You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
స్పెర్మ్ కౌంట్: వృషణాల మీద ఐస్ గడ్డలు పెట్టుకోవడం, రక్తదానం వంటివి ఫలితాలనిస్తాయా?
రోజూ నిద్రలేచిన వెంటనే సౌనా (వేడి గది -శరీరానికి చెమటలు పడతాయి)కు వెళ్తారు సైమన్. ఆ వేడి వల్ల శరీరంలోని విషపదార్థాలు చెమట రూపంలో బయటకు వెళ్తాయని, వీర్యకణాల పనితీరు మెరుగుపడుతుందని ఆయన నమ్మకం. కానీ ఆ వేడి నుంచి రక్షణ పొందేందుకు అదనపు జాగ్రత్తలు తీసుకుంటారు.
''నేను ఐస్ ప్యాక్ ఉపయోగిస్తాను. దాన్ని చిల్ నట్స్ అని పిలుస్తారు. వీర్యకణాల సంఖ్య ఎక్కువగా ఉండేందుకు దాన్ని నేను వృషణాలపై పెట్టుకుంటాను'' అని ఆయన బీబీసీతో చెప్పారు.
వీర్యకణాల సంఖ్య, నాణ్యత పెంచుకోడానికి ఆయన అనుసరించే అలవాట్లలో ఇవన్నీ భాగం. వీటివల్ల ఫలితం ఉంటుందని వైద్యపరంగా ఎలాంటి ఆధారాలు లేనప్పటికీ ఆయన వీటిని అనుసరిస్తున్నారు.
ఫ్లోరిడాలోని మయామీకి చెందిన ఈ 28 ఏళ్ల యువకుడు స్పెర్మ్ కౌంట్ కోసం ఇంకొన్ని జాగ్రత్తలు తీసుకుంటారు.
ప్రతిరోజూ సూర్యరశ్మి తగిలేలా చూసుకుంటారు. రోజూ వ్యాయాయం చేస్తారు. మైక్రోప్లాస్టిక్ ఫిల్టర్ నుంచి నీళ్లను తాగుతారు. విషపదార్థాల ప్రభావం పడకుండా కాటన్ బాక్సర్ షార్ట్‌లు వేసుకుంటారు.
స్పెర్మ్‌కౌంట్ తక్కువగా ఉండడం అనారోగ్యానికి సంకేతమా?
ఇప్పటికిప్పుడు పిల్లలను కనాలనే ఉద్దేశమేమీ సైమన్‌కు లేదు. ఆయనకు భాగస్వామి కూడా లేదు. అయితే వీర్యకణాల సంఖ్య తక్కువగా ఉంటే తన ఆరోగ్యంపై ఎలాంటి ప్రభావం పడుతుందన్నది ఆయన ఆందోళన.
‘‘సంతానోత్పత్తి సామర్థ్యం తక్కువగా ఉంటే ఎండోక్రైన్ పనితీరుపై, టెస్టోస్టిరాన్ లెవల్స్, ఇతర హార్మోన్లపై ప్రభావం పడుతుందనేది నాకున్న పెద్ద భయం'' అని ఆయన మాతో చెప్పారు. వీర్యకణాల సంఖ్యను ఎండోక్రైన్ ప్రభావితం చేసినప్పటికీ సంతానోత్పత్తి సామర్థ్యం తక్కువగా ఉండడం ఎండోక్రైన్ పనితీరుకుగానీ, టెస్టోస్టిరాన్ స్థాయిలకుగానీ నేరుగా ఆటంకం కలిగించదు.
