సంభోగం ముగిశాక ఆడ మిడత మగదాన్ని తినేస్తుందా? సైన్స్ ఏం చెబుతోంది?

    • రచయిత, కె. శుభగుణం
    • హోదా, బీబీసీ ప్రతినిధి
  • ప్రచురణ
  • చదివే సమయం: 7 నిమిషాలు

వర్షాకాలం తర్వాత వరి పొలాలు, కూరగాయల తోటలు లేదా చెట్లు, మొక్కలు ఎక్కువగా ఉండే ప్రాంతాలకు వెళ్లినప్పుడు మీరు మిడతలను చూసే ఉంటారు.

ఆకుపచ్చని ఆకులానో లేదా ఎండిన పుల్లలానో పరిసరాలతో చక్కగా కలిసిపోయి, కదలకుండా కూర్చునే ఈ కీటకం.. ఎర కోసం ఎంతో ఓపికగా వేచి ఉంటుంది.

తన రెండు ముందు కాళ్లను మడిచి ఉంచి, చేతులు జోడించి దండం పెడుతున్నట్లుగా కనిపించడం వల్ల దీనిని తెలుగులో 'మిడత' అని, ఆంగ్లంలో 'ప్రేయింగ్ మాంటిస్' అని పిలుస్తారు. దీని రూపం ఎంతో ప్రశాంతంగా కనిపించినప్పటికీ, కీటకాల్లో ఇది అత్యంత నైపుణ్యం కలిగిన, పొంచి ఉండి వేటాడే జీవుల్లో ఒకటిగా గుర్తింపు పొందింది.

మిడతలు పంటలను నాశనం చేసే పురుగులను తింటూ, రైతులకు, పర్యావరణానికి ఎంతో మేలు చేస్తున్నాయి.

అయితే, ఈ జాతికి చెందిన ఆడ కీటకాలు సంభోగం ముగిసిన తర్వాత మగ కీటకాన్ని ఆహారంగా తీసుకుంటాయన్న భావన విస్తృతంగా ఉంది, మరి ఇందులో నిజమెంత?

పరిసరాలతో కలిసిపోయే నైపుణ్యం

జూలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా గణాంకాల ప్రకారం.. ప్రపంచవ్యాప్తంగా 2,300 కంటే ఎక్కువ మిడత జాతులను గుర్తించారు. ముఖ్యంగా: "భారత దేశంలో రకరకాల ఆవాసాలలో సుమారు 184 రకాల మిడత జాతులు నమోదయ్యాయి".

ఇవి ఉష్ణమండల అడవులు, పచ్చికభూములు, పొదలు, వ్యవసాయ భూములు వంటి రకరకాల ప్రాంతాల్లో నివసిస్తాయి.

ప్రపంచంలోనే అత్యంత జీవవైవిధ్యం కలిగిన ప్రాంతాలలో ఒకటిగా భావించే పశ్చిమ కనుమలలో.. ముఖ్యంగా "కేరళ, తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాలలో విస్తరించి ఉన్న పశ్చిమ కనుమల దక్షిణ భాగంలో 12 శాస్త్రీయ వర్గాలకు చెందిన 61 రకాల మిడతలు ఉన్నట్లు" జూలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా గణాంకాలు చెబుతున్నాయి.

ఈ వేట కీటకాలను ప్రత్యేకంగా నిలబెట్టడంలో వాటికున్న 'కామోఫ్లాజ్' (పరిసరాలతో కలిసిపోయే) నైపుణ్యం కీలకపాత్ర పోషిస్తుంది.

మిడత శారీరక రూపం పచ్చని ఆకులానో, ఎండిపోయిన గోధుమ రంగు కొమ్మలానో, చెట్టు బెరడులానో లేదా ఒక పువ్వులానో కూడా ఉండవచ్చు.

