పదేళ్ల బాలుడికి 20 రకాల అలర్జీలు, వాటి చికిత్స కోసం 8వేల కిలోమీటర్ల ప్రయాణం

ఆరోగ్యం, వ్యాధులు, చిన్నారులు

ఫొటో సోర్స్, Katie Hutt

ఫొటో క్యాప్షన్, యాన్‌కు ఒకప్పుడు నట్స్ పడేవికావు, ఇప్పుడు రోజూ గుప్పెడు నట్స్ తినగలుగుతున్నాడు.
    • రచయిత, అంగహరాడ్ థామస్
    • హోదా, బీబీసీ వేల్స్
  • ప్రచురణ
  • చదివే సమయం: 7 నిమిషాలు

ఓ పదేళ్ల బాలుడు 20 రకాల సంక్లిష్టమైన అలర్జీలతో బాధపడుతున్నాడు. సీఫుడ్, కొబ్బరితో చేసిన పదార్థాలు, పిల్లులతో ఆడుకోవడంవంటివి అతనికి అలర్జీని కలిగిస్తాయి. తన జీవితాన్ని మార్చే వైద్యం కోసం అతను క్రమం తప్పకుండా అమెరికా వెళ్లాల్సి వస్తోంది.

ఈ అలర్జీల కారణంగా గతంలో యాన్ జెన్నింగ్ ఇంట్లో బాదం, జీడిపప్పు లాంటి డ్రైఫూట్స్ ‌కూడా ఉండనిచ్చేవారు కాదు. కానీ గడిచిన గడిచిన 18 నెలలుగా, ప్రతి 12 వారాలకోసారి దాదాపు 5,000 మైళ్ల (8,046 కిలోమీటర్ల) దూరం వెళ్లివస్తున్న యాన్ జెన్నింగ్స్ ఇప్పుడు చికిత్స కారణంగా ప్రతిరోజూ కొన్ని రకాల నట్స్ తినగలుగుతున్నాడు.

తన కుమారుడు యాన్‌కు సెకండరీ స్కూల్‌లో చేరే సమయానికి అలర్జీలు తగ్గిపోయే (రిమిషన్‌లోకి వెళ్లే) అవకాశం ఉంటుందని 46 ఏళ్ల కేటీ హట్ ఆశిస్తున్నారు. ఇందుకోసం అమెరికాలోని కాలిఫోర్నియాలో నిర్వహిస్తున్న అలర్జీ నిర్మూలన కార్యక్రమంలో యాన్ జెన్నింగ్‌ను చేర్పించారు. ఇందుకు వారికి ఏడాదికి సుమారు 30 వేల పౌండ్లు ఖర్చవుతోంది.

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్
ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

హైస్కూల్‌కు వెళ్లే సమయానికల్లా యాన్ ఈ అలెర్జీల నుంచి పూర్తిగా కోలుకుంటాడని అతని తల్లి, 46 ఏళ్ల కేటీ హట్ ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.

తన కుమారుడికున్న 'సంక్లిష్టమైన' అలర్జీలకు యూకేలోని ఎన్‌హెచ్‌ఎస్ (నేషనల్ హెల్త్ సర్వీస్) సహాయం చేయలేకపోయిందని ఆమె అన్నారు.

అయితే, 'తమకు అవసరమైన సేవలు, మద్దతు సకాలంలో పొందే హక్కు ప్రజలందరికీ ఉంది' అని వేల్స్ ప్రభుత్వం పేర్కొంది.

అమెరికాలో తన నాలుగేళ్ల చికిత్స ప్రణాళికను పూర్తి చేసే క్రమంలో యాన్ మొత్తంగా 18 నెలల పాటు పాఠశాలకు దూరం కావలసి వస్తుందని కేటీ చెప్పారు.

ఈ చికిత్స కోసం ఆ కుటుంబం ప్రతి మూడు నెలలకొకసారి దాదాపు ఒక వారం రోజుల పాటు అమెరికాలోనే ఉంటారు. ఆ సమయంలో బడికి వెళ్లలేకపోతున్న యాన్‌కు, అలాగే అతని ఎనిమిదేళ్ల సోదరి మాయ్‌కు తల్లిదండ్రులే స్వయంగా చదువు చెబుతారు.

