You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
పాకిస్తాన్: ‘ ఏ రోజుకైనా రామాయణ, మహాభారతాలు ఉర్దూలో రావాలి’ అంటున్న సంస్కృత ప్రొఫెసర్
- రచయిత, షుమాయిలా ఖాన్
- హోదా, బీబీసీ కోసం
- ప్రచురణ
- చదివే సమయం: 6 నిమిషాలు
"సంస్కృతం దక్షిణాసియా ఉమ్మడి వారసత్వం. ఆధునిక ప్రపంచంలో దానిని ఒక దేశానికి పరిమితం చేయడం అన్యాయం"
లాహోర్‌లో సంస్కృతం బోధించే డాక్టర్ షాహిద్ రషీద్ వ్యాఖ్యలివి.
లాహోర్ యూనివర్శిటీ ఆఫ్ మేనేజ్‌మెంట్ సైన్సెస్‌లోని జర్మన్ సెంటర్ ఫర్ లాంగ్వేజ్ అండ్ లిటరేచర్ గతేడాది డిసెంబర్‌లో సంస్కృత కోర్సును ప్రారంభించింది.
విభజన తర్వాత పాకిస్తాన్‌లో విశ్వవిద్యాలయ స్థాయి విద్యలో సంస్కృతం భాగం కావడం ఇదే మొదటిసారి.
ఈ వార్త పాకిస్తానీయులతో పాటు భారతీయులకీ ఆశ్చర్యాన్ని కలిగించింది.
ఇస్లాం నేపథ్యం ఉన్న వ్యక్తి సంస్కృతం బోధించడం చూసి పాకిస్తాన్‌లో అనేకమంది ఆశ్చర్యపోయారని ప్రొఫెసర్ షాహిద్ రషీద్ బీబీసీతో అన్నారు
"దీన్ని ప్రజలు ఆమోదించినప్పటికీ, కొంతమంది దీని వల్ల ఎలాంటి మతపరమైన ప్రయోజనం ఉండదని, ఇది నేర్చుకోవడం వల్ల సమయం వృథా అవుతుందని అన్నారు" అని ఆయన చెప్పారు.
భారత్ నుంచి వచ్చిన స్పందనపై ఆయన నవ్వుతూ "పాకిస్తాన్‌లో ఇలాంటిదేదీ జరగదని భావించారు. ఇదంతా అబద్ధం లేదా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సాయంతో సృష్టించిందని అనుకున్నారు"
సంస్కృతం అంతరిస్తున్న భాష. భారత్‌లో కొద్దిమందికే సంస్కృతం తెలుసు.
పాకిస్తాన్‌లో సంస్కృతాన్ని పునరుద్ధరించే ప్రయత్నాల గురించి మాట్లాడుతూ "పాకిస్తాన్ చరిత్ర కేవలం 1947 రాజకీయ ఉద్యమంతోనే ప్రారంభం కాదని నేను నమ్ముతున్నాను" అని ప్రొఫెసర్ షాహిద్ రషీద్ అన్నారు.
"మనం ఆ కాలంకంటే ఇంకా వెనక్కి వెళ్లాలి. సింధు నాగరికతను పరిశీలించాలి. తక్షశిలను అర్థం చేసుకోవాలి. మనం మన గతం నుండి పారిపోలేం" అని ఆయన చెప్పారు.
లాహోర్‌కీ సంస్కృతానికి సంబంధం ఉందా?
లాహోర్ సంస్కృతానికి కేంద్రంగా ఉండేదని డాక్టర్ షాహిద్ రషీద్ అన్నారు.
1940లో ప్రచురించిన ఒక సంస్కృత వ్యాకరణ పుస్తకాన్ని చూపిస్తూ "లాహోర్‌లోని అనార్కలి మార్కెట్‌లో అనేక సంస్థలు సంస్కృతంలో పుస్తకాలను ముద్రించేవి. ఆ పుస్తకాలను భారత్ అంతటా పంపిణీ చేశారు" అని షాహిద్ రషీద్ చెప్పారు.
ఆయన సుమారు 200 ఆధునిక ప్రాచీన సంస్కృత పుస్తకాలను సేకరించారు.