ఈ సామర్థ్యం వల్ల మిడతలు ప్రకృతిలో సులువుగా కలిసిపోతూ, శత్రువుల కంటికి చిక్కకుండా తప్పించుకుంటాయి. అయితే, ఈ దాగుడుమూతలు కేవలం రక్షణ కోసమే కాదు, ఎరను వేటాడే వ్యూహంలో కూడా భాగమే.

గాలిలో ఎరను వెంటాడి వేటాడే తూనీగలు, వల వేసి వేచి చూసే సాలెపురుగులలా కాకుండా.. ఇవి ఆకులో ఆకులా, కొమ్మలో కొమ్మలా, పువ్వులో పువ్వులా కలిసిపోయి, ఎంతో నిదానంగా, ఓపికగా పొంచి ఉండి వేటాడతాయి.

ఒకే చోట అస్సలు కదలకుండా గంటల తరబడి ఉండిపోతూ, తమ దగ్గరకు వచ్చే కీటకాలను రెప్పపాటులో పట్టుకుంటాయి.

మిడతలు ఎంత నిశ్చలంగా ఉంటాయంటే, అనుభవజ్ఞులైన వైల్డ్‌లైఫ్ ఫొటోగ్రాఫర్స్, పక్షుల ప్రేమికులు కూడా వాటిని గమనించలేకపోతుంటారు.

ఈ నైపుణ్యం వల్ల మిడతలకు వేట దొరికే అవకాశాలు పెరగడమే కాకుండా, పక్షుల వంటి ఇతర శత్రు జీవుల బారి నుంచి కూడా ప్రాణరక్షణ లభిస్తుందని నిపుణులు చెబుతున్నారు.

3డీ దృష్టి సామర్థ్యం

పరిసరాల్లో కలిసిపోవడమే కాదు, మిడతల దగ్గరున్న మరో పదునైన ఆయుధం వాటి ప్రత్యేకమైన చూపు.

అమెరికాకు చెందిన పి.ఎన్.ఎ.ఎస్ ప్రచురించిన ఒక పరిశోధనా వ్యాసం ప్రకారం, "వీటికి రెండు పెద్ద కళ్లు ఉంటాయి. ప్రతి కంటిలోనూ 'ఒమ్మాటిడియా' అని పిలిచే వేలాది సూక్ష్మ లెన్స్‌లు ఉంటాయి. రాయల్ ఎంటమోలాజికల్ సొసైటీ ప్రకారం, మిడతకు ఒకే కంటిలో సుమారు 3,500 ఒమ్మాటిడియాలు ఉంటాయి. ఈ విలక్షణమైన కంటి నిర్మాణం వల్ల ఇవి తమ శరీరాన్ని అస్సలు తిప్పకుండానే చుట్టుపక్కల ఉన్న ప్రతిదాన్ని స్పష్టంగా చూడగలవు".

అంతేకాకుండా, కీటకాల లోకంలో మిడతలకూ 3డీ చూపు ఉంటుందని అశోక పర్యావరణ పరిశోధనా సంస్థకు చెందిన కీటక శాస్త్రవేత్త డాక్టర్ సహానా చెబుతున్నారు.

ఈ విషయాన్ని 2018లో న్యూకాజిల్ విశ్వవిద్యాలయ శాస్త్రవేత్తలు చేసిన పరిశోధన కూడా ధ్రువీకరించింది.

"ఇవి తమ రెండు కళ్ల ద్వారా చూసే చిత్రాలను 3డీ చూపుతో పోల్చి చూసుకుంటాయి. దీనివల్ల మనుషుల కంటే చాలా కచ్చితంగా ఎర ఎంత దూరంలో ఉందో అంచనా వేయగలవు" అని ఆ పరిశోధనలో తేలింది.

"ఈ సామర్థ్యంతో దాడి చేసే పరిధిలోకి ఎర సరిగ్గా ఎప్పుడు వస్తుందో లెక్కిస్తాయి. చివరి క్షణం వరకు నిశ్చలంగా ఉంటూ సమయం చూసి దెబ్బతీస్తాయి" అని సహానా వివరించారు.