వీర్యకణాల సంఖ్యను పెంచుకోవడంపై ఎంతో ఆసక్తి కనబరుస్తున్న వారిలో సైమన్ ఒకరు. ఇలా ఆసక్తి చూపుతున్నవారి సంఖ్య పెరుగుతోంది. మగవారి సంతానోత్పత్తి సామర్థ్యానికి సంబంధించిన #మేల్‌ఫెర్టిలిటీ, #సీమెన్‌ఎనాలసిస్, #స్పెర్మ్ హ్యాష్‌ట్యాగ్‌లు టిక్‌టాక్, ఇన్‌స్టాగ్రామ్‌లో వందల మిలియన్ల వ్యూస్ సాధిస్తున్నాయి. పురుషుల సంతానోత్పత్తి సామర్థ్యంపై చర్చించే అతిపెద్ద రెడిట్ గ్రూపు సభ్యుల సంఖ్య జనవరి నుంచి మూడురెట్లయింది.
‘మార్కెట్ సరుకుగా మారిన వంధ్యత్వం’
వీర్యపరీక్ష చేయించుకోవాలనుంటున్న మగవారి సంఖ్య, భవిష్యత్తులో తమ సంతానోత్పత్తి సామర్థ్యంపై ఆందోళన వ్యక్తంచేస్తున్నవారి సంఖ్య పెరుగుతోందని, ప్రపంచవ్యాప్తంగా పురుషుల సంతానోత్పత్తి నిపుణులు చెబుతున్నారు.
టెస్టోస్టిరాన్ రీప్లేస్‌మెంట్ థెరపీలు(టీఆర్‌టీ), స్టెరాయిడ్ల వాడకం పెరగడం, పర్యావరణంలోని విషపదార్థాలు వంటివి సంతానోత్పత్తికి సంబంధించిన హర్మోన్లను దెబ్బతీయొచ్చని వారు ఆందోళన చెందుతున్నారు.
ఇలా దృష్టిపెట్టడం వల్ల మిశ్రమ లాభాలున్నాయని యూకేకు చెందిన ఫెర్టిలిటీ నిపుణులు ప్రొఫెసర్ సక్స్ మిన్హాస్ చెప్పారు. పురుషుల వంధ్యత్వంపై అవగాహన పెరగడం మంచిదే. కానీ మనం అనవసరంగా ఆందోళనను పెంచుతున్నామా?
ఈ ఆందోళనను సొమ్ము చేసుకునేందుకు ఇన్‌ఫ్లుయెన్సర్లు, ప్రోడక్టులు పుట్టుకొస్తున్నాయని, ఇదో పరిశ్రమలా మారిందని ప్రొఫెసర్ తెలిపారు.
చాలామందిలానే వెనెజ్వెలా-అమెరికాకు చెందిన సైమన్ సోషల్ మీడియా ద్వారానే దీని గురించి తెలుసుకున్నారు. కానీ ఆయన తన స్పెర్మ్‌ను టెస్ట్ చేయించుకోలేదు. తన ఆరోగ్యం గరించి ఆందోళన చెందడానికి ప్రత్యేక కారణాలు లేవు.
‘‘ఇది నాకు మామూలుగా భయం కలిగించే విషయం. అందుకే నా సంతానోత్పత్తి సామర్థ్యం దెబ్బ తినకూడదనుకుంటున్నా'' అని ఆయన చెప్పారు.
బ్రయాన్ జాన్సన్ రూపొంచించిన కంటెంట్ సంతానోత్పత్తి సామర్థ్యం గురించి సైమన్ జాగ్రత్తపడేలా చేసింది.
ప్రపంచవ్యాప్తంగా పురుషుల్లో వీర్యకణాల సంఖ్య బాగా తగ్గిపోతోంటే, సగటు స్పెర్మ్ కౌంట్ కన్నా తనకు నాలుగింతలు ఎక్కువ ఉందని సిలికాన్ వ్యాలీ మాజీ బిలియనీర్ అయిన బ్రయాన్ జాన్సన్ చెబుతుంటారు.
