అంగస్తంభన లోపం.. హార్ట్ అటాక్, స్ట్రోక్‌లకు ముందస్తు సూచనా

అంగస్తంభన లోపం

ఫొటో సోర్స్, Serenity Strull/ BBC

    • రచయిత, డేవిడ్ రాబ్సన్
    • హోదా, బీబీసీ ప్రతినిధి
  • ప్రచురణ
  • చదివే సమయం: 7 నిమిషాలు

అంగస్తంభన లోపం అనేది గుండెపోటు, స్ట్రోక్ (మెదడుకు రక్త సరఫరాలో అంతరాయం), మధుమేహం, మతిమరుపు వ్యాధులకు ముందస్తు హెచ్చరిక కావొచ్చని.. రోగులు, వైద్యులు దీనిపై దృష్టిపెట్టాల్సిన సమయం ఆసన్నమైందని పరిశోధకులు భావిస్తున్నారు.

అంగస్తంభన లోపం వల్ల లైంగిక కలయిక అనేది అసాధ్యమవుతుంది.

అంగస్తంభన లోపాన్ని చాపకింద నీరులా విస్తరిస్తున్న ఒక మహమ్మారిగా పరిశోధకులు చెబుతున్నారు.

వివిధ సర్వేల ప్రకారం.. 40 ఏళ్లు పైబడిన పురుషుల్లో సగం మందికి పైగా ఈ సమస్యను ఎదుర్కొంటున్నారు.

కానీ, చాలా తక్కువ మంది పురుషులు మాత్రమే ఈ సమస్య గురించి తమవారితో చర్చించగలుగుతున్నారు.

సంభాషణలో ఈ విషయం గురించి ప్రస్తావనకు వస్తే.. రాబోయే అనారోగ్యానికి ఇదొక ముందస్తు హెచ్చరికగా చూడకుండా... తరచూ దాన్ని సరదాగా మాట్లాడే అంశంగానే చూస్తున్నారు. కానీ, కొత్త పరిశోధనలో.. పురుషాంగం ఒక పురుషుడి మొత్తం ఆరోగ్యానికి సూచికగా పనిచేస్తుందని వెల్లడైంది.

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి
ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

అంగస్తంభన లోపం అనేది మధుమేహం, గుండెపోటు, స్ట్రోక్, మతిమరుపు వంటి అనేక తీవ్రమైన అనారోగ్య పరిస్థితులకు ఒక ముందస్తు సూచికగా ఉంటుందని తాజా పరిశోధనల్లో వెల్లడైంది.

ఇది ''ది కానరీ ఇన్ ది కోల్‌మైన్‌ (రాబోయే పెద్ద ప్రమాదాన్ని ముందుగానే హెచ్చరించే సూచన)'' లాంటిదని యూనివర్సిటీ ఆఫ్ రోమ్ టోర్ వెర్గాటాలోని సెక్సాలాజిస్ట్ ఎమ్మాన్యుయేల్ జాన్నినీ చెప్పారు.

అంగస్తంభన లోపాన్ని మెరుగ్గా స్క్రీనింగ్ చేయడం ద్వారా, పురుషుల ఆరోగ్యానికి సంబంధించి కొన్ని ప్రమాదాలు మరీ తీవ్రం కావడానికి ముందే వైద్యులు వాటిని నిర్ధరించగలరు.

కానీ, చాలా మంది పురుషులు తమ లైంగిక ఆరోగ్యం గురించి మాట్లాడటానికి ఇష్టపడకపోవడం వల్ల, వారికి భవిష్యత్తులో ఎదురయ్యే అనారోగ్యాల గురించి తెలుసుకునే విలువైన అవకాశాలను కోల్పోతున్నారు.

చాలా సాధారణమైన ఈ సమస్య గురించి మీరు తెలుసుకోవలసిన విషయాలు ఈ కథనంలో..

ఇదొక అంతర్గత సమస్య

చాలా వ్యాధుల మాదిరిగానే.. అంగస్తంభన లోపం కచ్చితంగా ఎంత మందిలో ఉందనేది దాన్ని మీరెలా నిర్వచిస్తారు, దాన్నెలా కొలుస్తారు? అనే దానిపై ఆధారపడి ఉంటుంది.