దీనివల్ల వేట తప్పిపోయే ప్రమాదం, శ్రమ వృథా చాలావరకు తగ్గుతాయని న్యూకాజిల్ విశ్వవిద్యాలయ శాస్త్రవేత్తలు పేర్కొన్నారు.

మిడతల్లో ఎన్నో ఏళ్లుగా శాస్త్రవేత్తలను ఆశ్చర్యపరుస్తున్న మరో విశేషం.. వాటి కళ్లలో కనిపించే 'కదిలే కనుపాప'. ఈ కీటకాల కళ్లలో ఉండే ఒక ముదురు రంగు చుక్క, నిజంగానే కనుపాపలా అది చూసే వైపు కదులుతున్నట్లు అనిపిస్తుంది.

కానీ, "నిజానికి మిడతలకు కనుపాపలు ఉండవని, కంటిలోని వేలాది ఒమ్మాటిడియా విభాగాలు కాంతిని గ్రహించే తీరు వల్లే అలా కదులుతున్నట్లు భ్రమ కలుగుతుందని" రాయల్ ఎంటమోలాజికల్ సొసైటీ పరిశోధన స్పష్టం చేసింది.

అపరిమితమైన ఓపిక.. అసాధారణ వేగం

మిడతల వేటను చూస్తే వాటికున్న అపరిమితమైన ఓపిక తెలుస్తుంది. అలాగే అవి చేసే దాడిని చూస్తే వాటి అసాధారణ వేగం అర్థమవుతుంది.

ఇందుకు ఉదాహరణగా, తిరుపూర్‌లో 'బాక్సర్ మ్యాంటిస్' అనే రకానికి చెందిన మిడత.. ఒక లీఫ్‌హాపర్ (చిన్న పచ్చ పురుగు)ను వేటాడటం స్వయంగా చూశాను.

ఒక తెల్లవారుజామున, ఇద్దరు వైల్డ్‌లైఫ్ ఫొటోగ్రాఫర్లతో కలిసి కీటకాలను పరిశీలించడానికి తిరుపూర్‌లోని చెట్లు, పొదలు ఉన్న ఒక ప్రాంతానికి వెళ్లాను. అక్కడ సాధారణంగా కనిపించే ఆకుపచ్చ మిడతతో పాటు, అది పెట్టిన గుడ్లను, అలాగే 'బాక్సర్ మ్యాంటిస్'ను చూసే అవకాశం దొరికింది.

అక్కడ ఒక బాక్సర్ మ్యాంటిస్ మొక్క కొమ్మపై చాలాసేపు కదలకుండా కూర్చుంది. కనీసం 20 నిమిషాల పాటు దాన్ని నేను గమనిస్తూనే ఉన్నాను. చివరికి, ఒక లీఫ్‌హాపర్ పురుగు అక్కడ మిడత ఉన్న విషయాన్ని గమనించకుండా సరిగ్గా దాని పక్కనే వచ్చి వాలింది. ఆ పురుగు వచ్చి వాలిన మరుక్షణమే.. అక్కడ ఏం జరిగిందో నేను కళ్లారా చూసి గ్రహించే లోపే, అది బాక్సర్ మ్యాంటిస్ ముందు కాళ్ల మధ్య చిక్కుకుపోయింది.

ఎరను పట్టుకోవడానికి వీటి ముందు కాళ్లు ఎంత అద్భుతంగా రూపాంతరం చెందాయో చెప్పడానికి ఇది ఒక ఉదాహరణ. బలమైన కండరాలతో లోడ్ చేసి ఉంచిన ఒక స్ప్రింగ్ లాగా, ఈ కాళ్లు తల కిందకు మడిచి ఉంటాయి. ఎర కాస్త అనుకూలమైన దూరంలోకి రాగానే, ఈ కాళ్లు కనురెప్పపాటు కాలంలో ముందుకు దూసుకెళ్తాయి. అవతలి కీటకం అసలు ఏం జరుగుతుందో ఊహించే లోపే, ఆ కాళ్లకు ఉన్న పదునైన ముళ్ల మధ్య చిక్కుకుపోతుంది.

