పిరుదుల పరిమాణం పెరగడానికి చికిత్స తీసుకున్న ఈ మహిళ 24 గంటల్లోనే ఎందుకు మరణించారు, ఈ చికిత్సలోని చీకటి కోణాలు ఏమిటి?

ఫొటో సోర్స్, PA Media
- రచయిత, షోనా ఇల్లియట్
- హోదా, బీబీసీ న్యూస్ ఇన్వెస్టిగేషన్
- ప్రచురణ
- చదివే సమయం: 10 నిమిషాలు
అలైస్ వెబ్ అనే మహిళ 2024 సెప్టెంబర్‌లో ఒకరోజు ఉదయం తన పిరుదుల్లోకి పెద్దమొత్తంలో డెర్మల్ ఫిల్లర్‌ను ఇంజెక్ట్ చేయించుకోవడానికి శస్త్రచికిత్స అవసరం లేని బ్రెజిలియన్ బట్ లిఫ్ట్ (బీబీఎల్)కోసం వెళ్లారు.
ఈ ప్రక్రియ కోసం ఆమె ఓ అద్దె బ్యూటీసెలూన్‌లో నడుస్తున్నతాత్కాలిక క్లినిక్‌కు హాజరయ్యారు. ఈ ప్రక్రియ మధ్యాహ్నంలోపే పూర్తవుతుందని, బడి నుంచి పిల్లలను తీసుకురావడానికి కూడా వెళ్లొచ్చని ఆమె భావించారు.
కానీ 33 ఏళ్ల ఎలిస్ ఇక ఇంటికి తిరిగి వెళ్లలేదు.
ఈ చికిత్స తీసుకున్న 24 గంటల్లోపే ఐదుగురు పిల్లల తల్లయిన అలైస్ మరణించారు. యూకేలో బీబీఎల్ చికిత్స పొంది మృతిచెందిన తొలి వ్యక్తి ఆమె. ఆమె మృతికి కారణమేంటనే విషయంపై అధికారిక విచారణ జరపనున్నారు.
శరవేగంగా అభివృద్ధి చెందుతున్న బ్రిటన్ సౌందర్య పరిశ్రమ (కాస్మటిక్ ఇండస్ట్రీ) పై జరుగుతున్న చర్చకు ఎలిస్ కేసు ఇప్పుడు కేంద్ర బిందువుగా మారింది. ఈ సౌందర్య పరిశ్రమ కారణంగా, ప్రధాన వాణిజ్య వీధుల్లోని బ్యూటీ సెలూన్ల నుంచి అద్దె కార్యాలయాలు, హోటళ్లు ఇలా అన్నిచోట్లా సౌందర్య చికిత్స ఇంజెక్షన్లు దొరుకుతున్నాయి.

కాస్మటిక్ ఇంజెక్షన్ల గురించి మహిళలేమంటున్నారు?
ఈ చికిత్స కేంద్రాలలో ఏం జరుగుతోందో తెలుసుకోవడానికి గడిచిన రెండేళ్లుగా నేను పరిశోధన చేస్తూనే ఉన్నాను. తాత్కాలిక చికిత్సా గదుల్లో నా శరీరంలోకి వందల మిల్లీలీటర్ల ఫిల్లర్‌ను ఎక్కించడానికి సిద్ధంగా ఉన్న వ్యక్తులను నేను కలిశాను.
కేవలం వైద్యుని సిఫార్సుతో మాత్రమే లభించాల్సిన మందులను కొంతమంది ఎలాంటి వైద్య సలహా లేకుండానే నాకు ఇవ్వడానికి ముందుకొచ్చారు. బరువు తగ్గించే ఇంజెక్షన్లను సోషల్ మీడియా ద్వారా అమ్మడానికి కూడా ప్రయత్నించారు. వాటిపై ఎలాంటి లేబుల్ లేదు.
నేను పదుల సంఖ్యలో మహిళలతో మాట్లాడాను. అంత ప్రమాదకరం కాదని, దాదాపు నొప్పిలేనివని చెప్పిన కాస్మటిక్ ఇంజెక్షన్ల వల్ల తాము తీవ్రమైన బాధకు గురై ఆసుపత్రిలో చేరాల్సి వచ్చింది.
