24 గంటల్లో దాదాపు 60,000 మంది ఈదుకుంటూ, నడుచుకుంటూ పొరుగు దేశంలోకి ప్రవేశించారు..

వలసలు, ఆఫ్రియా, స్పెయిన్, సీయుటా, మెలిలా

ఫొటో సోర్స్, Getty Images

    • రచయిత, సోఫియా ఫెరీరా శాంటోస్, సారా రీన్స్‌ఫోర్డ్
    • హోదా, యూరప్ కరస్పాండెంట్లు
  • ప్రచురణ
  • చదివే సమయం: 5 నిమిషాలు

స్పెయిన్‌కు చెందిన ఉత్తర ఆఫ్రికాలోని భూభాగం సీయుటాలోకి 24 గంటల్లో సుమారు 60 వేల మంది వలసదారులు ప్రవేశించినట్లు అక్కడి అధికారులు అంచనా వేస్తున్నారు. వీరంతా మొరాకో నుంచి భూ, సముద్ర మార్గాల్లో సీయుటాలోకి ప్రవేశించినట్లు చెబుతున్నారు.

వేలాది మంది గురువారం సీయుటా వైపు సముద్రంలో ఈదుకుంటూ వస్తున్న దృశ్యాలు వీడియోల్లో కనిపించాయి. గురువారం రాత్రి కూడా అనేక మంది నగరంలోకి ప్రవేశించినట్లు స్థానిక మీడియా వెల్లడించింది.

కాగా, సీయుటాలోకి ప్రవేశించే ప్రయత్నంలో 57 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారని స్థానిక మీడియా తెలిపింది.

సీయుటాకి కానీ.. స్పెయిన్‌కే చెందిన మరో భూభాగం మెలిలాను కానీ చేరుకోవడానికి ప్రయత్నిస్తుండగా ఎవరినైనా సముద్రంలో అడ్డుకుంటే, వారిని వెంటనే మొరాకోకు తిప్పి పంపకూడదంటూ స్పెయిన్ సుప్రీం కోర్టు జులై నెలలో తీర్పునిచ్చింది. ఆ తీర్పు అనంతరం సీయుటాలోకి వలసలు వెల్లువెత్తాయి.

అయితే, శుక్రవారం సాయంత్రానికి 48,000 మందికి పైగా వలసదారులు స్వచ్ఛందంగా మొరాకోకు తిరిగి వెళ్లారని స్పెయిన్ అధికారులు తెలిపారు.

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌
ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

స్పెయిన్ ప్రధాని పెడ్రో శాంచెజ్ ఈ ఘటనను "స్పెయిన్ ప్రాదేశిక సమగ్రతను ఉల్లంఘన"గా పేర్కొన్నారు. దీనికి ప్రతిస్పందనగా, స్పెయిన్‌తో ఉన్న స్వేచ్ఛా సరిహద్దు ఒప్పందాలను(షెంజెన్ ఒప్పందాలను) ఇటలీ నిలిపివేసింది.

మొరాకో ఉత్తర తీరంలో ఉన్న సీయుటా.. స్పెయిన్ ప్రధాన భూభాగం నుంచి భౌగోళికంగా వేరుగా ఉంటుంది. జిబ్రాల్టర్ జలసంధి సీయుటాను స్పెయిన్ మెయిన్‌లాండ్ నుంచి వేరు చేస్తుంది.

ఐరోపాకు వలస వెళ్లేవారికి చాలాకాలంగా ఇది ఒక ప్రధాన మార్గం.

సీయుటా, మెలిలా మ్యాప్

ఇటీవల కాలంలో సీయుటా మీదుగా వలసలు పెరగడంతో స్థానిక అధికారులు స్పెయిన్ రాజధాని మాడ్రిడ్ నుంచి సాయం కోరారు. కానీ, గురువారం సరిహద్దు నియంత్రణ వ్యవస్థలు విఫలం కావడంతో అక్కడ తీవ్ర గందరగోళ పరిస్థితులు ఏర్పడ్డాయి.