హై-స్పీడ్ వీడియో విశ్లేషణల ప్రకారం, ఈ దాడులు కేవలం 50-70 మిల్లీ సెకన్లలోపే జరిగిపోతాయి. అంటే, మనుషులు కనురెప్ప వేసే సమయం కంటే ఇది చాలా వేగవంతమైనది అన్నమాట.

"గంటల తరబడి కదలకుండా ఓపికగా ఉండే ఈ జీవులు, తమ శరీరాన్ని తిప్పకుండా, పరిసరాల దృష్టిని ఆకర్షించకుండానే తమ తలను ఏకంగా 180 డిగ్రీల వరకు తిప్పగలవు. ఈ విలక్షణమైన ఫ్లెక్సిబిలిటీ వల్ల.. తాము దాక్కున్న విషయం శత్రువులకు తెలియకుండానే ఎరను పసిగట్టడానికి, అలాగే తమపై దాడి చేయడానికి వచ్చే ఇతర జీవులను ముందే గుర్తించడానికి వీటికి వీలవుతుంది" అని కీటక శాస్త్ర పరిశోధకురాలు సహానా వివరించారు.

"సహజంగానే ఇవి పంటలను నష్టపరిచే అనేక రకాల పురుగులను తింటాయి కాబట్టి, వ్యవసాయానికి మేలు చేసే మిత్రకీటకాలుగా మారాయి. అయితే, వీటికి తేనెటీగలు, సీతాకోకచిలుకలు అనే తేడా ఏమీ ఉండదు. కంటికి కనిపించిన ప్రతి కీటకాన్ని వేటాడటం వల్ల, పొలానికి పరాగ సంపర్కం ద్వారా మేలు చేసే కీటకాలు కూడా వీటికి ఆహారంగా మారిపోతుంటాయి" అని డాక్టర్ సహానా తెలిపారు.

మగ కీటకాన్ని ఆడది తినేస్తుందా?

మిడతలు ఇంత ప్రత్యేకంగా నిలవడానికి కేవలం వాటి వేట నైపుణ్యం మాత్రమే కారణం కాదు, వాటి విలక్షణమైన ప్రత్యుత్పత్తి ప్రవర్తన కూడా ఒక కారణమే. సాధారణంగా ఆడ మిడతలు సంభోగం ముగిసిన వెంటనే తమ మగ తోడును తినేస్తాయని ఒక బలమైన నమ్మకం ఉంది.

ఈ ప్రచారంలో కొంత నిజం ఉన్నప్పటికీ, "అన్ని వేళలా, అన్ని రకాల మిడతలలో ఇది జరగదు. సంభోగం తర్వాత మగ కీటకాన్ని తినేయడం అనేది ఆయా జాతులు, అవి ఉండే వాతావరణ పరిస్థితులపై ఆధారపడి ఉంటుంది" అని డాక్టర్ సహానా స్పష్టం చేశారు.

"కొన్ని ప్రత్యేక జాతులు సహజంగానే ఇలాంటి ప్రవర్తనను చూపిస్తాయి. కానీ, మరికొన్నింటిలో ఇది చాలా అరుదుగా జరుగుతుంది, అసలు జరగకపోవచ్చు కూడా. ఆడ కీటకం ఎంత ఆకలితో ఉంది? దాని వయసు ఎంత, ఆ సమయం ఎలాంటిది అనే అంశాలే సంభోగం తర్వాత మగ కీటకం దానికి ఆహారంగా మారుతుందా లేదా అనేదాన్ని నిర్ణయిస్తాయి" అని ఆమె వివరించారు.

న్యూయార్క్ స్టేట్ యూనివర్సిటీ ప్రొఫెసర్ విలియం డి బ్రౌన్, పరిశోధకులు కేథరిన్ బారీ, మార్క్ ఎల్గర్ వంటి నిపుణులు చేసిన పరిశోధనలు కూడా సంభోగం ముగిసిన ప్రతిసారీ మగ కీటకం బలికావడం అనేది తప్పనిసరి నియమం ఏమీ కాదని నిరూపించాయి.

