టెస్టోస్టెరాన్ తక్కువగా ఉంటే యుద్ధానికి పనికిరారా?

అమెరికా, పిల్లలు, సంతాన లేమి, టెస్టోస్టిరాన్, సైనికులు

ఫొటో సోర్స్, Getty Images

    • రచయిత, సరీన్ హబెషియాన్
    • హోదా, బీబీసీ ప్రతినిధి
  • ప్రచురణ
  • చదివే సమయం: 4 నిమిషాలు

వార్షిక ఆరోగ్య పరీక్షలలో భాగంగా అమెరికా సైన్యంలో 30 ఏళ్లు లేదా అంతకంటే ఎక్కువ వయసున్నవారికి టెస్టోస్టెరాన్ లోపానికి సంబంధించిన పరీక్షలు నిర్వహిస్తామని అమెరికా రక్షణమంత్రి పీట్ హెగ్సెత్ ప్రకటించారు.

''హై-టి డిపార్ట్‌మెంట్'' అనే క్యాప్షన్‌తో 'ఎక్స్'లో హెగ్సెత్ పోస్టు చేసిన వీడియోలో, సైనికులు తమ విధులను అత్యుత్తమంగా నిర్వహించేందుకు అవసరమైన టెస్టోస్టెరాన్ స్థాయి ఉందో లేదో పరీక్షించడానికి స్క్రీనింగ్ చేపట్టడానికి ఆమోదం తెలిపినట్టు చెప్పారు.

తక్కువ టెస్టోస్టెరాన్ స్థాయిలు ఉన్న బలగాలకు స్వచ్ఛందంగా హార్మోన్ రీప్లేస్‌మెంట్ చికిత్స అందిస్తామన్నారు.

30 ఏళ్లలోపు ఉన్నవారు కూడా అవసరమనుకుంటే ఈ పరీక్ష చేయించుకోవచ్చన్నారు.

ఈ పరీక్షలు మహిళలకు కూడా నిర్వహిస్తారా లేదా అన్నదానిపై స్పష్టత లేదు. మహిళలకు కూడా వయసు పెరుగుతున్నకొద్దీ టెస్టోస్టెరాన్ స్థాయి తగ్గుతుంటుంది.

''మా యుద్ధవీరులకు ప్రపంచంలోనే అత్యుత్తమైన వైద్యసదుపాయాలు కల్పించాలని మేం అనుకుంటాం. ఈ కార్యక్రమం ఆ బాధ్యతను నెరవేరుస్తుంది''అని హెగ్సెత్ వీడియోలో తెలిపారు.

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌
ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

టెస్టోస్టెరాన్ రీప్లేస్‌మెంట్ థెరపీతో ప్రయోజనం ఉంటుందా?

దీర్ఘకాలిక ఆరోగ్యంపై దృష్టిపెట్టడమంటే ఎప్పటికీ బలంగా ఉండేలా చూసుకోవడం, సామర్థ్యాన్ని పెంపొందించుకోవడమేనని హెగ్సెత్ అన్నారు. ఇది తర్వాత విధుల్లో బాగా పనిచేసేందుకు మాత్రమే కాదని, మిగిలిన జీవితానికి కూడా వర్తిస్తుందని యూనిఫాంకు దూరమైన తర్వాత కూడా సుదీర్ఘకాలం ఆరోగ్యంగా, దృఢంగా ఉండడానికి సహకరిస్తుందని తెలిపారు.

కండరాల పటుత్వం కోసం డాక్టర్ ప్రిస్క్రిప్షన్ లేకుండా టెస్టోస్టెరాన్ తీసుకోవడంపై సైన్యంలో కఠిన నిషేధం ఉంది.

ఈ కార్యక్రమం కృత్రిమంగా శారీరక సామర్థ్యాన్ని పెంచుకోవడం కోసం కాదని హెగ్సెత్ తెలిపారు.

30ఏళ్లు అంతకన్నా ఎక్కువ వయసున్న సిబ్బంది, రిజర్వ్ బలగాలందరికీ టెస్టోస్టెరాన్ టెస్ట్ తప్పనిసరని, ఇది వెంటనే అమల్లోకి వస్తుందని పెంటగాన్ ప్రతినిధి సీన్ పార్నెల్ ఓ పక్రటనలో తెలిపారు.

''ఈ పరీక్షల వల్ల సైనికుల ఆరోగ్యానికి సంబంధించి సమగ్ర ప్రాథమిక సమాచారం లభిస్తుంది. అవసరమైనవారికి టెస్టోస్టెరాన్ చికిత్స అందించి ఆరోగ్యవంతమైన, సమర్థ, శక్తిమంతమైన సైనికులను తయారుచేసుకోవచ్చు''అని ఆయన తెలిపారు.

