You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
వెనెజ్వెలా భూకంపం: ‘‘18 రోజుల నా బిడ్డే నా ప్రాణాలు నిలిపాడు’’
- రచయిత, అలీస్ కుడీ, మహమద్ మడీ
- ప్రచురణ
- చదివే సమయం: 4 నిమిషాలు
వెనెజ్వెలాలో తన ఇంటి శిథిలాల కిందనుంచి ఓ తల్లిని ఆమె 18 రోజుల పసిబిడ్డతో కలిపి రక్షించారు. తన బిడ్డే తన ప్రాణాలు నిలబెట్టాడని ఆమె బీబీసీకి తెలిపారు.
తన కుమారుడు జువాన్ డేవిడే తనకు ‘మెలకువగా, అప్రమత్తంగా ఉండటానికి స్ఫూర్తి’ అని డయానా పాటినో పేర్కొన్నారు.
"వాడు బతికున్నంత వరకు నేనూ బతికుంటాననుకున్నా. వాడు శ్వాస తీసుకుంటున్నాడో లేదో తెలుసుకోవడానికి అప్పుడప్పుడు ముక్కును తాకేదాన్ని" అని ఆమె చెప్పారు.
ఈ తల్లీబిడ్డలను రక్షించడానికి సంబంధించిన ఫుటేజీ ప్రపంచవ్యాప్తంగా వైరల్ అయింది. జంట భూంకపాల కారణంగా 1,405 మంది చనిపోయి, శిథిలాల కుప్పగా మారిన వెనెజ్వెలాలో జువాన్ డేవిడ్ ఆశకు ప్రతిరూపంగా నిలుస్తున్నాడు.
వేలాదిమంది గల్లంతైన ఈ భూకంపాలను వెనెజ్వెలా చరిత్రలోనే అత్యంత భయంకరమైన ప్రకృతి విపత్తుగా తాత్కాలిక అధ్యక్షుడు అభివర్ణించారు.
గాలింపు చర్యలు కొనసాగుతున్నప్పటికీ శిథిలాల కింద ఇంకా బతికున్నవారు దొరికే అవకాశాలు క్రమంగా తగ్గుతున్నాయి.
శిథిలాల కింద చిక్కుకుపోయినప్పుడు తన కుమారుడిని హత్తుకుని తమను కాపాడమంటూ ప్రార్థిస్తూ గడిపిన భయనాక క్షణాలను డయానా వెనెజ్వెలా రాజధాని కారకస్‌లోని ఓ క్లినిక్‌లో ఆదివారం బీబీసీకి వివరించారు.
ఉత్తర తీర ప్రాంతమైన లా గ్వైరాలోని తమ ఎనిమిదో అంతస్తు అపార్ట్‌మెంట్‌లో ఆమె పాత్రలు శుభ్రం చేస్తుండగా భూకంపాలు సంభవించాయి. అది స్వల్ప ప్రకంపన మాత్రమేనని భావించిన ఆమె వెంటనే తన కుమారుడిని ఒడిలోకి తీసుకున్నారు.
"నేను గాల్లో ఎగురుతున్నట్లుగా అనిపించింది. ఆ తర్వాత నీళ్ళలో, మట్టిలో మునిగి పోతున్నట్లుగా అనిపించింది. అనంతరం గోతిలో పడిపోయాను. నేను గాల్లో ఎగురుతున్నప్పటికీ నా బిడ్డను ఎలా వదల్లేదో నాకు తెలియదు. ఫర్నిచర్ మధ్య నలిగిపోయాను" అని ఆమె చెప్పారు.
వెంటనే సాయం కోసం అరవడం మొదలుపెట్టాను. కానీ నా అరుపులు ఎవరూ వినలేరని త్వరగానే అర్థమైందని ఆమె చెప్పారు.
‘‘నా శక్తిని వృథా చేసుకోకూడదని నాకు నేనే చెప్పుకున్నా. సమీపంలో అడుగుల శబ్దం లేదా మనుషుల గొంతులు వినిపించినప్పుడే అరవాలనుకున్నా" అని ఆమె చెప్పారు.
