ఫార్మా / ఫ్యూచర్ సిటీ : "మేం వడ్లు పండిస్తేనే పట్నంలో కూర్చుని తింటున్నారు.. మా భూములు ఇవ్వం’’

ఫార్మాసిటీ, బాలామణి
ఫొటో క్యాప్షన్, ఫార్మాసిటీ కోసం తన భూములివ్వమని చెప్పిన యాచారం మండలంలోని నానక్ నగర్ గ్రామానికి చెందిన బాలామణి

"మేం ఇక్కడ వడ్లు పండిస్తేనే, అక్కడ వాళ్లు పట్నంలో కూర్చుని తింటున్నారు. మా భూములు తీసుకుంటే, వాళ్లకు అవేమీ ఉండవు"

రంగారెడ్డి జిల్లా యాచారం మండలంలోని నానక్‌నగర్ గ్రామానికి చెందిన బాలామణి ఆవేదన ఇది.

ఫార్మాసిటీ పేరుతో ఆమెకున్న నాలుగు ఎకరాల భూమిని తీసుకుంటామని అధికారులు చెప్పడంతో.. తన భూములివ్వమని చెబుతున్నారామె.

రంగారెడ్డి జిల్లాలో భూసేకరణ జరుగుతున్న గ్రామాల్లో బీబీసీ పర్యటించింది.

పదేళ్లుగా భూసేకరణ వివిధ దశల్లో జరుగుతున్నప్పటికీ, ఈ మధ్యకాలంలో ప్రభుత్వం వేగం పెంచింది.

అదే ప్రాంతంలో ఫ్యూచర్ సిటీని ఏర్పాలుచేయాలనే తలంపుతో పరిశ్రమలకు భూకేటాయింపులకోసం ప్రభుత్వం భూసేకరణను వేగవంతం చేసింది.

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి
ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి
పోలీసు పికెట్

పోలీసు పికెట్

యాచారం మండలం నానక్‌నగర్ శివారులో పోలీసు వాహనాలు నిలిపి ఉంచడం కనిపించింది. అక్కడ 20-25 మంది పోలీసుల పికెటింగ్ ఉంది. భూముల చదును సక్రమంగా సాగేందుకు ప్రభుత్వం పోలీసు పికెట్ ఏర్పాటు చేసింది.

"పట్టా భూముల జోలికి రామన్నారు. కానీ, ఇప్పుడు తీసుకుంటున్నారు. ఏది ఏమైనా మేం మా భూములు ఇవ్వం. ఎవరైనా ఇష్టపూర్వకంగా ఇస్తే తీసుకోమనండి. నాకున్న నాలుగెకరాల్లో ఏటా రూ.5 లక్షల పంట తీస్తా. పొట్లకాయ, సొరకాయ, కాకరకాయ వంటి కూరగాయల పంటలు పండిస్తా" అని బాలామణి చెబుతున్నారు.

ఇప్పుడు తమ భూమి తీసుకుంటే, మళ్లీ భూములు కొనలేమన్నది ఆమె ఆవేదన.

" కోటి రూపాయలు పెట్టినా భూమి దొరకడం లేదు. ప్రభుత్వం ఇచ్చే 30-40 లక్షల రూపాయలు ఏ మూలకు సరిపోతాయి?" అని ప్రశ్నించారు బాలామణి.

అయితే, రైతులకు ఇష్టం లేకుండా భూసేకరణ చేయమని ప్రభుత్వం చెబుతోంది.

రైతులు, ఫార్మాసిటీ, భూసేకరణ

ఫ్యూచర్ సిటీ కోసం నోటిఫికేషన్

హైదరాబాద్ నగరానికి సుమారు 40 కిలోమీటర్ల దూరంలో కందుకూరు, యాచారం, కడ్తాల్ మండలాల పరిధిలో ఫార్మాసిటీ ఏర్పాటు చేయాలని గతంలో బీఆర్ఎస్ (అప్పటి టీఆర్ఎస్) ప్రభుత్వం నిర్ణయించింది. 2016 జూన్ 10న దీనిపై జీవో 31తీసుకువచ్చింది.

ఫార్మాసిటీ కోసం 19,333 ఎకరాల సేకరణలో భాగంగా ఇప్పటివరకు సుమారు 13వేల ఎకరాలు సేకరించినట్లు అధికారులు చెబుతున్నారు. దాదాపు మరో 2500 ఎకరాలపై హైకోర్టులో కేసులు నడుస్తున్నాయి.

కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక ఫార్మాసిటీ ప్రాంతంలోనే ఫ్యూచర్ సిటీని ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించింది. దీనిపై 2025 మార్చి 12న జీవో నం.69ను విడుదల చేసింది. మొత్తం 56 రెవెన్యూ గ్రామాల పరిధిలో 765.28 చ.కి.మీ. విస్తీర్ణాన్ని 'ఫ్యూచర్ సిటీ ఏరియా'గా ప్రభుత్వం నోటిఫై చేసింది.

కానీ ప్రస్తుతం కొన్నిరోజులుగా అధికారులు ఫార్మాసిటీ పేరుతోనే భూసేకరణకు ప్రయత్నిస్తున్నారని రైతులు చెబుతున్నారు.

''భూసేకరణపై హైకోర్టులో స్టే ఉన్నప్పటికీ రైతుల భూములు తీసుకోడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి'' అని రైతు స్వరాజ్య వేదిక అధ్యక్షుడు కన్నెగంటి రవి బీబీసీతో చెప్పారు.

'' భూసేకరణలో పొలాలు తీసుకుంటే తమ ఉపాధి పోతుందని 2021లో వ్యవసాయ కూలీలు హైకోర్టును ఆశ్రయించారు. వారి సమస్య పరిష్కరించే వరకు భూసేకరణ నిలిపివేయాలని తెలంగాణ హైకోర్టు స్పష్టం చేసింది. అయినా, అధికారులు భూసేకరణ జరుపుతున్నారు'' అని వివరించారాయన.

ఈ విషయంపై ఇబ్రహీంపట్నం ఆర్డీవో శ్రీనివాసరెడ్డి బీబీసీతో మాట్లాడారు.

''నాలుగు గ్రామాల్లో సమస్య ఉందని చెబుతున్నారు. నేను కొత్తగా బాధ్యతలు తీసుకున్నా. పూర్తి వివరాలు కనుక్కుని చెబుతాను'' అన్నారు.

ఫార్మాసిటీ, భూసేకరణ, యాచారం, రంగారెడ్డి జిల్లా

నాలుగు గ్రామాల రైతుల అభ్యంతరాలు

యాచారం మండల పరిధిలోని కుర్మిద్ద, నానక్‌నగర్, మేడిపల్లి, తాడిపర్తి గ్రామాల్లో భూసేకరణ జరుగుతోంది.

ఇక్కడ అసైన్డ్ రైతుల నుంచి అధికారులు భూసేకరణ పూర్తి చేశారు.

అయితే, రైతుల నుంచి భూములు తీసుకునే క్రమంలో ఎకరాకు 120 చదరపు గజాల ప్లాటు ఇస్తామని ప్రభుత్వం ప్రకటించింది.

ఈ ప్లాట్లకు సంబంధించి హామీ పత్రం ఇచ్చినప్పటికీ, తమ పేరుతో రిజిస్ట్రేషన్ చేయలేదని రైతులు చెబుతున్నారు.

''భూసేకరణ కోసం మాకున్న 1.37 ఎకరాల అసైన్డ్ భూమిని ప్రభుత్వం తీసుకుంది. అప్పట్లో ప్లాటు ఇస్తామన్నారు. ఆ విషయంపై ప్రభుత్వం మాట్లాడటం లేదు. ప్లాటు ఎక్కడ ఉందో కూడా చూపించడం లేదు'' అని కుర్మిద్దకు చెందిన బైకని పద్మమ్మ బీబీసీతో చెప్పారు.

తమ పట్టా భూములు కూడా తీసుకోడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయని, ఎట్టి పరిస్థితుల్లో భూములు ఇవ్వమని చెబుతున్నారామె.

రైతులు, ఫార్మాసిటీ, భూసేకరణ

కరెంటు కనెక్షన్లు కట్

కుర్మిద్ద గ్రామానికి మేం వెళ్లినప్పుడు అక్కడ వరి కోతలు పూర్తయిన పొలాలు కనిపించాయి.

ఊరికి దూరంగా పశువుల పాకలు ఉన్నాయి. అక్కడికి వెళ్లాలంటే ఆ పొలాలను దాటుకుని వెళ్లాలి.

బైకని వీరయ్య పొలంలో మోటారు పనిచేయడం లేదు. ఆ మోటారుకున్న కరెంటు కనెక్షన్ కట్ చేసి ఉంది. వైర్లు స్తంభం కింద పడేసి కనిపించాయి.

