన్‌లైన్‌లో పోస్ట్ చేసినట్లు గుర్తించారు.

ఆ మహిళల్లో ఒకరిని వేధించాలంటూ ఆ వెబ్‌సైట్‌లోని ఇతర యూజర్లను కూడా ఆయన ప్రోత్సహించారు, అయితే సారాను ఎవరూ సమీపించలేదు.

ఆ మహిళలను "లక్ష్యంగా చేసుకుని, కేవలం భోగవస్తువులుగా చిత్రీకరించారని, దీంతో వారు తమ భద్రతపై నిరంతర భయంలో బతకాల్సి వచ్చింది" అని ఈ దర్యాప్తునకు నేతృత్వం వహించిన పీసీ స్టీవ్ కాన్ చెప్పారు.

"హాంప్‌షైర్‌లోని మహిళలకు జరిగిన ఈ సంఘటన నిజంగా దిగ్భ్రాంతికరం. కొందరు వ్యక్తులు ఇతరులకు తీవ్రమైన హాని కలిగించడానికి ఆన్‌లైన్ వేదికలను ఎలా దుర్వినియోగం చేయగలరో అనే భయానక వాస్తవాన్ని ఇది తెలియజేస్తోంది" అన్నారు.

ఆర్చర్డ్ నేరాలపై విచారణ జరుపుతున్న సమయంలోనే, ఆ వెబ్‌సైట్ గురించిన సమాచారాన్ని ఫిబ్రవరి 2024లో హాంప్‌షైర్ పోలీసులు ఎఫ్‌బీఐకి చేరవేశారు.

మరోపక్క స్వతంత్ర అంతర్జాతీయ దర్యాప్తులో భాగంగా ఈ వెబ్‌సైట్‌ను ఫ్లోరిడా డిపార్ట్‌మెంట్ ఆఫ్ లా ఎన్‌ఫోర్స్‌మెంట్ స్వాధీనం చేసుకుంది.

అంతర్జాతీయ ముఠా అరెస్ట్

పిల్లలపై జరిగే లైంగిక వేధింపుల సమాచారాన్ని ప్రకటనలుగా ఇవ్వడానికి, కొనుగోలుదారులను విక్రేతలతో అనుసంధానించడానికి కూడా ఈ సైట్‌ను ఉపయోగిస్తున్నట్లు యూఎస్ దర్యాప్తు అధికారులు కనుగొన్నారు.

11 లక్షలకు పైగా పిల్లల లైంగిక వేధింపుల చిత్రాలను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. యునైటెడ్ స్టేట్స్, కెనడా, ఆస్ట్రేలియా, యూకే వ్యాప్తంగా 50 మంది కంటే ఎక్కువ మంది బాధితులను గుర్తించారు.

ఒకే ఒక వెబ్‌సైట్ ద్వారా వెలుగులోకి వచ్చిన ఈ నేరాల తీవ్రత నిజంగా "భయంకరమైనది" అని కాన్ చెప్పారు.

"ఈ వెబ్‌సైట్‌ను తొలగించడానికి, పది లక్షలకు పైగా పిల్లల అసభ్యకర చిత్రాలను స్వాధీనం చేసుకోవడానికి, అంతర్జాతీయ పెడోఫైల్ (బాల లైంగిక వేధింపుల) ముఠాను గుర్తించడానికి అమెరికాలోని మా సహచర అధికారులు చాలాబాగా పని చేశారు" అన్నారు.

ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సాంకేతికతలో వస్తున్న పురోగతి వల్ల సోషల్ మీడియా లేదా ఆన్‌లైన్‌లోని ఇతర ప్రాంతాల నుంచి సేకరించిన ఫోటోలను ఉపయోగించి, నిజమైన వాటిలా భ్రమింపజేసే నకిలీ చిత్రాలు, వీడియోలను సృష్టించడం మునుపటి కంటే సులభంగా మారిందని, ఇది దర్యాప్తు అధికారులకు కొత్త సవాళ్లను విసురుతోందని పోలీసులు తెలిపారు.

"చట్టం వేగంగా పుంజుకుంటోంది. ఆన్‌లైన్ సేఫ్టీ యాక్ట్ 2023 అనేది ఆన్‌లైన్‌లో పిల్లలను, పెద్దలను రక్షించే ఒక కొత్త చట్టాల సమూహం" అని కాన్ చెప్పారు.

'భయపడకుండా ముందుకు రావాలి'

ఈ సంఘటన తనపై చాలా ప్రభావాన్ని చూపిందని, జరిగిన దాన్ని పోలీసులకు నివేదించడం కష్టమైనప్పటికీ, మంచి ఫలితాన్ని ఇచ్చిందని సారా చెప్పారు.

ఈ కేసు గురించి తాను బహిరంగంగా మాట్లాడటం వల్ల ఇతరులు కూడా ముందుకు రావడానికి ధైర్యం లభిస్తుందని ఆమె ఆశిస్తున్నారు.

"నేను ఊరికే కూర్చుని, దీనిని పట్టించుకోకుండా వదిలేసి ఉంటే నాకు సులభంగానే ఉండేది. కానీ, ఆ తర్వాత అతను ఇంకా ఎంత ఘోరంగా తయారయ్యేవాడో మనకు తెలియదు" అని సారా అన్నారు.

"నా ఫోటోలు ఎంత దూరం వెళ్లి ఉండేవో నాకు తెలియదు. అతను నా పేరు, నా చిరునామా, అన్నింటినీ అక్కడ ప్రచారం చేశాడు. నేను పోలీసులకు ఫిర్యాదు చేయకపోయి ఉంటే నాకు ఏమైనా జరిగి ఉండేది" అన్నారామె.

లైంగిక సంతృప్తి కోసం ఒక వ్యక్తికి సంబంధించిన వ్యక్తిగత చిత్రాలను షేర్ చేసినట్లు, నేరానికి ప్రేరేపించినట్లు వచ్చిన నేరారోపణలను ఆర్చర్డ్ అంగీకరించారు. దీంతో, అతను భవిష్యత్తులో మళ్లీ ఇలాంటి నేరాలకు పాల్పడకుండా కోర్టు పదేళ్ల పాటు ఆంక్షలు విధించింది. అలాగే, బాధితురాలి దరిదాపుల్లోకి రాకుండా శాశ్వత నిషేధ ఉత్తర్వులు (రెస్ట్రైనింగ్ ఆర్డర్) జారీ చేసింది.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,  ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)