తాజా అధ్యయనాల ప్రకారం.. ప్రపంచవ్యాప్తంగా పురుషుల్లో అంగస్తంభన లోపం రేటు 3 శాతం నుంచి 76.5 శాతం రేంజ్‌లో ఉంది. ఇది చాలా ఎక్కువ.

అయితే, ఇప్పటి వరకు నిర్వహించిన అతిపెద్ద, వివరణాత్మక సర్వేలలో ఒకదానిలో సుమారు 1200 మంది పురుషులు పాల్గొన్నారు.

ఒక వివరణాత్మక ప్రశ్నావళి ఆధారంగా ఈ అధ్యయనం సాగింది. ఈ అధ్యయనంలో తేలింది ఏమిటంటే.. 40 ఏళ్ల వయసున్న పురుషులలో 39 శాతం మంది క్రమం తప్పకుండా ఏదో ఒక స్థాయిలో అంగస్తంభన లోపాన్ని ఎదుర్కొంటున్నారు.

అదే పురుషులకు 70 ఏళ్లు వచ్చేసరికి, ఈ సంఖ్య 67 శాతానికి పెరుగుతుందని తెలిసింది.

చాలా సందర్భాలలో, అంగస్తంభన లోపం అనేది ఒక అంతర్గత సమస్య. అంటే, శరీరంలో రక్త ప్రసరణలో అడ్డంకి లేదా సమస్య ఏర్పడటం వల్ల ఇది సంభవిస్తుంది.

నీరు సరఫరా అయ్యే పైపులో అడ్డంకి ఏర్పడితే నీటి ప్రవాహం ఎలాఅయితే ప్రభావితమవుతుందో, అదే విధంగా పురుషాంగానికి వెళ్లే రక్త ప్రసరణలోనూ ఏదో జరుగుతుంది.

పురుషాంగం పొడవునా రెండు స్పాంజి లాంటి నిర్మాణాలు ఉంటాయి. వాటిని కార్పోరా కావెర్నోసా అని పిలుస్తారు. సాధారణంగా, అవి మెత్తగా లేదా వదులుగా ఉంటాయి.

పురుషుడు లైంగికంగా ఉద్రేకపడినప్పుడు, పురుషాంగంలోని ధమనుల చుట్టూ ఉన్న కండరాలను సడలించమని మెదడు సందేశాలు పంపుతుంది. దీనివల్ల ఈ రెండు స్తూపాకార నిర్మాణాలైన కార్పోరా కావెర్నోసాకు రక్త ప్రవాహం పెరుగుతుంది.

అవి వ్యాకోచించినప్పుడు, కార్పోరా కావెర్నోసా సాగుతాయి. అప్పుడు అవి పురుషాంగం నుంచి రక్తాన్ని బయటకు తీసుకువెళ్లే సిరలపై ఒత్తిడి కలిగించి, దానిని అడ్డుకుంటాయి.

అచ్చం.. గాలిని నింపినప్పుడు బెలూన్ ఎలా ఉబ్బుతుందో, అలాగే పురుషాంగం కూడా ఉబ్బి, గట్టిగా పొడవుగా అవుతుంది. పురుషాంగంలోని రక్తనాళాల ద్వారా రక్త సరఫరా తగ్గించే ఏదైనా అంశం.. పురుషుడికి అంగస్తంభన కలిగించే లేదా దాన్ని నిర్వహించే సామర్థ్యాన్ని ప్రభావితం చేస్తుంది లేదా బలహీనపరుస్తుంది.

ఈ సమస్య తరచూ ఒక మానసిక స్వభావంతో ఉంటుంది. అడ్రినలైన్, కార్టిసాల్‌తో కూడా ఏదైనా ఒత్తిడి రక్తనాళాలు సంకోచించేందుకు కారణమవుతుంది. ఇది కార్పోరా కావెర్నోసా గట్టి పడకుండా నిరోధిస్తుంది. ఒకవేళ ఒత్తిడి స్థాయిలు అత్యధికంగా ఉన్నప్పుడు, టెస్టోస్టెరాన్ ఉత్పత్తిపై కూడా ప్రభావం పడుతుంది.