పురుషులు, మహిళలిద్దరికీ ఈ పరీక్షలుంటాయా? అలాగే పెరిమెనోపాజ్ దశలోకి ప్రవేశిస్తున్న మహిళలకు ఈస్ట్రోజన్ ఆధారిత చికిత్సను అందించే విషయం పరిశీలిస్తారా అనే ప్రశ్నలకు పెంటగాన్ ఎలాంటి సమాధానాలూ ఇవ్వలేదు.

హార్మోన్ పరీక్షలు పురుషులు, మహిళలిద్దరికీ అందుబాటులో ఉండాలని ఇరాక్ యుద్ధంలో పనిచేసిన మాజీ సైనికురాలు, భద్రతాబలగాల సేవల కమిటీలో సభ్యురాలయిన ఇల్లినాయిస్ డెమోక్రటిక్ సెనెటర్ టామ్మీ డక్‌వర్త్ అభిప్రాయపడ్డారు.

కాంగ్రెస్ సభ్యురాలు, పెన్సిల్వేనియా డెమోక్రాట్ క్రిస్సీ హౌలాహన్.. హెగ్సెత్ ప్రకటనను ఖండించారు.

అమెరికా, పిల్లలు, సంతాన లేమి, టెస్టోస్టిరాన్, సైనికులు

ఫొటో సోర్స్, Getty Images

‘టెస్టోస్టెరాన్ చికిత్సను సులభతరం చేసేలా’

30ఏళ్లు పై బడిన మగవాళ్లంతా టెస్టోస్టెరాన్ పరీక్షలు చేయించుకోవాలని డాక్టర్ మోహిత్ ఖేరా బీబీసీతో చెప్పారు. మిలటరీలో టెస్టోస్టెరాన్ ఉపయోగం, పరీక్షలపై గత ఏడాది అమెరికా ఫుడ్, డ్రగ్ అడ్మినిస్ట్రేషన్(ఎఫ్‌డీఏ) నిపుణుల ప్యానెల్‌ ఆయన నేతృత్వంలో పనిచేసింది. వ్యక్తి ప్రస్తుత, భవిష్యత్ ఆరోగ్యాన్ని గుర్తించేందుకు ఇది కీలకమని ఆయన తెలిపారు.

''చాలామంది యువకులకు టెస్టోస్టెరాన్ స్థాయిలు తక్కువగా ఉంటున్నాయి. దీనివల్ల కండరాల పటుత్వం, శక్తి తగ్గుతాయి. యుద్ధ క్షేత్రంలో అదో సమస్య అవుతుంది''అని బేలర్ కాలేజ్ ఆఫ్ మెడిసన్‌లో యూరాలజీ ప్రొఫెసర్ అయిన ఖేరా చెప్పారు.

అయితే కొన్ని రకాల లక్షణాలు ఉంటేనే టెస్టోస్టెరాన్ ఎక్కించాలని, ఈ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలని ఆయన సూచించారు.

హార్మోన్ రీప్లేస్‌మెంట్ థెరపీ వల్ల కండరాల బలం పెరగడం, శరీరంలో కొవ్వు తగ్గడం, డిప్రెషన్ ప్రమాదం తగ్గడం వంటి ఉపయోగాలుంటాయన్నారు. దీర్ఘకాలంలో ఎముకల దృఢత్వం కూడా మెరుగుపడుతుందన్నారు.

అయితే ఈ చికిత్స అందరికీ సరిపోదని ఆయన స్పష్టం చేశారు.

''యువకులు టెస్టోస్టెరాన్ తీసుకుంటే అది వారిలో సంతానోత్పత్తి సామర్థ్యాన్ని దెబ్బతీయొచ్చు. పిల్లలను కనాలనుకునేవయసులో ఉన్నవారికి ఈ విషయం ముందుగానే తెలియజేయాలి. ఇది గుండె సంబంధిత వ్యాధుల ప్రమాదాన్ని కూడా కొంత పెంచే అవకాశం ఉంది'' అని ఆయన తెలిపారు.

పురుషులకు టెస్టోస్టెరాన్ మందులు సూచించేందుకు వైద్యనిపుణులకున్న అడ్డంకులను తొలగించేందుకు అమెరికా ఆరోగ్య మంత్రి రాబర్ట్ ఎఫ్ కెన్నెడీ జూనియర్, ఇతర అధికారులు ప్రయత్నిస్తున్న సమయంలో హెగ్సెత్ ప్రకటన వెలువడింది.

జాతీయ సంతానోత్పత్తి సంక్షోభానికి ఇది పరిష్కారమని ఆరోగ్యమంత్రి అంటున్నారు.

టెస్టోస్టెరాన్ రీప్లేస్‌మెంట్ చికిత్సకు సంబంధించిన మందుల లేబుళ్లపై ఉండే భద్రత, ప్రభావానికి సంబంధించిన హెచ్చరికలు తొలగించాలని, అలాగే ఈ మందులను సూచించే నిబంధనలను మరింత సడలించాలని గత నెలలో ఎఫ్‌డీఏ ప్రతిపాదించింది.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,  ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)