కుర్మిద్ద నివాసి వీరయ్యకు చెందిన 20 పశువులుసమీపంలోని పాకలో ఉన్నాయి.

''రెండు రోజుల కిందట వచ్చి కరెంటు కనెక్షన్ తొలగించారు. తర్వాత అధికారులను బతిమాలి కరెంటు తీగలు వేయించుకున్నాం. మళ్లీ పైఅధికారులు చెప్పారంటూ లైన్‌మన్ వచ్చి కరెంటు కనెక్షన్ తొలగించారు'' అని వీరయ్య వాపోయారు.

కరెంటు కనెక్షన్ తొలగించడంతో మోటారు పనిచేయడం లేదని, పశువులకు నీరు పెట్టడానికి ఇబ్బందిగా మారిందని వీరయ్య చెప్పారు.

ఆయన సోదరులకు కూడా పశువులు ఉన్నాయి. పొలాల వద్దే పాకలు వేసుకుని వీరు కొన్నేళ్లుగా పశు పోషణ చేస్తున్నారు.

''వారం, పది రోజులు గడువు అడిగాం. అయినా వినలేదు. కరెంటు కనెక్షన్లు కట్ చేస్తే, రైతులు ఇక్కడి నుంచి వెళ్లిపోతారనే భావనతో మోటార్లకు కరెంటు రాకుండా ఆపేశారు'' అని వీరయ్య చెప్పారు.

‘‘కరెంటు కనెక్షన్లు కట్ చేయడం సరికాదని, భూసేకరణ పూర్తయిన చోట రైతులకు నెల నుంచి రెండు నెలల సమయం ఇవ్వాలని రెవెన్యూ అధికారులతో మాట్లాడుతున్నట్లు’’ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ, రైతు సంక్షేమ కమిషన్ ఛైర్మన్ ఎం.కోదండ రెడ్డి వివరించారు.

ఫార్మాసిటీ, భూసేకరణ, యాచారం, రంగారెడ్డి జిల్లా

‘అసైన్డ్ ల్యాండ్‌కూ అంతే పరిహారం ఇవ్వాలి’

కుర్మిద్ద, నానక్‌నగర్ గ్రామాల్లో భూసేకరణ పూర్తయినచోట వాటిని చదును చేసే పనులు నడుస్తున్నాయి.

తమకు పరిహారం పూర్తిగా ఇవ్వకుండానే చదును పనులు మొదలుపెట్టారని రైతులు చెబుతున్నారు.

''నాకు ఐదెకరాల భూమి ఉంది. ఎకరాన్నరకే పరిహారం ఇచ్చారు. మిగిలిన భూమికి ఇవ్వలేదు. పరిహారం ఇచ్చిన భూమిని చదును చేశారు. అది కూడా ఆ భూమికి తగ్గట్టుగా ప్లాటును మాకు చూపలేదు'' అని కుర్మిద్ద గ్రామస్తుడు గోరెటి కృష్ణయ్య బీబీసీతో చెప్పారు.

మరో రైతు తెలకమళ్ల నర్సింహదీ ఇదే పరిస్థితి.

''మా తాత మైసయ్య పేరుతో ఉన్న 5ఎకరాలకు పరిహారం ఇచ్చారు. కానీ, మా నాన్న వెంకటయ్య పేరుతో ఉన్న 3.20 ఎకరాల అసైన్డ్ భూమికి పరిహారం ఇవ్వడం లేదు'' అని చెప్పారు.

కోర్టు స్టే ఉన్నప్పటికీ పొలాలను చదును చేశారని చెబుతున్నారాయన.

''నాకు భూమే జీవనాధారం. పట్టాకు ఎంత పరిహారం ఇచ్చారో.. అసైన్డ్ ల్యాండ్‌కూ అంత పరిహారం ఇవ్వాలి. అప్పుడే మాకు న్యాయం జరుగుతుంది'' అని నర్సింహ చెబుతున్నారు.

ఫార్మాసిటీ, భూసేకరణ, యాచారం, రంగారెడ్డి జిల్లా

'బ్లాక్ లిస్టులో పెట్టడంతో ఇబ్బందులు పడుతున్నాం'

గ్రామాల్లో బీబీసీ పర్యటించినప్పుడు రైతులు భిన్నమైన అభిప్రాయాలు వ్యక్తం చేశారు.