పుస్తకాల గురించి చర్చిస్తున్నప్పుడు పంజాబ్ యూనివర్సిటీలో భద్రపరిచిన ప్రాచీన సంస్కృత తాళపత్ర గ్రంథాలు, అరుదైన పుస్తకాల గురించి ఆయన ప్రస్తావించారు.
వీటిని దేశ విభజనకు పూర్వమే సంస్కృత పండితుడు ఆల్ఫ్రెడ్ ఊల్నర్ సేకరించారు.
ఆల్ఫ్రెడ్ ఊల్నర్ పంజాబ్ యూనివర్సిటీకి వైస్ చాన్సలర్‌గా పని చేశారు. ఆయన 1936లో మరణించారు.
"ఈ పుస్తకాల వల్ల పాకిస్తాన్‌లో ప్రయోజనం పొందేవారు ఎవరూ లేరు" అని రషీద్ చెప్పారు.
ప్రొఫెసర్ ఊల్నర్ సేకరించిన అరుదైన పుస్తకాలు, ప్రాచీన తాళపత్రాల్లో సంస్కృతం, హిందీ, ప్రాకృతం, శారద, ఆంధ్ర, తమిళం, నంద నాగరి భాష, లిపిలో రాసిన 9075 ప్రాచీన తాళపత్రాలు ఉన్నాయి. దీంతో పాటు 2వేలకు పైగా ప్రాచీన తాళపత్రాలు( కొబ్బరి ఆకులపై రాసినవి) ఉన్నాయని పంజాబ్ యూనివర్సిటీ లైబ్రరీ వెబ్‌సైట్ చెబుతోంది.
పంజాబ్ యూనివర్సిటీ బయట ఆల్ఫ్రెడ్ ఊల్నర్ విగ్రహం ఇప్పటికీ ఉంది.
సంస్కృత వ్యాకరణంలో గుర్తింపు పొందిన అష్టాధ్యాయిని రాసిన పాణిని ఒకప్పటి గాంధారగా భావించే శాలతురలో జన్మించారని భావిస్తారు.
శాలతుర ప్రాంతం ఖైబర్ పఖ్తూన్‌ఖ్వా రాష్ట్రంలోని స్వాబి జిల్లాలో సింధు, కాబూల్ నదుల సంగమ స్థానంలో ఉన్న చిన్న పట్టణం. దీనిని ప్రస్తుతం 'లిటిల్ లాహోర్' అని పిలుస్తున్నారు.
ఇంజనీరింగ్ నుంచి సంస్కృతం వైపు..
పంజాబ్ రాష్ట్రంలోని బురేవాలాకు చెందిన ప్రొఫెసర్ డాక్టర్ షాహిద్ రషీద్ లాహోర్‌లో ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ చదివారు. సీఎస్ఎస్ పరీక్ష పాసైన తర్వాత కొంతకాలం సివిల్ సర్వీస్‌లో పని చేశారు.
సివిల్ సర్వీస్ ఉద్యోగం వదిలేసి ఉన్నత చదువుల కోసం బ్రిటన్ వెళ్లారు. ఆక్స్‌ఫర్డ్‌లో సోషియాలజీలో మాస్టర్స్ పూర్తి చేశారు. ఆ తర్వాత పాకిస్తాన్ తిరిగొచ్చి లాహోర్‌లోని ఫోర్మాన్ క్రిస్టియన్ కాలేజ్‌లో ప్రొఫెసర్‌గా పని చేశారు.
ప్రొఫెసర్ రషీద్ అరబిక్, పర్షియన్, గ్రీక్, హిందీ, సంస్కృతం భాషలను నేర్చుకున్నారు.
సంస్కృత ఉపాధ్యాయుల కొరత ఒక సవాలుగా మారినప్పుడు ఆయన ఆన్‌లైన్ ప్లాట్‌ఫామ్‌లలో సంస్కృతంలోని మూడు కోర్సులను పూర్తి చేశారు. "కేంబ్రిడ్జ్ ఇంట్రడక్షన్ టు సాంస్క్రిట్" గ్రంథ రచయిత ఆంటోనియో రుపాల్ ఆ ప్లాట్‌ఫారమ్‌లో సంస్కృతాన్ని బోధించేవారు.
