ఆరోగ్యం: 40 ఏళ్లు పైబడిన పురుషులు తప్పనిసరిగా చేయించుకోవాల్సిన వైద్య పరీక్షలు ఏంటి?

    • రచయిత, ఓంకార్ కరంబేల్కర్
    • హోదా, బీబీసీ ప్రతినిధి
  • ప్రచురణ
  • చదివే సమయం: 8 నిమిషాలు

జై పరేఖ్ ముంబయికి చెందిన 45 ఏళ్ల హెల్త్ కేర్ ప్రొఫెషనల్. క్రమం తప్పకుండా ఆరోగ్య పరీక్షలు చేయించుకోవడం, ముందుగా వ్యాధులను గుర్తించడం, ముందస్తు ఆరోగ్య సంరక్షణ ప్రాముఖ్యత గురించి ఆయన రోగులకు సలహా ఇస్తున్నారు.

అయితే, ఆయన తన ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేసుకున్నారు. పని ఒత్తిడి, ప్రయాణం, కుటుంబ బాధ్యతల కారణంగా ఆయన తన వైద్య పరీక్షలను వాయిదా వేస్తూ వచ్చారు. పైగా, ఆయనకు తనలో ఎలాంటి అనారోగ్య లక్షణాలు కనిపించలేదు. ఛాతీ నొప్పి, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, అలసట వంటివి ఏమీ లేవు.

ఆయన పరిస్థితి ఒక అనుకోని రూపంలో, ప్రమాదవశాత్తు వెలుగులోకి వచ్చింది. రక్త నమూనాల సేకరణపై శిక్షణా సెషన్‌లో ఆయన పాల్గొన్నారు. పరీక్షల కోసం తన బ్లడ్ శాంపిల్స్‌ను ఇచ్చారాయన.

తన హెచ్‌బీఏ1సీ పరీక్షలో షుగర్ లెవల్ 8.8గా ఉన్నట్లు తెలిసింది. ఈ స్థాయి అనియంత్రిత మధుమేహాన్ని సూచిస్తుంది.

ఆ తర్వాత.. ఆయన వివిధ రకాల వైద్య పరీక్షలు చేయించుకున్నారు. రక్తంలో కొలెస్ట్రాల్, ట్రైగ్లిజరైడ్ స్థాయిలు చాలా ఎక్కువగా ఉన్నాయి. సీటీ స్కాన్‌లో తన గుండె రక్తనాళాల్లో ఎక్కువ మొత్తంలో బ్లాకేజీలు ఉన్నట్లు తెలిసింది. యాంజియోగ్రఫీ పరీక్షలో కూడా రెండు పెద్ద బ్లాకేజీలు ఉన్నాయని, ఒక్కోటి 90 శాతం తీవ్రతతో ఉన్నట్లు వెల్లడైంది.

తక్షణ ఉపశమనం కోసం యాంజియోప్లాస్టీ చేయించుకున్నారు. అయితే, ఇక్కడ ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే.. ఇంత పెద్ద సీరియస్ సమస్య ఎలాంటి లక్షణాలు లేకుండా అభివృద్ధి చెందుతూ వచ్చింది. ఈ కేసులో ఇదే అత్యంత కీలకం.

శరీరం లోపల చాలా రకాల వ్యాధులు ఎలాంటి వార్నింగ్ సిగ్నల్స్ లేకుండానే అభివృద్ధి చెందుతున్నాయి.

40 ఏళ్లు పైబడిన వారు ముఖ్యంగా ప్రమాదం ఎక్కువగా ఉన్న వారు క్రమం తప్పకుండా చెకప్‌లు చేయించుకోవడం అవసరమని జై పరేఖ్‌ ఉదాహరణ చెబుతుంది.

ముందస్తుగా ఎలాంటి లక్షణాలు లేకుండానే కొన్నిసార్లు అతిపెద్ద అనారోగ్య సమస్యలు బయటపడుతున్నాయి.

జై పరేఖ్‌కు ఎలాంటి లక్షణాలు లేకుండానే వైద్య పరీక్షల్లో వ్యాధి నిర్ధరణ అయింది.. బీబీసీతో మాట్లాడిన ఒక వైద్య కేంద్రానికి చెందిన డాక్టర్ పల్లవి నగారే దీనిపై మరింత సమాచారం ఇచ్చారు.

