ఇరాన్, అమెరికా శాంతి ఒప్పందంతో భారత్‌కు లాభమేంటి

భారత్

ఫొటో సోర్స్, Getty Images

    • రచయిత, మొహమ్మద్ షాహిద్
    • హోదా, బీబీసీ ప్రతినిధి
  • ప్రచురణ
  • చదివే సమయం: 6 నిమిషాలు

మిడిల్‌ఈస్ట్‌లో ఫిబ్రవరి నెలాఖరు నుంచి కొనసాగుతున్న యుద్ధానికి ఎట్టకేలకు ముగింపు దొరికే సూచనలు కనిపిస్తున్నాయి.

పాకిస్తాన్ మధ్యవర్తిత్వంతో అమెరికా, ఇరాన్ యుద్ధాన్ని ముగించేందుకు ఒక ఒప్పందానికి వచ్చినట్లు ప్రకటించాయి. ఈ ఒప్పందంపై శుక్రవారం స్విట్జర్లాండ్‌లోని జెనీవాలో సంతకాలు జరగనున్నాయి.

ఈ ఒప్పందం గురించి పూర్తి వివరాలు ఇంకా వెల్లడించలేదు.

అయితే ఈ ఒప్పందంలోని ప్రధాన షరతుల్లో ఆంక్షలను ఎత్తివేయడం, అణ్వాయుధాలు తయారుచేయబోమని ఇరాన్ హామీ ఇవ్వడం, 30 రోజుల్లోగా హార్ముజ్ జలసంధిని తిరిగి తెరవడం వంటివి ఉన్నాయని ఇరాన్ ప్రభుత్వ మీడియా చెబుతోంది.

60 రోజుల తర్వాత తుది ఒప్పందంపై చర్చలు జరుగుతాయని, ఈ సందర్భంగా ఇరాన్ "అనేక అంశాలను పరిశీలిస్తోందని ఇరాన్ విదేశీ వ్యవహారాల ఉప మంత్రి కాజిమ్ గరీబాబాదీ తెలిపారు.

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌
ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

అమెరికా, ఇరాన్ రెండూ సైనిక చర్యలను తక్షణం, శాశ్వతంగా నిలిపివేయాలని ప్రకటించాయని లెబనాన్ అంశంపై మధ్యవర్తిత్వం వహిస్తున్న పాకిస్తాన్ పేర్కొంది.

"తమ దేశ ప్రజలు ఈ హింసను శాశ్వతంగా ముగించే ఆచరణాత్మక చర్యల కోసం ఆశిస్తున్నారు" అని లెబనాన్ అధ్యక్షుడు జోసెఫ్ ఔన్ అన్నారు.

అయితే ఈ ఒప్పందంలోని ఈ షరతును ఇరాన్ మద్దతిస్తున్న సాయుధ రాజకీయ సంస్థ హిజ్బొల్లాతో పాటు ఇజ్రాయెల్ పాటిస్తుందా లేదా అన్నది ఇంకా స్పష్టం కాలేదు.

తమ బలగాలు లెబనాన్‌లోనే ఉంటాయని ఇజ్రాయెల్ రక్షణ మంత్రి చెబుతుండగా, అన్ని సైనిక చర్యలను పూర్తిగా నిలిపివేయాలని ఇరాన్ డిమాండ్ చేసింది.

నరేంద్రమోదీ

ఫొటో సోర్స్, Getty Images

స్వాగతించిన ప్రధాని మోదీ

అమెరికా–ఇరాన్ శాంతి ఒప్పందానికి అంగీకారం కుదరడంతో ప్రపంచంలోని అనేక దేశాలు, నాయకులు స్పందించారు.

తాము అమెరికా, ఇరాన్, ప్రాంతీయ భాగస్వాములతో కలిసి పనిచేస్తామని బ్రిటన్, ఫ్రాన్స్, జర్మనీ, ఇటలీ దేశాల నాయకులు చేసిన సంయుక్త ప్రకటనలో తెలిపారు.

