సుద్దపొడి, యోగర్ట్‌లను కిటికీ అద్దాలకు పూస్తే ఎండ, వేడి నుంచి బయట పడొచ్చా? కొందరు ఫ్రెంచ్ వాళ్లు ఏం చేస్తున్నారో చూడండి...

ఫొటో సోర్స్, Getty Images
- రచయిత, సోఫీ హర్‌డాక్
- హోదా, బీబీసీ ప్రతినిధి
- ప్రచురణ
- చదివే సమయం: 5 నిమిషాలు
రికార్డు స్థాయి వేడి ఫ్రాన్స్‌ను ఉక్కిరిబిక్కిరి చేస్తున్న నేపథ్యంలో అక్కడ కొన్ని షాపుల్లో చౌకగా లభించే ఓ సాధారణ వస్తువు ఎండ తీవ్రతను తట్టుకునేందుకు దోహదపడుతోంది. అదే పొడి చేసిన సుద్ద.
బ్లాంక్ డి మూడోన్ లేదా మూడోన్ వైటింగ్‌గా పిలిచే ఈ పదార్థాన్ని సాధారణంగా పెయింట్లు తయారు చేయడానికి లేదా శుభ్రం చేయడానికి వాడతారు.
అయితే భరించలేని ఉష్ణోగ్రతల నేపథ్యంలో కొందరు ఈ సుద్దను వేడిని తగ్గించే చిట్కాగా కొందరు ఫ్రెంచ్ ప్రజలు ఉపయోగిస్తున్నారు. పాఠశాలలు, ఇళ్ల కిటికీలపై దీన్ని పూస్తున్నారు.
సుద్ద పొడిని నీటిలో కలిపి అద్దాలపై పూస్తే తెల్లటి పొర ఏర్పడుతుంది. ఇది కొంతమేర వెలుతురును లోపలికి అనుమతిస్తూ వేడిని మాత్రం రిఫ్లెక్ట్ చేస్తుంది.
ఈ సులభమైన పద్ధతి వెనుక బలమైన శాస్త్రీయ ఆధారాలున్నాయని, ఈ అంశంపై పెరుగుతున్న పరిశోధనలు సూచిస్తున్నాయి.

ప్రపంచ ఉష్ణోగ్రతలు పెరుగుతున్న కొద్దీ వడగాలుల తీవ్రత పెరుగుతోంది. వాటి సంఖ్య కూడా పెరుగుతోంది.
ముఖ్యంగా నగరాల్లో నివసించే ప్రజలకు ఇవి పెద్ద ముప్పుగా మారుతున్నాయి.
ఇలాంటి పరిస్థితుల్లో కిటికీలపై తెల్లటి పూత ఒకటి వేయడం ద్వారా వేడిని తట్టుకోవడం సులభమవుతుందా? ఎలాగో తెలుసుకుందాం......

ఫొటో సోర్స్, Getty Images
రేడియేటివ్ కూలింగ్
తెల్లటి పెయింట్‌ను గోడలు, పైకప్పులపై వేయడం వల్ల చల్లదనం పెరుగుతుందని చాలామందికి తెలిసిన విషయమే. సాధారణంగా తెల్లటి ఉపరితలాలు సూర్యకాంతిని, వేడిని రిఫ్లెక్ట్ చేస్తాయి. ముదురు రంగుల ఉపరితలాలు మాత్రం వాటిని గ్రహిస్తాయి.
ఈ సూత్రాన్ని భవనాలు, నగరాలను చల్లబరచడానికి వినియోగించచ్చు. మార్కెట్‌లో లభించే సాధారణ తెల్లటి పెయింట్‌ను బిల్డింగ్ ఉపరితలంపై పూస్తే మధ్యాహ్న సమయంలో ఆ ఉపరితలానికి అవతలివైపు ఉష్ణోగ్రత, పరిసర ప్రాంతాల్లోని ఉష్ణోగ్రతతో పోలిస్తే కనీసం 1.7 డిగ్రీల సెల్సియస్ మేర తగ్గుతుంది.
చల్లదనాన్ని వీలైనంత గరిష్ఠ స్థాయికి తీసుకెళ్లేలా రూపొందించిన అల్ట్రా వైట్ పెయింట్ వంటి ప్రత్యేక పెయింట్లు సూర్యకాంతిని ప్రతిబింబించడమే కాకుండా రేడియేటివ్ కూలింగ్ అనే ప్రక్రియ ద్వారా వేడిని బయటకు పంపుతాయి. దీంతో గదుల లోపలి ఉష్ణోగ్రత అనేక డిగ్రీలు తగ్గుతుందని అధ్యయనాలు వెల్లడించాయి.