కొందరు పరిహారం పెంచాలని అడుగుతుంటే.. మరికొందరు భూములు ఇవ్వడానికే సుముఖంగా లేమని చెబుతున్నారు.

అసైన్డ్ భూములకు తొలుత ప్రభుత్వం రూ.8 లక్షలు ఇస్తామని చెప్పగా, పట్టా భూములకు రూ.16 లక్షలు ఇవ్వాలని నిర్ణయించింది. ఇది కాకుండా అనుభవదారుగా ఉన్న రైతులకు రూ.7.70 లక్షలు ఇవ్వాలని అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం నిర్ణయించింది.

అయితే, ప్రస్తుతం అసైన్డ్ రైతులు కూడా తమకు పరిహారం పెంచి ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు.

మరోపక్క రైతులు తమ పట్టా భూములు ఇవ్వమని చెబుతున్నారు.

తనకున్న ఐదెకరాల పట్టా భూమిని తీసుకోడానికి 2021లోనే నోటిఫికేషన్ ఇచ్చారని, కానీ, కోర్టు స్టే తెచ్చుకున్నానని నానక్‌నగర్‌కు చెందిన అంజిరెడ్డి చెబుతున్నారు.

''స్టే ఉన్నప్పటికీ పరిహారం కోర్టులో జమ చేశారనే ఉద్దేశంతో భూములు తీసుకుంటున్నారు. మా భూములు బ్లాక్ లిస్టులో పెట్టారు'' అని అంజిరెడ్డి చెప్పారు.

తమది రైతు అనుకూల ప్రభుత్వమని తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ, రైతు సంక్షేమ కమిషన్ చైర్మన్ ఎం.కోదండ రెడ్డి బీబీసీతో చెప్పారు.

''పట్టా భూములకు రూ.40 లక్షలు ఇవ్వడానికి ప్రభుత్వం సిద్ధమైంది. అలాగే అసైన్డ్ భూములకు పరిహారం ఇవ్వడంతోపాటు ప్లాట్లు ఇవ్వడానికి సిద్ధంగా ఉంది. ఇవి కాకుండా రెండు, మూడు ప్రతిపాదనలు కూడా ప్రభుత్వం వద్ద పరిశీలనలో ఉన్నాయి'' అని చెప్పారు.

ఫార్మాసిటీ, భూసేకరణ, యాచారం, రంగారెడ్డి జిల్లా

‘భూములు వెనక్కి ఇవ్వాలి’

భూములు అమ్ముకోవద్దని, ఫ్యూచర్ సిటీ వస్తుందని, భూముల ధరలు పెరుగుతాయని తమకు సమీపంలోని ఇతర గ్రామాలలో ప్రభుత్వం చెబుతోందని నానక్‌నగర్‌కు చెందిన భగవంత్ రెడ్డి చెబుతున్నారు.

''మాకు 2018లోనే భూములు తీసుకుంటామని చెప్పారు. 2021లో నోటిఫికేషన్ ఇచ్చారు. నాకు 20 ఎకరాల పట్టా భూమి ఉంది. కోర్టు స్టే తెచ్చుకున్నాం. కానీ, అప్పట్నుంచి నా భూమిని నిషేధిత జాబితాలో పెట్టారు. నా భూమి అమ్ముకోవడానికి లేకుండా పోయింది'' అని చెప్పారు భగవంత్ రెడ్డి.

''పంట రుణాలు రావడం లేదు. యూరియా రావడం లేదు. పంట అమ్ముకోడానికి వీలుండటం లేదు. భూమిని బ్లాక్ లిస్టులో పెట్టడంతో మేం ఎన్నో ఇబ్బందులు పడుతున్నాం'' అని భగవంత్ రెడ్డి చెప్పారు.

గతంలో పట్టా భూమికి రూ.16 లక్షలు ఇస్తామని చెప్పారని, ఇప్పుడు దాన్ని రూ.30-40 లక్షలకు పెంచి ఇస్తామని చెబుతున్నారని ఆయన తెలిపారు.

''మాకు పరిహారం వద్దు. మా భూమి మాకే ఉండాలి. రూ.40 లక్షలు ఇచ్చినా సరే, ఇప్పుడు మా ప్రాంతంలో ఎకరా భూమి దొరకడం లేదు. ఒక్కొక్క ఎకరా రూ. 2-3 కోట్ల వరకు పలుకుతోంది'' అని చెప్పారాయన.