శుక్రవారం ఒప్పందంపై సంతకాలు పూర్తయ్యాక చమురు ఎలాంటి ఆటంకాలు లేకుండా ప్రవహిస్తుందని అమెరికా అధ్యక్షుడు డోనల్డ్ ట్రంప్ అన్నారు.

శాంతి ఒప్పందంపై భారత ప్రధాని నరేంద్ర మోదీ కూడా స్పందించారు.

"ప్రపంచవ్యాప్తంగా తీవ్రమైన ఆర్థిక అంతరాయానికి కారణమై, అనేక దేశాలలో ప్రాణనష్టానికి దారితీసిన యుద్ధాన్ని ముగించడానికి అమెరికా, ఇరాన్‌ల మధ్య కుదిరిన ఒప్పందాన్ని నేను స్వాగతిస్తున్నా" అని ఆయన ఎక్స్‌లో పోస్ట్ చేశారు.

ఒప్పందం అమల్లోకి రావడం వల్ల ఆ ప్రాంతంలో శాంతి, స్థిరత్వాన్ని పునరుద్ధరించడానికి, సముద్ర రవాణా, వాణిజ్యం సజావుగా సాగడానికి దోహదపడుతుందని భారత్ ఆశిస్తోందని ప్రధాని మోదీ అన్నారు.

మిగిలిన సమస్యలపై జరగబోయే చర్చలు కూడా శాశ్వతమైన, తుది ఒప్పందానికి దారితీయాలని ఆయన కోరుకున్నారు.

పాకిస్తాన్ ప్రధానమంత్రి షాబాజ్ షరీఫ్

ఫొటో సోర్స్, Getty Images

భారత్‌కు లాభం ఏంటి?

ఈ యుద్ధం ప్రపంచవ్యాప్తంగా చమురు, గ్యాస్ ధరలు, సరఫరాలపై తీవ్ర ప్రభావం చూపింది, దీనికి భారత్‌ కూడా మినహాయింపు కాదు.

భారత్‌లో చమురు, గ్యాస్ సరఫరా ప్రభావితమై, వాటి ధరలు భారీగా పెరిగాయి. భారత్ తన చమురు, గ్యాస్ అవసరాల్లో 90% దిగుమతి చేసుకుంటుంది. ఇందులో ముడి చమురు దిగుమతిలో 60% కంటే ఎక్కువ భాగం గల్ఫ్ దేశాలైన ఇరాక్, సౌదీ అరేబియా, కువైట్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ నుంచే వస్తుంది.

ఈ చమురులో సగం హార్ముజ్ జలసంధి మీదుగా వస్తుంది. అయితే ప్రస్తుత యుద్ధం కారణంగా హార్ముజ్ ప్రాంతంలో నౌకల రాకపోకలకు తీవ్ర అంతరాయం కలిగింది. దీనివల్ల భారత్‌ కూడా ఒత్తిడికి గురైంది.

ఈ ఒప్పందం అమల్లోకి వస్తే చమురు ధరలు తగ్గడం ఖాయం. కానీ భారత్‌కు కలిగే ఇతర ప్రయోజనాలు ఏంటి?

'మూడు కారణాల వల్ల గల్ఫ్ ప్రాంతం భారత్‌కు చాలా ముఖ్యమైంది. అక్కడి నుంచి ఎక్కువ మొత్తంలో చమురు, గ్యాస్ కొనుగోలు చేస్తాం. ఈ ప్రాంతం మన దేశానికి దగ్గరగా ఉండటం వల్ల రవాణా సమయం చాలా తక్కువ. ఓడ అయిదారు రోజుల్లో ఇక్కడికి చేరుకుంటుంది. దీంతో ఖర్చు కూడా తగ్గుతుంది. బీమా వంటి ఇతర ఖర్చులు కూడా తక్కువగా ఉంటాయి' అని ఇంధన రంగ నిపుణులు నరేంద్ర తనేజా చెప్పారు.