టెస్టోస్టిరాన్, వీర్యకణాల సంఖ్యను పెంచుకోడానికి సౌనా, ఐస్ ప్యాక్ వంటి ఆరోగ్యకరమైన పద్ధతులు పాటించాలని ఆయన ప్రచారం చేస్తున్నారు. అదే సైమన్ అనుసరిస్తున్నారు.
జాన్సన్ కంటెంట్‌ను 60 లక్షలమంది ఫాలో అవుతున్నారు. ఆయన పోస్టులు యూజర్లను ఆయన వెబ్‌సైట్ బ్లూప్రింట్‌లోకి తీసుకెళ్తాయి. అక్కడ ఆయన సప్లిమెంట్లు అమ్ముతున్నారు.
1970తో పోలిస్తే ఇప్పటి యువకుల్లో స్పెర్మ్ కౌంట్ తక్కువగా ఉందా?
ఇలా చెప్పేది జాన్సన్ ఒక్కరే కాదు. ఎలాంటి వైద్యపరమైన ఆధారాలు లేకుండా ఇతర ఇన్‌ఫ్లుయెన్సర్లు అనేకమంది ఇలాంటివాటిని ప్రమోట్ చేస్తున్నారు. కొన్నిరకాల సప్లిమెంట్లు, రెడ్ లైట్ థెరపీ, శరీరంలోని మైక్రోప్లాస్టిక్స్‌ను బయటకు పంపించడానికి రక్తదానం చేయడం వంటివి కూడా ఇందులో ఉన్నాయి.
110 దేశాల్లో జననాల సంఖ్య తగ్గుతోందనేదానిపై విస్తృత చర్చ జరుగుతున్న సమయంలో హెల్త్ ఇన్‌ఫ్లుయెన్సర్ల కంటెంట్‌కు మరింత ఆదరణ దక్కుతోంది.
సంతానోత్పత్తి సంక్షోభంపై ఇటీవల అమెరికా ఆరోగ్యశాఖ మంత్రి ఆర్ఎఫ్‌కే జూనియర్ మాట్లాడుతూ ఇప్పటి యువకులతో పోలిస్తే 1970నాటి మగవాళ్లలో వీర్య కణాల సంఖ్య రెట్టింపు ఉండేదని వ్యాఖ్యానించారు.
1970నాటి పురుషులతో పోలిస్తే ఇప్పటి యువతలో వీర్యకణాల సంఖ్య తక్కువ ఉందనడానికి శాస్త్రీయమైన ఆధారాలేమీ లేవు. అయితే గత అధ్యయనాలపై జరిపిన విస్తృతస్థాయి విశ్లేషణల్లో 1970లనుంచి వీర్యకణాల సంఖ్య అంతర్జాతీయంగా గణనీయస్థాయిలో తగ్గుతోందని తేలింది. దీనిపై ఇంకా తగినంత పరిశోధనలు జరగలేదు. వీర్యకణాల సంఖ్య తగ్గడానికి, జననాల సంఖ్యపై ప్రభావం పడడానికి గల కారణాలపై స్పష్టత లేదు.
ఆండ్రూ హ్యూబర్మన్ వంటి పురుషాధిక్య భావజాలానికి దగ్గరగా ఉండే ఇన్‌ఫ్లూయెన్సర్లు వీర్యకణాల సంఖ్య తగ్గడంపై తమ పాడ్‌కాస్ట్‌ల్లో చర్చించారు. భవిష్యత్తులో జనాభా తీవ్రస్థాయిలో తగ్గిపోవచ్చని జో రీగన్ అనే ఇన్‌ఫ్లూయెన్సర్ హెచ్చరించారు.
జననాల రేట్లు తగ్గడానికి శారీరక సామర్థ్యం కన్నా ఇతర కారణాలు చాలా ఉన్నాయి. వంధ్యత్వ సమస్య అంతర్జాతీయంగా ప్రతి ఏడు జంటల్లో ఒక జంటలో మాత్రమే కనిపిస్తోంది. సాధారణంగా చెప్పుకునే ఆర్థిక, సామాజిక సమస్యల వల్లే ప్రజలు పిల్లలను కనడానికి మొగ్గుచూపడం లేదు.