‘‘నా ఎడమ కాలు ఓ కాంక్రీట్ కింద చిక్కుకుపోయింది. కదల్లేని పరిస్థితి. నా కణత ఓ రాయికి నొక్కుకుపోయింది. అయినా ప్రశాంతంగా ఎలా ఉండగలిగానో నాకే తెలియదు’’ అని చెప్పారు.
తన కింద బైబిల్ తగలడంతో తనలో ఆశ చిగురించిందని డయానా తెలిపారు.
"అప్పుడే ప్రాణాలు నిలుపుకోవాలనే నా పోరాటం ప్రారంభమైంది" శిథిలాల చీకటిలో చంద్రుడిలాంటి ఓ చిన్నకాంతిని చూడగలిగానని ఆమె చెప్పారు.
తన సోదరుడు తన పేరును పిలవడం వినిపించిన తర్వాతే రక్షణ బృందం ఆమెను చేరుకున్నట్లు ఆమె గుర్తు చేసుకున్నారు.
"ఇదే నాకు ఉన్న ఏకైక అవకాశం అనుకున్నాను. నా శక్తినంతా కూడగట్టి 'నేను ఇక్కడ ఉన్నాను' అని కేక వేశాను. అప్పుడు అతను 'నువ్వు కనపడ్డావు. నిన్ను బయటకు తీసే వరకు నేను వెళ్లను' అని చెప్పాడు" అని ఆమె అన్నారు.
ఆయన ఇచ్చిన మాట నిలబెట్టుకున్నారు. అనంతరం గురువారం రాత్రి తల్లి, శిశువును శిథిలాల నుంచి సురక్షితంగా బయటకు తీసే ప్రక్రియ మొదలైంది.
భూకంపం సంభవించినప్పుడు డయానా రెండు కాళ్లకు గాయాలయ్యాయి. జువాన్‌కు మాత్రం స్వల్ప గాయాలు అయ్యాయి.
డయానా భర్త గెర్సన్ అప్పుడే ఇంటికి చేరుకుని కారును పార్క్ చేస్తుండగా భూకంపాలు సంభవించాయి. ఆయన వెంటనే బయటకు పరిగెత్తి సురక్షితంగా బయటపడ్డారు.
తమ అపార్ట్‌మెంట్ భవనం కూలిపోయిన దృశ్యాన్ని చూసినప్పుడు భార్య, కుమారుడు మరణించి ఉంటారని భావించినట్లు ఆయన తెలిపారు.
తన భార్య, కుమారుడు ప్రాణాలతో బయటపడిన క్షణం అద్భుతమన్నారాయన.
విస్తృతంగా వైరల్ అయిన రెస్క్యూ వీడియోలో గెర్సన్ తన కుమారుడిని కౌగిలించుకుంటూ కన్నీటి పర్యంతానికి గురైన దృశ్యాలు కనిపిస్తున్నాయి.
"ఆ అనుభూతిని మాటల్లో చెప్పలేను. వారు చనిపోయారనుకున్నాను. నా కుమారుడిని చూసిన క్షణాన నేను మళ్లీ జన్మించినట్లు అనిపించింది. నమ్మలేకపోయాను. నాకు మళ్లీ ప్రాణం వచ్చినట్లైంది" అని ఆయన బీబీసీకి తెలిపారు.
గెర్సన్, డయానా దంపతుల ఇల్లు పూర్తిగా ధ్వంసమైంది. వారి ఆస్తి నాశనమైంది. వారి పెంపుడు కుక్క ఇప్పటికీ కనిపించకపోవడం వారిని కలచివేస్తోంది. అయినప్పటికీ ఇక నుంచి మళ్లీ జీవితాన్ని ప్రారంభిస్తామని వారు తెలిపారు.
"మేం దాదాపు అన్నీ కోల్పోయాం. అయినా మేమిక్కడే ఉన్నాం. మేం కోల్పోయిన ప్రతి దాన్ని మళ్లీ నిర్మించుకుంటాం" అని గెర్సన్ చెప్పారు.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్, ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)