‘నాకు జెనిటల్ హెర్పెస్ సోకిందని తెలిసిన తర్వాత సిగ్గుతో ఎవరికీ ముఖం చూపించలేకపోయా.. ’

ఫొటో సోర్స్, Julian Tse
- రచయిత, లెనా-జారా మొహమ్మద్
- హోదా, బీబీసీ వేల్స్
- ప్రచురణ
- చదివే సమయం: 5 నిమిషాలు
ఇరవై ఏళ్ల వయసు దాటిన తొలినాళ్లలో మెలిస్ ఎడ్వర్డ్స్ సన్‌గ్లాసులు ధరించకుండా ఇంటి నుంచి బయటకు వెళ్లేవారు కాదు. అయితే దానికి కారణం ఎండ కాదు. తనపై తనకే సిగ్గుగా అనిపించడమే.
"ప్రజలు నన్ను చూడటం నాకు ఇష్టం ఉండేది కాదు. సిగ్గు అంటే అదే" అని 29 ఏళ్ల మెలిస్ చెబుతున్నారు. తనకు జెనిటల్ హెర్పెస్ (జననేంద్రియాలకు సోకే హెర్పెస్ వ్యాధి. దీనినే సర్పి వ్యాధి అని అంటారు) ఉందని నిర్థరణ అయినప్పుడు తాను ఎదుర్కొన్న మానసిక పరిస్థితిని ఆమె వివరించారు.
ఈ వ్యాధి తమకు ఉందని తెలిసిన తర్వాత చాలామందిపై శారీరక లక్షణాల కంటే మానసిక ప్రభావమే ఎక్కువగా ఉంటుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.
ప్రపంచవ్యాప్తంగా 15 నుంచి 49 ఏళ్ల మధ్య వయసున్న సుమారు 84.6 కోట్ల మంది జెనిటల్ హెర్పెస్‌తో జీవిస్తున్నారు. అంటే ఈ వయసు వర్గంలో ప్రతి ఐదుగురిలో ఒకరికి పైగా ఈ ఇన్ఫెక్షన్ ఉందని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌ఓ) 2024లో విడుదల చేసిన అంచనాలు వెల్లడిస్తున్నాయి.
ఇది చికిత్సతో నియంత్రించగలిగే ఆరోగ్య సమస్య. అయితే పూర్తిగా నయం చేసే మందు లేదు. చాలామందిలో ఎలాంటి లక్షణాలూ కనిపించవు లేదా స్వల్ప లక్షణాలే ఉంటాయి. కానీ కొందరిలో జననేంద్రియాలపై నొప్పితో కూడిన పుండ్లు, పొక్కులు వస్తుంటాయి. ఇవి జీవితాంతం మధ్య మధ్యలో మళ్లీ రావచ్చు.

యూకేలోని వేల్స్‌కు చెందిన మెలిస్‌కు ఈ వ్యాధి కారణంగా తీవ్రంగా ఇబ్బంది పడినట్లు చెప్పారు.
"మొదటిసారి ఈ వ్యాధి వచ్చినప్పుడు అది భయంకరంగా అనిపించింది" అని ఆమె బీబీసీ వేల్స్‌తో చెప్పారు.
డిజిటల్ కంటెంట్ క్రియేటర్ అయిన మెలిస్, తనకు జెనిటల్ హెర్పెస్ ఉందని తెలిసినా ఆ విషయం చెప్పకుండా తనతో రక్షణ లేకుండా లైంగిక సంబంధం పెట్టుకున్న వ్యక్తి వల్లే తనకు ఈ వైరస్ సోకిందని అనుకుంటున్నారు.
వ్యాధి నిర్థరణ కావడంతో మెలిస్ తీవ్ర విషాదం, కోపం, అపరాధ భావనలను ఎదుర్కొన్నారు. తననుంచి తాను దూరమైనట్టుగా అనిపించిందని, తన నిర్ణయాలపైనా నమ్మకం కోల్పోయానని చెప్పారు. "ఆ క్షణంలో నా జీవితం పూర్తిగా మారిపోయింది" అని ఆమె అన్నారు.

ఫొటో సోర్స్, Getty Images
జెనిటల్ హెర్పెస్ అంటే?
జననేంద్రియ హెర్పెస్‌కు హెర్పెస్ సింప్లెక్స్ వైరస్ కారణం. ఒకసారి ఈ వైరస్ శరీరంలోకి ప్రవేశిస్తే అది జీవితాంతం అక్కడే ఉంటుంది.
