అగ్నిపర్వతం బిలం లోపలి గోడలపైకి ఎక్కుతుండగా జారిపడి మరణించిన ‘యెమెన్ స్పైడర్ మ్యాన్’

ఫొటో సోర్స్, Yemen civil defence
- రచయిత, జాక్ బర్గెస్
- హోదా, బీబీసీ ప్రతినిధి
- ప్రచురణ
- చదివే సమయం: 3 నిమిషాలు
‘స్పైడర్-మ్యాన్ ఆఫ్ యెమెన్’గా ఫేమస్ అయిన ఒక సాహస ఫ్రీ-క్లైంబర్, యెమెన్ దక్షిణ పశ్చిమ ప్రాంతంలో ఉన్న అగ్నిపర్వత బిలంలో పడి మరణించారు.
అల్-ఖక్వా ఇబ్న్ అంతార్ శుక్రవారం ఎలాంటి భద్రత పరికరాలు లేకుండా ఆ బిలంలోని నిటారుగా ఉన్న రాళ్లను ఎక్కే ప్రయత్నం చేస్తుండగా కింద పడిపోయినట్టు అధికారులు వెల్లడించారు.
30 ఏళ్ల అల్-ఖక్వా ఇబ్న్ అంతార్‌కు సోషల్ మీడియాలో చాలా మంది ఫాలోవర్స్ ఉన్నారు. ప్రమాదకరమైన అక్రోబాటిక్ స్టంట్స్ వీడియోలతో ఆయన ఫేమస్ అయ్యారు.
హర్దా డ్యామ్ అగ్నిపర్వత బిలం యెమెన్‌లోని నేచురల్ ల్యాండ్‌మార్క్స్‌లో ఒకటి.
అంతార్ జారిపడిపోయిన క్షణాన్ని చూపించే వీడియోలు ఆన్‌లైన్‌లో విస్తృతంగా షేర్ అవుతున్నాయి.
అందులో ఆయన బిలంలో చాలా ఎత్తైన రాతిగోడను ఎక్కుతూ, పట్టుకోల్పోయి కింద పడిపోతున్నట్లు కనిపిస్తుంది.
బిలం అడుగున ఉన్న ఆయన మృతదేహాన్ని బయటకు తెచ్చే ఆపరేషన్ చాలా ప్రమాదకరమైందని, అత్యంత కఠినమైన, క్లిష్టమైన రెస్క్యూ మిషన్లలో ఒకటని అధికారులు పేర్కొన్నారు.


ఫొటో సోర్స్, Yemen civil defence
బిలం అడుగు భాగం నుంచి ఆయన మృతదేహాన్ని తీసుకువచ్చిన వాటర్ రెస్క్యూ టీమ్‌ను యెమెన్ సివిల్ డిఫెన్స్ అథారిటీ ప్రశంసించింది.
కఠినమైన భూభాగం, తీవ్రమైన వాతావరణ పరిస్థితులు, బిలంలోని అధిక వేడి మధ్య అద్భుతమైన నైపుణ్యం చూపినందుకు రక్షణ బృందాన్ని ప్రమోట్ చేసినట్లు వారు తెలిపారు.
వీడియోల్లో రెస్క్యూ సిబ్బంది తాళ్లు, పరికరాలతో గుంతలోకి దిగుతూ, తర్వాత ఒక కేజ్‌ను కిందకు దించి మృతదేహాన్ని తీసుకువస్తున్న దృశ్యాలు కనిపిస్తున్నాయి.
120 మీటర్ల వెడల్పు ఉన్న బిలంలో, నీటి ఉపరితలం కంటే 30 మీటర్ల లోతులో ఆయన మృతదేహాన్ని డైవర్స్ గుర్తించారు.
ధాలే ప్రావిన్స్‌లోని హర్దా డ్యామ్ ఇటీవలి ఏళ్లలో పర్యటక స్థలంగా మారింది. దాని కింద భాగంలో వేడి గంధక సరస్సు(హాట్ సల్ఫర్ లేక్) ఉంది.
( బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్, ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)




























