జపాన్: మగవాళ్లు షార్ట్స్ ధరిస్తే ‘అదొక వేధింపు’గా మహిళలు ఎందుకు భావిస్తున్నారు?

ఫొటో సోర్స్, Getty Images
- రచయిత, కుురమి మోరీ
- హోదా, టోక్యో కరస్పాండెంట్
- ప్రచురణ
- చదివే సమయం: 4 నిమిషాలు
జపాన్‌లో ఈ వేసవి ఉష్ణోగ్రతలు ఎన్నడూ లేనంతగా పెరుగుతుండటంతో ఉద్యోగాలకు వెళ్లే పురుషులు గతంలో కంటే ఎక్కువగా షార్ట్స్ ధరిస్తున్నారు.
ఉద్యోగులు సాధారణంగా ధరించే సూట్, టైలకు గుడ్‌బై చెప్పి, టీ షర్టులు, ట్రైనర్లు, షార్ట్స్ వంటి సాధారణ దుస్తులు ధరించాలని టోక్యో మెట్రోపాలిటన్ ప్రభుత్వం ప్రోత్సహిస్తోంది.
టోక్యో గవర్నర్ యురికో కోయికే ఏప్రిల్‌లో ‘టోక్యో కూల్ బిజ్’ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఏటా వేసవి సంప్రదాయంగా మారి, యురికో కోయికేకు ప్రత్యేక గుర్తింపు తీసుకువచ్చిన ఈ కార్యక్రమాన్ని మరింత విస్తరించడం దీని లక్ష్యం.
షార్ట్స్ ధరించి కార్యాలయాకు రావడానికి అనుమతి ఇచ్చి దాదాపు నాలుగు నెలలు గడిచాయి. అయినా ఈ నిర్ణయంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి
కొంతమంది ఉద్యోగులు ఈ సడలింపును స్వాగతిస్తూ మరింత సౌకర్యంగా పనిచేయగలు గుతున్నామని చెబుతున్నారు.
మరోవైపు కొందరు ఈ విధానం మహిళల విషయంలో న్యాయంగా లేదంటున్నారు. పురుషులు షార్ట్స్ ధరించే వెసులుబాటు పొందినా, మహిళలు మాత్రం తమ కాళ్లలో కొంతభాగం బయటకు కనిపించే దుస్తులు ధరించినప్పుడు టైట్స్ ధరించాలనే సామాజిక అంచనాలను పాటించాల్సి వస్తోందని వారు చెబుతున్నారు.
మరికొందరు మహిళలు, తమ సహోద్యోగుల కాళ్లపై రోమాలను చూడాల్సి రావడం అసౌకర్యంగా ఉందని చెబుతున్నారు. దీన్ని వారు లెగ్ హెయిర్ హెరాస్‌మెంట్ అని లేదా ఆన్‌లైన్‌లో ప్రాచుర్యం పొందిన సునెహారా అనే పదంతో అభివర్ణిస్తున్నారు.