ఇలాంటి చికిత్స యూకేలోని ప్రైవేట్ రంగంలో అందుబాటులో ఉందని కొందరు నిపుణులు భావిస్తున్నారు. కానీ, ఎన్‌హెచ్‌ఎస్ ద్వారా ఈ సేవలను మరింత మెరుగుపరచాల్సిన అవసరం ఉందన్న విషయాన్ని వారు అంగీకరిస్తున్నారు.

''ఫేస్‌బుక్‌లోని అలర్జీ గ్రూప్‌లలో చేరడం ద్వారా, అప్పటికే అనఫిలాక్సిస్ (తీవ్రమైన అలర్జీ రియాక్షన్లు) ఉన్న పిల్లల తల్లిదండ్రుల అనుభవాల నుంచి ఈ అలర్జీ సమస్యలు భవిష్యత్తులో ఎలా మారే అవకాశం ఉందో తెలుసుకోగలిగాను'' అని కేటీ చెప్పారు.

ఆరోగ్యం, వ్యాధులు, చిన్నారులు

ఫొటో సోర్స్, Katie Hutt

అలర్జీలు ఎందుకు వస్తున్నాయి?

యాన్ చిన్నతనంలో తీవ్రమైన తామర వ్యాధి బారిన పడ్డాడు. అతనికి ఆరు నెలల వయసు ఉన్నప్పుడు చేసిన రక్త పరీక్షల్లో... పాలు, వేరుశెనగలు (పల్లీలు), గుడ్ల వల్ల అతనికి అలర్జీ వస్తున్నట్లు తేలింది.

అయితే, 'కొన్ని రకాల పదార్థాలను తినిపించి పరీక్షించడం ద్వారా యాన్ కుటుంబం అతనికి ఉన్న మరిన్ని అలర్జీలను గుర్తించగలిగింది.

వాటిలో పాల ఉత్పత్తులు, గోధుమలు, ట్రీ నట్స్, కొబ్బరి, సీఫుడ్, రెడ్ ఫిష్, పప్పుధాన్యాలు, కివి పండ్లు, నువ్వులు, కుక్కలు, పిల్లులు, గుర్రాలు, పుప్పొడి, అవిసె గింజలు, చియా గింజలు, గసగసాలు, బక్‌వీట్ (రాగుల లాంటి ధాన్యం), సజ్జలు, బఠానీలు, చెస్ట్‌నట్, క్వినోవా, రై, ఓట్స్, గుమ్మడికాయ గింజలు వంటివి ఉన్నాయి.

యాన్‌కు అలర్జీ కలిగించే పదార్థాలు ఉన్న గదిలో అతడు ఉంటే, అతని శరీరంపై అలర్జీ లక్షణాలు ఎంత 'తీవ్రంగా బయటపడుతున్నాయో' కేటీ వివరించారు.

అందుకే అతను ఆరు బయట ఉండటానికే లేదా కిటికీలు ఎప్పుడూ తెరిచి ఉండే చోట ఉండటానికే ఎక్కువగా ఇష్టపడేవాడని ఆమె తెలిపారు.

చికిత్స విషయంలో మాత్రం "అతనికి మూడేళ్ల వయసు వచ్చేసరికి వేల్స్‌లో ఉన్న అన్ని మార్గాలనూ ప్రయత్నించాం. కానీ అతని పరిస్థితి చాలా సంక్లిష్టంగా ఉందని, ప్రమాద స్థాయి కూడా ఎక్కువగా ఉందని వైద్యులు చెప్పారు" అని కేటీ పేర్కొన్నారు.

ఆరోగ్యం, వ్యాధులు, చిన్నారులు

ఫొటో సోర్స్, Katie Hutt

ఫొటో క్యాప్షన్, ప్రతి 12 వారాలకు ఒకసారి చికిత్స కోసం కాలిఫోర్నియా వెళ్తున్న యాన్

అనాఫైలాక్సిస్ అంటే ఏమిటి?

అనఫిలాక్సిస్ అంటే ప్రాణాంతకమయ్యే అవకాశం ఉన్న ఒక తీవ్రమైన అలర్జీ రియాక్షన్ అని ఎన్‌హెచ్ఎస్ పేర్కొంది. ఇది అకస్మాత్తుగా, చాలా వేగంగా సంభవిస్తుంది. మన శరీరంలోని రోగనిరోధక వ్యవస్థ మనం తీసుకునే ఏదైనా ఆహారాన్ని లేదా పదార్థాన్ని పొరపాటున ఒక ప్రమాదకరమైన శత్రువుగా భావించినప్పుడు ఈ పరిస్థితి ఏర్పడుతుంది.