''జై పరేఖ్ సిటి కరోనరీ యాంజియోగ్రఫీ పరీక్ష కోసం వచ్చినప్పుడు ఆయన కాల్షియం స్థాయి 571.8గా ఉన్నట్లు తేలింది. ఇది చాలా ప్రమాదకరం. ఆ తరువాత, గుండెకు దగ్గర్లో 'లెఫ్ట్ యాంటిరియర్ ఆర్టరీ' (ఎడమ వైపు ప్రధాన రక్తనాళం)లో 80 నుండి 90 శాతం వరకు బ్లాకేజ్ ఉన్నట్లు తెలిసింది. అది కూడా అత్యంత ముఖ్యమైన స్థలంలో.. అంటే ఆ రక్తనాళం ప్రారంభమయ్యే చోటే ఉంది'' అని డాక్టర్ పల్లవి చెప్పారు.

అదేవిధంగా ఓఎం2 ఆర్టరీలో ఎక్కువగా బ్లాకేజీ ఉన్నట్లు కూడా తేలింది. 44 ఏళ్లు ఉన్న వ్యక్తికి ఇంత తీవ్రమైన అనారోగ్య పరిస్థితి ఉన్నట్లు తెలియడం షాకింగ్‌గా అనిపించింది.

''జీవనశైలి, ఆహారంపై అవగాహన, వ్యాయామం చాలా కీలకం. డబ్బు సంపాదించుకోవడానికి మనం ఎంతైతే కృషి చేస్తామో.. బయట ఆహారం తీసుకోకపోవడం, క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం, బరువును నియంత్రణలో ఉంచుకోవడం వంటివాటికి అంతే ప్రాధాన్యతను ఇవ్వాలి'' అని డాక్టర్ పల్లవి సూచించారు.

40 ఏళ్ల వయసుకు చేరుకోవడం అంటే.. కేవలం సంఖ్య మారడమే కాదు. అదే చాలా ముఖ్యమైన మలుపు. అప్పటి వరకు ఒక వ్యక్తి తీసుకున్న ఆహారం, వ్యాయామం, జీవనశైలి అలవాట్ల మొత్తం ప్రభావం ఆయన శరీరంలో బయటపడటం ప్రారంభమయ్యేది అప్పుడే.

ఈ సమయంలో అధిక రక్తపోటు, మధుమేహం, ఎక్కువ కొలెస్ట్రాల్ లేదా గుండెకు సంబంధించిన వ్యాధులు బయటపడటం ప్రారంభమవుతాయి. ఒకప్పుడు యాభై లేదా అరవై ఏళ్లు పైబడిన వారిలో మాత్రమే కనిపించే ఇటువంటి కేసులు గత రెండు దశాబ్దాలుగా ముప్పై, నలభై మధ్య వయస్కుల్లో కూడా పెరుగుతున్నాయి. ఈ కాలంలో పరీక్షలు చేయించుకుంటే రాబోయే అనేక ప్రమాదాలను నివారించుకోవచ్చు.

''నేను చాలా ఆరోగ్యకరంగా ఉన్నాను. చూడానికి చాలా ఫిట్‌గా ఉన్నాను'' అని చాలామంది పురుషులు చెబుతుంటారు. కానీ, శారీరకంగా పరీక్షలు చేయించుకున్నప్పుడు మాత్రమే ఈ మాటలు నిజమా కాదా అన్నది తెలుస్తుంది.

సకాలంలో పరీక్షలు చేయించుకోవడం ముందుగా వ్యాధిని నిర్ధరించడానికి, తగ్గించుకోవడానికి సాయపడుతుందని చాలామంది నిపుణులు చెప్పారు. క్రమం తప్పకుండా వైద్య పరీక్షలు చేయించుకోవడం వల్ల వ్యాధులను గుర్తించడమే కాకుండా.. నాణ్యమైన జీవనాన్ని మెరుగుపరుచుకునే అవకాశం దొరుకుతుందని తెలిపారు.

40 ఏళ్ల వయసు తర్వాత.. నిర్లక్ష్యం చేయకుండా క్రమం తప్పకుండా పురుషులు కొన్ని ముఖ్యమైన వైద్య పరీక్షలు చేయించుకోవడం చాలా ముఖ్యం.

