You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
వెనెజ్వెలా: 920కి పెరిగిన మృతుల సంఖ్య, బిడ్డను రక్షించి తల్లి మృతి, శిథిలాల నుంచి బయటపడ్డ ముగ్గురు చిన్నారులు
- రచయిత, టామ్ మెక్‌ఆర్థర్
- హోదా, బీబీసీ ప్రతినిధి
- ప్రచురణ
- చదివే సమయం: 6 నిమిషాలు
వెనెజ్వెలాలో వెనువెంటనే రెండుసార్లు సంభవించిన భూకంపాల్లో 900మందికిపైగా చనిపోయారని, 3వేల 360 మంది గాయపడ్డారని ప్రభుత్వం తెలిపింది.
శిథిలాల్లో చిక్కుకుపోయినవారి కోసం సహాయకసిబ్బంది గాలిస్తుండగా, తమ వారి క్షేమ సమాచారం కోసం కుటుంబాలు ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నాయి.
గాయపడిన వారికి తాత్కాలిక వైద్యశిబిరాలలో చికిత్స అందిస్తున్నారు.
వెనెజ్వెలా రాజధాని కారకస్ సహా దేశంలోని ఉత్తరప్రాంతంలో ఒకదాని తరువాత ఒకటిగా వచ్చిన రెండు భారీ భూకంపాల కారణంగా పదులసంఖ్యలో భవనాలు దెబ్బతిన్నాయి.
వందల సంఖ్యలో అంతర్జాతీయ సహాయక సిబ్బంది వెనెజ్వెలాకు వచ్చారని, ఇంకా మరికొంతమంది మార్గమధ్యంలో ఉన్నారని ప్రభుత్వ సీనియర్ అధికారి ఒకరు చెప్పారు.
భూకంపాల తర్వాత 214 సార్లు ప్రకంపనలు
సెకన్ల వ్యవధిలో వెనెజ్వెలాను రెండు శక్తిమంతమైన భూకంపాలు వణికించాయి. రెండో భూకంపం ఈ శతాబ్దంలోనే వచ్చిన తీవ్రమైన భూకంపాల్లో ఒకటి. రిక్టర్ స్కేల్‌పై ఈ భూకంపం తీవ్రత 7.5గా నమోదయింది.
కారకస్‌కు ఉత్తరాన ఉన్న లా గువైరా భూకంపంతో బాగా దెబ్బతిందని అధికారులు చెప్పారు. దేశంలో రెండు ప్రధాన పోర్టుల్లో ఒకటి లా గువైరాలో ఉంది. దేశ ప్రధాన ఎయిర్‌పోర్ట్ మైక్వెటియాలోని సైమన్ బొలివర్ అంతర్జాతీయ విమానాశ్రయం ఇక్కడే ఉంది.
భూకంపాలవల్ల చాలామంది కనిపించకుండాపోయారు. సహాయక కార్యక్రమాలు కొనసాగేకొద్దీ మరణాల సంఖ్య పెరగవచ్చు.
ఓ షాపింగ్ సెంటర్ కూలిపోవడంతో అక్కడి శిథిలాల్లో 22,23 ఏళ్ల వయసున్న తన ఇద్దరు కుమార్తెలు చిక్కుకుపోయారని నటాచా డియాజ్ లా గువైరాలో బీబీసీతో చెప్పారు. తన ఇద్దరు కూతుళ్లు ఆ షాపింగ్ సెంటర్‌లో మానిక్యూరిస్టులుగా పనిచేస్తున్నారని తెలిపారు.
''వాళ్లు తమ స్నేహితులతో ఉన్నారు. వాళ్లను గుర్తిస్తే చాలు. వాళ్లు అక్కడ ఉన్నారని నాకు నమ్మకం, ఆశ ఉన్నాయి. వాళ్లు తిరిగి నా దగ్గరకు రావాలి. నాకున్నదంతా వాళ్లే'' అని నటాచా ఆవేదన వ్యక్తంచేశారు.