ఇది సాధారణంగా ఆహారం, మందులు లేదా కీటకాలు కుట్టడం వల్ల సంభవించవచ్చు.

దీని లక్షణాలు కేవలం కొన్ని సెకన్ల వ్యవధిలోనే బయటపడవచ్చు. వాటిలో ముఖ్యమైనవి:

  • గొంతు వాపు రావడం
  • పిల్లికూతలు
  • దగ్గు, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది వంటి లక్షణాలు కనిపించవచ్చు.

యూకే వ్యాప్తంగా ఉన్న గణాంకాల మేరకు ఇంగ్లండ్‌లో అలర్జీలు, అనాఫైలాక్సిస్ కారణంగా ఏటా 25,000 కంటే ఎక్కువ మంది ఆసుపత్రిలో చేరుతున్నారు. ఇది 20 ఏళ్ల క్రితంతో పోలిస్తే రెట్టింపు సంఖ్య. అలాగే వేల్స్‌లో ఈ సంఖ్య దాదాపు 1,000 వరకూ ఉంది.

యూకేలోని బడికి వెళ్లే వయసు రాని పిల్లల్లో 4 శాతం వరకు, అలాగే పెద్దవారిలో 2.4 శాతం మంది ఆహార అలర్జీలతో ఇబ్బందిపడుతున్నారని 'అనాఫైలాక్సిస్ యూకే' అనే స్వచ్ఛంద సంస్థ తెలిపింది.

తీవ్రమైన అలర్జీల వల్ల ఆసుపత్రిలో చేరే వారి సంఖ్య విపరీతంగా పెరిగినప్పటికీ, దీనివల్ల మరణాలు సంభవించడం అనేది చాలా అరుదు. కేవలం 0.001 శాతం కంటే తక్కువ కేసులలో మాత్రమే ప్రాణనష్టం జరుగుతోంది.

ఆరోగ్యం, వ్యాధులు, చిన్నారులు

ఫొటో సోర్స్, Katie Hutt

ఫొటో క్యాప్షన్, కేటీ, మాయ్, యాన్, నీల్...

ఇతరులకు సహాయం కోసం వెబ్‌సైట్...

కార్డిఫ్‌కు చెందిన వ్యాపారవేత్త కేటీ, ఆమె భర్త నీల్ జెన్నింగ్స్... యాన్‌కు మూడేళ్ల వయసున్నప్పుడు, వేరుశెనగ కారణంగా పసిపిల్లలలో వచ్చే అలర్జీ కోసం లండన్‌లో జరిగిన ఒక మెడికల్ ట్రయల్‌లో అతను పాల్గొనేలా దరఖాస్తు చేశారు. దానివల్ల అతని ఆరోగ్యం మెరుగైనప్పటికీ, ఆ ట్రయల్ ముగిసిపోయింది.

ఆ తర్వాత యాన్ 'ఓరల్ ఇమ్యునోథెరపీ' తీసుకోవడం ప్రారంభించాడు. కానీ, దీనివల్ల ఇతర సమస్యలు తలెత్తడంతో ఆ చికిత్సను నిలిపివేయడానికి వైద్యులు అంగీకరించారు.

2024 ఆగస్టులో, యాన్ కుటుంబం కాలిఫోర్నియాలో ఒక లాభాపేక్ష లేని క్లినిక్‌ను సందర్శించింది. అక్కడ ఆధునిక, వినూత్నమైన 'అలర్జీ నిర్మూలన కార్యక్రమాన్ని' నిర్వహిస్తున్నారు.

అక్కడ యాన్‌కు ప్రత్యేకంగా రూపొందించిన మొదటి చికిత్స ప్రణాళికను అందించారు. దీనిని పూర్తి చేయడానికి నాలుగు సంవత్సరాలు పడుతుంది. దీని ద్వారా అతను అలర్జీల నుంచి పూర్తిగా విముక్తి పొందుతాడని వారు ఆశిస్తున్నారు. ఇందులో భాగంగా అతనికి అలర్జీని కలిగించే పదార్థానికి దగ్గరి పోలిక ఉండే ఒక ప్రొటీన్‌ను చాలా తక్కువ పరిమాణంలో ఇస్తారు.