అందుబాటులో ఉన్న తాజా గణాంకాల ప్రకారం సీయుటా జనాభా సుమారు 83,600. కానీ, గత ఒకట్రెండు రోజుల్లో ఈ నగరంలోకి పెద్దసంఖ్యలో వలస వచ్చారు. అక్కడి స్థానిక జనాభాలో సగం కంటే ఎక్కువ సంఖ్యలో బయట నుంచి ప్రజలు వలస వచ్చారని స్పానిష్ అధికారులు అంచనా వేస్తున్నారు.

ఈ పరిణామాల తరువాత సీయుటా, మెలిలాలో స్పెయిన్ సాయుధ బలగాలను మోహరించింది. మెలిలాలోకి కూడా ఒక్క రాత్రిలోనే 300 నుంచి 400 మంది ప్రవేశించినట్లు అధికారులు అంచనా వేస్తున్నారు.

సీయుటా, మెలిలాలను మొరాకో కోరుకుంటుండడంతో చాలాకాలంగా ఆ దేశానికి ఈ రెండు నగరాల విషయంలో స్పెయిన్‌తో దౌత్య వివాదాలున్నాయి. ఈ రెండు భూభాగాలు స్పెయిన్‌లో అంతర్భాగాలని.. తమ ప్రధాన భూభాగంలోకి సెమీ అటానమస్ ప్రాంతాలతో సమానమైన హోదాను ఇవి కలిగి ఉన్నాయని స్పెయిన్ స్పష్టం చేస్తోంది.

కాగా, ఆఫ్రికాతో యూరోపియన్ యూనియన్‌కు ఉన్న ఏకైక భూ సరిహద్దులు ఇవే.

మొరాకో, స్పెయిన్ సరిహద్దుల్లో చేరిన ప్రజలు

ఫొటో సోర్స్, Reuters

ఫొటో క్యాప్షన్, మొరాకో, స్పెయిన్ సరిహద్దుల్లో చేరిన ప్రజలు

మొరాకో నుంచి సరిహద్దులు దాటి సీయుటాలోకి వస్తున్నవారిలో ఎక్కువగా యువత ఉన్నారు. ముఖ్యంగా పురుషులే ఎక్కువ. అయితే, కొందరు మహిళలు, పిల్లలు కూడా ఇలా వచ్చినవారిలో ఉన్నారు.

గడచిన 24 గంటల్లో అక్రమంగా ఈ భూభాగంలోకి ప్రవేశించిన వారిలో కనీసం 7,000 మందికి పైగా మైనర్లు ఉన్నారని అధికారులు అంచనా వేస్తున్నారు.

సాధారణంగా వలసదారులు సీయుటాలోకి ప్రవేశించడానికి తీరానికి కొన్ని కిలోమీటర్ల దూరం నుంచి ఈదుకుంటూ వస్తారు. కానీ, ఈసారి వారు సరిహద్దు కంచె వద్దకే చాలా సులభంగా చేరుకోగలిగినట్లు కనిపిస్తోంది. ప్రారంభంలో కొంతమంది జెట్టీపై ఉన్న రాళ్ల వెంబడి నడుచుకుంటూ వచ్చారు.

ఈ సమయంలో మొరాకో సరిహద్దు భద్రతా బలగాలు ఎక్కడ ఉన్నాయి? వలసదారులను వారు ఎందుకు ఆపలేదు అనే విషయాలపై స్పష్టత లేదు.

వలసలు, ఆఫ్రియా, స్పెయిన్, సీయుటా, మెలిలా

ఫొటో సోర్స్, EPA/Shutterstock

గురువారానికి ముందు కూడా కొన్ని రోజులుగా సీయుటాలోకి ఈదుకుంటూ వచ్చినవారి సంఖ్య పెరిగింది. వారంతా విజయవంతంగా సీయుటాలోకి రాగలిగారన్న సమాచారం వ్యాపించడంతో గురువారం పెద్ద సంఖ్యలో వలసలు పెరిగినట్లు కనిపిస్తోంది.

ఇంతకుముందు, 2021లో ఇలాగే భారీగా ప్రజలు వచ్చారు, అయితే ఈ స్థాయిలో కాదు.