ఫలితంగా లైంగిక వాంఛ తగ్గడం, లైంగిక ఉత్తేజం తగ్గడం జరగవచ్చు. (హైపోగోనాడిజం వంటి గ్రంథి సంబంధిత రుగ్మతలు ఉన్న వారికి టెస్టోస్టెరాన్ ఉత్పత్తి కూడా తక్కువగా ఉంటుంది. ఇది కూడా కీలక పాత్ర పోషించవచ్చు.)

ఒత్తిడి తరచూ ఒక రకమైన పరధ్యానానికి కారణం కావొచ్చు. దీనివల్ల సెక్స్‌పై దృష్టి పెట్టడం కష్టమవుతుంది.

అంగస్తంభన లోపం, గుండె జబ్బులు

ఫొటో సోర్స్, Getty Images

గుండె, మెదడు సంబంధిత సమస్యలు

చాలా సందర్భాలలో అంగస్తంభన లోపం అనేది ఒక పెద్ద ఆరోగ్య సమస్యకు సంకేతం కావచ్చు. రక్తనాళాలు గట్టిపడి, కుచించుకుపోయే అథెరోస్క్లెరోసిస్ అనే పరిస్థితి దీనికి కారణం కావచ్చు, దీనివల్ల గుండె జబ్బుల ప్రమాదం పెరుగుతుంది.

పురుషాంగంలోని రక్తనాళాలు శరీరంలోనే అత్యంత చిన్నవిగా ఉంటాయి. అందుకే, అవి తరచూ మొదటగా విఫలమవుతాయి. అందువల్ల, అంగస్తంభనలో సమస్యలు ఈ రకమైన గుండె వైఫల్యానికి (హార్ట్ ఫెయిల్యూర్‌కు) ఒక సంకేతం లేదా హెచ్చరిక కావచ్చు.

తాజా పరిశోధన పత్రం1,54,794 మంది పురుషుల డేటాను విశ్లేషించింది. అంగస్తంభన లోపం ఉన్న పురుషుల్లో కరోనరీ హార్ట్ డిసీజ్ (గుండె జబ్బులు) వచ్చే ప్రమాదం 59 శాతం ఎక్కువగా ఉందని, అలాగే, స్ట్రోక్ వచ్చే ప్రమాదం 34 శాతం కంటే ఎక్కువ ఉందని వెల్లడైంది.

''వాస్క్యులర్ హెల్త్‌కు మంచి కొలమానం లేదా సూచన అంగస్తంభన లోపం'' అని బ్రిటన్‌లోని మాంచెస్టర్ మెట్రోపాలిటన్ యూనివర్సిటీలోని రీప్రొడ్యూక్టివ్ సైన్స్ ఎక్స్‌పర్ట్ మైఖేల్ కారోల్ చెప్పారు.

మైఖేల్ కారోల్.. 'యువర్ నట్స్: ది సైన్స్ ఆఫ్ హౌ దే వర్క్ అండ్ వాట్ ఇట్ మీన్స్ ఫర్ యువర్ ఫెర్టిలిటీ' అనే పుస్తకానికి రచయిత. త్వరలోనే ఈ పుస్తకం విడుదల కాబోతుంది.

అంగస్తంభన లోపం ఉన్న పురుషులకు ఏడేళ్లలో మతిమరుపు వ్యాధి వచ్చే అవకాశం 68 శాతం ఎక్కువగా ఉందని ఒక తైవాన్ అధ్యయనంలో కనుగొన్నారు. పురుషాంగం లాగే, మన మెదడు కూడా శక్తిని అందించడానికి, విష పదార్థాలను బయటకు పంపడానికి మంచి రక్త సరఫరాపై ఆధారపడి ఉంటుంది.

అంగస్తంభన లోపం, గుండె జబ్బులు

ఫొటో సోర్స్, Serenity Strull/ BBC/ Getty Images

మధుమేహంతో సంబంధం ఏంటి..

మధుమేహ ప్రమాదం ఉన్నవారికి, అంగస్తంభన సమస్యను పర్యవేక్షించడం చాలా ముఖ్యం. ఎందుకంటే, రక్తంలో చక్కెర స్థాయిలు అకస్మాత్తుగా పెరగడం వంటి కారణాల వల్ల మధుమేహం రక్తప్రసరణ, నాడీ వ్యవస్థలకు నష్టం కలిగించగలదు.