ఆంటోనియో రూపాల్ ఎఫ్‌సీ కాలేజ్‌లో సోషియాలజీ ప్రొఫెసర్.
షాహిద్ రషీద్‌కు లాహోర్ యూనివర్సిటీ ఆఫ్ మేనేజ్‌మెంట్ సైన్సెస్‌లోని జర్మనిక్ సెంటర్ డైరెక్టర్ అలీ ఉస్మాన్ కజ్మీ సంస్కృతం, హిందీ బోధించే అవకాశాన్ని ఇవ్వడంతో ఆయన తన బోధనా వృత్తి ప్రారంభించారు.
లాహోర్ యూనివర్సిటీ ఆఫ్ మేనేజ్‌మెంట్ విద్యార్థుల కోసం ఆయన రెండు ఓపెన్ వర్క్‌షాప్‌లు నిర్వహించారు. అందులో రెండు కోర్సులు బోధించారు. ఈ కోర్సుల్లో 32 మంది విద్యార్థులు చేరారు. ఈ సిరీస్ ఇప్పటికీ కొనసాగుతోంది.
పాటల ద్వారా సంస్కృత శ్లోకాల బోధన
ప్రొఫెసర్ షాహిద్ రషీద్ సంస్కృతం బోధించడానికి సంగీతంతో సహా అనేక పద్ధతులను ఉపయోగిస్తున్నారు. ఆయన విద్యార్థులు శ్లోకాలు, వ్యాకరణ నియమాలను పాడటం ద్వారా నేర్చుకుంటారు.
సంస్కృతం ఇప్పుడు వాడుక భాషగా వాడుకలో లేనప్పటికీ "ఆర్కైవ్‌లు, మ్యూజియంలు, చారిత్రక ప్రదేశాల ద్వారా జీవితంతో దానికున్న సంబంధం నిలిచి ఉంద’’ని షాహిద్ అభిప్రాయపడ్డారు.
ఆయన తన విద్యార్థులను లాహోర్ మ్యూజియం, జోగియా కోట, తక్సిలా(తక్షశిల) వంటి ప్రదేశాలకు యాత్రలకు తీసుకెళుతున్నారు. అక్కడ వాళ్లు ప్రాచీన బౌద్ధ గ్రంథాలను అధ్యయనం చేసేలా ప్రోత్సహిస్తున్నారు.
ఆయనని విద్యార్థులలో ఒకరైన అఫ్తాబ్ నాసిర్ స్వయంగా లాహోర్ యూనివర్సిటీలో అధ్యాపకుడు.
"తక్సిలాలో జూలియన్ విశ్వవిద్యాలయం ఉంది. దీనిని ప్రపంచంలోని అత్యంత పురాతన బౌద్ధ విశ్వవిద్యాలయాలలో ఒకటిగా పరిగణిస్తారు. అయితే దాని రికార్డులలో చాలా వరకు సంస్కృతంలో ఉండటం వల్ల దాని గురించి మనకు పెద్దగా తెలియదు" అని అఫ్తాబ్ చెప్పారు.
లాహోర్ యూనివర్సిటీ విద్యార్థి అబ్దుల్ రెహమాన్.. 1930,1940లలో బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా జరిగిన ఉద్యమాలపై పరిశోధన చేస్తున్నారు.
"ఉద్యమాలపై అందుబాటులో ఉన్న పత్రాలు చాలావరకు బ్రిటిష్ పాలన కాలం నాటి రికార్డుల రూపంలో ఉన్నాయి. నా పరిశోధన సమయంలో, దేవనాగరి లిపి, సింధీ భాషలో ఉన్న కొన్ని పత్రాలు నాకు లభించాయి. అవి చూశాక దేవనాగరి లిపి సంస్కృతం నేర్చుకోవాలనుకున్నా" అని రెహమాన్ చెప్పారు.
"ఇప్పటికీ ఎవరూ చదవవి అనేక ప్రాచీన సంస్కృత గ్రంథాలు పాకిస్తాన్‌లో ఉన్నాయి. భవిష్యత్తులో వాటిని చదవాలనుకుంటున్నా" అని ఆయన చెప్పారు.