పరీక్షలు ఎందుకు అవసరం?

40 ఏళ్లు నిండిన తర్వాత క్రమం తప్పకుండా కొన్ని పరీక్షలు చేయించుకోవాలని వైద్య నిపుణులు చెబుతున్నారు. రక్తపోటును పరీక్షించుకోవడం చాలా ముఖ్యమైనదిగా చెబుతున్నారు. అధిక రక్తపోటు తరచూ ప్రారంభ దశలో ఒక స్పష్టమైన హెచ్చరిక సంకేతంగా కనిపించదు.

అలాగే, మధుమేహ ప్రమాదాన్ని గుర్తించడానికి ఖాళీ కడుపుతో, ఏదైనా తిన్న తర్వాత రక్తంలో చక్కెర స్థాయిలను పరీక్షించుకోవడం చాలా ముఖ్యం.

కొలెస్ట్రాల్, ట్రైగ్లిజరైడ్ స్థాయిలను అర్థం చేసుకోవడానికి ఏడాదికి ఒకసారి 'లిపిడ్ ప్రొఫైల్' పరీక్ష చేయించుకోవడం చాలా ప్రయోజనకరం.

గుండె జబ్బుల ప్రమాదాన్ని తీసుకుంటే.. స్ట్రెస్ టెస్ట్, 2డీ ఎకోకార్డియోగ్రఫీ వంటి పరీక్షలు చాలా ఉపయోగపడతాయి. అంతేకాక, కిడ్నీల పనితీరును తెలుసుకునేందుకు 'సీరం క్రియేటినిన్' పరీక్ష, కాలేయం, ప్రొస్టేట్ గ్రంథికి అల్ట్రాసౌండ్ పరీక్ష చేయించుకోవడంతో ప్రారంభ మార్పులు వెంటనే బయటపడతాయి. 40 ఏళ్ల తర్వాత.. ప్రొస్టేట్ సంబంధిత సమస్యలను తెలుసుకునేందుకు పీఎస్ఏ పరీక్ష కూడా చాలా ముఖ్యమైనదిగా చూస్తారు.

నిపుణుల అభిప్రాయం ప్రకారం.. కేవలం శరీర బరువుపైనే కాకుండా.. శరీరంలో కొవ్వు పరిమాణంపై కూడా శ్రద్ధ వహించడం చాలా ఉపయోగకరం. ఎందుకంటే, అత్యధికంగా బెల్లీ ఫ్యాట్ ఉంటే.. అది మధుమేహానికి, గుండె జబ్బులకు, ఇతర వ్యాధులకు సంకేతం. అందువల్ల క్రమం తప్పకుండా చెకప్‌లు, సరైన జీవనశైలి మార్పులు అవసరమని వైద్యనిపుణులు సూచిస్తున్నారు.

ముంబయిలోని కోకిలాబెన్ ధీరూభాయ్ అంబానీ హాస్పిటల్ ఇంటర్నల్ మెడిసిన్ అండ్ అడ్మినిస్ట్రేటివ్ హెల్త్ చెకప్స్ విభాగం కన్సల్టెంట్ డాక్టర్‌గా పనిచేసే సందీప్ దోషి ఈ పరీక్షలపై మరింత సమాచారం ఇచ్చారు.

''ఆరోగ్యంగా ఉండటానికి, నిజంగా ఆరోగ్యంగా ఉండటానికి మధ్య చాలా వ్యత్యాసం ఉంది. 40 ఏళ్లు పైబడిన ప్రతి వ్యక్తి రక్తపోటు, రక్తంలో చక్కెర స్థాయిలు, లిపిడ్ ప్రొఫైల్, కిడ్నీలు ఎలా పనిచేస్తున్నాయన్న విషయాలను తెలుసుకునేందుకు పరీక్షలు చేయించుకోవాలి. యూరిక్ యాసిడ్, టెస్టోస్టెరాన్ పరీక్షించుకోవాలి. గుండె పనితీరు కోసం స్ట్రెస్ టెస్ట్, 2డీ ఎకోకార్డియోగ్రామ్ కూడా సిఫార్సు చేస్తాను. ప్రొస్టేట్, కిడ్నీలు, లివర్‌కు ఆల్ట్రాసౌండ్ చేయించుకోవడం వల్ల ఏదైనా వ్యాధులు ఉన్నాయో లేదో తెలుసుకోవడానికి సహాయపడుతుంది'' అని డాక్టర్ సందీప్ దోషి వివరించారు.