మధుమేహాన్ని సరిగ్గా నియంత్రించకపోతే, రక్తంలో చక్కెర స్థాయిలు పెరగడం సర్వసాధారణం. దీనివల్ల రక్తంలోని అదనపు గ్లూకోజ్, రక్తనాళాల గోడలలోని ప్రోటీన్లకు అంటుకుంటుంది. ఇది రక్తనాళాల సాగే గుణం తగ్గడానికి దారితీస్తుంది. ఈ ప్రక్రియను గ్లైకేషన్ అంటారు.

అథెరోస్క్లెరోసిస్ మాదిరే.. ఇది శరీరంలోని అత్యంత అవసరమైన భాగాలకు, ముఖ్యంగా పురుషాంగంలోని సున్నితమైన రక్తనాళాలకు రక్త ప్రసరణను ప్రభావితం చేస్తుంది.

''మధుమేహం, అంగస్తంభన లోపానికి మధ్య బలమైన సంబంధం ఉంది. మధుమేహం లేని పురుషులతో పోలిస్తే టైప్ 2 డయాబెటిస్ ఉన్న పురుషుల్లో అంగస్తంభన లోపం వచ్చే అవకాశం మూడింతలు ఎక్కువగా ఉంటుంది'' అని స్పెయిన్‌లోని బార్సిలోనాలోని శాంట్ పౌ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్‌ పరిశోధకులు బోగ్డాన్ వ్లాచో అన్నారు.

కేవలం మధుమేహం ఉన్నవారితో పోలిస్తే.. మధుమేహం, అంగస్తంభన లోపం ఉన్నవారికి పెరిఫెరల్ న్యూరోపతి అంటే చేతులు, కాళ్లలోని నరాల దెబ్బతినే ప్రమాదం ఎక్కువగా ఉందని వ్లాచో కనుగొన్నట్లు ఆధారాల తాజా సమీక్షలో తెలిసింది.

ఈ వ్యక్తులకు కంటిచూపు కోల్పోవడానికి కారణమయ్యే రెటినోపతి అనే వ్యాధి వచ్చే ప్రమాదం కూడా ఎక్కువగా ఉంటుంది. ఇది మానని గాయాలకు కూడా దారితీయవచ్చు. కొన్నిసార్లు దీనివల్ల అవయవాలను తీసేయాల్సి వస్తుంది.

అంగస్తంభన లోపం, గుండె జబ్బులు

ఫొటో సోర్స్, Serenity Strull/ BBC/ Getty Images

చికిత్స పద్ధతులు

యూకేలోని 'ది యూరాలజీ ఫౌండేషన్' నిర్వహించిన ఒక సర్వేలో.. అంగస్తంభన సమస్య ఉన్న పురుషులలో సగానికి పైగా వైద్య సహాయం తీసుకోవడం లేదని తేలింది.

ఆ పరిస్థితి పట్ల ఉన్న సిగ్గు, భయం కారణంగా వారు చికిత్సకు ముందుకు రావడం లేదని తెలిసింది.

20 శాతం మంది పురుషులు తమ సమస్య గురించి వైద్యుడి వద్దకు వెళ్లడం కంటే ఒక నెలపాటు బీరు తాగకుండా ఉండటానికే ఇష్టపడతామని చెప్పారు.

కానీ, అంగస్తంభన లోపం ఉన్న పురుషులందరూ కూడా వైద్య సాయం తీసుకోవాలని కారోల్ సూచించారు. ఇది మీ బాధకు, ఒత్తిడికి మంచి ఉపశమనం కలిగించగలదని తెలిపారు.

అంతేకాకుండా, ఇది మీ మొత్తం శారీరక ఆరోగ్యం గురించి ఒక విలువైన సంభాషణను ప్రారంభించగలదు. ఇది ప్రాణాలను కాపాడుతుండొచ్చు.

"సమస్యను ముందుగానే పరిష్కరించడం ముఖ్యం" అని ఆయన అన్నారు.