అమెరికాలోని ఇండియానా రాష్ట్రంలో పర్డ్యూ యూనివర్సిటీ పరిశోధకులు అభివృద్ధి చేసిన అల్ట్రా వైట్ పెయింట్‌పై నిర్వహించిన ఒక అధ్యయనం ప్రకారం, ఇది సూర్యకాంతిలో 98.1 శాతం వరకు ప్రతిబింబిపజేస్తుంది. సాధారణ తెల్లటి పెయింట్ మాత్రం దాదాపు 85 శాతం మాత్రమే సూర్యకాంతిని ప్రతిబింబిపజేస్తుంది. మరో అధ్యయనం ప్రకారం అల్ట్రా వైట్ పెయింట్ కింద అల్ట్రా బ్లాక్ పెయింట్ పొర వేస్తే పగటి పూట ఉష్ణోగ్రత 7.6 డిగ్రీల సెల్సియస్ వరకు తగ్గవచ్చు.
ఈ పద్ధతి ప్రభావవంతంగా పనిచేయడానికి ప్రధాన కారణాల్లో ఒకటి సుద్దలో ఉండే కాల్షియం కార్బోనేట్ లక్షణాలేనని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఇది అధికంగా కాంతిని ప్రతిఫలింపజేయడమే కాకుండా సోలార్ రేడియేషన్‌ని కూడా సమర్థంగా తట్టుకుంటుంది.
"సుద్దలో ఎక్కువ భాగం కాల్షియం కార్బోనేట్ ఉంటుంది. ఇది కనిపించే కాంతితో సహా సూర్యకాంతిని చాలా తక్కువగా గ్రహిస్తుంది. అందుకే ఇది తెల్లగా కనిపిస్తుంది. అంతేకాకుండా అతినీలలోహిత కిరణాలను గ్రహించదు. సమీప ఇన్‌ఫ్రారెడ్ కాంతిని కూడా చాలా తక్కువగా గ్రహిస్తుంది. అందువల్ల సూర్యకాంతిని ప్రతిబింబించడంలో ఇది అద్భుతమైన ఆప్షన్" అని పర్డ్యూ యూనివర్సిటీలోని కూలింగ్ టెక్నాలజీస్ రీసెర్చ్ సెంటర్ పరిశోధకులు షియాంగ్యూ లీ తెలిపారు.
ఈ లక్షణం కారణంగానే కొందరు పరిశోధకులు కాల్షియం కార్బోనేట్ నానోకణాలను కొత్త తరహా సూపర్ కూల్ పెయింట్ల తయారీలో వినియోగిస్తున్నారు.
"ఇలాంటి కణాలను రేడియేటివ్ కూలింగ్ పెయింట్లలో విస్తృతంగా ఉపయోగిస్తున్నారు. మా సూపర్ కూల్ పెయింట్‌లో కూడా వీటినే వినియోగిస్తున్నాం" అని సిడ్నీలోని యూనివర్సిటీ ఆఫ్ న్యూ సౌత్ వేల్స్‌కు చెందిన విద్యార్థి జియాషువో వాంగ్ తెలిపారు. ఆయన కూడా కూలింగ్ పెయింట్‌పై పరిశోధనలు చేస్తున్న బృందంలో ఒకరు.
సుద్దను దుస్తులపై పూతగా కూడా ఉపయోగించారు. దీంతో వాటిని ధరించే వ్యక్తికి చల్లదనం లభిస్తుంది. సుద్దలోని ప్రధాన పదార్థమైన కాల్షియం కార్బోనేట్ కణాలు యూవీ కిరణాలు, సమీప ఇన్‌ఫ్రారెడ్ కాంతిని సమర్థంగా ప్రతిబింబింపజేస్తాయి.

ఫొటో సోర్స్, Getty Images
ఆరోగ్యం, పర్యావరణంపై ప్రభావం పరంగా కూడా సుద్దను తక్కువ ప్రమాదకరమైన పదార్థంగా భావిస్తారు. అయితే గదుల లోపల దీన్ని ఉపయోగించినప్పుడు దీని ధూళిని పీల్చడం వల్ల శ్వాసకోశ సంబంధిత ఇబ్బందులు తలెత్తే ప్రమాదం కొంత ఉండొచ్చు.
ఫ్రెంచ్ మీడియా కథనాల ప్రకారం 40 డిగ్రీల సెల్సియస్‌కు మించిన ఉష్ణోగ్రతలను ఎదుర్కొంటున్న ప్రజలు బ్లాంక్ డి మూడోన్‌ను పెద్దఎత్తున కొనుగోలు చేయడంతో దేశవ్యాప్తంగా నిల్వలు తగ్గిపోతున్నాయి.
