ట్రంప్: త్వరగా ఒప్పందం కుదిరితే ఇరాన్‌పై దాడులు నిలిపివేస్తాం

ఫొటో సోర్స్, Reuters
- రచయిత, జేమ్స్ చేటర్, జో ఇన్‌వుడ్
- హోదా, బీబీసీ ప్రతినిధులు
- ప్రచురణ
- చదివే సమయం: 4 నిమిషాలు
ఇరాన్‌తో త్వరగా ఒప్పందం కుదిరితే ఆ దేశంపై దాడులను రద్దు చేస్తానని అమెరికా అధ్యక్షుడు డోనల్డ్ ట్రంప్ ప్రకటించారు.
ఆయన తన సామాజిక మాధ్యమం ట్రూత్ సోషల్‌లో చేసిన పోస్టులో, ఇరాన్‌తో పాటు మధ్యప్రాచ్యంలోని ఇతర దేశాలు కూడా దాడులను వాయిదా వేయాలని తనను కోరాయని ట్రంప్ తెలిపారు. ఒప్పందానికి సంబంధించిన మౌలిక అంశాలపై ఇప్పటికే ఏకాభిప్రాయం కుదిరిందని ఆయన పేర్కొన్నారు.
అమెరికా, ఇజ్రాయెల్ కలిసి ఇరాన్‌పై మరోసారి తీవ్రమైన వైమానిక దాడులకు సిద్ధమవుతున్నాయంటూ వార్తలు వెలువడిన నేపథ్యంలో ట్రంప్ ఈ వ్యాఖ్యలు చేశారు. అయితే ప్రపంచ వినాశనాన్ని తలపించే హెచ్చరికలు చేయడం, ఆ తర్వాత చర్చలకు అవకాశం ఇస్తున్నట్లు ట్రంప్ ప్రకటించడం ఇదే తొలిసారి కాదు.
అమెరికా దాడులను నిలిపివేయాలని తెహ్రాన్ కోరినట్లు ట్రంప్ చేసిన వ్యాఖ్యలను ఇరాన్ ప్రభుత్వానికి సన్నిహితంగా ఉండే మెహర్ వార్తాసంస్థ ఖండించింది. అది మరో అబద్ధం తప్ప మరేమీ కాదని పేర్కొంది.
ఇరాన్ తాత్కాలిక రక్షణ మంత్రి మజీద్ ఇబ్న్ అల్-రెజా మాట్లాడుతూ, ప్రత్యర్థుల నుంచి వచ్చే ప్రతి హెచ్చరికను తమ దేశం నిజమైనదిగానే, విశ్వసనీయమైనదిగానే పరిగణిస్తుందని చెప్పారు. అవి మానసిక యుద్ధంలో భాగమైనప్పటికీ ‘‘అప్రమత్తత కోల్పోమని, నిష్క్రియంగా కూడా ఉండమని’’ స్పష్టం చేశారు.

అమెరికా, ఇజ్రాయెల్ కలిసి ఇరాన్ ఇంధన మౌలిక సదుపాయాలపై ఇప్పటివరకు జరిగిన వాటిలోనే అత్యంత తీవ్రమైన బాంబు దాడులకు ప్రణాళిక సిద్ధం చేస్తున్నాయంటూ అమెరికా మీడియాలో వచ్చిన కథనాల తర్వాత ఇరు దేశాల మధ్య మాటల యుద్ధం మరింత ముదిరింది.
ఈ ప్రణాళికపై శుక్రవారం జరిగిన ట్రంప్ మంత్రివర్గ సమావేశంలో చర్చ జరిగినట్లు, ఆ సమావేశానికి సంబంధించిన వర్గాలను ఉటంకిస్తూ బీబీసీ భాగస్వామ్య సంస్థ సీబీఎస్ న్యూస్ వెల్లడించింది.
ఇదే సమయంలో, మధ్యప్రాచ్యంలో ఉద్రిక్తతలు మరింత పెరిగే అవకాశం ఉన్నందున అక్కడ ఉన్న అమెరికన్లు అప్రమత్తంగా ఉండాలని, అవసరమైతే వెంటనే అక్కడి నుంచి వెళ్లిపోయేందుకు సిద్ధంగా ఉండాలని అమెరికా ప్రభుత్వం సూచించింది.
కొలిక్కిరాని చర్చలు
శనివారం చేసిన పోస్టులో ట్రంప్, "రెండో ప్రపంచ యుద్ధం తర్వాత ఎన్నడూ చూడనంత సైనిక శక్తి, విధ్వంసక సామర్థ్యంతో ఇస్లామిక్ రిపబ్లిక్ ఆఫ్ ఇరాన్‌పై దాడికి అమెరికా పూర్తిగా సిద్ధంగా ఉంది" అని పేర్కొన్నారు.
అయితే ఆ దాడిని రద్దు చేయడం ప్రపంచ భవిష్యత్తు ప్రయోజనాలకే కాకుండా, విజయవంతమైన, సుసంపన్నమైన ఇరాన్ మనుగడకూ మేలు చేస్తుందని అన్నారు.
గత ఏప్రిల్ 7న కూడా, శాంతి చర్చలకు ఇరాన్ అంగీకరించకపోతే "ఈ రాత్రే ఒక నాగరికత అంతరించిపోతుంది" అంటూ ట్రంప్ హెచ్చరించారు. పౌర మౌలిక సదుపాయాలు, విద్యుత్ కేంద్రాలను ధ్వంసం చేస్తామని కూడా బెదిరించారు. అలాంటి చర్య అంతర్జాతీయ యుద్ధ నేరంగా పరిగణించే అవకాశముందని అప్పట్లో పలువురు వ్యాఖ్యానించారు.
ఆ హెచ్చరికల అనంతరం అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ నేతృత్వంలో పాకిస్తాన్‌లో ఇరాన్ ప్రతినిధులతో చారిత్రక ముఖాముఖి చర్చలు జరిగాయి. ఇది ట్రంపు వ్యూహాల ఫలితమని ఆయన మద్దతుదారులు అభివర్ణించారు.
తీవ్ర హెచ్చరికలు చేసి ప్రత్యర్థిని చర్చల బల్ల వద్దకు తీసుకురావడాన్ని "మ్యాడ్‌మ్యాన్ థియరీ"గా పిలుస్తారు.
అయితే ఆ చర్చలు ఎలాంటి ఒప్పందం లేకుండానే ముగిశాయి. ఇరు పక్షాలు గీసుకున్న రెడ్‌లైన్స్ పరస్పరం రాజీ పడే స్థితిలో లేకపోవడంతో, వినాశన హెచ్చరికలు కూడా ఫలించలేదని విశ్లేషకులు చెబుతున్నారు.
శుక్రవారం జరిగిన సమావేశంలో మీడియా ప్రతినిధులు ఇంకా సమావేశ మందిరంలోనే ఉండగా, "వారిపై (ఇరానీయులపై) చాలా తీవ్రంగా దాడి చేస్తాం. ఒక దశలో వాళ్లే 'ఇక భరించలేం' అంటారు" అని ట్రంప్ వ్యాఖ్యానించినట్లు సీబీఎస్ న్యూస్ తెలిపింది.

