You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
పగటి పూట అదేపనిగా ఆవులింతలు, కునికిపాట్లు ఎందుకు వస్తాయి? ఇది అనారోగ్యమా?
- రచయిత, ఓంకార్ కరంబేల్కర్
- హోదా, బీబీసీ ప్రతినిధి
- ప్రచురణ
- చదివే సమయం: 7 నిమిషాలు
ఉదయాన్నే నిద్రలేచినా రాత్రి అసలు నిద్రపోలేదని అనిపించడం.. ఆపై రోజులో ఎప్పుడు ఖాళీ సమయం దొరికినా పడుకుందాం అనిపించడం లేదా మీకు అవకాశం దొరికినప్పుడల్లా కళ్లు మూతలు పడటం.. ఇలాంటి పరిస్థితిని కొందరు ఎప్పుడో ఒకసారి ఎదుర్కొంటూ ఉండొచ్చు. కానీ, పగటిపూట నిద్రపోవడం అంత సులభం కాదు.
నిరంతరం కళ్ళు మూతలు పడినా, పని సమయంలో లేదా డ్రైవింగ్ చేస్తున్నప్పుడు మీరు నిద్రను ఆపుకోలేకపోయినా, దాని వెనుక తీవ్రమైన కారణాలు ఉండవచ్చు.
పగటిపూట ఎక్కువగా నిద్రపోవడం బద్దకానికి సంకేతం మాత్రమే కాదు.. శరీరంలో చాలా అనారోగ్య సమస్యలకు ఇదొక సంకేతం.
మారిన జీవనశైలి, ఎక్కువగా స్క్రీన్‌ను చూడటం, మానసిక ఒత్తిడి, చాలినంత నిద్ర లేకపోవడం, షిఫ్ట్‌లలో పనిచేయడం వంటి కారణాల వల్ల ఈ సమస్య విపరీతంగా పెరుగుతుంటుంది.
దీని కేవలం పనిపైనే కాదు.. మానసిక ఆరోగ్యం దెబ్బతినడం, దీర్ఘకాలిక వ్యాధుల ముప్పు పెరగడం వంటి ప్రమాదాలకు కూడా దారితీయచ్చు. చాలాసార్లు ప్రజలు వీటిని నిర్లక్ష్యం చేస్తుంటారు. లేదా 'నేను చాలా అలసిపోయాను' అని పక్కన పెడుతుంటారు. కానీ, నిరంతరం నిద్రరావడం ఒక 'ఆరోగ్య హెచ్చరిక సంకేతం' కావొచ్చు.
పగటి పూట ఎందుకు నిద్రమత్తుగా అనిపిస్తుంటుంది? ఈ నిద్ర సాధారణంగా అలసటకు సంకేతమా? లేదా నిద్రలేమికి ఒక లక్షణమా? దీనికి పరిష్కారం ఏంటి? ఈ ప్రశ్నలన్నింటికీ సమాధానం తెలుసుకోవడం అత్యంత ముఖ్యం.
పగటి నిద్రకు కారణాలేంటి?
పగలు నిద్రమత్తుగా అనిపించడం ఒక అంశానికే పరిమితం కాదు. అది అనేక శారీరక, మానసిక కారణాల కలయిక వల్ల జరగవచ్చు.
దీనికి అత్యంత సాధారణ కారణం ఏంటంటే.. రాత్రిపూట సరిగ్గా, మంచి నిద్ర లేకపోవడం. పొద్దుపోయేదాకా స్క్రీన్ చూడటం, నిద్రవేళలు సరిగ్గా లేకపోవడం లేదా రాత్రిపూట పదేపదే లేవడం వల్ల శరీర సహజ నిద్రా చక్రం దెబ్బతింటుంది.
అలాగే, 'స్లీప్ అప్నియా' వంటి నిద్ర రుగ్మతలు నిద్ర సమయంలో వ్యక్తి శ్వాస తీసుకునే సామర్థ్యాన్ని దెబ్బతీస్తాయి. దీని కారణంగా నిద్ర సరిగ్గా పోలేము. రోజంతా అలసటను అనుభవించవచ్చు.
మానసిక ఆరోగ్య సమస్యలు కూడా దీనికి ఒక కారణం. ఉదాహరణకు నిరాశ లేదా ఎక్కువగా ఒత్తిడి కూడా నిద్రపై తీవ్రమైన ప్రభావాన్ని చూపుతుంది. కొన్ని మందులు, ఆల్కహాల్, కెఫిన్ దుష్ప్రభావాలు కూడా నిద్ర సమతుల్యతకు భంగం కలిగిస్తాయి.
