You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
యూరప్‌లో 36-39 డిగ్రీల ఉష్ణోగ్రతలకే అల్లాడిపోతున్న దేశాలు...ఆందోళనలు ఏంటి?
- రచయిత, అలైస్ డేవిస్, ఒలీవియా ఐర్లండ్
- హోదా, బీబీసీ ప్రతినిధులు
- ప్రచురణ
- చదివే సమయం: 3 నిమిషాలు
పశ్చిమ యూరప్‌ను వడగాలులు చుట్టేయడంతో యూరప్ దేశాల్లో ఉష్ణోగ్రతలు భరించలేనంతగా పెరిగాయి.
దీని వల్ల ఫ్రాన్స్ చరిత్రలోనే అత్యంత వేడి రోజు, బ్రిటన్‌లో జూన్‌లో రికార్డు స్థాయి పగటి ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. స్పెయిన్‌లోనూ 1950 తర్వాత అత్యధిక రోజువారీ సగటు ఉష్ణోగ్రత నమోదైంది.
తీవ్ర ఉష్ణోగ్రతలకు కోట్ల మంది ప్రజలు సతమతమవుతున్నారు. పారిస్‌లో ఉష్ణోగ్రతలు దాదాపు 41 డిగ్రీల సెల్సియస్‌కు చేరాయి. యూరప్ ఖండంలోని అనేక ప్రాంతాలలో రెడ్ హీట్ అలర్ట్‌లు జారీ అయ్యాయి.
ఫ్రాన్స్‌లోని అనేక ప్రాంతాల్లో రోజువారీ సగటు ఉష్ణోగ్రత 30 డిగ్రీల సెంటీగ్రేడ్ ఉన్నట్లు నేషనల్ టెంపరేచర్ ఇండికేటర్ తెలిపింది. 1947లో ఉష్ణోగ్రతల్ని నమోదు చేయడం ప్రారంభమైన తర్వాత ఫ్రాన్స్‌లో బుధవారం అత్యంత వేడి రోజుగా నమోదైంది.
ఫ్రాన్స్‌లో సగానికి పైగా ప్రాంతాల్లో రెడ్ అలర్ట్ అమల్లో ఉంది. దేశ పశ్చిమ ప్రాంతంలోని 10వేల గృహాలకు విద్యుత్ సరఫరా నిలిచిపోయింది.
ఫ్రాన్స్‌లో రికార్డ్ స్థాయి ఉష్ణోగ్రతలు
వాతావరణ మార్పుల వల్ల ప్రపంచవ్యాప్తంగా పగటి ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి. అయితే ప్రపంచ సగటు కంటే యూరప్ ఖండం రెండింతల వేగంతో అత్యంత వేగంగా వేడెక్కుతున్నట్లు కోపర్నికస్ క్లైమేట్ సర్వీస్ చెబుతోంది.
దీని వల్ల వేసవిలో వడగాలులు, నీటి సరఫరాపై ఒత్తిడి పెరుగుతున్నాయి. కార్చిచ్చులు తీవ్రమయ్యే అవకాశాలు ఎక్కువ అవుతున్నాయి
ఫ్రాన్స్ వ్యాప్తంగా ఉష్ణోగ్రతలు "అంతకు ముందు రోజుతో పోలిస్తే ఉష్ణోగ్రతలు స్థిరంగా ఉన్నాయి" అని మెటియో ఫ్రాన్స్ తెలిపింది.
పశ్చిమ ఫ్రాన్స్‌లోని చాలా ప్రాంతాల్లో గరిష్ఠ ఉష్ణోగ్రతలు 39 డిగ్రీల నుంచి 43 డిగ్రీల మధ్య నమోదయ్యాయి.
వేడి తీవ్రత కారణంగా పారిస్‌లో పర్యాటక ప్రాంతాలైన లూవ్రా మ్యూజియం, ఈఫిల్ టవర్ ప్రాంతాలను నిర్ణీత సమయాని కంటే ముందే మూసివేశారు.
లూవ్రా బిల్డింగ్ "వాతావరణ మార్పులకు అనుగుణంగా లేదు" అని మ్యూజియం ప్రతినిధి తెలిపారు.