కాస్మటిక్ చికిత్సకు గుర్తింపు ఇచ్చే 'సేవ్ ఫేస్' సంస్థ వద్ద ఇలా తీవ్ర ఇబ్బందులు పడినవారికి సంబంధించిన అనేక కేసులు నమోదయ్యాయని సంస్థ చెబుతోంది. ఈ కేసుల్లో కనురెప్పల కాస్మటిక్ సర్జరీ వికటించడంతో కళ్ళు పూర్తిగా మూసుకోలేని స్థితిలో ఉన్న ఒక బాధితురాలు కూడా ఉన్నారు. అలాగే శరీరంలోని అదనపు కొవ్వును తొలగించే కాస్మటిక్ సర్జరీ లైపోసక్షన్ సమయంలో ఒకరి పేగుకు రంధ్రం పడింది.
"ఇదంతా ఓ భయానక సినిమా కథలా అనిపిస్తోంది. కానీ ఇదంతా ప్రధాన వాణిజ్య మార్కెట్లలో బహిరంగంగానే జరుగుతోంది’’ అని సేవ్ ఫేస్ డైరక్టర్ ఆస్టన్ కాలిన్స్ చెప్పారు.
యూరప్‌లో కాస్మటిక్ ఇంజెక్షన్ల విషయంలో అతి తక్కువ నియంత్రణలు ఉన్న మార్కెట్లలో బ్రిటన్ ఒకటి. ఇక్కడ ఎవరైనా శిక్షణ తీసుకుని చట్టబద్ధంగా డెర్మల్ ఫిల్లర్ ఇంజెక్షన్లను ఇవ్వడం మొదలుపెట్టవచ్చు.
స్కాట్లాండ్, ఇంగ్లాండ్ ప్రభుత్వాలు ఈ బిలియన్ల పౌండ్ల విలువైన పరిశ్రమపై నిబంధనలను కఠినతరం చేస్తున్నామని చెబుతున్నాయి. కానీ ఈ చర్యలు సరిపోతాయా అన్నదే ప్రశ్న.డెర్మల్ ఫిల్లర్ల వల్ల కలిగే ప్రమాదాల గురించి దశాబ్దానికి పైగా నిపుణులు హెచ్చరిస్తూనే ఉన్నారు. అయినా కూడా ఇలాంటివి ఎందుకు జరుగుతున్నాయి?

‘చికిత్స తర్వాత పరిస్థితి విషమం’
డెర్మల్ ఫిల్లర్లు ముఖంపై ముడతలను తగ్గించి వదులుగా ఉన్న చర్మం ముడతలు లేకుండా కనిపించేలా చేసే ఇంజెక్షన్లు.
జోవాన్ అనే మహిళ ఎసెక్స్‌లోని ఒక ఫ్లాట్‌లో ఏర్పాటుచేసిన తాత్కాలిక క్లినిక్‌లో శస్త్రచికిత్స అవసరం లేని బీబీఎల్ చికిత్స చేయించుకోవడానికి 2024 జూన్‌లో వెళ్ళారు.
జోవాన్ తన ఇంటిపేరు మాత్రమే బయటపెట్టడానికి ఒప్పుకున్నారు.
ఆ సమయంలో తుర్కియేకు వెళ్లి శస్త్రచికిత్స చేయించుకోవడం కంటే ఈ పద్ధతి తక్కువ ప్రమాదకరమని ఆమె భావించారు.
"నా పిరుదులు మరింత ఆకర్షణీయంగా కనిపించాలని మాత్రమే అనుకున్నా'' అని దక్షిణ వేల్స్‌కు చెందిన ఇద్దరు పిల్లల తల్లి అయిన జోవాన్ చెప్పారు.
"నేను అక్కడి నుంచి వెంటనే తిరిగి రావాల్సింది'' అని అన్నారు.
చికిత్స సమయంలో ఆమెకు ఒక లీటరు ఫిల్లర్‌ను ఇంజెక్ట్ చేశారు. తర్వాత ఆమెకు సెప్సిస్ సోకింది. పరిస్థితి విషమించడంతో ఆస్పత్రిలో చేరాల్సి వచ్చింది.
