'పేలుడు పదార్థాలతో వచ్చిన మహిళను అడ్డుకున్న సెక్యూరిటీ గార్డు, ఒక్కసారిగా పేలుడు'

ఫొటో సోర్స్, Getty Images
- రచయిత, రాబర్ట్ గ్రీనల్
- ప్రచురణ
- చదివే సమయం: 2 నిమిషాలు
రష్యా రాజధాని మాస్కోలోని ఒక ఇటాలియన్ రెస్టారెంట్‌లో జరిగిన పేలుడులో ముగ్గురు మరణించగా, 21 మందికి గాయాలైనట్లు భద్రతాధికారులను ఉటంకిస్తూ రష్యన్ ప్రభుత్వ మీడియా తెలిపింది.
నగరంలోని కుద్రిన్‌స్కయా స్క్వేర్ వద్ద స్థానిక కాలమానం ప్రకారం రాత్రి 8 గంటలకు ఈ పేలుడు సంభవించింది.
పేలుడు పదార్థాలతో ఒక మహిళ రెస్టారెంట్‌లోకి ప్రవేశించేందుకు ప్రయత్నించగా, అక్కడి సెక్యూరిటీ గార్డు ఆమెను అడ్డుకున్నట్లు 'నేషనల్ యాంటీ టెర్రరిస్ట్ కమిటీ' తెలిపింది.
అదే సమయంలో పేలుడు జరగడంతో ఆ మహిళ, సెక్యూరిటీ గార్డుతో పాటు 'బాల్జి రోసీ' రెస్టారెంట్‌కు వచ్చిన మరో వ్యక్తి అక్కడికక్కడే మరణించినట్లు పేర్కొంది.
ఆ సమయంలో ఆ రెస్టారెంట్‌లో ఒక ప్రైవేట్ వేడుక జరుగుతోంది.

ఎవరిని లక్ష్యంగా చేసుకుని ఈ దాడి జరిగిందనే వివరాలను అధికారులు ఇంకా వెల్లడించలేదు. అయితే, దీనికి యుక్రెయిన్ యుద్ధంతో సంబంధం ఉండొచ్చని ఎక్కువ మంది మాస్కో వాసులు అభిప్రాయపడుతున్నారు.
ఇటీవల కొన్నేళ్లలో రష్యా రాజధాని సహా పరిసర ప్రాంతాల్లో పలువురు సీనియర్ రష్యన్ మిలిటరీ అధికారులు హత్యకు గురయ్యారు. యుక్రెయిన్ ఈ దాడులకు పాల్పడినట్లు మాస్కో ఆరోపిస్తూ వస్తోంది.
తొలుత ఈ పేలుడు రెస్టారెంట్ కిచెన్‌లో జరిగినట్లు కథనాలు వచ్చినప్పటికీ, 'పేలుడు బయట జరిగింది' అని ఆ తర్వాత రెస్టారెంట్ యాజమాన్యం ఒక ప్రకటన విడుదల చేసింది.
స్టాలిన్ కాలంనాటి ప్రముఖ ఆకాశహర్మ్యాలలోని, ఒక భవనంలో ఈ రెస్టారెంట్ ఉంది. పేలుడు అనంతరం స్క్వేర్ చుట్టూ ఉన్న రోడ్లను అధికారులు కొద్దిసేపు మూసివేశారు.
రష్యన్ వార్తా సంస్థ ఆర్‌ఐఏ విడుదల చేసిన వీడియోలో, సంఘటనా స్థలంలో భారీ ఆయుధాలతో భద్రతా సిబ్బంది మోహరించి ఉండడం కనిపించింది. సాధారణ పౌరులెవరూ అటువైపు వెళ్లకుండా అధికారులు రోడ్లను మూసివేశారు.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్, ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)






























