కేంద్రం తెచ్చిన పబ్లిక్ ఎగ్జామినేషన్స్ సవరణ బిల్లు పేపర్ లీకులను అడ్డుకోగలదా, సీజేపీ వాదనేంటి?

ఫొటో సోర్స్, Getty Images
- రచయిత, కీర్తి దుబే
- హోదా, బీబీసీ ప్రతినిధి
- ప్రచురణ
- చదివే సమయం: 7 నిమిషాలు
పబ్లిక్ ఎగ్జామినేషన్స్ (సవరణ) బిల్లు-2026ను పార్లమెంట్‌లోని ఉభయసభలు ఆమోదించాయి. పేపర్ లీక్ కేసులకు సంబంధించి కఠినమైన శిక్షలు, ఫాస్ట్ ట్రాక్ కోర్టుల నిబంధనలను ఈ సవరణ బిల్లులో చేర్చారు.
ఈ బిల్లు ఆమోదం పొందిన కొన్ని గంటల్లోనే, గురువారం అర్ధరాత్రి దాటాక ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఇన్‌స్టాగ్రామ్‌లో ఒక వీడియో షేర్ చేశారు.
"పేపర్ లీక్ మాఫియా, పేపర్ లీక్ గ్యాంగ్‌లు లేదా దేశ యువత భవిష్యత్‌తో చెలగాటమాడే ఎవరినైనా వదిలిపెట్టే ప్రసక్తి లేదు'' అని ఆ వీడియోలో మోదీ అన్నారు.
ఇలాంటి ఘటనలను నివారించడానికి కఠినమైన చట్టాన్ని తీసుకొస్తామని ఇచ్చిన మాటను తమ ప్రభుత్వం నిలబెట్టుకుందని ఆయన గుర్తు చేశారు.
''నమ్మదగిన విద్యా వ్యవస్థను నిర్మించే దిశగా మేం నిరంతరం పనిచేస్తున్నాం. ఆ దిశగానే టాస్క్‌ఫోర్స్ ఏర్పాటు, ఫాస్ట్ ట్రాక్ కోర్టుల ఏర్పాటు, రాష్ట్రాల నుంచి సలహాలు తీసుకోవడం వంటివి చేస్తున్నాం. విద్యా రంగంలో దేశవ్యాప్తంగా సంస్కరణలు తీసుకురావడం ఇప్పుడు అనివార్యగా మారింది. ఈ దిశగా మా ప్రయత్నాలు కొనసాగుతూనే ఉంటాయి'' అని మోదీ వీడియోలో మాట్లాడారు.


ఫొటో సోర్స్, Getty Images
పబ్లిక్ ఎగ్జామినేషన్స్ (సవరణ) బిల్లులోని నిబంధనలు
పబ్లిక్ ఎగ్జామినేషన్స్ యాక్ట్‌ను 2024లో పార్లమెంట్ ఆమోదించింది.
ప్రశ్న పత్రాల లీకేజీతో సహా పరీక్షల్లో అక్రమాలకు పాల్పడేవారిని కఠినంగా శిక్షించడమే దీని ముఖ్య ఉద్దేశం.
యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (యూపీఎస్సీ), స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (ఎస్సెస్సీ), రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డ్ (ఆర్‌ఆర్‌బీ), ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్ సెలక్షన్ (ఐబీపీఎస్), నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్‌టీఏ) నిర్వహించే 'నీట్' సహా అన్ని రకాల పోటీ పరీక్షలకూ ఈ చట్టం వర్తిస్తుంది. 2024 జూన్ నుంచే ఈ చట్టం అమల్లోకి వచ్చింది.
ఈ ఏడాది మే నెలలో నీట్-యూజీ (NEET-UG) పేపర్ లీక్ అయిన తర్వాత, దిల్లీలోని జంతర్ మంతర్ సహా దేశమంతటా విద్యార్థులు పెద్ద ఎత్తున నిరసనలకు దిగారు.
ఈ నేపథ్యంలో, పేపర్ లీకులను అడ్డుకునేందుకు తమ ప్రభుత్వం మరింత కఠినమైన నిబంధనలతో కూడిన బిల్లును తీసుకొస్తుందని జులై 23న రాత్రి ఇన్‌స్టాలో మోదీ వెల్లడించారు.
2024 నాటి చట్టానికి సవరణలు చేస్తూ రూపొందించిన ఈ కొత్త బిల్లుకు మరుసటి రోజే, అంటే జులై 24న కేంద్ర మంత్రి మండలి ఆమోదం తెలిపింది.

ఫొటో సోర్స్, Getty Images
ఫాస్ట్ ట్రాక్ కోర్టులు
ఫాస్ట్‌ట్రాక్ కోర్టుల ఏర్పాటు అనేది ఈ కొత్త బిల్లులో తీసుకొచ్చిన అతిపెద్ద మార్పు.