రెండేళ్లు గడిచిన తర్వాత కూడా ఈ చికిత్స గుర్తులు తన తొడలు, పిరుదులపై ఇంకా ఉన్నాయని జోవాన్ చెబుతున్నారు.

యువతులలో డెర్మల్ ఫిల్లర్లపై ఆసక్తికి కారణమేంటి?
ఒకప్పుడు కాస్మటిక్ ఇంజెక్షన్లు ప్రధానంగా సంపన్నులు, మధ్య వయస్కులకు మాత్రమే పరిమితమయ్యేవి. వృద్ధాప్య ప్రభావాలను తగ్గించుకోవడానికి ప్రజలు వాటిని ఉపయోగించారు.కానీ గత దశాబ్దంలో ఈ పరిశ్రమలో పెద్ద మార్పు వచ్చింది.
డెర్మల్ ఫిల్లర్ ఒక రకమైన జెల్. శరీరంలోని ఏ భాగానికైనా మరింత స్పష్టమైన ఆకృతిని ఇవ్వడానికి ఇంజెక్షన్ ద్వారా దీన్ని ఉపయోగిస్తారు. దీనిని సాధారణంగా హాయ్లురోనిక్ యాసిడ్ నుంచి తయారు చేస్తారు.
డెర్మల్ ఫిల్లర్స్, బోటాక్స్ వంటి చికిత్సలను ఇప్పుడు వైద్య ప్రక్రియలా కాకుండా ఒక సాధారణ సౌందర్య చికిత్సగా ప్రచారం చేస్తున్నారు.
ఈ మార్పులో సోషల్ మీడియా, రియాలిటీ టీవీ కార్యక్రమాలు కీలక పాత్ర పోషించాయని 'సేవ్ ఫేస్'కు చెందిన ఆష్టన్ కాలిన్స్ భావిస్తున్నారు.
ఇంజెక్షన్ ఆధారిత చికిత్సలు గతంతో పోలిస్తే ఇప్పుడు మరింత సులభంగా అందుబాటులోకి వచ్చాయని వాటిల్లో చాలా వరకు ఇప్పుడు బ్యూటీ సెలూన్లలో లభిస్తున్నాయని కాలిన్స్ చెప్పారు. దీనివల్ల ఇది కూడా ఇతర సౌందర్య సేవల లాంటిదే అని ప్రజలు భావించే అవకాశం ఉందని చెప్పారు.
" వీటిని గోళ్ళు లేదా కనుబొమ్మల సంరక్షణలా సౌందర్యాన్ని పెంచే సాధారణ అంశాలుగా భావిస్తున్నారు'' అని ఆమె అన్నారు.
35 ఏళ్లలోపు వారిలో ఈ ఆలోచనా విధానం ఎక్కువగా ఉందని అంటున్నారు. వాళ్లు ఈ ప్రక్రియలను వైద్య చికిత్సగా కాకుండా సౌందర్య సేవగా చూస్తున్నారు.
ఫలితంగా వినియోగదారులు భద్రత, అర్హతల కంటే సౌలభ్యం, ప్రజాదరణ, తక్కువ ధరకు ప్రాధాన్యత ఇస్తారని కాలిన్స్ తెలిపారు.
"బోటాక్స్ అనేది కేవలం డాక్టర్ ప్రిస్క్రిప్షన్‌తో మాత్రమే ఇవ్వాల్సిన మందు అనే విషయం చాలా మందికి తెలియదు" అని ఆమె అంటున్నారు.
అలాంటి చికిత్స తీసుకోవడానికి ముందు ఆరోగ్య నిపుణుడితో సరైన పరీక్షలు చేయించుకోవాలనే విషయం కూడా వారికి తెలియదు.
ఈ కారణాలన్నిటి వల్ల ఈ పరిశ్రమ చాలా వేగంగా అభివృద్ధి చెందిందని కాలిన్స్ అంటున్నారు.
అయితే దీంతో పాటు అసురక్షిత పద్ధతుల్లో చికిత్స అందించేవారికి అవకాశాలు కూడా పెరిగాయి.