రెండో కారణం ఏంటంటే.. ఆ ప్రాంతంలో సుమారు కోటి మంది భారతీయులు పనిచేస్తున్నారు. వీరిలో కూలీలు, నైపుణ్యంగల కార్మికులు ఉన్నారు.

మూడో కారణం అది భారత్‌కు దగ్గరగా ఉండటంతోపాటు అక్కడ పాకిస్తాన్, చైనాల ప్రభావం పెరుగుతుండడమే. అక్కడ చైనా లేదా పాకిస్తాన్ జోక్యాన్ని పెంచే అటువంటి పరిస్థితిని భారత్ కోరుకోవడం లేదు.

ఈ ఒప్పందం అమలైతే యుద్ధం ఆగిపోయే అవకాశం ఉంది. కానీ నిజంగా శాంతి నెలకొంటుందా లేదా అనేది ఇప్పుడే చెప్పడం తొందరపాటు అవుతుందని ఆయన అంటున్నారు.

యెమెన్, లెబనాన్‌, చమురు, హార్ముజ్

శుక్రవారం ఈ ఒప్పందం అమల్లోకి వచ్చే అవకాశం చాలా తక్కువని మిడిల్ ఈస్ట్ ఇన్‌సైట్స్ ప్లాట్‌ఫామ్ వ్యవస్థాపకురాలు డాక్టర్ శుభదా చౌదరి భావిస్తున్నారు.

"ఈ ఒప్పందం కుదురుతుందని అనుకోవడం లేదు. ఇందుకు చాలా కారణాలు ఉన్నాయి. మొదటిది ఇరాన్ నుంచి జప్తు చేసుకున్న 300 బిలియన్ డాలర్లను తిరిగి ఇస్తామని అమెరికా చెబుతోంది, కానీ ఇది ఎలా జరుగుతుంది? రెండోది యెమెన్, లెబనాన్‌పై ఎలాంటి చర్చ జరగలేదు. అలాగే ఇజ్రాయెల్ దాడులు ఎంతవరకు తగ్గుతాయనే విషయంపైనా స్పష్టత లేదు" అని ఆమె అంటున్నారు.

'ఈ ఒప్పందం జరిగినా కూడా, దానిపై ఎవరు సంతకం చేస్తారన్నదానిపై స్పష్టత లేదు. ఎందుకంటే సుప్రీం లీడర్ మొజ్తబా ఖమేనీ గురించి స్పష్టమైన సమాచారం లేదు. అలాగే ఇరాన్ సుప్రీం కౌన్సిల్, నేషనల్ కౌన్సిల్, ఐఆర్‌జీసీ పాత్ర ఏంటన్నది కూడా క్లారిటీ లేదు.ఇది కేవలం మూడు దేశాల మధ్య పోరాటం కాదు, రెండు ప్రపంచ వ్యవస్థల మధ్య పోరాటం' అని శుభదా చౌదరి అంటున్నారు.

'ఒకవైపు ఇజ్రాయెల్, బ్రిటన్, అమెరికా, అనేక పశ్చిమ ఐరోపా దేశాలు ఉండగా, మరోవైపు ఉత్తర కొరియా, చైనా, రష్యా, ఇరాన్ ఉన్నాయి. ఇది పెట్రోడాలర్‌కు, పెట్రోయువాన్‌కు మధ్య జరుగుతున్న పోరాటం' అని ఆమె చెప్పారు.

ఒకవేళ ఈ ఒప్పందం కుదిరితే భారత్‌కు నాలుగు విషయాల్లో ప్రయోజనం చేకూరుతుందని శుభదా అంటున్నారు.