మరణాల సంఖ్య 920కి చేరుకుందని, కనీసం 172 మంది శిథిలాల కింద చిక్కుకుపోయి ఉంటారని భావిస్తున్నామని జాతీయ అసెంబ్లీ హెడ్, తాత్కాలిక అధ్యక్షురాలి సోదరుడు అయిన జార్జ్ రోడ్రిగ్జ్ ప్రభుత్వ టీవీతో చెప్పారు.
ఒక్క లా గువైరాలోనే 243మందిని రక్షించారని జార్జ్ రోడ్రిగ్జ్ తెలిపారు.
''పదులసంఖ్యలో ప్రజలు ప్రాణాలతో బయటపడ్డారు. వారి కుటుంబాలకు, వారి శ్రేయోభిలాషులకు ఇది ఎంతో ఆనందం కలిగించే విషయం'' అని తాత్కాలిక అధ్యక్షురాలు డెల్సీ రోడ్రిగ్జ్ టీవీ ప్రసంగంలో చెప్పారు.
తొలి రెండు భూకంపాల తర్వాత 214 కంపనాలొచ్చాయని ఆమె తెలిపారు.
అంతర్జాతీయ సమాజం మద్దతు
వందలాది భవనాలు కూలిపోయాయని, వాటిలో ఆస్పత్రులు, షాపింగ్ సెంటర్లు కూడా ఉన్నాయని, ఇతర మౌలికసదుపాయాల ప్రదేశాలు దాదాపు వెయ్యికి పైగా కూడా దెబ్బతిన్నాయని జార్జ్ రోడ్రిగ్జ్ తెలిపారు.
భూకంపం ప్రభావం లేని వైద్యకేంద్రాలపై ఒత్తిడి పెరిగిందని, విపత్తుకు ముందే ఇక్కడ రోగులకు చికిత్స చేయడం కష్టంగా ఉండేదని వైద్యులు బీబీబీతో చెప్పారు.
''మా ఆస్పత్రులన్నింటిలో అవసరమైన వైద్యసదుపాయాలు లేవు. మందులు లేవు. సాధారణ రోజుల్లోనే రోగులకు సరైన వైద్యం అందించడం మాకు కష్టంగా ఉండేది''అని డాక్టర్ పెడ్రో జేవియర్ ఫెర్నాండెజ్ చెప్పారు.
''ఈ విషాదంతో అత్యవసర పరస్థితి మరింత తీవ్రమైంది. ఇతర దేశాలతో పోలిస్తే ఈ పరిస్థితిని ఎదుర్కోవడం మాకు మరింత కష్టం'' అని ఆయన అన్నారు.
ధ్వంసమైన భవనాల శిథిలాల్లో చిక్కుకుపోయినవారిని సహాయకసిబ్బంది ఉత్త చేతులతో బయటకు లాగుతున్నారని రిపోర్టులొస్తున్నాయి. సమాచార సదుపాయాలకు అంతరాయం ఏర్పడడం, రోడ్లు ధ్వంసమవడం, వనరులు లేకపోవడంతో ప్రాథమిక అత్యవసర స్పందన కష్టతరంగా మారింది.
బ్రిటిష్ సహాయక సిబ్బంది, శునకాలు, డ్రోన్లను తీసుకుని యూకే మిలటరీ విమానం ఆక్స్‌ఫర్డ్‌షైర్‌లోని ఆర్ఏఎఫ్ బ్రిజ్ నార్టన్ నుంచి వెనెజ్వెలాకు బయలుదేరింది.
మెర్సీసైడ్ ఫైర్, రెస్క్యూ నేతృత్వోంలని 14 యూకే ఫైర్ సర్వీసుల స్పెషలిస్టులు ఈ విమానంలో ఉన్నారు.
అమెరికా, నెదర్లాండ్స్, మెక్సికో, స్విట్జర్లాండ్ వంటి ఇతర దేశాలు కూడా తమ సహాయక బృందాలను పంపాయి. యుద్ధనౌకలు, రవాణా విమానాలు మోహరించడంతోపాటు 150 మిలియన్ డాలర్ల సాయం అందిస్తామని అమెరికా ప్రకటించింది.