భూమి ఇస్తే, మళ్లీ కొనుగోలు చేసే పరిస్థితి లేదని చెబుతున్నారు భగవంత్ రెడ్డి.

రైతులపై ఒత్తిడి పెట్టి భూములు తీసుకోడానికి ప్రయత్నిస్తున్నారని పర్యావరణవేత్త, ఫార్మాసిటీ వ్యతిరేక పోరాట కమిటీ అధ్యక్షురాలు కవుల సరస్వతి బీబీసీతో చెప్పారు.

''మా డిమాండ్ ఒక్కటే... ఫార్మాసిటీ రద్దు చేసి భూములు తిరిగి రైతులకు ఇవ్వాలి. ప్రభుత్వం వ్యవసాయ భూములనే తీసుకుంటోంది. దానివల్ల వ్యవసాయం, దానిపై ఆధారపడిన రంగాలు పూర్తిగా దెబ్బతినే ప్రమాదం ఉంది'' అని కవుల సరస్వతి చెప్పారు.

ఫార్మాసిటీ, భూసేకరణ, యాచారం, రంగారెడ్డి జిల్లా, కవుల సరస్వతి
ఫొటో క్యాప్షన్, పర్యావరణవేత్త, ఫార్మాసిటీ వ్యతిరేక పోరాట కమిటీ అధ్యక్షురాలు కవుల సరస్వతి

ఫార్మాసిటీ రద్దు చేస్తామని మేనిఫెస్టోలో హామీ

కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి ముందు ఫార్మాసిటీ రద్దు చేస్తామని హామీ ఇచ్చింది. 2023 ఎన్నికల మేనిఫెస్టోలో ఈ విషయాన్ని ప్రకటించింది.

''ప్రజాభిప్రాయ సేకరణతో హైకోర్టు ఆదేశానుసారం ఫార్మాసిటీను రద్దు చేస్తాం'' అని మేనిఫెస్టోలో పెట్టింది కాంగ్రెస్ పార్టీ.

ఫార్మాసిటీ రద్దుతోపాటు మరికొన్ని హామీలను కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో పెట్టిందని రైతు స్వరాజ్య వేదిక అధ్యక్షుడు కన్నెగంటి రవి బీబీసీతో చెప్పారు.

''పట్టా భూములతో సమానంగా అసైన్డ్ భూములకు పరిహారం ఇస్తాం. బీఆర్ఎస్ ప్రభుత్వం సేకరించిన అసైన్డ్ భూములను తిరిగి ఎస్సీ, ఎస్టీలకు ఇస్తాం. 2013 భూసేకరణ చట్టాన్ని అమలు చేస్తామని కాంగ్రెస్ పార్టీ హామీలిచ్చింది’’ అని కన్నెగంటి రవి చెప్పారు.

ప్రజాభిప్రాయ సేకరణతోనే ఏ అభివృద్ధి కార్యక్రమమైనా జరగాలని కవుల సరస్వతి అభిప్రాయపడ్డారు.

''ప్రస్తుతం ఫ్యూచర్ సిటీ అని కాంగ్రెస్ ప్రభుత్వం అంటోంది. ఫార్మాసిటీ రద్దు చేశారో లేదో చెప్పలేదు. ఫ్యూచర్ సిటీ పెడతామని చెబుతుంటే, దానికి తగ్గట్టుగా ప్రజాభిప్రాయ సేకరణ చేయాలి'' అని కవుల సరస్వతి చెప్పారు.

కాంగ్రెస్ పార్టీ అభయహస్తం పేరుతో ప్రకటించిన మానిఫెస్టోలో హైకోర్టు ఆదేశాల మేరకు ఫార్మాసిటీలను రద్దు చేస్తామని ప్రకటించింది.

ఫొటో సోర్స్, UGC

ఫొటో క్యాప్షన్, కాంగ్రెస్ పార్టీ అభయహస్తం పేరుతో ప్రకటించిన మేనిఫెస్టోలో హైకోర్టు ఆదేశాల మేరకు ఫార్మాసిటీలను రద్దు చేస్తామని ప్రకటించింది.

ఫార్మాసిటీ రద్దు చేస్తామని మేనిఫెస్టోలో పెట్టినప్పటికీ, కొన్ని సాంకేతిక కారణాలతో రద్దు కాలేదని ఎం.కోదండ రెడ్డి బీబీసీతో చెప్పారు.