'మొదటి ప్రయోజనం ఇరాన్ చమురుకు సంబంధించింది. ఎందుకంటే దానిలో సల్ఫర్ శాతం తక్కువగా ఉండటం వల్ల అది యూఏఈ లేదా సౌదీ చమురు కంటే నాణ్యత కలిగి ఉంటుంది. రెండవ ప్రయోజనం ఎరువులు, గ్యాస్‌కు సంబంధించింది. ఎందుకంటే మనం చాలా వరకు గ్యాస్, ఎరువులను అక్కడి నుంచే దిగుమతి చేసుకుంటాం. మూడవది విదేశాల నుంచి పంపే డబ్బు (రెమిటెన్స్) రూపంలో చేకూరే ప్రయోజనం. ఎందుకంటే చాలా మంది భారతీయులు అక్కడ పనిచేస్తున్నారు. నాలుగో ప్రయోజనం భారతీయుల భద్రత మెరుగుపడడం, ముడి చమురు ధరల తగ్గడం' అని శుభదా వివరించారు.

ఇరాన్‌లో భారత్ ప్రాజెక్టుల పరిస్థితి?

ప్రపంచ చమురులో సుమారు 20 శాతం హార్ముజ్ జలసంధి ద్వారా రవాణా అవుతుంది.

హార్ముజ్ జలసంధి ఎవరి నియంత్రణలో ఉంటుంది, అక్కడ టోల్ వసూలు చేస్తారా లేదా అన్నదానిపై స్పష్టత లేదని నరేంద్ర తనేజా అంటున్నారు.

అక్కడ టోల్ విధిస్తే భారత్‌తో పాటు చైనా, జపాన్ వంటి దేశాలకు పెద్ద సమస్యగా మారవచ్చు అని ఆయన అంటున్నారు.

అయితే ఒప్పందం అమల్లోకి వస్తే హార్ముజ్ జలసంధిలో చిక్కుకున్న నౌకలు, అందులో ఉన్న భారతీయ నావికులు సురక్షితంగా ఉంటారని, అలాగే గల్ఫ్ దేశాల్లో ఉన్న సుమారు ఒక కోటి మంది భారతీయులకు స్థిరత్వం వస్తుందని నరేంద్ర తనేజా అంటున్నారు.

'యుద్ధం ఆగితే చమురు ధరలు తగ్గుతాయి, ఇది భారత ఆర్థిక వ్యవస్థకు మంచి వార్త. అలాగే అక్కడి నుంచి వచ్చే రిమిటెన్స్‌లు, సాధారణ కార్యకలాపాలు మళ్లీ సాధారణ స్థితికి వస్తాయి' అని ఆయన చెప్పారు.

భవిష్యత్తులో చమురు, గ్యాస్ కోసం గల్ఫ్ దేశాలపై ఆధారపడటాన్ని భారత్ కొనసాగిస్తుందా లేక తగ్గిస్తుందా అనే కీలకమైన ప్రశ్నను నరేంద్ర తనేజా కూడా లేవనెత్తుతున్నారు.

ఈ ఒప్పందం తర్వాత ఆ ప్రాంతంలో ఇరాన్ ప్రభావం పెరుగుతుందని, అలాగే దాని ప్రత్యర్థి సౌదీ అరేబియాకు అమెరికా కాకుండా ఇతర దేశాలపై ప్రభావం పెరుగుతుందని ఆయన భావిస్తున్నారు.

ఇరాన్‌లోని చాబహార్, బందర్ అబ్బాస్ పోర్టుల్లో భారత్ పెట్టుబడులు పెట్టింది, కానీ ఈ యుద్ధం తర్వాత ఆ ప్రణాళికలు నిలిచిపోయాయి.

ఇంటర్నేషనల్ నార్త్-సౌత్ ట్రాన్స్‌పోర్ట్ కారిడార్, అలాగే చాబహార్‌లో 20 ఏళ్లుగా పెట్టిన పెట్టుబడుల కారణంగా భారత్‌కు ఇరాన్ చాలా ముఖ్యమైన దేశమని, ఇవన్నీ భారత్‌కు ప్రయోజనం చేకూరుస్తాయని శుభదా చౌదరి అంటున్నారు.

( బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,  ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)