రక్తపోటు, రక్తంలో చక్కెర స్థాయిలు, కొలెస్ట్రాల్ వంటి వాటిని పరీక్షించుకునేందుకు ఎంత తరచుగా ఈ పరీక్షలు చేయించుకోవాలనే ప్రశ్నకు స్పందించిన డాక్టర్ దోషి, ''40 ఏళ్లు పైబడిన పురుషులు ప్రతి మూడు నెలలకు ఒకసారి తమ రక్తపోటును పరీక్షించుకోవాలి. రక్తంలో చక్కెర స్థాయిలను, లిపిడ్ ప్రొఫైల్‌ను ఏడాదికి ఒకసారి చేయించాలి. కొలెస్ట్రాల్, ట్రైగ్లిజరైడ్ స్థాయిలను తెలుసుకోవడం వల్ల జీవనశైలి మార్పులు చేసుకునేందుకు, గుండెకు రాబోయే ప్రమాదం నుంచి తప్పించుకునేందుకు సాయపడుతుంది'' అని తెలిపారు.

''ఈ పరీక్షలన్నింటితో పాటు, చేయించుకోవాల్సిన మరో ముఖ్యమైన పరీక్ష టెస్టోస్టెరాన్. నలభైలలో, టెస్టోస్టెరాన్ స్థాయిలను తగ్గే ప్రమాదం ఉంది. తీవ్రమైన అలసట, కండర ద్రవ్యరాశి కోల్పోవడం, లైంగిక ఉద్రేకం, ఆసక్తి తగ్గడం, అంగస్తంభన లోపం, శారీరక శక్తి తగ్గడం, మూడ్ స్వింగ్స్ వంటి సంకేతాలు ఉన్నప్పుడు టెస్టోస్టెరాన్ స్థాయిలను పరీక్షించుకోవాలి. ఒకవేళ ఊహించిన స్థాయి కంటే తక్కువగా ఉంటే.. దానికి చికిత్స చేయించుకోవాలి'' అని వైద్యులు సూచిస్తున్నారు.

చాలామంది బరువును మాత్రమే ఒక ప్రమాణంగా చూస్తారు. కానీ, మీ బరువు, మీ మొత్తం శరీరాన్ని అర్థం చేసుకోలేదు. పొత్తికడుపు చుట్టూ ఉన్న కొవ్వు, నడుము చుట్టుకొలతను చెక్ చేసుకోవడం ద్వారా మీ జీవక్రియ స్థితిని (మెటబాలిజాన్ని) తెలుసుకోవచ్చు.

బరువుతో పాటు ఈ శారీరక మార్పులు ఇన్సులిన్ రెసిస్టెన్స్, టైప్ 2 డయాబెటిస్, ఫ్యాటీ లివర్, కిడ్నీ వ్యాధులు, గుండె జబ్బులు, నరాల సంబంధిత రుగ్మతలతో దగ్గర సంబంధం కలిగి ఉంటాయి.

శరీర కొవ్వు స్థాయిలు ముఖ్యంగా పొత్తికడుపు చుట్టూ కొవ్వుపై (బానపొట్టపై) ఒక కన్నేసి ఉంచాలి. భవిష్యత్‌లో వచ్చే ఆరోగ్య సమస్యల ప్రమాదానికి చాలా ముఖ్యమైన సంకేతం ఇది. సరైన సమయంలో జీవనశైలిలో మార్పులు చేసుకునే అవకాశాన్ని ఇది అందిస్తుంది.

40 ఏళ్ల తర్వాత క్యాన్సర్ సంబంధిత పరీక్షలు చేయించుకోవడం వైద్యపరంగా చాలా ముఖ్యమని డాక్టర్ దోషి చెప్పారు. పీఎస్ఏ, సీఈఏ, సీఏ19-9, ఆల్ఫా-ఫెటోప్రొటీన్ వంటి రక్తపరీక్షలు ఎవరికి అదనపు పరీక్షలు అవసరమో గుర్తించడంలో సాయపడతాయి.