''మేం అధికారంలోకి వస్తే ఫార్మా పరిశ్రమలు ఉండవని చెప్పాం. ఆ ప్రాంతం వాడిని కాబట్టి భూములు చెడిపోతాయని తెలుసు. మేనిఫెస్టో ప్రకారం, ఫార్మాసిటీ జోలికి పోవడం లేదు. సాంకేతిక ఇబ్బందులు అధిగమించి రైతులకు న్యాయం చేయాలి. ఆ విధంగా చేస్తాం. భారీ ఫార్మా పరిశ్రమలు రాకుండా చేయాలన్నదే మా ఉద్దేశం'' అని చెప్పారు.

ఫార్మాసిటీ ఏర్పాటు జీవో నం.31 అమల్లోనే ఉందని స్పష్టం చేస్తూ  ప్రభుత్వం  హైకోర్టులో దాఖలు చేసిన అఫిడవిట్ (ఎడమ), ఫ్యూచర్ సిటీ కోసం ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వులు (కుడి)

ఫొటో సోర్స్, TSGOVT

ఫొటో క్యాప్షన్, ఫార్మాసిటీ ఏర్పాటు జీవో నం.31 అమల్లోనే ఉందని స్పష్టం చేస్తూ ప్రభుత్వం హైకోర్టులో దాఖలు చేసిన అఫిడవిట్ (ఎడమ), ఫ్యూచర్ సిటీ కోసం ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వులు (కుడి)

అసలు ఫార్మాసిటీ ఉందా.. లేదా..?

ఫార్మాసిటీ ఉందా.. లేదా.. అన్నది ఇప్పుడు రైతుల సందేహం. ఒకవైపు ఫార్మాసిటీ పేరిట భూములు సేకరిస్తూ మరోవైపు అదే ప్రాంతంలో ప్రభుత్వం ఫ్యూచర్ సిటీనిఏర్పాటు చేస్తోంది.

అయితే, ఫార్మాసిటీ కేసు విషయంలో తెలంగాణ ప్రభుత్వం 2024 సెప్టెంబరులో అఫిడవిట్ దాఖలు చేసింది.

అందులో ఫార్మాసిటీ కోసం తీసుకువచ్చిన జీవో నం.31 అమల్లోనే ఉందని ప్రభుత్వం స్పష్టం చేసింది. ఆ తర్వాత కూడా జీవోను రద్దు చేస్తూ ప్రభుత్వం ఎలాంటి ఉత్తర్వులూ విడుదల చేయలేదు.

''ప్రస్తుతం ఫార్మాసిటీ ప్రాంత గ్రామాల్లో పరిస్థితులు కొంత జఠిలంగా ఉన్న మాట వాస్తవమే. ఈ ప్రభుత్వం రైతులకు సంబంధించిన అన్ని సమస్యలు పరిష్కారానికి సిద్ధంగా ఉంది'' అని ఎం.కోదండరెడ్డి చెప్పారు.

రైతుల అభ్యంతరాలు, ఆరోపణలపై యాచారం తహసీల్దారు అయ్యప్పను బీబీసీ సంప్రదించింది.

"పరిహారం ఇచ్చిన భూములను తీసుకుంటున్నాం. భూసేకరణ పూర్తయిన చోట కరెంటు కనెక్షన్లు తీసేశాం. అవి ప్రభుత్వ అధీనంలోకి వచ్చినవి కాబట్టే కరెంటు కనెక్షన్లు తొలగించి టీజీఐఐసీకి అప్పగించాం" అని చెప్పారు.

ప్లాట్లు ఇవ్వలేదని రైతులు చెబుతున్నారు కదా.. అని తహసీల్దారును బీబీసీ ప్రశ్నించగా, ఇప్పటికే ప్లాట్ల కోసం భూకేటాయింపులు పూర్తయ్యాయన్నారు.

"ప్లాట్ల కోసం డ్రా తీసి, జాబితాను సబ్-రిజిస్ట్రార్‌కు పంపించాం. మంత్రి, ఎమ్మెల్యే సమక్షంలో లబ్ధిదారులకు కేటాయించనున్నాం" అని అయ్యప్ప వివరించారు.

హైకోర్టు స్టే విషయంలో అప్పీలుకు వెళ్లామని, పరిహారం పంపిణీ పూర్తయిన చోట భూసేకరణ పూర్తి చేస్తున్నామని అయ్యప్ప చెప్పారు.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,  ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)