పశ్చిమ సహారా సార్వభౌమాధికారంపై స్పెయిన్‌తో తలెత్తిన విభేదాల నేపథ్యంలో అప్పట్లో మొరాకో అధికారులు సుమారు 8,000 మందిని సరిహద్దు దాటడానికి అనుమతించారు.

ఆ ప్రాంత స్వాతంత్య్రానికి మద్దతు ఇచ్చే అల్జీరియాలో స్పెయిన్ ప్రధాని పెడ్రో శాంచెజ్ పర్యటించిన తర్వాత, ఈ దౌత్యపరమైన వివాదం ఇటీవల మళ్లీ రాజుకుంది.

తమ భూభాగంలోకి అక్రమంగా ప్రవేశించిన వారందరినీ సాధ్యమైనంత త్వరగా తిరిగి పంపేలా చూసేందుకు మొరాకోతో కలిసి పనిచేస్తున్నట్లు స్పెయిన్ హోం మంత్రిత్వ శాఖ తెలిపింది.

కాగా, ప్రధాని శాంచెజ్ శుక్రవారం తరువాత సీయుటా వెళ్లనున్నారు.

వలసలు, ఆఫ్రియా, స్పెయిన్, సీయుటా, మెలిలా

ఫొటో సోర్స్, Reuters

ఫొటో క్యాప్షన్, మొరాకో సరిహద్దుల్లో స్పెయిన్ భారీగా మిలటరీ సిబ్బందిని మోహరించింది

రాత్రి సమయంలోనూ వలసదారులు సరిహద్దులు దాటి వస్తున్నారని... పోలీసులకు, వలసదారులకు మధ్య ఘర్షణలు జరిగాయని లోకల్ మీడియా రాసింది.

మొరాకో నుంచి ఈ స్థాయిలో అక్రమ ప్రవేశాలు పెరగడానికి కారణణాలు, ఈ వలసలను అడ్డుకునేందుకు చేసిన ప్రయత్నాలపై ఇంతవరకు స్పష్టత లేదు. ఒక దశలో సరిహద్దు వ్యవస్థ మొత్తం కుప్పకూలిందని స్పెయిన్‌కు చెందిన అధికారి ఒకరు చెప్పారు.

ఈ వలసలపై ఇటలీ ప్రధాని జార్జియా మెలోనీ స్పందిస్తూ.. ఇలాంటి నియంత్రణలేని వలసలు యూరప్ భద్రతకు ముప్పుగా పేర్కొన్న ఆమె, మొరాకో నుంచి సీయుటాలోకి వలసలు వస్తున్న దృశ్యాలు దిగ్భ్రాంతికరంగా ఉన్నట్లు సోషల్ మీడియాలో రాశారు.

స్పెయిన్‌తో స్వేచ్ఛారాకపోకలకు వీలు కల్పించే షెంజెన్ ఒప్పందాలను ఇటలీ తాత్కాలికంగా నిలిపివేసింది.

అయితే, స్పెయిన్, ఇటలీలు ఇరుగుపొరుగు దేశాలు కావు. మరోవైపు మొరాకో నుంచి పెద్దసంఖ్యలో వలస వచ్చిన వారంతా స్పెయిన్ ప్రధాన భూభాగంలో కాకుండా సీయుటాలోనే ఉన్నారు.

కాగా, మెలోనీ కంటే ముందు ఇటలీ విదేశీ వ్యవహారాల మంత్రి ఆంటోనియో టాజానీ కూడా ఇలాంటి వ్యాఖ్యలే చేశారు. దాంతో ఆంటోనియో రాజకీయ ప్రయోజనాల కోసం వలసల అంశాన్ని వాడుకుంటున్నారంటూ స్పెయిన్ విదేశీ వ్యవహారాల మంత్రి జోస్ అల్బరెస్ విమర్శించారు.

ఈ పరిణామాల నేపథ్యంలో స్పెయిన్‌లో ఇటలీ రాయబారిని స్పెయిన్ విదేశీ వ్యవహారాల మంత్రి పిలిపించారు.

( బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,  ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)