పేపర్ లీక్ కేసులను వేగంగా విచారించి వీలైనంత త్వరగా తీర్పులు ఇచ్చేందుకు ప్రతి రాష్ట్రంలో ప్రత్యేక ఫాస్ట్ ట్రాక్ కోర్టులను ఏర్పాటు చేయాలని ఈ బిల్లులో పొందుపరిచిన నిబంధనలు చెబుతున్నాయి.
పేపర్ లీక్ కేసుల్లో పోలీసులు దర్యాప్తును కేవలం రెండు నెలల్లోనే పూర్తి చేయాలని బిల్లులో కాలపరిమితిని విధించారు. దీనివల్ల ఛార్జ్‌షీట్ దాఖలు, విచారణ వేగంగా జరుగుతుంది.
సాధారణ కేసుల విచారణకు పోలీసులకు దర్యాప్తు సమయం 90 రోజులు ఉంటుంది.
ఒకవేళ ఎవరైనా పేపర్ లీక్ చేసినట్లు రుజువైతే వారికి పదేళ్ల వరకు జైలు శిక్షతో పాటు రూ. 50 లక్షల జరిమానా విధిస్తారు.
ఇదివరకు 2024 చట్టంలో ఇలాంటి నేరానికి గరిష్టంగా అయిదేళ్ల జైలు శిక్షతో పాటు రూ. 10 లక్షల వరకు జరిమానా విధించేవారు.
ఒకవేళ ఈ లీకేజీ వెనుక ఏదైనా సిండికేట్ నెట్‌వర్క్ లేదా ముఠా ప్రమేయం ఉంటే, వారికి ఏకంగా రూ.10 కోట్ల వరకు జరిమానా విధిస్తారు.

ఫొటో సోర్స్, ANI
ఈ బిల్లు గురించి సీజేపీ వాదనేంటి?
పార్లమెంట్‌లో ఈ బిల్లు ఆమోదం పొందిన తర్వాత సీజేపీ ప్రతినిధి అశుతోష్ రాంకా స్పందిస్తూ, 'మళ్లీ అదే పాత ధోరణి అవలంబిస్తున్నారు' అని విమర్శించారు.
పేపర్లు లీక్ కాకుండా అడ్డుకునేలా వ్యవస్థలో మార్పులు తీసుకురావడం వదిలేసి, పేపర్ లీక్ అయిన తర్వాత చేయాల్సిన చర్యలకే ప్రభుత్వం ప్రాధాన్యమిస్తోందని ఆయన పేర్కొన్నారు.
బిల్లు ఆమోదం పొందిన తర్వాత ఆయన ఒకటిన్నర నిమిషాల వీడియో ప్రకటన విడుదల చేశారు.
''ఈరోజు ఆమోదించిన బిల్లులో మీరు పేపర్ లీకైన తర్వాత పరిస్థితి గురించే వివరించారు. ఫాస్ట్ ట్రాక్ కోర్టులు, కఠినమైన శిక్షలు, భారీ జరిమానాలు ఇవన్నీ దానికి సంబంధించినవే. అసలు పేపర్ లీక్‌ను అడ్డుకోవడానికి మీరు ఏం చేస్తున్నారనే దానిపై చర్చ జరగడం లేదు.
ఎన్‌టీఏలో సంస్కరణలు, ఎస్‌ఎస్‌సీని చట్టబద్ధమైన సంస్థగా మార్చడం, ఎగ్జామ్ క్యాలెండర్- సిలబస్‌లో పారదర్శకత, కోచింగ్ సెంటర్లు, వెండర్ల వ్యవహారాలు, బ్లాక్‌లిస్ట్ అయిన వెండర్లను ఎలా నిరోధించాలి, పరీక్షల ప్రక్రియను మొదటి నుంచి చివరి వరకు ఎలా బలోపేతం చేయాలి, ఎగ్జామ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ను ఎలా మెరుగుపరచాలి అనే విషయాలపై చర్చించనంత వరకు ఈ పేపర్ లీక్‌ల సమస్య పరిష్కారం కాదు.
లీక్‌ను ఎలా అరికట్టాలనే దానిపై కూడా మీరు మాట్లాడాల్సి ఉంటుంది. మీరు మా చార్టర్‌ను చూడండి. దానిపై విద్యార్థులు, ఉపాధ్యాయులు, సైబర్- డిజిటల్ నిపుణులతో చర్చించండి. ఇది దేశ విద్యార్థుల భవిష్యత్‌కు సంబంధించిన అంశం కాబట్టి తొందరపాటు నిర్ణయాలు తీసుకోకండి'' అని ఆ వీడియోలో అశుతోష్ వ్యాఖ్యానించారు.