45 సంవత్సరాలు తర్వాత కొలనోస్కోపీ చాలా ముఖ్యమైన స్క్రీన్‌గా చెబుతారు. ఇది పెద్ద పేగులో పెద్ద పేగు క్యాన్సర్‌ను, పాలిప్స్‌ను ప్రారంభ దశలోనే తెలుసుకునేందుకు సాయపడుతుంది.

ఇలా గుర్తించినప్పుడు దానికి చికిత్స చేయడం తేలికవుతుంది. ధూమపానం చేసేవారు లేదా హై-రిస్క్ కేటగిరీలో ఉన్న వారు తమ ఊపిరితిత్తులకు 'హై-రిజొల్యూషన్ సీటీ స్కాన్' చేయించుకునేందుకు వైద్యుడిని సంప్రదించడం మంచిది.

ప్రొస్టేట్ క్యాన్సర్ ప్రమాదాన్ని దృష్టిలో ఉంచుకుని డాక్టర్ సౌరభ్ పాటిల్ ఒక ప్రత్యేక సలహా ఇస్తున్నారు. ములుండ్‌లోని ఫోర్టిస్ ఆస్పత్రిలో నెఫ్రాలజీ, కిడ్నీ ఆంకాలజీ డిపార్ట్‌మెంట్‌లో ఈయన సీనియర్ కన్సల్టెంట్‌గా పనిచేస్తున్నారు.

''ప్రొస్టేట్ సంబంధిత సమస్యలు సాధారణంగా 50-55 సంవత్సరాల వయస్సు తర్వాత కనిపించడం ప్రారంభిస్తాయి. ప్రొస్టేట్ క్యాన్సర్ తరచుగా 60-65 సంవత్సరాల వయస్సు తర్వాత మాత్రమే నిర్ధరణ అవుతుంది'' అని ఆయన వివరించారు.

తాను సిఫార్సు చేసే పరీక్షల్లో ప్రొస్టేట్-స్పెషిఫిక్ యాంటీజెన్ (పీఎస్ఏ), రక్తపరీక్షతో పాటు యూరాలజిస్ట్‌ను సంప్రదించి ఇతర పరీక్షలు చేయించుకోవడం అవసరమని డాక్టర్ సౌరభ్ తెలిపారు.

40 ఏళ్లకు ముందు మీరు పరీక్షలు చేయించుకోకపోతే ఏమవుతుంది?

ఒక వ్యక్తి 40 సంవత్సరాల తరువాత ముందస్తుగా ఆరోగ్య పరీక్షలు చేయించుకోవాల్సిన అవసరం ఎక్కువగా ఉంటుంది. దీనికి ప్రధాన కారణం.. శారీరక శ్రమలేని జీవనశైలి వల్ల కలిగే వ్యాధుల ప్రమాదం పెరగడమే.

మధుమేహం, అధిక కొలెస్ట్రాల్, గుండె జబ్బులు, ఊబకాయం, కొన్ని రకాల క్యాన్సర్ తరచుగా ఈ వయస్సులో అభివృద్ధి చెందుతాయి. అయితే, ప్రతీసారి వీటి స్పష్టమైన లక్షణాలు పైకి కనిపించవు.

ఈ వ్యాధులను ముందుగానే స్క్రీనింగ్ చేస్తే ప్రారంభ దశలోనే గుర్తించవచ్చు. ఆ సమయంలో, సమర్థవంతమైన నిర్వహణ, నియంత్రణ, పూర్తి రివర్సల్ లేదా చికిత్స సాధ్యమవుతుంది.

40 ఏళ్లు పైబడిన చాలామంది పురుషులు వృత్తిపరమైన, కుటుంబ బాధ్యతల కారణంగా ఈ సంకేతాలను సరిగ్గా పట్టించుకోరు.

వైద్య సాయం తీసుకునేసరికి అతిపెద్ద ప్రమాదాన్ని, నష్టాన్ని కలిగిస్తుంది. కుటుంబంలోని వైద్య పరంగా ఎవరికైనా ఈ వ్యాధులు ఉన్నాయో లేదో సంబంధం లేకుండా.. లేదా శరీర సంకేతాలతో సంబంధాలు లేకుండా.. 40 ఏళ్ల వయసులో ప్రాథమిక ఆరోగ్య పరీక్షలు చేయించుకోవాలని వైద్యులు సిఫార్సు చేస్తున్నారు.