మిడతల సంతానోత్పత్తిలో ఆడ కీటకానికి లభించే పోషకాహారం కీలకపాత్ర పోషిస్తుందని సహానా చెప్పారు.

"బాగా ఆకలితో ఉన్న ఆడ కీటకం, తన దగ్గరకు వచ్చే మగ కీటకంపై దాడి చేసి తినేసే అవకాశాలు చాలా ఎక్కువ. అదే దానికి ఆహారం సమృద్ధిగా దొరికి కడుపు నిండుగా ఉంటే మాత్రం అంతగా దూకుడు చూపించదు" అని చెప్పారు.

"మగ కీటకాన్ని ఆహారంగా తీసుకోవడం ద్వారా ఆడ కీటకానికి అవసరమైన పోషకాలు అందుతాయి. ఇది దాని ఆరోగ్యానికి మేలు చేసి, బలమైన గుడ్ల కోశాలను తయారు చేయడానికి, ఎక్కువ గుడ్లు పెట్టడానికి దోహదపడుతుంది" అని ఆమె వివరించారు.

"సాధారణంగా చుట్టుపక్కల ఆహారం దొరకని పరిస్థితిలోనే ఆడ కీటకాలు ఇలా మగవాటిని తింటుంటాయి. కాబట్టి, దీన్ని మగ కీటకం చేసే 'త్యాగం' లాగా కాకుండా, సంతానోత్పత్తిని విజయవంతం చేయడానికి ఆడ కీటకం అనుసరించే ఒక ప్రకృతి సహజ వ్యూహంగా చూడాలి" అని సహానా అన్నారు.

అయితే, మగ మిడతలు కూడా అంత అమాయకంగా, నిర్లక్ష్యంగా ఏమీ ఉండవని న్యూయార్క్ స్టేట్ యూనివర్సిటీ అధ్యయనాలు చెబుతున్నాయి.

"ఆడ కీటకంతో సంభోగానికి సిద్ధపడే ముందే మగ కీటకాలు పరిస్థితిని జాగ్రత్తగా అంచనా వేస్తాయి. వీలైనంత వరకు తాము దానికి ఆహారంగా మారిపోయే ప్రమాదం నుంచి తప్పించుకోవడానికే ప్రయత్నిస్తాయి" అని ఆ అధ్యయనాలు పేర్కొన్నాయి.

సంభోగం ముగిసిన తర్వాత ఆడ కీటకం ఒక నురుగు లాంటి ద్రవాన్ని స్రవిస్తూ అందులో గుడ్లను పెడుతుంది. ఆ నురుగు కొద్దిసేపటికే గట్టిపడి 'ఊథెకా' అని పిలిచే ఒక సురక్షితమైన గుడ్ల కోశంగా మారుతుంది. మిడత జాతిని బట్టి, ఒక కోశంలో కొన్ని డజన్ల నుంచి వందల సంఖ్యలో గుడ్లు ఉంటాయి.

ఈ అద్భుతమైన గుడ్ల కోశం ఒక సహజమైన రక్షణ కవచంలా పనిచేస్తుంది. గుడ్ల నుంచి పిల్లలు బయటకు వచ్చే వరకు.. ఎండ తీవ్రతకు ఎండిపోకుండా (నిర్జలీకరణం చెందకుండా), వాతావరణ మార్పుల నుంచి, ఇతర శత్రు జీవుల దాడుల నుంచి ఈ కోశమే గుడ్లను కాపాడుతుంది.

సంతానోత్పత్తి కాలంలో ఈ 'ఊథెకా' గుడ్ల కోశాలు ఎక్కువగా గడ్డి పరకలు, పొదలు, చెట్ల కొమ్మలు లేదా కంచె స్తంభాలకు అంటుకుని కనిపిస్తుంటాయి.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,  ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)