వైద్యులు ప్రతి 12 వారాలకు ఒకసారి ఈ మోతాదును మారుస్తుంటారు. ఆ పురోగతి అలాగే కొనసాగడానికి యాన్ ప్రతిరోజూ తక్కువ మొత్తంలో ఆ మోతాదును తీసుకుంటుంటాడు. కాలక్రమేణా అతనిలో ఆయా పదార్థాలను తట్టుకునే శక్తిని పెంచడమే ఈ చికిత్స ముఖ్య ఉద్దేశం.

''ఇది చాలా కష్టమైనది, సమయం, శ్రమపరంగా ఎంతో అంకితభావం కావాలి. కానీ గతంలో అతను చాలాసార్లు అలర్జీ షాక్‌కు గురికావడం చూసిన మాకు, ఇప్పుడు ఈ మార్పు కనిపించడం అద్భుతంగా ఉంది'' అని కేటీ చెప్పారు.

18 నెలల క్రితం ఈ చికిత్స ప్రారంభించినప్పటి నుంచి, అతని అలర్జీలు ఇకపై గాలి ద్వారా వ్యాపించేవి కావు అని ఆమె తెలిపారు. దీనివల్ల, యాన్ ఇప్పుడు పాఠశాలలో తన స్నేహితులకు దూరంగా ఒంటరిగా ఉండాల్సిన అవసరం లేకుండా పోయింది.

'ఇప్పుడు ఇతరులు వేరే పదార్థాలు తింటున్నప్పుడు కూడా యాన్ వారి పక్కనే కూర్చోగలుగుతున్నాడు. ఇప్పుడు ఎలాంటి సమస్యా రావడం లేదు' అని కేటీ అన్నారు.

యాన్ ఇప్పుడు జీవితాన్ని ఎంతో ఆనందంగా గడుపుతున్నాడు. అతను జియు-జిట్సు మార్షల్ ఆర్ట్స్‌లో గ్రే బెల్ట్ సాధించాడు. అలాగే అతనికి ఈత కొట్టడం, గోల్ఫ్ ఆడటం, సైక్లింగ్ అంటే చాలా ఇష్టం.

''అతను గతంలో ఎన్నడూ జీవించలేనంత స్వేచ్ఛగా, సంతోషంగా ఇప్పుడు జీవించగలుగుతున్నాడు'' అని కేటీ ఆనందం వ్యక్తం చేశారు.

కుటుంబసభ్యులైన కేటీ, మాయ్, నీల్... యాన్‌కు ఉన్న అలర్జీలతో ఎలా సర్దుకుపోవాలో నేర్చుకున్నారు. తమలాంటి ఇతర కుటుంబాలకు సహాయం చేయాలనే ఆలోచనతో వారు foodallergyfamilies.org అనే వెబ్‌సైట్‌ను ప్రారంభించారు.

ఆరోగ్యం, వ్యాధులు, చిన్నారులు

ఫొటో సోర్స్, Katie Hutt

ఫొటో క్యాప్షన్, ఒక ఆహార పరీక్షలో... చాక్లెట్‌లో కలిపి ఇచ్చిన ఓట్స్ పిండిని తింటున్న యాన్.

'ఆహార అలర్జీల నిర్వహణలో అద్భుత పురోగతి'

నేషనల్ అలర్జీ స్ట్రాటజీ గ్రూప్‌కు చెందిన ప్రొఫెసర్ ఆడమ్ ఫాక్స్ మాట్లాడుతూ... ఆహార అలర్జీల నిర్వహణ 'గడిచిన 10 నుంచి 20 ఏళ్లలో అద్భుతంగా పురోగతి చెందిందని చెప్పారు.

''కానీ, విచారకరమైన విషయం ఏమిటంటే, ఎన్‌హెచ్‌ఎస్ ద్వారా ఈ చికిత్సా మార్గాలు అందుబాటులో ఉండటం చాలా పరిమితంగా ఉంది. అందువల్ల యూకేలో చాలా తక్కువ మందికి మాత్రమే ఇవి అందుతాయి. అలా లభించినా కూడా, అవి సాధారణ వైద్య చికిత్సల ద్వారా కాకుండా క్లినికల్ ట్రయల్స్ రూపంలోనే ఎక్కువగా అందుతాయి'' అని ఆయన అన్నారు.

''అయినప్పటికీ, ఈ చికిత్సా మార్గాలన్నీ యూకేలోని ప్రైవేట్ రంగంలో పూర్తిగా అందుబాటులో ఉన్నాయి. ఇలాంటి చికిత్స యూకేలోనే ప్రైవేటుగా లభిస్తుందనే విషయం తెలియక, కొందరు అమెరికా వెళ్లడానికే మొగ్గు చూపిస్తున్నారు'' అని ఆడమ్ ఫాక్స్ వివరించారు.