అయితే అది శరీరమంతా వ్యాపించి పొక్కులు రావడానికి కారణం కాదు. సమీపంలోని నరాల్లో నిష్క్రియగా ఉండి, అదే ప్రాంతంలో అప్పుడప్పుడు పుండ్లు రావడానికి కారణమవుతుంది.
హెర్పెస్ సింప్లెక్స్ వైరస్‌లో రెండు రకాలు ఉన్నాయి. అవి హెచ్‌ఎస్‌వీ-1, హెచ్‌ఎస్‌వీ-2. ఈ రెండూ జననేంద్రియ హెర్పెస్‌కు కారణమవుతాయి.
లైంగిక సంబంధాల ద్వారా వ్యాపించే హెచ్‌ఎస్‌వీ-2 వైరస్ 52 కోట్ల మందిలో ఉందని 2020 నాటి అంచనాలు చెబుతున్నాయి.
ప్రజారోగ్య దృష్ట్యా హెచ్‌ఎస్‌వీ-2 మరింత తీవ్రమైనదిగా భావిస్తారు. ఎందుకంటే ఇది తరచూ ఇన్ఫెక్షన్ మళ్లీ రావడానికి కారణమవుతుంది. లక్షణాలతో కనిపించే కేసుల్లో దాదాపు 90 శాతం దీనివల్లే వస్తాయి. అలాగే హెచ్‌ఐవీ సోకే ప్రమాదాన్ని మూడింతలు పెంచుతుంది.
పురుషులతో పోలిస్తే మహిళలకు హెచ్‌ఎస్‌వీ-2 దాదాపు రెండింతల ఎక్కువగా సోకుతుంది. యోని లోపల, చుట్టుపక్కల ఉండే సున్నితమైన శ్లేష్మ పొరల ద్వారా వైరస్ సులభంగా శరీరంలోకి ప్రవేశించడం ఇందుకు కారణం.
హెచ్‌ఎస్‌వీ-1 సాధారణంగా చిన్నతనంలోనే లాలాజలం ద్వారా లేదా నోటి చుట్టూ చర్మం తగలడం వల్ల వ్యాపిస్తుంది. దీనివల్ల నోటి హెర్పెస్ వస్తుంది. చలి పుండ్లు, నోటిపూతలు దీని సాధారణ లక్షణాలు.
యూకేకు చెందిన హెర్పెస్ వైరసెస్ అసోసియేషన్ డైరెక్టర్ మరియన్ నికల్సన్ మాట్లాడుతూ, కోల్డ్ సోర్స్, జననేంద్రియ హెర్పెస్ రెండింటికీ ఒకే వైరస్ కారణమనే విషయం చాలామందికి తెలియదన్నారు.
ఓరల్ సెక్స్ ద్వారా కూడా ఈ వైరస్ సులభంగా వ్యాపిస్తుందని ఆమె చెప్పారు.
"వైరస్‌కు అది శరీరంలో ఏ భాగంలో ఉందో తెలియదు. ఎవరికైనా కోల్డ్ సోర్ ఉండి, వారు ఓరల్ సెక్స్‌లో పాల్గొంటే, ఆ వైరస్ జననేంద్రియాలకు కూడా వ్యాపించవచ్చు."
ఈ వ్యాధి లక్షణాల్లో చిన్న చిన్న పొక్కులు, మచ్చలు లేదా పుండ్లు, జననేంద్రియాల చుట్టూ మంట లేదా జలదరింపు, మూత్ర విసర్జన సమయంలో నొప్పి వంటివి ఉంటాయి.
పుండ్ల నుంచి తీసిన ద్రవాన్ని పరీక్షించడం ద్వారా వ్యాధిని నిర్థరిస్తారు. అయితే లక్షణాలు ఉన్నప్పుడే ఈ పరీక్ష చేయడం సాధ్యమవుతుంది.

ఫొటో సోర్స్, Emrah Zengin
నియంత్రణ ఎలా?
ఈ వ్యాధి విషయంలో మద్దతు కోసం ఆన్‌లైన్‌లో వెతికినప్పుడు భయపెట్టే కథనాలే ఎక్కువగా కనిపించాయని మెలిస్ చెబుతున్నారు.