ఫొటో సోర్స్, Reuters
దేశీయ సవాళ్లు
ఆ మరుసటి రోజు ట్రంప్‌తో సౌదీ యువరాజు మహ్మద్ బిన్ సల్మాన్ ఫోన్‌లో మాట్లాడినట్లు ఆ దేశ అధికారిక ఎస్‌పీఏ వార్తా సంస్థ వెల్లడించింది. ప్రాంతీయ ఉద్రిక్తతలను తగ్గించడమే ఆ సంభాషణ ప్రధాన ఉద్దేశమని తెలిపింది.
ఉద్రిక్తతలు తగ్గించేందుకు సంభాషణకే ప్రాధాన్యం ఇవ్వాలని, కాల్పుల విరమణకు దారితీసే అన్ని ప్రయత్నాలు చేయాలని యువరాజు ఆ సందర్భంగా నొక్కిచెప్పినట్లు ఎస్‌పీఏ పేర్కొంది.
ఇరాన్ క్షిపణులు అమెరికా ప్రధాన భూభాగాన్ని చేరుకోలేకపోయినా, బహ్రెయిన్, జోర్డాన్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ వంటి అమెరికా మిత్రదేశాలు వాటి పరిధిలోనే ఉన్నాయని గల్ఫ్ దేశాలు ఆందోళన చెందుతున్నాయి. ముఖ్యంగా సముద్రజలాలను తాగునీటిగా మార్చే డీశాలినేషన్ ప్లాంట్లు వంటి కీలక మౌలిక సదుపాయాలు దాడులకు గురయ్యే ప్రమాదం ఉందని భావిస్తున్నాయి.
ఏప్రిల్‌లో యుద్ధాన్ని నిలిపివేయడానికి కుదిరిన కాల్పుల విరమణ జూన్‌లో కుప్పకూలినప్పటి నుంచి అమెరికా, ఇరాన్ పరస్పర దాడులు, ప్రతిదాడులు కొనసాగిస్తున్నాయి.
అమెరికా ఇరాన్ నౌకాశ్రయాలపై దిగ్బంధం విధించి, పలు లక్ష్యాలపై బాంబు దాడులు చేసింది. ప్రతిగా ఇరాన్ మధ్యప్రాచ్యంలోని అమెరికా స్థావరాలపై క్షిపణులు, డ్రోన్లతో దాడులు చేయడంతో పాటు, ప్రపంచ చమురు రవాణాకు అత్యంత కీలకమైన హార్ముజ్ జలసంధిలో నౌకలను కూడా లక్ష్యంగా చేసుకుంది.
ఈ పరిణామాల ప్రభావంతో అంతర్జాతీయ చమురు ధరలు గణనీయంగా ఒడిదుడుకులకు గురవుతున్నాయి.
అంతర్జాతీయ ఒత్తిడి మాత్రమే కాదు, దేశీయంగా కూడా ట్రంప్‌కు సవాళ్లు ఎదురవుతున్నాయి. ప్యూ రీసెర్చ్ సెంటర్ తాజా సర్వే ప్రకారం, ఇరాన్‌తో యుద్ధాన్ని దాదాపు 60 శాతం మంది అమెరికన్లు వ్యతిరేకిస్తున్నారు. దీనివల్ల ట్రంప్ ప్రజాదరణ కూడా తగ్గుతోంది.
ఇక ఉద్రిక్తతలు మరింత పెరిగితే చమురు ధరలు మళ్లీ పెరిగి, అమెరికా వినియోగదారులపై అదనపు భారం పడే అవకాశం ఉంది.
మరోవైపు కీలకమైన మధ్యంతర ఎన్నికలు సమీపిస్తున్న వేళ, విదేశాంగ నిర్ణయాలు దేశీయ రాజకీయాలపై తీవ్ర ప్రభావం చూపుతాయన్న విషయం ట్రంప్‌కు బాగా తెలుసు.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్, ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)






