"సోషల్ మీడియాలో ఈ చికిత్సలను చూపించే విధానం వల్ల వాటి వల్ల కలిగే నష్టాలను అంతగా లేవన్న భావన ప్రజలకు కలుగుతుంది. ఫలితంగా ప్రజలు తమకు ఎదురయ్యే ప్రమాదాలను తీవ్రంగా పరిగణించరు'' అని ఆమె అన్నారు.

ఫొటో సోర్స్, Reuters
కాస్మటిక్ ఇంజెక్షన్లు ఎందుకు ప్రాచుర్యం పొందాయి?
ఈ రంగంలో పనిచేసే వారి కోసం కేంద్రీకృత వ్యవస్థ లేదు. అలాగే పరిశ్రమ వృద్ధిని పర్యవేక్షించడానికి అధికారిక డేటాబేస్ కూడా లేదు.
ఈ కారణంగా ఈ మార్కెట్ వాస్తవ పరిమాణం ఇంకా అస్పష్టంగా ఉంది.
బ్రిటన్ నేషనల్ హెల్త్ సర్వీస్(ఎన్‌హెచ్ఎస్)లో ప్లాస్టిక్ సర్జన్, యూనివర్సిటీ కాలేజ్ లండన్ పరిశోధకులైన డాక్టర్ అలెగ్జాండర్ జర్గారన్ మార్కెట్‌లోని ఒక పెద్ద విభాగమైన బోటాక్స్ రంగం పరిమాణాన్ని అంచనావేయడానికి ప్రయత్నించారు.
వారి విశ్లేషణ ప్రకారం 2025లో బ్రిటన్ వ్యాప్తంగా సుమారు 20,000 మంది ఈ రంగంలోని పని చేస్తున్నారని తేలింది. 2023లో ఈ సంఖ్య 3,500 కంటే కొంచెం ఎక్కువగా ఉంది.
"ఈ పరిశ్రమ నిరంతరం అభివృద్ధి చెందుతోందని మాకు తెలుసు" అని డాక్టర్ జర్గారన్ అన్నారు. దీనికి ఒక కారణం ఏంటంటే ఇప్పుడు ఆన్‌లైన్‌లో,సోషల్ మీడియాలో ప్రకటనలు ఇచ్చేవారిని ఇంతకుముందు కంటే మరింత క్రమబద్ధమైన పద్ధతిలో గుర్తిస్తున్నారు.
అయినప్పటికీ కేవలం రెండేళ్లలో నమోదైన ఈ పెరుగుదల చాలా పెద్దది.
అత్యంత వెనుకబడిన ప్రాంతాలలో బోటాక్స్ వంటి సేవలు ఎక్కువగా అందుబాటులో ఉన్నాయని పరిశోధకులు గుర్తించారు. ఈ రంగం విస్తరించడానికి గల కారణాలలో ఒకటి వైద్య అర్హతలు లేని చాలా మంది ఇందులో పనిచేస్తుండడమని డాక్టర్ జర్గారన్ అభిప్రాయపడ్డారు.
వైద్య అర్హతలు లేకుండా సౌందర్య చికిత్సలు అందించే వారి శాతం 2023 -2025 మధ్య 12 నుంచి 24.8కు పెరిగింది.అంటే ఈ సంఖ్య దాదాపు రెట్టింపు అయింది.
అత్యంత వెనుకబడిన వర్గాలలో బోటాక్స్ సేవలు మరింత సులభంగా అందుబాటులో ఉన్నాయని కూడా ఈ అధ్యయనంలో తేలింది.
అత్యంత వెనుకబడిన ప్రాంతాలలో చికిత్స అందించేవారి సంఖ్య, అంతగా వెనుకబడని ప్రాంతాల కంటే ఆరు రెట్లు అధికంగా ఉంది. కానీ దీంతో పాటు మరో సమస్య కూడా తలెత్తింది. అత్యంత వెనుకబడిన ప్రాంతాలలో నివసించే ప్రజలకు వైద్య అర్హత కలిగిన నిపుణుల సేవలు పొందే అవకాశం తక్కువగా ఉంది.