పైగా థైరాయిడ్, మధుమేహం లేదా ఊబకాయం వంటి జీవనశైలి సమస్యలు కూడా పగటిపూట నిద్రను పెంచుతాయి. అందువల్ల, ఈ సమస్య కేవలం అలవాట్లుగా కొట్టిపారేయకుండా.. దీని వెనుకాలనున్న కారణాన్ని తెలుసుకోవడం చాలా ముఖ్యం.
పగటి నిద్రకు, అలసటకు మధ్య తేడా ఏంటి?
కష్టపడి పనిచేయడం, ఎక్కువ శారీరక శ్రమ లేదా ఎక్కువ వ్యాయామం వల్ల వచ్చే అలసటకు, నిరంతరం నిద్ర వచ్చే స్థితికి మధ్య వ్యత్యాసం ఉందని అర్థం చేసుకోవాలి.
రోజువారీ పనుల వల్ల, రోజంతా శ్రమ కారణంగా రైతులు, కార్మికులు అలసిపోవడం సాధారణమే. ఇది విశ్రాంతి, మంచి ఆహారం, నిద్ర మనం తిరిగి సాధారణ స్థితికి రావడానికి సాయపడుతుంది.
పగటపూట ఎక్కువగా నిద్రపోవడం (ఎక్సెసెసివ్ డే టైమ్ స్లీపీనెస్ - ఈడీఎస్) అంటే.. పగటి సమయంలో మేల్కొని, అప్రమత్తంగా ఉండాల్సి వచ్చినప్పటికీ.. పదేపదే ఆపుకోలేనంత నిద్ర ముంచుకురావడం. ఇది సాధారణ అలసట కంటే భిన్నమైంది.
అలసట అంటే శారీరకంగా లేదా మానసికంగా అలసిపోయామనే భావనను కలిగిస్తుంది. అలసిపోయిన వ్యక్తికి ఎనర్జీ తక్కువగా ఉన్నట్లు అనిపిస్తుంది. కానీ, సాధారణంగా వారు మేల్కొని ఉండగలరు.
దీనికి విరుద్ధంగా, ఈడీఎస్ ఉన్న వ్యక్తికి ఏదైనా మీటింగ్‌లో ఉన్నప్పుడు, మాట్లాడుతున్నప్పుడు లేదా డ్రైవింగ్‌లో కూడా కళ్లు తెరిచి ఉంచడం కష్టంగా మారుతుంది.
రాత్రిపూట సరిగ్గా నిద్రపోకపోవడం దీర్ఘకాలం పాటు కొనసాగితే, అప్పుడు సమస్యలు తలెత్తుతాయి. నిద్రలేమి కారణంగా 'స్లీప్ డెట్' ఏర్పడుతుంది.
మెదడుకు తగినంత నిద్ర లభించకపోతే.. అప్రమత్తత, ఏకాగ్రత, జ్ఞాపకశక్తి, త్వరగా స్పందించే సామర్థ్యం తగ్గిపోతాయి. దీనివల్ల రోజంతా ఆపుకోలేనంత నిద్ర వస్తూనే ఉంటుంది.
పగటపూట అధిక నిద్రకు గల లక్షణాలు
- తరచూ ఆవలింతలు
- ఏకాగ్రత లోపించడం
- ఉదయం పూట తలనొప్పి
- చిరాకు, మతిమరుపు
- అనుకోకుండా నిద్రపోవడం
- రోజువారీ పనుల సమయంలో నిద్రపోవడం
ఈడీఎస్‌కు కారణమేంటి?
ఈడీఎస్ వల్ల నిర్ణయం తీసుకునే సామర్థ్యం తగ్గుతుంది. పని ఉత్పాదకత లోపిస్తుంది. తప్పులు పెరుగుతాయి. రోడ్డు ప్రమాదాల రిస్క్ బాగా పెరుగుతుంది.
తేలికపాట నిద్ర కూడా స్పందించే సామర్థ్యంపై ప్రభావం చూపుతుంది. ఇది కొంత ఆల్కహాల్ ప్రభావాలకు సమానం.
రాత్రిపూట మొబైల్ వాడకం, కంప్యూటర్ లేదా ఇతర స్క్రీన్ల వాడకం, అధిక ఒత్తిడి, కాఫీ,టీలు ఎక్కువగా తాగడం, నిద్ర వేళలు క్రమరహితంగా ఉండటం వంటివి శరీర జీవ గడియారంలో అంతరాయాలకు కారణమవుతాయి.