అంతిమంగా, అంగస్తంభన లోపం అనేది నయం చేయలేని వ్యాధి కాదు. వయాగ్రా (సిల్డెనాఫిల్) వంటి మందులు పురుషాంగంలోని రక్తనాళాలను వ్యాకోచింపజేస్తాయి లేదా వెడల్పు చేస్తాయి.

అయితే, తమ లైంగిక జీవితాన్ని మెరుగుపరచుకోవడానికి ఈ మాత్రలు తీసుకునే వ్యక్తులలో గుండె, రక్తనాళాల ఆరోగ్యం కూడా మెరుగుపడుతుందని, అలాగే హార్ట్ ఫెయిల్యూర్ వచ్చే ప్రమాదం కూడా తగ్గుతుందని అనుభవపూర్వకంగా చెబుతున్న కొన్ని ఆధారాలు సూచిస్తున్నాయి. అయితే, ఇది క్లినికల్ ట్రయల్స్‌లో ఇంకా నిరూపితం కాలేదు.

(వయాగ్రాకు సంబంధించి ఇప్పుడు దుష్ప్రభావాలు గమనించకముందు.. ఈ డ్రగ్‌ను తొలుత అధిక రక్తపోటు ఉన్న రోగులకు గుండె, రక్తనాళాల చికిత్సకు ఉపయోగించేవారు)

ఈ మందులు మతిమరుపు ప్రమాదాన్ని తగ్గించడంతో పాటు అల్జీమర్స్ వ్యాధి ప్రమాదాన్ని సగానికి తగ్గించగలవని 8,85,000 మందికి పైగా రోగులను విశ్లేషించిన ఒక అధ్యయనం వెల్లడించింది.

గుండె ఆరోగ్యం దెబ్బతినడానికి దారితీసే ఊబకాయం వంటి సమస్యలపై కూడా వారు గైడ్ చేయగలరు.

కొన్ని సందర్భాల్లో, ఆహారపు అలవాట్లలో మార్పులు, వ్యాయామం వంటి సాధారణ చర్యలు కూడా సహాయపడతాయి. మధుమేహం ఉన్నవారు రక్తంలో చక్కెర స్థాయిలను అదుపులో ఉంచుకోవడం చాలా అవసరం.

అయితే, అంగస్తంభన సమస్యకు ఈ చికిత్సలను కనుగొనడం, అవి ఇతర సమస్యల ప్రమాదాన్ని కూడా తగ్గించగలవా అనే దానిపై పరిశోధన ఇంకా చాలా ప్రారంభ దశలోనే ఉందని స్పెయిన్‌లోని యూనివర్సిటీ ఆఫ్ బార్సిలోనా ఎండోక్రినాలజిస్ట్ శాంటియాగో మార్టినెజ్, శాంట్ పౌ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్‌ పరిశోధకులు బోగ్డాన్ వ్లాచో చెప్పారు.

అదనంగా, అంగస్తంభన సమస్య తలెత్తేందుకు కారణాలేంటో కనుగొనేందుకు కూడా చాలా ప్రయత్నాలు అవసరం పడొచ్చు.

ఎందుకంటే, ఇది లైంగిక కోరికలకు సంబంధించిన పోర్న్ అడిక్షన్, మానసిక ఆరోగ్య సమస్యల నుంచి కూడా ఉత్పన్నం కావచ్చు.

"ఒక వ్యక్తికి మధుమేహం లేదా గుండె జబ్బు ఉంటే, దాన్ని గుర్తించి చికిత్స చేయడం సాధారణంగా సులభం" అని కారోల్ చెప్పారు.

''కానీ, ఒకవేళ మద్యపానం, ధూమపానం వంటి జీవనశైలి కారకాలు, అధికంగా పోర్న్‌కు బానిసవ్వడం వంటి మానసిక, ప్రవర్తనా అంశాలుంటే.. దీనికి చికిత్స చేయడం చాలా కష్టం. తరచూ ఈ పురుషులు వారి ఈ విషయాల గురించి బయటికి మాట్లాడరు" అని కారోల్ తెలిపారు.

(డేవిడ్ రాబ్సన్ అవార్డు గ్రహీత సైన్స్ రచయిత)

( బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,  ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)