పీరియడ్స్ టైంలో సెక్స్.. ప్రమాదకరమా? ప్రయోజనకరమా?

ఫొటో సోర్స్, Getty Images
పీరియడ్స్ గురించి స్వేచ్ఛగా మాట్లాడటానికి ఇప్పటికీ చాలామంది సంకోచిస్తారు. ఇక దానికి సెక్స్ అనే అంశం కూడా తోడైతే దాని గురించి ఎక్కువగా మాట్లడరనే చెప్పొచ్చు.
"పీరియడ్స్ టైంలో సెక్స్" విషయంలో అనేక అపోహలు ఉన్నాయి, అలాగే దీనిగురించి సరైన సమాచారం కూడా చాలామందికి తెలియదు.
లైంగికంగా చురుకుగా ఉండే జంటలలో 30 శాతం మంది తమ నెలసరి సమయంలో శృంగారంలో పాల్గొంటారని ఒక అధ్యయనం పేర్కొంది.
అయితే అలా చేయడం పరిశుభ్రమైనది కాదు, సురక్షితమైనది కూడా కాదనే మరో వాదన కూడా ఉంది.

‘సహజ లూబ్రికెంట్’
500 మందిపై జరిగిన ఒక అధ్యయనంలో 55 శాతం మంది పీరియడ్స్ సమయంలో సెక్స్ చేయడం నార్మల్‌గా, బాగా అనిపించిందని చెప్పారు. అయితే 45% మంది అలా చేయడంలో అంతగా ఆనందం కలగలేదని తెలిపారు.
అయితే ఆ 45 శాతం మంది ఇలా ఎందుకు భావిస్తారో తెలుసుకోవడానికి కూడా అధ్యయనాలు జరిగాయి.
మహిళలకు అండం విడుదల సమయంలో లైంగిక ఉత్సాహం పెరిగే అవకాశం ఉంటుంది. కానీ రుతుస్రావం సమయంలో అలా అనిపించదని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
'పీరియడ్స్ టైంలో సెక్స్ చేయడంపై అనేక అపోహలు, భిన్న వాదనలు ఉన్నాయి. ఆ సమయంలో చాలామంది మహిళలకు నొప్పి ఉంటుంది. కాబట్టి అది మంచిది కాదనేది ఒక అపోహ. కానీ అది నిజం కాదు' అని సూరత్‌కు చెందిన గైనకాలజిస్ట్ డాక్టర్ శ్వేతా పటేల్ అన్నారు.
'రక్తం సహజ లూబ్రికెంట్‌గా పనిచేయవచ్చు, భావప్రాప్తి వల్ల కొంతమందికి పీరియడ్ నొప్పి కూడా తగ్గిపోవచ్చు. అయితే ఆ టైంలో చేయాలా, వద్దా అన్న నిర్ణయం మాత్రం జంటలు పరస్పర అంగీకారంతో తీసుకోవడం ఉత్తమం' అని ఆమె సూచించారు.
"పీరియడ్స్ టైంలో వచ్చే క్రాంప్స్ నొప్పిగా, అసౌకర్యంగా అనిపిస్తాయి. కానీ భావప్రాప్తి సమయంలో శరీరం ఎండార్ఫిన్‌లను విడుదల చేస్తుంది, ఇవి పీరియడ్ క్రాంప్స్, ఒత్తిడితో బాధపడే కొంతమందికి ఉపశమనం కలిగిస్తాయి" అని పీరియడ్ ట్రాకింగ్ యాప్‌లో సైన్స్ పరిశోధకురాలైన అన్నా డ్రూయెట్ అంటున్నారు.
'పీరియడ్స్ టైంలో సెక్స్ సహజంగానే ఎక్కువ లూబ్రికేషన్‌తో ఉంటుంది. అలాగే ఆ రోజుల్లో షవర్‌లో సెక్స్ చేయడం కొందరికి బాగా అనిపించవచ్చు, ఎందుకంటే నీటి వల్ల అదనపు లూబ్రికేషన్ అవసరం ఉండదు, శుభ్రంగా కూడా ఉంటుంది' అని ఆమె చెప్పారు.