డాక్టర్ షాహిద్ మొదటి విద్యార్థి ఆయన సొంత కుమార్తె ఆఫియా షాహిద్.
2015లో సంస్కృతం నేర్చుకోవడం మొదలుపెట్టినట్లు ఆఫియా చెప్పారు.
"ప్రజలు చిన్ననాటి కార్టూన్లు లేదా ఆటలను గుర్తుంచుకుంటారు, కానీ నేను సంస్కృతం, అరబిక్‌ల గుర్తుంచుకుంటాను" అని ఆమె అన్నారు.
"నా బాల్యం ఈ రెండు భాషలతోనే గడిచింది. అందుకే ఈ భాషలతో నాకు వ్యక్తిగత అనుబంధం ఉంది. ఈ భాష చాలా క్లిష్టమైనది, కానీ దాని క్లిష్టతను ఒక పజిల్ లాగా పరిష్కరించినప్పుడు చాలా సరదాగా ఉంటుంది" అని ఆఫియా చెప్పారు.
తాహా వాసిక్ లాహోర్ యూనివర్సిటీలో చరిత్ర విద్యార్థి.
సంస్కృతం నేర్చుకోవాలనే తన ఆసక్తి గురించి మాట్లాడుతూ "మీరు దేవనాగరి లిపిని నేర్చుకుంటే, ఇతర భాషలు నేర్చుకోవచ్చు. హిందీ, ఉర్దూను పోలి ఉంటుంది. కాబట్టి, ఇప్పుడు నేను ఆ భాషను చదవగలను. మన సాహిత్య వారసత్వానికి చేరువ కావడమే మా ప్రధాన లక్ష్యం" అని వాసిక్ చెప్పారు.
పాకిస్తాన్‌లో 'సంస్కృత సమాజం' అనే కల
ప్రొఫెసర్ రషీద్, ఆయన విద్యార్థులు పాకిస్తాన్‌లోని పంజాబ్ యూనివర్సిటీలోని ఊల్నర్ సెంటర్‌లో భద్రపరిచిన అరుదైన ప్రాచీన సంస్కృత తాళపత్ర గ్రంథాలు, పుస్తకాలను చదవాలని కలలు కంటున్నారు.
"సంస్కృతం మన భాష కాదు వేరొకరి భాష అనేది సంకుచితమైన, పక్షపాతపూరితమైన మనస్తత్వం. దాని నుంచి బయటపడాలి" అని ప్రొఫెసర్ రషీద్ చెప్పారు.
"మనమందరం కలిసి మహాభారతాన్ని ఉర్దూలోకి అనువదించే సమయం ఎప్పుడో ఒకప్పుడు వస్తుందని ఆశిస్తున్నా" అని ఆయన అన్నారు.
"ప్రస్తుతం ఉర్దూలో లభ్యమవుతున్న మహాభారతం ఒక సంక్షిప్త సారాంశం రూపంలో ఉంది. అదేవిధంగా, రామాయణం పూర్తి ఉర్దూ అనువాదాన్ని కూడా ప్రచురించాలి" ఆయన చెప్పారు.
పాకిస్తాన్‌లో మహాభారత, రామాయణాల ఉర్దూ అనువాదాలు సులభంగా లభిస్తాయి.
"ఈ అనువాదాలలో చాలా వరకు పర్షియన్ లేదా ఇంగ్లీష్ నుంచి చేశారు" అని ఆయన చెప్పారు.
ఈ అనువాదాలు నేరుగా సంస్కృతం నుండి చేసి ఉంటే బాగుండేదని ఆయన అభిప్రాయపడ్డారు.
"ఇది ఏ ఒక్క మతానికి సంబంధించినది కాదని అర్థం చేసుకోగలిగే ఒక సంస్కృత సమాజం ఉండాలి. ప్రజల విశాల హృదయంతో ఆలోచించాలి. ఉమ్మడి వారసత్వాన్ని మనం మరింత బాగా అర్థం చేసుకోగలగాలి" అని ఆయన చెప్పారు.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్, ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)