యూకే, యూరప్, ఇతర ప్రాంతాల్లోని వందలాది మంది లాభాపేక్ష లేని అలర్జీ నిపుణుల కూటమి అయిన 'ఫుడ్ అలర్జీ సపోర్ట్ టీమ్' కో-ఫౌండర్ డాక్టర్ డౌగ్లస్ జోన్స్ మాట్లాడుతూ, ''అమెరికాలో చికిత్స విధానం కేవలం అలర్జీ కలిగించే పదార్థాలకు దూరంగా ఉండటమనే పద్ధతి కంటే చాలా పురోగతి సాధించింది'' అని చెప్పారు.

''నిరూపితమైన ఆధారాలతో కూడిన చికిత్సా మార్గాలలో ఇప్పుడు ఓరల్ ఇమ్యునోథెరపీ (ఓఐటీ), సబ్‌లింగ్యువల్ ఇమ్యునోథెరపీ (నాలుక కింద వేసే మందులు), ఒమాలిజుమాబ్ వంటి బయోలాజిక్ థెరపీలు ఉన్నాయి. అయినప్పటికీ, భౌగోళిక ప్రాంతం, నిపుణుల లభ్యత, ఆర్థిక వనరులపై ఆధారపడి ఈ చికిత్సలు అందరికీ అందుబాటులో ఉండటంలో ఇప్పటికీ చాలా వ్యత్యాసాలు ఉన్నాయి'' అని వివరించారు.

కొన్ని రకాల తీవ్రమైన అలర్జీలకు ఓఐటీ ఉపయోగపడుతుందని కేటీ చెప్పారు. అయితే అనేక రకాల ఆహార పదార్థాల వల్ల అనాఫైలాక్సిస్ వచ్చిన చరిత్ర ఉండి, దాంతో పాటు తీవ్రమైన ఉబ్బసం , ఎగ్జిమా వంటి సమస్యలు ఉన్న యాన్ లాంటి ఎక్కువ ప్రమాదం ఉన్న 'సంక్లిష్టమైన' పిల్లలకు ఈ చికిత్స తగినది కాదని ఆమె అన్నారు.

యూకేలో యాన్ కోసం మరే ఇతర 'ప్రత్యామ్నాయ చికిత్స' లేదని ఆమె భావిస్తున్నారు.

అమెరికాలో ఈ చికిత్సకు అయ్యే ఖర్చులలో ఎక్కువ భాగం ప్రయాణానికే అవుతోంది. ఇందుకోసం ఏటా అయ్యే 30,000 పౌండ్లు ఖర్చులో... 20,000 పౌండ్లు మొత్తాన్ని విరాళాల ద్వారా సమకూర్చుకోవాలని యాన్ కుటుంబం భావిస్తోంది.

అలర్జీలతో బాధపడుతున్న వారికి మెరుగైన సంరక్షణ అందించేందుకు తాము కట్టుబడి ఉన్నామని యూకే ప్రభుత్వం తెలిపింది. ఇందులో భాగంగానే, సెప్టెంబర్ నుంచి ఇంగ్లాండ్‌లోని పాఠశాలల్లో మొదటిసారిగా ప్రాణాలను రక్షించే 'అలర్జీ పెన్స్' తప్పనిసరిగా ఉంచాలని పేర్కొంది.

అలర్జీ సేవల ప్రణాళిక, వాటిని అందించే బాధ్యత స్థానిక ఆరోగ్య బోర్డులదేనని వేల్స్ ప్రభుత్వం పేర్కొంది.

అలాగే వేల్స్‌లో నివసించే ప్రజలందరికీ 'తమకు అవసరమైన సేవలు, మద్దతు సకాలంలో పొందే హక్కు ఉంది' అని తెలిపింది.

అలర్జీలు సహా ఇతర ఆరోగ్య సమస్యలు ఉన్న పిల్లలు, యువతకు మద్దతుగా... రికార్డుల నిర్వహణ, మందుల నిల్వ, వాటిని అందించే విధానం, అత్యవసర పరిస్థితులు, సిబ్బంది శిక్షణా అవసరాలపై అన్ని పాఠశాలలకు చట్టబద్ధమైన మార్గదర్శకాలను జారీ చేశారు.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,  ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)