ఫొటో సోర్స్, Getty Images
పీరియడ్స్ టైంలో సెక్స్ చేస్తే ప్రెగ్నెన్సీ వస్తుందా?
'పీరియడ్స్ టైంలో సెక్స్ చేయడం వల్ల సాధారణంగా ప్రెగ్నెన్సీ రాదు. ఇది ఒక అపోహ మాత్రమే. గర్భం రావడానికి ఒవ్యూలేషన్ సమయం (అండం విడుదలయ్యే దశ) అత్యంత అనుకూలమైంది' అని డాక్టర్ శ్వేతా పటేల్ చెబుతున్నారు.
ఒవ్యూలేషన్ అనేది మెన్స్ట్రువల్ సైకిల్‌లో పీరియడ్స్ తర్వాత వచ్చే దశ.
ఈ సమయంలో అండాశయం నుంచి అండం విడుదల అవుతుంది. ఆ అండం 12 నుంచి 24 గంటల వరకు గర్భధారణకు అనుకూలంగా ఉంటుంది కాబట్టి, ఆ సమయంలో శృంగారం చేస్తే గర్భం దాల్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి.
అయితే, పీరియడ్స్ టైంలో సెక్స్ చేస్తే కండోమ్ వాడటం మంచిదని కొంతమంది ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు .

ఫొటో సోర్స్, Getty Images
పీరియడ్స్ ఆలస్యం అయితే గర్భం వచ్చినట్టేనా?
నెలసరి ఆలస్యం కావడానికి అనేక కారణాలుంటాయి. ప్రెగ్నెన్సీ రావడం అనేది వాటిలో ఒకటి మాత్రమే.
'పీరియడ్స్ లేట్ కావడానికి కేవలం ప్రెగ్నెన్సీ మాత్రమే కారణం కాదు. పీసీఓడీ, థైరాయిడ్ సమస్యలు, ఒబెసిటీ వంటి కారణాల వల్ల కూడా ఆలస్యం కావచ్చు. కాబట్టి పీరియడ్స్ ఆలస్యం అయితే వెంటనే ప్రెగ్నెన్సీ వచ్చిందనుకోవడం కరెక్ట్ కాదు' అని డాక్టర్ శ్వేతా పటేల్ చెప్పారు.
'రుతుచక్రం(మెనుస్ట్రువల్ సైకిల్) రెగ్యులర్‌గా ఉన్న మహిళలకు పీరియడ్స్ మిస్ అయితే 2 లేదా 3వ రోజున ప్రెగ్నెన్సీ టెస్ట్ చెయ్యొచ్చు. ఈ సైకిల్ రెగ్యులర్‌గా లేని వారికి అయితే సుమారు వారం తర్వాత టెస్ట్ చేయడం మంచిది' అని ఆమె సూచించారు.

ఫొటో సోర్స్, Getty Images
రుతు చక్రం మూడు దశలు
స్త్రీల రుతుచక్రం మూడు దశలుగా ఉంటుంది.
ఈ దశలు అండాశయాల నుంచి విడుదలయ్యే ఈస్ట్రోజెన్, ప్రొజెస్టెరాన్ అనే హార్మోన్లపై ఆధారపడి ఉంటాయి.
1. రుతుస్రావ దశ - మహిళలకు రక్తస్రావం మొదలయ్యే దశను రుతుస్రావ దశ అంటారు.
'గర్భాశయం లోపల ఎండోమెట్రియం అనే ఒక పొర ఉంటుంది. పీరియడ్స్ టైంలో ఈ ఎండోమెట్రియం విచ్ఛిన్నమవడంతో పాటు, సర్వైకల్ మ్యూకస్, రక్తం శరీరం నుంచి బయటకు వస్తుంది. ఈ ఎండోమెట్రియం ఈస్ట్రోజెన్ హార్మోన్ ప్రభావంలో ఉంటుంది. ప్రతి పీరియడ్ తర్వాత ఈ పొర మళ్లీ కొత్తగా ఏర్పడుతుంది' అని డాక్టర్ శ్వేతా పటేల్ అంటున్నారు,
2. అండ విడుదల దశ - రక్తస్రావం ఆగిపోయిన 13 నుంచి 15 రోజుల మధ్య ఈ దశ ఉంటుంది.
'ఈ దశలో అండాశయం నుంచి అండం విడుదలై 12 నుంచి 24 గంటల వరకు ఫలదీకరణకు అనుకూలంగా ఉంటుంది. కాబట్టి గర్భధారణకు ఇది చాలా అనుకూలమైన సమయం' అని ఆమె చెప్పారు.
3. ల్యూటియల్ దశ - 'ఒక స్త్రీ అండవిడుదల దశలో గర్భం దాల్చకపోతే, ప్రొజెస్టెరాన్ అనే హార్మోన్ విడుదల అవుతుంది. ఈ హార్మోన్ మెదడుకు ఒక సంకేతాన్ని పంపుతుంది, అది పిట్యూటరీ గ్రంథి2, హైపోథాలమస్‌కు సందేశాన్ని పంపుతుంది. దాంతో రుతుచక్రం మళ్లీ మొదలవుతుంది' అని డాక్టర్ శ్వేతా పటేల్ వివరించారు.
( బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్, ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)






