ఫొటో సోర్స్, ANI
నీట్ పేపర్ ఎలా లీక్ అయింది?
నీట్ పరీక్షలో ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ సబ్జెక్టుల నుంచి మొత్తం180 ప్రశ్నలతో నాలుగు రకాల పేపర్ సెట్లు ఉంటాయి. అయితే 2024, 2026లలో లీకేజీలు వేర్వేరు దశల్లో జరిగాయి.
2024లో పేపర్ ముద్రించిన తర్వాత లీక్ అయినట్లుగా ఆరోపణలు వచ్చాయి. పరీక్షా కేంద్రాలకు ప్రశ్న పత్రాలను తరలించే క్రమంలో సీలు చేసిన ట్రంకు పెట్టెలను తెరిచి పేపర్‌ను లీక్ చేసినట్లు దర్యాప్తు సంస్థలు పేర్కొన్నాయి. ఈ ఘటనలో దాదాపు 40 నుంచి 50 మంది ప్రమేయం ఉన్నట్లు దర్యాప్తులో తేలింది.
ఈ ఘటన వల్ల పరీక్ష పారదర్శకత దెబ్బతినలేదని అభిప్రాయపడుతూ, తిరిగి పరీక్ష నిర్వహించాలన్న డిమాండ్‌ను అప్పట్లో సుప్రీంకోర్టు తిరస్కరించింది.
2026లో మాత్రం ప్రశ్న పత్రం అసలు ఎన్‌టీఏ వ్యవస్థ దాటి బయటకు రాకముందే లీక్ అయినట్లు ఆరోపణలు ఉన్నాయి.
సిస్టమ్ లోపల ఉన్న కొందరు ఉపాధ్యాయులే పేపర్‌ను లీక్ చేశారని భావిస్తున్నారు. ప్రింటింగ్, రవాణా, పంపిణీకి సంబంధించిన భద్రతా వ్యవస్థల్లో ఎలాంటి లోపాలు జరగలేదని అధికారులు తెలిపారు. అంటే 'చైన్ ఆఫ్ కస్టడీ' పరిధిలోకి పేపర్ రాకముందే లీక్ అయిందని వెల్లడించారు.
పేపర్ లీకేజీకి సంబంధించి 2024 నుంచే కఠిన శిక్షలు, జరిమానాలు ఉన్న చట్టం అమల్లో ఉంది. అయినా కూడా 2026లో నీట్ పేపర్ లీక్ అయింది. అలాంటప్పుడు కేవలం శిక్షా కాలాన్ని, జరిమానా మొత్తాన్ని పెంచినంత మాత్రాన పేపర్ లీక్‌లను ఎంతవరకు అడ్డుకోగలరనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి.
పేపర్ లీకులను ఎదుర్కొనేందుకు ప్రభుత్వం తెచ్చిన చట్ట సవరణలు బహుళ అంచెల వ్యూహంలో ఒక భాగం మాత్రమేనని బీబీసీతో సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (సీబీఎస్‌ఈ) మాజీ చైర్ పర్సన్ అశోక్ గంగూలీ చెప్పారు.
'కఠిన శిక్షలు, ఫాస్ట్ ట్రాక్ విచారణల వల్ల పేపర్ లీక్ చేసే వారిలో భయం మొదలవుతుంది. అయితే ఇటువంటి పరీక్షల నిర్వహణలో విశ్వసనీయత, ప్రామాణికత, ప్రతిష్ట అనేవి చాలా ముఖ్యం. ఈసారి పొరపాటు బయటి నుంచి కాదు.. బాధ్యతలు అప్పగించిన వ్యవస్థ లోపలి వ్యక్తుల వల్లే జరిగింది. ఇప్పుడు ఆ నమ్మకమే దెబ్బతిన్నది.
పరీక్షా ప్రక్రియ ప్రతిష్ట దెబ్బతినకుండా ఉండేందుకు నమ్మకమైన వ్యక్తులు, నమ్మకమైన సాంకేతిక వ్యవస్థ, బాధ్యతాయుతమైన ప్రవర్తన అవసరం. ఈ అంశాల్లో ఎలాంటి అలసత్వానికి చోటు ఉండకూడదు.
పరీక్షలు నిర్వహించే విధానంలో కూడా మార్పులు రావాల్సి ఉంది. ఇటువంటి పరీక్షల నిర్వహణ అనేది ఒక ప్రొఫెషనల్ పని. దీనికోసం నిపుణులు కావాలి తప్ప సాధారణ పరిపాలనాధికారులు సరిపోరు.