ఈ పరిస్థితి ఒక పెద్ద ప్రశ్నను లేవనెత్తుతుంది.
ఈ రోజు బ్రిటన్ వ్యాప్తంగా వేలాది మంది కాస్మటిక్ ఇంజెక్షన్లు తీసుకుంటున్నప్పుడు ఈ రంగాన్ని నియంత్రించే బాధ్యతను ఏదైనా సంస్థ లేదా ప్రభుత్వ విభాగం తీసుకోవాలి కదా?
యూకేలో డెర్మల్ ఫిల్లర్ల మోసాల కేసులు ఎందుకు పెరుగుతున్నాయి?

ఫొటో సోర్స్, Janet Taylor
‘నియంత్రణ లేకపోవడమే కారణమా?’
బ్రిటన్‌లో ప్రస్తుత చట్టం ప్రకారం శిక్షణ పొందిన తర్వాత ఎవరైనా డెర్మల్ ఫిల్లర్లను చట్టబద్ధంగా ఉపయోగించవచ్చు.
శిక్షణ పొందిన వారు ఉత్పత్తులను కొనుగోలు చేసి సాధారణ ప్రజలకు చికిత్స చేయవచ్చు.
వైద్యులు, నర్సులు, దంతవైద్యులు వృత్తిపరమైన నియంత్రణ సంస్థల పర్యవేక్షణలో ఉంటారు. ఫిర్యాదులను విచారించే అధికారం ఈ సంస్థలకుంటుంది.
అవసరమైతే వారు చర్యలు కూడా తీసుకోవచ్చు. అయితే వైద్య అర్హతలు లేకుండా సౌందర్య చికిత్సలు అందించే వారి కోసం ఇలాంటి చట్టబద్ధమైన నియంత్రణ సంస్థ ఏదీ లేదు.
మరోవైపు ఆస్ట్రియాలో బోటులినమ్ టాక్సిన్, డెర్మల్ ఫిల్లర్లను వైద్య ప్రక్రియలుగా పరిగణిస్తారు. ఈ చికిత్సలను చేయడానికి వైద్యులకు మాత్రమే అనుమతి ఉంటుంది.
ఫ్రాన్స్‌లో వైద్య అర్హతలు లేని వ్యక్తులు ఇంజెక్షన్ ఆధారిత సౌందర్య చికిత్సలను అందించడానికి అనుమతి ఉండదు.
బ్రిటన్‌లో సడలించిన నియంత్రణ వ్యవస్థ అక్కడి విస్తృత నియంత్రణ సంస్కృతిని ప్రతిబింబిస్తుందని జాయింట్ కౌన్సిల్ ఫర్ కాస్మటిక్ ప్రాక్టీషనర్స్ ముఖ్య కార్యనిర్వహణాధికారి ఆండ్రూ రాంకిన్ అన్నారు.
బ్రిటన్‌లో వినియోగదారుల ఎంపికకు, ఆర్థిక వృద్ధికి ఎప్పటినుంచో ప్రాధాన్యం ఇస్తున్నారు.
"ప్రజా భద్రత, ఆర్థిక కార్యకలాపాల మధ్య సమతుల్యతను సాధించే దిశగా ప్రభుత్వం ప్రయత్నిస్తోంది'' అని చెప్పారు.
2023లో ఇంగ్లాండ్‌లో లైసెన్స్ ఆధారిత వ్యవస్థను అమలు చేయాలనే ప్రతిపాదనపై ప్రభుత్వం ప్రజలు, సంబంధిత వర్గాల అభిప్రాయాలను కోరింది.
ఆ సమయంలో కొత్త నిబంధనలు సమతుల్యంగా ఉండాలని కొందరు అభిప్రాయపడ్డారు. భద్రతా చర్యలకు విస్తృత మద్దతు లభించింది.
అయితే చిన్న వ్యాపారాలపై దాని ప్రభావం గురించి కూడా ఆందోళనలు వ్యక్తమయ్యాయి. అతి కఠినమైన నిబంధనలు వినియోగదారుల ఎంపికను పరిమితం చేయగలవన్న అభిప్రాయం వినపడింది. పరిశ్రమలోని కొంత భాగం రహస్యంగా పనిచేసే అవకాశం ఉందన్న హెచ్చరికలు వినిపించాయి.