శిథిలాల తొలగింపు కార్యక్రమం ప్రారంభించేందుకు భారీ మెషినరీ వచ్చిందని లా గువైరా రాష్ట్రం కారాబల్లెడాలోని బీబీసీ రిపోర్టర్ చెప్పారు. భయంకరమైన విధ్వంసం జరిగిందని ఇప్పటికే సహాయకకార్యక్రమాల్లో పాల్గొంటున్న అంతర్జాతీయ సిబ్బంది అంటున్నారని నార్వే శరణార్ణుల కౌన్సిల్ సెక్రటరీ జనరల్ చెప్పారు.
దశాబ్దాలుగా పెట్టుబడులు లేకపోవడంతో మౌలికసదుపాయాలు బాగా దెబ్బతిన్నాయని, దీంతో అత్యవసర పరిస్థితిని ఎదుర్కోగల స్థితిలో వెనెజ్వెలా లేదని జాన్ ఏజ్‌లాండ్ బీబీసీతో చెప్పారు.
దశాబ్దకాలానికిపైగా వెనెజ్వెలా తీవ్రమైన ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. ఇది చమురు సుసంపన్నమైన దేశంలో ప్రజల జీవన ప్రమాణాలు దారుణంగా పడిపోవడానికి కారణమైంది.
ఈ విపత్తును ఎదుర్కొనేందుకు అంతర్జాతీయ స్పందన అవసరమని, వాటిని సమన్వయం చేసి తాము వెనెజ్వెలాకు చేరవేస్తామని ఐక్యరాజ్యసమితి మానవతాసాయం చీఫ్ టామ్ ఫ్లెచర్ చెప్పారు.
''తమకు సాయం వస్తోందని వెనెజ్వెలా ప్రజలు తెలుసుకోవాలనుకుంటున్నారు'' అని ఆయన చెప్పారు.
ముగ్గురు చిన్నారులను కాపాడారు
లా గువైరాలో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు చిన్నారులను శిథిలాలనుంచి రక్షించడం వెనెజ్వెలా ప్రజలకు సంతోషం కలిగించింది. దుమ్ముతో నిండిపోయిన శిథిలాల నుంచి వారిని రక్షించినట్టు ప్రభుత్వ టీవీలో ప్రసారమైన ఫుటేజ్‌లోకనిపించింది.
కాంక్రీట్ ముక్కల మధ్య నుంచి మొదటి బిడ్డ సజీవంగా బయటకు వస్తున్నప్పుడు ఓ వ్యక్తి ''ఇక్కడికి రా..ఇక్కడికి రా '' అని అంటున్నారు.
తర్వాత ఓ బాలిక బయటకు వచ్చింది. ఆ వ్యక్తి నీకు ఇంకా అక్కాచెల్లెళ్లు, అన్నాదమ్ములున్నారా ఆ పాపను అడగ్గా మేం ముగ్గురం అని ఆ చిన్నారి జవాబిచ్చింది.
కాసేపటికే మరింత కష్టమైన పరిస్థితుల మధ్య మూడో అమ్మాయి బయటికొచ్చింది. తలనుంచి కాళ్లదాకా దుమ్ముతో నిండిపోయి ఏడుస్తూ కనిపించింది.
కూతురిని రక్షిస్తూ వెనెజ్వెలా ఫుట్‌బాలర్ భార్య మృతి
తన కుమార్తెను రక్షిస్తూ వెనెజ్వెలా ఫుట్‌బాలర్ హెక్టర్ బెల్లో భార్య చనిపోయినట్టు ఆయన సోషల్ మీడియా, స్థానిక వార్తల ద్వారా తెలిసింది.
భూకంపాల సమయంలో తమ చిన్నారని తన ప్రియాతిప్రియమైన భార్య ఆండ్రియా కాపాడారని బెల్టో ఇన్‌స్టాలో రాశారాని వెనెజ్వెలా వార్తా సంస్థలు తెలిపాయి.