లక్షల మంది రాసే ఇలాంటి పరీక్షలను ఒకే దశలో కాకుండా, రెండు దశల విధానంలో నిర్వహించాలి'' అని ఆయన వివరించారు.
ఈ కొత్త సవరణలు ఎంతవరకు ప్రభావవంతంగా పనిచేస్తాయో రాబోయే కాలంలో తెలుస్తుంది.
కేవలం శిక్షలు పెంచితే సరిపోదని, అసలు లీక్ కాకుండా వ్యవస్థను 'లీక్ ప్రూఫ్'గా ఎలా మారుస్తారో చెప్పాలని విపక్షాలు, ఒక వర్గం ప్రజలు ప్రశ్నిస్తున్నారు.

ఫొటో సోర్స్, ANI
దేశంలోని ఫాస్ట్ ట్రాక్ కోర్టుల పరిస్థితి ఏంటి?
ఈ బిల్లుపై మరికొన్ని ప్రశ్నలు కూడా ఉత్పన్నమవుతున్నాయి. సాధారణ కేసుల్లో దర్యాప్తుకు 90 రోజుల సమయం ఉంటే, తాజా సవరణ బిల్లులో పోలీసులు 60 రోజుల్లోనే (రెండు నెలలు) ఛార్జ్‌షీట్ దాఖలు చేయాలని, ఫాస్ట్ ట్రాక్ కోర్టులు వీటిని విచారించాలని నిర్దేశించారు.
అయితే, ఇంత తక్కువ సమయంలో సమగ్ర దర్యాప్తు చేసేందుకు పోలీసు వ్యవస్థ సిద్ధంగా ఉందా?
గడువు తక్కువగా ఉండటం వల్ల దర్యాప్తు నాణ్యత దెబ్బతింటుందా?
ప్రస్తుతం దేశంలో పనిచేస్తున్న ఫాస్ట్ ట్రాక్ కోర్టులు నిజంగానే వేగంగా తీర్పులు ఇస్తున్నాయా? అనే ప్రశ్నలు ఉత్పన్నం అవుతున్నాయి.
2026 జులై 24న ప్రభుత్వం వెల్లడించిన వివరాల ప్రకారం... దేశంలో ఉన్న ఫాస్ట్ ట్రాక్ స్పెషల్ కోర్టులలో ఏకంగా 2.45 లక్షల కేసులు పెండింగ్‌లో ఉన్నాయి.
ఉత్తరప్రదేశ్ (ఫతేపూర్ సిక్రీ) బీజేపీ ఎంపీ రాజ్‌కుమార్ చాహర్, మధ్యప్రదేశ్ (రేవా) బీజేపీ ఎంపీ జనార్దన్ మిశ్రా అడిగిన ప్రశ్నలకు సమాధానంగా న్యాయ శాఖ ఈ వివరాలను తెలిపింది.
దేశంలో ఉన్న ఫాస్ట్ ట్రాక్ స్పెషల్ కోర్టులు (ప్రత్యేక పోక్సో కోర్టులతో సహా) సంఖ్య, గత మూడేళ్లలో దాఖలైన, పరిష్కరించిన, పెండింగ్‌లో ఉన్న కేసుల వివరాలను సదరు ఎంపీలు కోరారు.
న్యాయశాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్ లోక్‌సభకు రాతపూర్వక సమాధానం ఇస్తూ.. 2026 ఏప్రిల్ 30 నాటికి దేశంలోని 29 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలలో 775 ఫాస్ట్ ట్రాక్ స్పెషల్ కోర్టులు పనిచేస్తున్నాయని తెలిపారు.
వీటిలో 398 ప్రత్యేక పోక్సో కోర్టులు ఉన్నాయి.
డిసెంబర్ 31, 2025 నాటికి ఈ కోర్టుల్లో 2,45,579 కేసులు పెండింగ్‌లో ఉన్నాయని ఆయన తెలిపారు.
ప్రభుత్వ గణాంకాల ప్రకారం... 2025 లో ఫాస్ట్ ట్రాక్ స్పెషల్ కోర్టుల్లో 1,43,936 కొత్త కేసులు నమోదవగా 66,500 కేసులు మాత్రమే పరిష్కారమయ్యాయి.
ఇప్పటికే ఉన్న ఫాస్ట్ ట్రాక్ కోర్టుల్లో లక్షల కేసులు పెండింగ్‌లో ఉన్న నేపథ్యంలో... కొత్తగా ఏర్పాటు చేసే ఫాస్ట్ ట్రాక్ కోర్టులు, పేపర్ లీక్ కేసులను ఎంత వేగంగా పరిష్కరిస్తాయో వేచి చూడాలి.
( బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్, ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)





