సంప్రదాయంగా బ్లాంక్ డి మూడోన్‌ను దుకాణాల మరమ్మతుల సమయంలో షోకేస్ అద్దాలను తెల్లగా పూయడానికి లేదా గ్రీన్‌హౌస్‌లలోని గార్డెనర్లు ఉపయోగిస్తారు. అయితే కిటికీలకు సుద్ద పూత వేసే చిట్కా సామాజిక మాధ్యమాల్లో వైరల్ కావడంతో దీనికి డిమాండ్ ఒక్కసారిగా పెరిగిందని ఫ్రెంచ్ పత్రికలు పేర్కొన్నాయి.
"ఈ ఆలోచన గురించి మాకు ముందే తెలుసు. పోయినసారి వడగాలుల సమయంలో దీని గురించి మాట్లాడుకున్నాం. కానీ కొనడం మర్చిపోయాం. ఇప్పుడు ఆలస్యమైంది. ఎక్కడా దొరకడం లేదు" అని ఫిలిప్ అనే కస్టమర్ మాటలను ఊయెస్ట్ ఫ్రాన్స్ పత్రిక పేర్కొంది.
ఫ్రాన్స్‌లోని కొన్ని పాఠశాలలు కూడా తమ కిటికీలకు ఈ సుద్ద పూతను వేశాయి. అయితే ఇది ఒక అద్భుత పరిష్కారమేమీ కాదని, సరైన ఇన్సులేషన్ ఉన్న పైకప్పులు కూడా అవసరమని ఒక అధికారి హెచ్చరించారు.
కొంతమంది తమ అపార్ట్‌మెంట్ కిటికీలకు కూడా సుద్దతో చేసిన మిశ్రమాన్ని పూశారు.
"కిటికీలను తెల్లగా పూస్తే గదుల లోపలి ఉష్ణోగ్రత గణనీయంగా తగ్గుతుంది. గోడల మీద పూయడంకంటే ఇలా ప్రభావం ఎక్కువ ఉంటుంది" అని లీ చెప్పారు.
సుద్దతో పాటు సాధారణ తెల్లటి పెయింట్ కూడా చాలా చౌకగా లభిస్తుంది. ఎయిర్ కండిషనర్లతో పోలిస్తే ఇవి మరింత పర్యావరణహితమైనవి. ఎందుకంటే ఎయిర్ కండిషనర్లు విద్యుత్ వినియోగించి బయటకు వేడిని విడుదల చేయడం ద్వారా మొత్తం వేడి ప్రభావాన్ని, ఉద్గారాలను పెంచుతాయి. కానీ పెయింట్ తయారీ సమయంలో మాత్రమే శక్తి వినియోగం ఉంటుంది.
తెల్లటి పూత వేసిన కూల్ రూఫ్‌లు లేదా ఫ్రాన్స్‌లో లే కూల్ రూఫింగ్‌గా పిలిచే విధానం కూడా అక్కడ ప్రాచుర్యం పొందుతోంది. తీవ్రమైన వేడిని ఎదుర్కొనే సుస్థిరమైన, సాంకేతికతపై తక్కువగా ఆధారపడే మార్గంగా దీన్ని భావిస్తున్నారు. గ్రీస్ వంటి దక్షిణ ఐరోపా ప్రాంతాల్లో ఇళ్లను వేడి నుంచి రక్షించేందుకు తెల్లటి రంగు వేయడం చాలా కాలంగా కొనసాగుతున్న సంప్రదాయమే.
ఒక అధ్యయనం ప్రకారం తెల్లటి పెయింట్ లేదా పూత వేసిన కూల్ రూఫ్‌ల వల్ల వడగాలుల సమయంలో లండన్‌లో సగటున 0.8 డిగ్రీల సెల్సియస్ మేర ఉష్ణోగ్రత తగ్గి, వేడి కారణంగా సంభవించే సుమారు 249 మరణాలను నివారించే అవకాశం ఉంది.
ఇంకో చిట్కా గురించి తెలుసుకోవాలనుకునేవారికి మరో ప్రత్యామ్నాయం కూడా ఉంది. అదే యోగర్ట్. బ్రిటన్‌కు చెందిన పరిశోధకులు నిర్వహించిన ఒక ప్రయోగంలో యోగర్ట్‌ను కిటికీలకు పూసిన ఇంట్లో లోపలి ఉష్ణోగ్రత సగటున 0.6 డిగ్రీల సెల్సియస్ తక్కువగా ఉన్నట్లు గుర్తించారు. ఎండ తీవ్రంగా ఉన్న రోజుల్లో పలుచటి యోగర్ట్ పొర వల్ల గదుల ఉష్ణోగ్రత 3.5 డిగ్రీల సెల్సియస్ వరకు తగ్గచ్చని వారు తేల్చారు. మొదట్లో కొంత దుర్వాసన వచ్చినప్పటికీ యోగర్ట్ పూత ఎండిపోయిన తర్వాత ఆ వాసన త్వరగానే మాయమవుతుందని పరిశోధకులు పేర్కొన్నారు.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్, ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)






