''నువ్వు తనను రక్షించిన కథను ఆమెకు చెపుతాను. మన కుమార్తె కోసం నువ్వు నీ జీవితాన్ని ఎలా పణంగా పెట్టావో, ఆమెను ఎన్నడూ వదిలిపెట్టని, చివరకు నీ చివరి శ్వాస తీసుకుంటున్న సమయంలో కూడా బిడ్డను వదలని ధైర్యవంతురాలివని చెబుతాను'' అని బెల్లె తన పోస్టులో రాశారు.
‘విపత్తును తట్టుకునే శక్తిసామర్థ్యాలు లేవు’
మృతుల్లో ఓ పోర్చుగీస్ వ్యక్తి, ఇదర్దు బ్రెజిల్ పౌరులున్నట్టు ఆయా దేశాల ప్రభుత్వాలు ధ్రువీకరించాయి. నలుగురు స్పానిష్ ప్రజలు కూడా మృతుల్లో ఉన్నారని, 106మంది జాడ తెలియడం లేదని విదేశాంగ శాఖ చెప్పినట్టు స్పానిష్ మీడియా తెలిపింది.
రెండు భూకంపాల ప్రభావం అనేక రాష్ట్రాలపై ఉందని వెనెజ్వెలా హోం మంత్రి డియోస్‌డాడో కాబెల్లో చెప్పారు. కారకస్‌లో ఇరుగుపొరుగు ప్రాంతాలైన పాలొస్ గ్రాండెస్, అల్టామిరా ప్రాంతాలు బాగా దెబ్బతిన్నాయని తెలిపారు.
లా గువైరా, అరగ్వా, కరాబొబొ, ఫాల్కన్ సహా ఉత్తర తీరప్రాంతాలు భూకంపాల తర్వాతి కంపనాలతో బాగా ప్రభావితమయ్యాయని ప్రభుత్వం తెలిపింది.
నష్టం చాలా పెద్దదని, ప్రజలు షాక్‌లో ఉన్నారని స్పెయిన్‌లో ప్రవాసంలో ఉన్న ప్రతిపక్ష నాయకుడు లియోపోల్డో లోపెజ్ బీబీసీతో చెప్పారు.
మౌలిక సదుపాయాలు కుప్పకూలాయని, ధ్వంసమైన ప్రాంతాల్లోని ప్రజలకు సరైన సమమంలో సహాయకకార్యక్రమాలు అందించే సామర్థ్యం ప్రభుత్వానికి లేదని, దురదృష్టవశాత్తూ ఈ రెండింటినీ ఒకే సమయంలో చూస్తున్నామని ఆయన వ్యాఖ్యానించారు.
ఇవి ఎలా ఉన్నా వెనెజ్వెలా పౌరసమాజం నుంచి అద్భుతమైన మద్దతు లభిస్తోందని ఆయన చెప్పారు.
వెనెజ్వెలాలో తీవ్ర అనిశ్చిత పరిస్థితులు నెలకొన్న సమయంలో ప్రకృతి విపత్తు సంభవించింది.
2013నుంచి దేశాన్ని పరిపాలిస్తున్న వామపక్షనేత నికోలస్ మదురోను కారకస్‌లో అమెరికా బలగాలు బంధించి తీసుకుపోయి ఆరు నెలలు కూడా గడవలేదు. డ్రగ్స్ అక్రమరవాణా ఆరోపణలపై ఆయన్ను న్యూయార్క్‌కు తరలించారు.
మదురో మిత్రురాలు, మాజీ ఉపాధ్యక్షురాలు డెల్సీ రోడ్రిగ్జ్ అప్పటినుంచి దేశాన్ని పరిపాలిస్తున్నారు. ట్రంప్ ప్రభుత్వం ప్రతిపక్షనాయకురాలు మరియా కొరినా మచాడోకు వెనెజ్వెలా బాధ్యతలు అప్పగిస్తుందని ప్రతిపక్షం మద్దతుదారులు భావించారు. అలా జరగకపోవడంతో వారు అసంతృప్తి చెందారు.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్, ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)