లైసెన్సు తప్పనిసరి చేయాలి’
ప్రస్తుత విధానంలో చికిత్స అందించే వారి అర్హతలేంటో రోగులు తెలుసుకోవడం కష్టమని డాక్టర్ అలెగ్జాండర్ జర్గారన్ అంటున్నారు.
వాళ్లు ఎలాంటి శిక్షణ పొందారో తెలుసుకోవడం అంత తేలికకాదు. అలాగే చికిత్స సమయంలో ఏదైనా సమస్య వస్తే సహాయం ఎక్కడ దొరుకుతుందో కూడా స్పష్టంగా తెలియదు.
"వైద్య రంగంలో ఉన్నట్టయితే బహుశా ప్రత్యేక శిక్షణ లభించి ఉంటుంది" అని డాక్టర్ జర్గారన్ అన్నారు.
రోగి సమ్మతి పొందడం, చికిత్స, పర్యవేక్షణ, సంక్లిష్ట పరిస్థితులను గుర్తించడం వంటి ముఖ్యమైన అంశాలు ఇందులో ఉంటాయి.
పీఐపీ బ్రెస్ట్ ఇంప్లాంట్ కుంభకోణం తర్వాత ప్రభుత్వం సౌందర్య చికిత్సల పరిశ్రమపై ఒక స్వతంత్ర సమీక్షను ప్రారంభించింది.
ఈ మోసంలో వైద్యపరమైన వినియోగానికి ఆమోదం లేని సిలికాన్ ఇంప్లాంట్లను వేలాది మంది మహిళలకు అమర్చారు.
అప్పటి ఎన్‌హెచ్ఎస్ మెడికల్ డైరెక్టర్, ప్రొఫెసర్ సర్ బ్రూస్ కీయో నేతృత్వంలో జరిగిన ఈ సమీక్ష, డెర్మల్ ఫిల్లర్స్, బోటాక్స్, ఇతర శస్త్రచికిత్స లేని సౌందర్య విధానాలను కూడా పరిశీలించింది.
శస్త్రచికిత్స రహిత సౌందర్య చికిత్సలు చేయించుకుంటున్న వారికి ప్రత్యేక రక్షణ లభించలేదని ఆ సమీక్ష హెచ్చరించింది.
వాళ్ల పరిస్థితి ఒక సాధారణ వినియోగదారుడి పరిస్థితిలాగే ఉందని నివేదిక పేర్కొంది.
"మా అభిప్రాయం ప్రకారం డెర్మల్ ఫిల్లర్లు ఎప్పుడైనా సంక్షోభానికి దారితీయగల అంశం" అని ఆ సమీక్ష తేల్చింది.
సౌందర్య చికిత్సలు అందించేవారికి లైసెన్సు తప్పనిసరి చేయాలని నివేదిక సిఫార్సు చేసింది.
కఠినమైన శిక్షణా ప్రమాణాలను ఏర్పాటు చేయాలని, అలాగే అలాంటివి నిర్వహించడానికి ఎవరికి అనుమతి ఉందో కూడా స్పష్టం చేయాలని సూచించింది.
కీయో సమీక్షను అనుసరించి ప్రభుత్వం జేసీసీపీ వంటి సంస్థలను ఏర్పాటు చేస్తూ స్వచ్ఛంద స్వీయ-నియంత్రణ నమూనాని స్వీకరించింది.చికిత్స ప్రమాణాలను నిర్ణయించడం, ప్రొవైడర్లను గుర్తింపు పొందిన రిజిస్టర్లలో చేరేలా ప్రోత్సహించడం వారి లక్ష్యం.
అయితే ఈ వ్యవస్థ విజయవంతం కాలేదని ఆండ్రూ రాంకిన్ అంటున్నారు. ఇప్పటికీ చికిత్స అందించే చాలా మంది ఈ స్వచ్ఛంద సంస్థకు బయటే ఉన్నారని ఆయన చెప్పారు.