సోషల్ మీడియాలో విపరీత ప్రచారం
ఆందోళన చెందాల్సిన అవసరం కొంత ఉన్నప్పటికీ సోషల్ మీడియా ఈ విషయాన్ని అతిగా ప్రచారం చేస్తోందని ఇంపీరియల్ కాలేజ్‌లో రీప్రోడక్టివ్ ఎండోక్రైనాలజిస్ట్ ప్రొఫెసర్ చన్నా జయసేన అంటున్నారు.
''కొన్ని సమస్యలున్నాయి. కానీ వాటికి కారణాలేంటనేదానిపై స్పష్టత లేదు'' అని ఆయన చెప్పారు.
హెల్త్ ఇన్‌ఫ్లూయెన్సర్లలో నేచురోపతి వైద్యునిగా చెప్పుకునే వారిలో లుకాస్ ఒకరు. సంతానోత్పత్తి రేటు తగ్గిపోతుందని ఆయన కూడా హెచ్చరిస్తుంటారు.
''సంతానోత్పత్తి సామర్థ్యం తగ్గిపోవడం ప్రపంచవ్యాప్తంగా ఓ పెద్ద సమస్యగా మారడాన్ని మనం చూస్తున్నాం'' అని ఆయన బీబీసీతో చెప్పారు.
33 ఏళ్లలో మగాడికి పిల్లలను పుట్టించే సామర్థ్యం పూర్తిగా తగ్గిపోతుందని కూడా ఆయన తన యూట్యూబ్ చానెల్‌లో చెప్పారు. ఇవి పూర్తిగా ఆధారం లేని మాటలు.
ఆయన ఆన్‌లైన్ కోర్సులు నిర్వహిస్తారు. వన్ టు వన్ కౌన్సెలింగ్ ఇస్తారు. టెస్టోస్టిరాన్, ఫెర్టిలిటీ స్థాయి పెంచుకునే మగవారి కోసం సప్లిమెంట్లు అమ్ముతారు.
సంతానోత్పత్తి సామర్థ్యం పెంచుకునేందుకు చేయాల్సిన కొన్ని పద్థతులంటూ ఆయన సోషల్ మీడియాలో ప్రచారం చేసే కంటెంట్‌కు ఎలాంటి శాస్త్రీయ ఆధారాలూ లేవు. కానీ అవి వైరల్ అవుతుంటాయి.
''రోజుకు రెండు లేదా మూడుసార్లు పది నుంచి 15నిమిషాల పాటు అండర్‌వేర్‌పై ఐస్ ప్యాక్ ఉంచమని నేను సలహా ఇస్తా. ఇలా చేసిన తర్వాత తమ భాగస్వాములు గర్భం దాల్చారని నా క్లయింట్లు చెప్పారు'' అని ఆయన తన కంటెంట్‌లో చెబుతారు.
ఆయన సలహా మేరకు ఆయన ఫాలోవర్లలో కొందరు వృషణాలపై రెడ్ లైట్ పరికరం నుంచి వెలువడే కాంతి పడేలా చేస్తారు.
''ఇదింకా ప్రారంభదశలో ఉంది. ఎలాంటి హానీ జరగనంతవరకు ఓ సారి దీన్ని ప్రయత్నించవచ్చని నేను భావిస్తాను'' అని ఆయన అన్నారు.
మీ సలహాలు శాస్త్రీయంగా నిరూపితం కాలేదు కదా అన్న ప్రశ్నకు ఇది అద్భుతమైన ఆవిష్కరణ అని, కానీ మరింత పరిశోధన చేయాలనుకుంటున్నానని లుకాస్ బదులిచ్చారు.
ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవాలని, నిద్రపోవాలని, వ్యాయాయం చేయాలని కూడా లుకాస్ సూచిస్తుంటారు. వీటన్నింటివల్ల మంచి ఫలితాలుంటాయని రుజువైంది.
‘సంతానోత్పత్తి సామర్థ్యంపై కంటెంట్ తయారు చేయడం, మందులు అమ్ముకోవడం’
బాడీబిల్డింగ్, మరింత ఆకర్షణీయంగా కనిపించడం వంటి లుక్స్‌మాక్సింగ్ ఆన్‌లైన్ ట్రెండ్ కోసం టెస్టోస్టిరాన్‌ను పెంచే డ్రగ్స్ తీసుకునే మగవాళ్ల సంఖ్య పెరుగుతోంది. అదే సమయంలో ఇలాంటి సంతానోత్పత్తి సలహాలు కూడా పెరుగుతున్నాయి.
అయితే స్టెరాయిడ్లు, టెస్టోస్టిరాన్ తీసుకోవడం సంతానోత్పత్తి సామర్థ్యాన్ని దెబ్బతీస్తాయి.
ఈ నష్టాన్ని తగ్గించడానికి ఇన్‌ఫ్లూయెన్సర్లు అనేక రకాల మందుల కలయికలను 'స్టాక్స్' పేరుతో ప్రచారం చేస్తున్నారు. వాటిని వాళ్ల వెబ్‌సైట్లలో అమ్ముతుంటారు.
సామర్థ్యాన్ని పెంచే మందులు వాడి వంధ్యత్వానికి గురైన తర్వాత లుక్‌మాక్సింగ్ ఇన్‌ఫ్లుయెన్సర్ 'ఫెర్టిలిటీ-మాక్సింగ్' మందుల వివరాలను ఈ ఏడాది ప్రారంభంలో సోషల్ మీడియాలో షేర్ చేశారు.
సంతానోత్పత్తి హార్మోన్లను ప్రేరేపించడానికి పురుషులు, మహిళలు సాధారణంగా ఉపయోగించే సంతానోత్పత్తి మందులు హెచ్‌సీజీ, హెచ్ఎంజీ వంటివి కూడా ఇందులో ఉన్నాయి. కానీ వీటివల్ల ప్రమాదకర దుష్ప్రభాలున్నాయి. వైద్యపరమైన సూచనలు లేకుండా వాటిని తీసుకోవడం వల్ల శాశ్వత హానిని కలిగిస్తాయి.
''అది నమ్మలేనంత ప్రమాదకరమైనది. కొందరిలో రక్తం గడ్డలు కడుతుంది. ఛాతీ పెరుగుతుంది. వెంటనే చికిత్స తీసుకోకపోతే శరీరాకృతి మారిపోతుంది'' అని ప్రొఫెసర్ జయసేన చెప్పారు.
టీఆర్‌టీ తీసుకున్న తర్వాత తమ సంతానోత్పత్తి సామర్థ్యాన్ని తిరిగి పొందేందుకు సంతానోత్పత్తి మందులను ఉపయోగించిన ఏడుగురు విభిన్న వ్యక్తులతో మేం మాట్లాడాం. వీరంతా భిన్న ప్రాంతాలకు చెందినవారు.
స్టెరాయిడ్లు వంటి మందులను ఆన్‌లైన్‌లో కొనడం అక్రమం కాబట్టి వారు తమ వివరాలు రహస్యంగా ఉంచాలని విజ్ఞప్తిచేశారు.
హెచ్ఎంజీ, హెచ్‌సీజీ తీసుకుంటే తాను చాలామంది పిల్లలకు తండ్రి కావొచ్చనుకున్నానని వారిలో ఒకరు నాతో చెప్పారు. ''ఈ మందులు వేసుకున్న తర్వాత నాకు పిల్లలు పుడతారని నేను నమ్మకంతో ఉన్నా'' అని మరొక వ్యక్తి చెప్పారు.