ఫొటో సోర్స్, Getty Images
‘‘తీవ్రమైన ఎండల్లో ప్రజలకు దుస్తుల విషయంలో మరింత వెసులుబాటు కల్పించాలన్నదే మా ఉద్దేశం. అంతేకానీ, ఏ దుస్తులు ధరించాలో చెప్పడం కాదు. పని ప్రదేశానికి వేసుకువచ్చే దుస్తులు ఎవరికీ అభ్యంతరం కలిగించనంతవరకు దానిని సమస్యగా చూడాల్సిన పనిలేదు’’ అని టోక్యో మెట్రోపాలిటన్ ప్రభుత్వ పర్యావరణ శాఖాధికారి నొబోరు వతనాబే బీబీసీకి చెప్పారు.
ఇటీవలి సంవత్సరాల్లో ముఖ్యంగా స్టార్టప్‌లు, టెక్నాలజీ సంస్థల్లో పనిచేసే జపాన్ ఉద్యోగులు సాధారణ దుస్తులలో కార్యాలయాలకు రావడం మొదలుపెట్టారు. అయితే ఈ ఏడాది టోక్యో ప్రభుత్వ సిఫార్సు తో అలాంటి దుస్తులు ధరించడాన్ని సమాజం మరింతగా ఆమోదిస్తోంది. అయినప్పటికీ కొందరు పురుషులు తమ కాళ్లపై రోమాల గురించి ఇతరులు ఏమనుకుంటారోననే సంకోచంలో ఉన్నారు.
‘‘పురుషుల కాళ్లపై తక్కువ రోమాలు ఉండాలని’’ మహిళలు భావిస్తున్నారని గొరిల్లా క్లినిక్ డైరక్టర్ అకిఫుమి ఫునాట్సు చెప్పారు. అందువల్ల కేవలం సౌందర్యం కోసమే కాకుండా,షార్ట్స్ ధరించినప్పుడు ఇతరులకు అసౌకర్యం కలగకూడదనే సామాజిక మర్యాదను పాటించాలనే ఉద్దేశంతో లేజర్ చికిత్స ద్వారా కేశాలను తొలగించుకోవడానికి మా క్లినిక్‌కు వస్తున్నారు అని ఆయన తెలిపారు.
కోయికే తొలిసారిగా 2005లో జపాన్ పర్యావరణ మంత్రిగా ఉన్నప్పుడు వేసవి కాల దుస్తుల్లో మార్పులను ప్రవేశపెట్టారు. కంపెనీల్లో పనిచేసేవారు ఫుల్‌స్లీవ్ చొక్కాలు, టైలకు బదులుగా పొట్టి చేతుల చొక్కాలు ధరించాలని ప్రోత్సహిస్తూ "కూల్ బిజ్" పేరుతో దేశవ్యాప్త ఇంధన పొదుపు కార్యక్రమాన్ని ప్రారంభించారు.
ఆ సమయంలో ప్రభుత్వంలోని పెద్దలు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. అప్పటి ప్రధానమంత్రి జునిచిరో కోయిజుమి బహిరంగ కార్యక్రమాల్లో తరచుగా టై, కోటు లేకుండా కనిపించడంతో ఈ కార్యక్రమానికి విస్తృతంగా ప్రాచుర్యం పొందింది.
2011 మార్చిలో తోహోకు భూకంపం, సునామీ తర్వాత ప్రభుత్వం "సూపర్ కూల్ బిజ్" కార్యక్రమాన్ని ప్రారంభించింది. కార్యాలయాలతో పాటు ఇళ్లలోనూ విద్యుత్ వినియోగాన్ని తగ్గించేందుకు మరిన్ని మార్గదర్శకాలను విడుదల చేసింది.
ప్రపంచంలోని ఇతర దేశాల మాదిరిగానే జపాన్ కూడా ఇటీవలి నెలల్లో రికార్డు స్థాయి ఎండలను ఎదుర్కొంటోంది. ఇదే సమయంలో మధ్యప్రాచ్యంలో నెలకొన్న అస్థిర పరిస్థితుల వల్ల ఇంధన ధరలు పెరగడంతో దేశం మరో సవాలును ఎదుర్కొంటోంది.
ఈ వేసవిలో తీవ్రమైన ఎండలు ఉంటాయని వాతావరణ నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఉష్ణోగ్రతలు 40 డిగ్రీల సెల్సియస్ దాటిన రోజులను అత్యంత వేడిగా ఉండే రోజు అని సూచించేందుకు జపాన్ వాతావరణ సంస్థ "కొకుషో-బి" అనే పదాన్ని ఉపయోగిస్తూ ప్రజలను అప్రమత్తం చేస్తోంది .

ఫొటో సోర్స్, Getty Images
తాజా వారపు గణాంకాల ప్రకారం జూలై 6 నుంచి 12 వరకు ఏడు రోజుల వ్యవధిలో వడదెబ్బ కారణంగా ఏడుగురు మరణించగా, 4,580 మంది ఆసుపత్రుల్లో చేరినట్లు అగ్నిమాపక, విపత్తు నిర్వహణ సంస్థ తెలిపింది.
తగినంత నీరు తాగడం, ఎయిర్ కండిషనర్ ఉపయోగించడం వంటి ప్రాథమిక సూచనలను ప్రభుత్వం పదేపదే ప్రచారం చేస్తుండగా, ప్రజలు వేడిని తట్టుకోవడానికి కొత్త ఉత్పత్తులు, పరికరాలను కూడా ఆశ్రయిస్తున్నారు.
అంతర్నిర్మిత ఫ్యాన్లు ఉన్న దుస్తులు, ఒకసారి వాడి పారేసే తడి తువ్వాళ్లు, అతినీలలోహిత కిరణాలు, వేడిని అడ్డుకునే గొడుగులు, చేతిలో అమరే చిన్న ఫ్యాన్లు దేశవ్యాప్తంగా విస్తృతంగా అమ్ముడవుతున్నాయి.
జపాన్ అకాడెమిక్ నెట్‌వర్క్ ఫర్ డిజాస్టర్ రిడక్షన్ నిపుణులు శరీరాన్ని వేడికి అలవాటు చేయడం ఎంతో అవసరమని చెబుతున్నారు. అధిక ఉష్ణోగ్రతలకు శరీరం అలవాటు పడేందుకు కొన్ని వారాలు పడుతుందని వారు తెలిపారు.
జపాన్‌లో అధిక తేమ కూడా మరో సవాలుగా ఉంది. దీని వల్ల చెమట త్వరగా ఆవిరి కాకపోవడంతో శరీరం సహజంగా చల్లబడే సామర్థ్యం తగ్గిపోతుంది.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్, ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)





