"చాలా మందికి ఈ ప్రమాణాలను పాటించడంపై అసలు ఆసక్తి చూపరనే విషయాన్ని సరిగ్గా అంచనా వేయలేకపోయాం" అని ఆయన అన్నారు.

ఫొటో సోర్స్, Getty Images
‘అత్యంత ప్రమాదకరం’
బోల్టన్‌కు చెందిన 28 ఏళ్ల లూయిస్ మోలర్ అక్టోబర్ 2023లో ఎసెక్స్‌లోని ఒక క్లినిక్‌లో లిక్విడ్ బీబీఎల్ చేయించుకున్న నాలుగు రోజుల తర్వాత ఆమెకు సెప్సిస్ సోకడంతో ఆస్పత్రికి తీసుకువెళ్లారు. అత్యవసర విభాగం నుంచి ఆమె తల్లి జానెట్ టేలర్‌కు ఫోన్ చేశారు.
"అమ్మా, నేను చనిపోతాననిపిస్తోంది" అని లూయిస్ చెప్పారు.
ఇన్ఫెక్షన్ శరీరమంతా వ్యాపించకుండా సర్జన్లు ఆమె ఎడమ పిరుదులోని చాలా భాగాన్ని తొలగించాల్సి వచ్చింది. అక్కడి కండరాలు పూర్తిగా దెబ్బతిన్నాయి.
ఈ చికిత్స చేసిన రికీ సాయర్‌పై జానెట్ ఫిర్యాదు చేశారు. రికీ సావర్ కాస్మటిక్ ఇంజెక్షన్ల రంగంలో అప్పటికే అపఖ్యాతి పొందారు.
జానెట్ తన కూతురికి న్యాయం జరిగేలా చూడటానికి ప్రయత్నిస్తున్నసమయంలో నేను నా గుర్తింపును దాచిపెట్టి ఒక కస్టమర్‌గా నటించాను.
నేను లండన్ శివార్లలోని ఒక కార్యాలయ భవనంలో ఉన్న తాత్కాలిక క్లినిక్‌ను సందర్శించాను. అక్కడ రికీ సావర్ అప్పటికీ చికిత్స అందిస్తూనే ఉన్నారు.
ఆయన నా శరీరంలోకి ఒక లీటరు వరకు ఫిల్లర్‌ను ఇంజెక్ట్ చేయడానికి ముందుకొచ్చారు. అంతేకాకుండా, కేవలం ప్రిస్క్రిప్షన్‌తో మాత్రమే లభించాల్సిన మందులను కూడా ఇస్తానని చెప్పారు.
ఆ సమయంలో ప్రిస్క్రిప్షన్ రాసే అధికారం ఉన్నవారు ఎవరూ అక్కడ లేనప్పటికీ ఆయన లోకల్ అనస్థీషియా ఇవ్వాలని సిఫార్సు చేశారు.
ఈ సన్నివేశాలను ప్లాస్టిక్ సర్జన్ దల్వి హుమ్జా సమీక్షించారు.
ఈ కార్యకలాపాలను "దిగ్భ్రాంతికరం", "అత్యంత ప్రమాదకరమైనవి"గా ఆయన అభివర్ణించారు. ఫిబ్రవరి 2025లో బీబీసీ నివేదిక ప్రసారమైన తర్వాత సావర్‌పై చర్య తీసుకున్నారు.
ట్రాఫర్డ్ కౌన్సిల్ జారీ చేసిన చట్టపరమైన ఉత్తర్వుల ప్రకారం ఈ రకమైన చికిత్సలు చేయడకుండా ఆయనపై నిషేధం విధించారు.
ఈ నిషేధాన్ని ఉల్లంఘించిన ఆరోపణలపై ఆయన ఇటీవల కోర్టులో హాజరయ్యారు. కానీ కోర్టు ఆయన్ను నిర్దోషిగా విడుదల చేసింది.
ఈ ప్రక్రియలలోని ప్రమాదాల గురించి తనకు అవగాహన ఉందని తన సాక్ష్యంలో ఆయన అంగీకరించారు.
( బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్, ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)



