ఇది నిద్ర నాణ్యతను తగ్గిస్తుంది. పగటిపూట నిద్రను పెంచుతుంది. ఈ అలవాట్లు ఉంటే, పగటిపూట అధికంగా నిద్రపోయే అవకాశం ఉంది.
షిఫ్ట్‌లలో పనిచేసే కార్మికులు, హెల్త్‌కేర్ సిబ్బంది, డ్రైవర్లు, పైలట్లు, ఐటీ ఉద్యోగులు, విద్యార్థులు ఈ క్రమరహిత దినచర్యల కారణంగా ఎక్కువ ప్రమాదంలో ఉన్నారు.
అలాగే, వయసుతో పాటు నిద్రలో వచ్చే మార్పులు లేదా ఇతర వైద్య సమస్యల కారణంగా సీనియర్ సిటిజన్లలో కూడా ఈడీఎస్ వస్తుంటుంది.
డాక్టర్‌ను ఎప్పుడు కలవాలి?
పగటిపూట నిరంతర నిద్రఒక ఆరోగ్య సమస్య అని కేవలం వైద్యులు మాత్రమే నిర్ధరించగలరు. దీనికోసం మనం లక్షణాలపై దృష్టిపెట్టాలి.
దీనిపై ఎప్పుడు డాక్టర్‌ను కలవాలని డాక్టర్ అనిరుద్ధ మోరేను అడిగాం. ఈయన థానేలోని జూపిటర్ హాస్పిటల్ కన్సల్టెంట్ న్యూరాలజిస్ట్.
"తగినంత నిద్రపోయినప్పటికీ పగటిపూట నిరంతరం నిద్ర వస్తుంటే, దానివల్ల పనిపై లేదా రోజువారీ జీవితంపై ప్రభావం పడుతుంటే, లేదా అకస్మాత్తుగా కునుకుపాట్లు పడుతుంటే ... కచ్చితంగా వైద్య పరీక్షలు చేయించుకోవడం అవసరం. నిరంతరం వేధించే ఈడీఎస్ ఏదైనా నిద్ర రుగ్మతకు లేదా నరాలకు సంబంధించిన వ్యాధికి సంకేతం కావచ్చు" అని బీబీసీతో అన్నారు.
''ఆధునిక జీవనశైలి రోజురోజుకూ నిద్రకు మరింత అవరోధంగా మారుతోంది. పని గంటలు పెరుగుతున్నాయి, డిజిటల్ డివైజ్‌ల వాడకం పెరిగింది, ఒత్తిడి, షిఫ్ట్‌లలో పనిచేసే పద్ధతులు, ఊబకాయం కేసులు పెరగడం వంటివి నిద్రలేమితో చాలా దగ్గర సంబంధం ఉంటుంది. దీనివల్ల ఈడీఎస్ కేసులు పెరుగుతున్నాయి. చాలామంది ప్రజలు 'నేను చాలా బిజీగా ఉన్నాను' అనుకుంటూ ఈ సమస్యను నిర్లక్ష్యం చేస్తుంటారు. కానీ, నిజానికి అది ఏదైనా నిద్ర రుగ్మత లక్షణం కావచ్చు, దీనిపై సరైన సమయంలో దృష్టి పెట్టడం ఎంతో అవసరం'' అని డాక్టర్ అనిరుద్ధ మోరే చెప్పారు.
మంచి నిద్ర ఎందుకు?
మనుషులు జీవశాస్త్రపరంగా పగటిపూట చురుకుగా ఉండేలా, శరీరం సేదతీరేందుకు రాత్రివేళల్లో నిద్రపోయేలా రూపాంతరం చెందారు. ఈ ప్రక్రియను ప్రధానంగా రెండు అంశాలు నియంత్రిస్తాయి.
ఒకటి అడెనోసైన్ అనే రసాయనం. పగటిపూట మెదడులో ఈ రసాయనం పేరుకుపోతుంది. ఎంత ఎక్కువ సేపు మేల్కొని ఉంటే, అంత ఎక్కువగా నిద్ర అవసరం పెరుగుతుంది.
ఇంక రెండోది.. సూర్యస్తమయం తర్వాత, సూర్యకాంతి తగ్గినప్పుడు, మెదడులోని పీనియల్ గ్రంథి మెలటోనిన్ అనే హార్మోన్ విడుదల చేయడాన్ని పెంచుతుంది.
ఈ హార్మోన్ శరీరాన్ని నిద్రకు సిద్ధం చేయడానికి సంకేతాలు ఇస్తుంది. దీనితో మేల్కొని ఉండే స్థితి నుండి నిద్రపోయే స్థితికి మారే ప్రక్రియ ప్రారంభమవుతుంది.