ఫ్రాన్స్ వ్యాప్తంగా వడగాలుల నుంచి సేద దీరేందుకు నీటిలో దిగిన వారిలో కనీసం 40 మంది మునిగిపోయారు. వీరిలో గిరాండ్‌లోని బెగ్లెస్ బీచ్‌లో ప్రాణాలు పోగొట్టుకున్న 6ఏళ్ల బాలుడు కూడా ఉన్నారు.
తీవ్రమైన వేడి గాలుల వల్ల అడవుల్లో కార్చిచ్చు రగిలే అవకాశం ఉందని అధికారులు హెచ్చరించారు.
"మనం వేడి దేశంగా మారిపోయామని తెలుసుకునే ప్రక్రియలో ఉన్నాం" అని ఫ్రాన్స్ కార్మిక శాఖ మంత్రి జీన్-పియెర్ ఫరాండౌ అన్నారు. ప్రజలు దీనికి అలవాటు పడాల్సి ఉంటుందని ఆయన హెచ్చరించారు.
ఫ్రాన్స్‌లో శుక్రవారం నుంచి ఉష్ణోగ్రతలు క్రమంగా తగ్గుతాయని అంచనా వేస్తున్నారు.
యూరప్‌లోని అనేక ప్రాంతాల్లో రెడ్ అలర్ట్
బుధవారం వడగాలు పశ్చిమ యూరప్‌లోని ఇతర ప్రాంతాలకు విస్తరించాయి. బ్రిటన్‌లోని కొన్ని ప్రాంతాల్లో రెడ్ హీట్ అలర్ట్ పొడిగించారు.
బుధవారం మధ్యాహ్నం హాంప్‌షైర్‌లోని గోస్పోర్ట్‌లో పగటి ఉష్ణోగ్రతలు 36 డిగ్రీలకు చేరడంతో యూకేలో జూన్‌లో ఇది అత్యంత వేడి రోజుగా నమోదైంది.
స్పెయిన్‌లోనూ కొన్ని రోజులుగా తీవ్రమైన వేడి గాలులు వీస్తున్నాయి. జూన్ 23న 28.17 డిగ్రీల పగటి ఉష్ణోగ్రత నమోదైనట్లు అక్కడి వాతావరణ సంస్థ తెలిపింది. ఇది జూన్‌లో నమోదైన అత్యధిక ఉష్ణోగ్రత.
ఉత్తర స్పెయిన్‌లో కొన్ని ప్రాంతాలకు రెడ్ అలర్ట్‌లు కొనసాగుతున్నాయి. బాస్క్ కంట్రీలోని కొన్ని ప్రాంతాల్లో గరిష్ఠ ఉష్ణోగ్రత 42 డిగ్రీలకు చేరవచ్చని వాతావరణ అంచనా సంస్థ ఏమెట్ తెలిపింది.
ఇటలీలోనూ 16 ప్రాంతాల్లో రెడ్ అలర్ట్‌లు అమలులో ఉన్నాయి. వారాంతానికి జర్మనీ, నెదర్లాండ్స్, బెల్జియంలో ఉష్ణోగ్రతలు గరిష్ఠ స్థాయికి చేరుకుంటాయని అంచనా.
రాబోయే రోజుల్లో వడగాలులు తూర్పు ఐరోపాకు కూడా విస్తరించనున్నాయి. ఈవారం చివర్లో పోలండ్, క్రొయేషియా, హంగేరి సహా అనేక దేశాలకు ఉష్ణోగ్రతలకు సంబంధించిన హెచ్చరికలు జారీ చేశారు.
కొన్ని ప్రాంతాల్లో కరవు రావచ్చనే భయం పెరుగుతోంది. బ్రాండెన్‌బర్గ్, హెస్సే నార్త్ రైన్-వెస్ట్‌ఫాలియాలో నీటిని పొదుపుగా వాడాలని అధికారులు కోరినట్లు జర్మన్ వార్తా పత్రిక డై వెల్ట్ రిపోర్ట్ చేసింది.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్, ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)