''ప్రాధాన్యత ఆధారంగా ప్రాథమిక ఆరోగ్య పరీక్షలు చేయించుకోవడంపై దృష్టిపెట్టాలి. దీనిలో రక్తంలో చక్కెర స్థాయిలు, లిపిడ్ ప్రొఫైల్, రక్తపోటు పరీక్షలు, కిడ్నీ, లివర్ ఫంక్షన్‌ను గుర్తించే పరీక్షలు, సాధారణంగా మూత్ర పరీక్షలు చేయించుకోవాలి'' అని డాక్టర్ సౌరభ్ పాటిల్ సూచించారు.

నలభై ఏళ్ల తర్వాత కంటి ఆరోగ్యాన్ని ఎలా కాపాడుకోవాలి?

40 ఏళ్ల వయసులో ఎటువంటి లక్షణాలు లేనప్పటికీ, కంటి చూపు బాగానే ఉన్నట్లు కనిపించినప్పటికీ, ఈ వయసులో 'బేస్‌లైన్' అని పిలిచే కంటి పరీక్ష అవసరమని అమెరికన్ ఆప్తాల్మాలజీ అసోసియేషన్ చెబుతోంది. గ్లాకోమా, కంటిశుక్లాలు, మక్యూలర్ డీజెనరేషన్ (కంటిచూపు మసకబారడం), రెటినల్ డీజెనరేషన్ (రెటీనా క్షీణత) వంటి వాటి ప్రారంభ లక్షణాలు ఈ సమయంలోనే కనిపిస్తాయి. ఈ వ్యాధులు తరచూ ఎటువంటి లక్షణాలను చూపించకుండానే తీవ్రమవుతాయి.

డాక్టర్ హిమాన్షు శేఖర్ ఏఎస్‌జీఐ హాస్పిటల్ గ్రూప్ చీఫ్ స్ట్రాటజీ, క్లినికల్ ఆఫీసర్. కంటి పరీక్ష ఒక వ్యక్తి వయస్సు, వారికుండే ప్రమాద కారకాలపై ఆధారపడి ఉంటుందని చెప్పారు.

వయసు గ్రూప్ ఆధారంగా డాక్టర్ హిమాన్షు సూచిస్తున్న పరీక్షల కాలవ్యవధి..

వయసు 40-54 సంవత్సరాలు, ఎలాంటి ప్రమాదం లేనప్పుడు: ప్రతి 2-4 సంవత్సరాలకు ఒకసారి పరీక్షలు చేయించుకోవాలి

వయసు 55-64 సంవత్సరాలు: ప్రతి 1-3 సంవత్సరాలకు ఒకసారి

వయసు 65, అంతకంటే ఎక్కువ: 1-2 సంవత్సరాలకు ఒకసారి

హై రిస్క్ కేటగిరీలో ఉన్న పురుషులు: ప్రతి సంవత్సరం లేదా 1-2 సంవత్సరాలకు ఒకసారి

(హైరిస్క్ ఉన్న రోగులలో మధుమేహం, అధిక రక్తపోటు, కుటుంబంలో ఎవరికైనా గ్లూకోమా లేదా ఏఎండీ ఉన్న వారు)

నలభై ఏళ్లు పైబడిన పురుషులు జీవనశైలి మార్పులపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని డాక్టర్ హిమాన్షు శేఖర్ సూచించారు. రక్తపోటును 130/80 కంటే తక్కువగా ఉంచుకోవాలని, క్రమం తప్పకుండా వ్యాయామం చేయాలని, అతినీలలోహిత కిరణాల నుంచి రక్షణ కోసం కూలింగ్ గ్లాసును ఉపయోగించాలని, బరువును అదుపులో ఉంచుకోవాలని చెప్పారు.

(గమనిక: మీ శరీర లక్షణాలను బట్టి వైద్యునికి చూపించుకోవాలి. వారిని సంప్రదించిన తర్వాతనే జీవనశైలిలో మార్పులు చేసుకోవడం మంచిది. ఆరోగ్యపరమైన ఏ నిర్ణయమైనా డాక్టర్‌ను సంప్రదించి మాత్రమే తీసుకోగలరు. వైద్యుడిని సంప్రదించకుండా స్వీయ చికిత్స ప్రమాదకరం)

( బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,  ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)