నిద్ర ఎందుకు అవసరం అనే విషయాన్ని జస్లోక్ హాస్పిటల్ అండ్ రీసెర్చ్ సెంటర్‌కు చెందిన న్యూరాలజీ డిపార్ట్‌మెంట్ డైరెక్టర్‌గా ఉన్న డాక్టర్ జాయ్ దేశాయ్‌ను అడిగాం.
''నిద్ర ద్వారా శరీరం సరైన రీతిలో సేదతీరి, కొన్ని ప్రాథమిక నిబంధనలు నెరవేరడం అవసరం. దీనికి ప్రతిరోజూ ఏడు నుంచి ఎనిమిది గంటలు నిద్రపోవాలి. సూర్యస్తమయం అయిన నాలుగు గంటల్లోనే నిద్రపోవాలి. స్లీప్ అప్నియా లేదా రెస్ట్‌లెస్ లెగ్స్ సిండ్రోమ్ (ఆర్ఎల్ఎస్) వంటి నిద్ర రుగ్మతలు లేకుండా ఉండటం మంచిది. సరిగ్గా నిద్ర పోయిన వ్యక్తి పగటిపూట పదహారు గంటల పాటు మేల్కొని, అప్రమత్తంగా ఉంటూ బయట ప్రపంచంతో చురుకుగా మెలగగలడు'' అని డాక్టర్ దేశాయ్ చెప్పారు.
"నిద్ర రక్తపోటును (బీపీ) నియంత్రించడానికి, రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడానికి, కొవ్వు నిల్వను సమతుల్యంగా ఉంచడానికి, జ్ఞాపకశక్తిని మెరుగుపర్చడానికి, భావోద్వేగాలను స్థిరపరచడానికి, నిద్ర సమయంలో పనిచేసే గ్లింఫాటిక్ వ్యవస్థ ద్వారా మెదడులోని హానికరమైన ప్రోటీన్లను శుభ్రపరచడానికి సహాయపడుతుంది. అందువల్ల, నిద్ర రుగ్మతలు ఉన్నవారు, రోజంతా నిద్రమత్తులో ఉండే వారికి అధిక రక్తపోటు, మధుమేహం, అలాగే స్ట్రోక్, గుండెపోటు వంటి జీవనశైలి వ్యాధులు వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉంది'' అని తెలిపారు.
మంచి నిద్ర కోసం ఏం చేయాలి?
- రాత్రిపూట ఒకే సమయానికి పడుకుని, పొద్దునే ఒకే సమయానికి నిద్రలేచేలా సమయాన్ని నిర్ణయించుకోవాలి.
- ఉదయం పూట వ్యాయామాలు చేయాలి.
- మేల్కొన్న తర్వాత కొన్ని నిమిషాలు ఎండలో ఉండటం వల్ల, స్లీప్ సైకిల్‌కు ప్రయోజనకరంగా ఉంటుంది.
- కెఫిన్ ఉన్న పదార్థాల సేవనం తగ్గించాలి. మధ్యాహ్నం 3 గంటల తర్వాత ఆల్కాహాల్ ఆపేయాలి.
- పడుకునే ముందు గోరువెచ్చని నీటితో స్నానం చేయడం వల్ల నిద్రపోవడానికి సహాయపడుతుంది.
- సూర్యాస్తమయం అయిన ఒక గంటలోపు రాత్రి భోజనం పూర్తి చేయడం, నిద్రను ప్రేరేపిస్తుంది.
- పడుకునే ముందు ప్రశాంతంగా ఉండటానికి సరైన దినచర్యను సృష్టించుకోవాలి.
- స్క్రీన్ ఆఫ్ చేయడం, గదిలో కాంతిని తగ్గించడం, గది ఉష్ణోగ్రతను తక్కువగా ఉంచడం ఇవన్నీ ప్రయోజనకరంగా ఉంటాయి.
(గమనిక: మీ శరీర లక్షణాలను బట్టి వైద్యునికి చూపించుకోవాలి. వారిని సంప్రదించిన తర్వాతనే జీవనశైలిలో మార్పులు చేసుకోవడం మంచిది. ఆరోగ్యపరమైన ఏ నిర్ణయమైనా డాక్టర్‌ను సంప్రదించి మాత్రమే తీసుకోగలరు. వైద్యుడిని సంప్రదించకుండా స్వీయ చికిత్స ప్రమాదకరం)
( బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్, ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)