‘పర్యవేక్షణ లేని ఔషధాలతో అసలుకే మోసం’
బాడీబిల్డింగ్ కోసం జమాల్(అసలు పేరు కాదు) అనే వ్యక్తి టెస్టోస్టిరాన్, స్టెరాయిడ్స్ హై డోస్‌లు తీసుకున్నారు. దీని వల్ల ఆయన సంతానోత్పత్తి సామర్థ్యం తగ్గింది. పిల్లలను కనాలని ఆయన, ఆయన భాగస్వామి భావించిన తర్వాత గత ఏడాది చివర్లో ఆయన వాటిని తీసుకోవడం ఆపేశారు.
తనలాగే టెస్టోస్టిరాన్, స్టెరాయిడ్లు తీసుకున్న ఇతరులు యూట్యూబ్ వంటి సోషల్ మీడియాలో కచ్చితంగా ఫలితాన్నిచ్చే సంతానోత్పత్తి మందులు గురించి ఇచ్చిన సలహాలను జమాల్ గమనించారు.
''ఇలా తీసుకోవాలి, ఇదీ చేయాల్సింది వంటి సలహాలు ఆన్‌లైన్‌లో జనం ఇస్తుంటారు. కానీ ఎండోక్రైనాలజిస్ట్ దగ్గరకు వెళ్లడం బహుశా మంచి విధానమని నాకు తెలుసు. కానీ వాళ్లు చెప్పిన కొన్నింటిని ఆన్‌లైన్‌లో ఇచ్చిన సమాచారం ఆధారంగా కొనేశాను'' అని జమాల్ తెలిపారు.
ఇవి ఉపయోగపడకపోవడంతో నిపుణులైన వారి సలహా కోసం ఆయన ప్రొఫెసర్ జయసేనను కలిశారు. పర్యవేక్షణలేని ఈ సంతానోత్పత్తి మందులను తీసుకోవడం ప్రమాదకరంగా మారుతుందని అప్పటిదాకా ఆయనకు తెలియదు.
''జనం స్టెరాయిడ్లు ఆరోగ్యానికి ప్రమాదం కలిగిస్తాయని తెలిసినా వాడుతుంటారు. హెచ్‌సీజీ వంటి మందుల దుష్ప్రభావాల గురించి పట్టించుకోరు'' అని జమాల్ అన్నారు.
ప్రొఫెసర్ జయసేన సలహా మేరకు సంతానోత్పత్తి మందులు సహా తాను తీసుకునే అన్ని రకాల మందులనూ జమాల్ ఆపేశారు. ఆరు నెలల తర్వాత ఆయన టెస్టోస్టిరాన్ స్థాయి సహజంగా పెరిగింది. అయితే స్మెర్మ్ ఉత్పత్తిని ప్రేరేపించే హర్మోన్ ఇంకా తక్కువగానే ఉంది. అది మెరుగుపడుతుందని జమాల్, ప్రొఫెసర్ జయసేన ఆశాభావంతో ఉన్నారు.
పురుషుల సంతానోత్పత్తి సామర్థ్యం గురించి అవగాహన పెంచడం సానుకూల అంశమే అయినప్పటికీ, సరైన సమాచారం అందుబాటులో ఉండడం లేదని ప్రొఫెసర్ జయసేన హెచ్చరించారు. నిపుణులు ఎల్లవేళలా అందుబాటులో ఉండకపోవడంతో జమాల్ వంటి వారు ఇన్‌ఫ్లుయెన్సర్ల సలహాలు తీసుకుంటున్నారని ఆయన అన్నారు.
''అత్యుత్తమ సమయంలో కూడా ఇవి నిజంగా ఉపయోగపడేవాటి నుంచి దృష్టి మళ్లించవచ్చు. ఆరోగ్యానికి హాని కలిగించే పనులు చేయించే ప్రమాదం కూడా ఉంది'' అని ఆయన అన్నారు.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్, ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.