"ఇక నీ జీవితం మునుపటిలా ఉండదు... నీకు పిల్లలు పుడతారో లేదో కూడా తెలియదు... ఇలాంటి అతిశయోక్తి వ్యాఖ్యలన్నీ చదివి వాటిని జీర్ణించుకోవాల్సి వచ్చింది" అన్నారామె.
అయితే ముప్పై ఏళ్లకుపైగా హెర్పెస్‌తో జీవిస్తున్న మరియన్ నికల్సన్ మాత్రం, చాలామందికి ఇది నియంత్రించగలిగే చర్మ సమస్య మాత్రమేనని చెబుతున్నారు.
"అనవసరమైన భయం చాలా ఎక్కువగా ఉంది. చాలామంది దీనిని శిక్షగా భావిస్తారు. కానీ అది నిజం కాదు" అన్నారు నికల్సన్.
చాలామందిలో అసలు ఎలాంటి లక్షణాలూ కనిపించవు. తరచూ ఇన్ఫెక్షన్ వచ్చే వారు మాత్రం యాంటీవైరల్ మందులు, జీవనశైలిలో మార్పుల ద్వారా దాన్ని అదుపులో ఉంచగలరని ఆమె చెప్పారు.
"ఈ వైరస్ సోకిన ముగ్గురిలో ఒకరికి మాత్రమే అది తెలిసే అవకాశం ఉంటుంది. మిగిలిన ఇద్దరిలో లక్షణాలు చాలా స్వల్పంగా ఉండటంతో తమకు వైరస్ సోకిందనే విషయం కూడా వారికి తెలియదు."
మొదటిసారి ఇన్ఫెక్షన్ వచ్చినప్పుడు కూడా చాలామందికి చికిత్స అవసరం ఉండకపోవచ్చు. ఎందుకంటే పొక్కులు చాలాసార్లు వాటంతట అవే తగ్గిపోతాయి.
అయితే లక్షణాలు తీవ్రంగా ఉంటే చికిత్స ఉపయోగపడుతుంది. వైరస్ తీవ్రత పెరగకుండా వైద్యులు యాంటీవైరల్ మందులు, నొప్పి తగ్గించేందుకు క్రీములు సూచిస్తారు.
తిరగబెట్టే ఇన్ఫెక్షన్లు సాధారణంగా మొదటిసారి వచ్చినంత తీవ్రంగా ఉండవు. కాలక్రమేణా అవి వచ్చే వ్యవధి కూడా తగ్గుతుంది.
ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకారం, కండోమ్ ఉపయోగించడం వల్ల హెర్పెస్ వ్యాప్తి ప్రమాదం తగ్గుతుంది. లక్షణాలు ఉన్న సమయంలో లైంగిక సంబంధాలకు దూరంగా ఉండాలని కూడా సూచిస్తోంది. అలాగే లక్షణాలు ఉన్నవారికి హెచ్‌ఐవీ పరీక్ష చేయించాలని సిఫార్సు చేస్తోంది.
అనారోగ్యం, ఒత్తిడి, రుతుచక్రం వల్ల కూడా ఈ ఇన్ఫెక్షన్ మళ్లీ ప్రబలవచ్చని యూకే జాతీయ ఆరోగ్య సేవ (ఎన్‌హెచ్‌ఎస్) చెబుతోంది. అలాగే అతినీలలోహిత కిరణాలు, మద్యం, ధూమపానానికి దూరంగా ఉండాలని సూచిస్తోంది.
కాలక్రమేణా ఈ వ్యాధి తన వ్యక్తిత్వాన్ని నిర్వచించదనే విషయాన్ని తాను అర్థం చేసుకున్నానని మెలిస్ చెబుతున్నారు. ఇప్పుడు అదే అనుభవంతో సోషల్ మీడియా ద్వారా ఇతరుల్లో అవగాహన కల్పిస్తున్నారు.
"నాకు ఈ వ్యాధి సోకినప్పుడు, గూగుల్‌లో భయపెట్టే సమాచారం, రెడిట్ పోస్టులు తప్ప ఇంకేమీ కనిపించేవి కాదు. అప్పట్లో నాకు అవసరమైన వ్యక్తిగా ఇప్పుడు నేను మరొకరికి ఉపయోగపడగలిగితే, ఈ అనుభవం నుంచి కనీసం ఒక మంచి విషయం వెలువడినట్టే’’ అంటారు మెలిస్.
( బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్, ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)





























