You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
మొహర్రం ఊరేగింపులో ఎలుకల మందు నింపిన క్యాప్సుల్స్ పంచిపెట్టిన వ్యక్తి అరెస్ట్, అసలేం జరిగింది?
- రచయిత, అల్పేష్ కర్‌కరే
- హోదా, బీబీసీ ప్రతినిధి
- ప్రచురణ
- చదివే సమయం: 5 నిమిషాలు
ముంబైలో మొహర్రం ఊరేగింపులో ఎలుకల మందు కలిపిన క్యాప్సుల్స్‌ను పంపిణీ చేస్తున్న వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు.
ఊరేగింపులో వీటిని పంచుతూ, అనుమానాస్పదంగా కనిపించిన వ్యక్తిని బైకుల్లా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అతని నుంచి సుమారు 15 వేల విషపూరిత క్యాప్సుల్స్ స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు.
ఇవి నొప్పినివారణ క్యాప్సుల్స్ అని అనుమానితుడు చెబుతున్నప్పటికీ, వాటిని తీసుకున్న ఓ వ్యక్తికి కడుపులో తిప్పడం, వాంతులు అయినట్టు సమాచారం.
ఈ ఘటనపై సమగ్ర దర్యాప్తు జరపాలని ఎంఐఎం సహా పలు ప్రతిపక్షాలు డిమాండ్ చేశాయి.
మొహర్రం ఊరేగింపులో పాల్గొన్న వారిని లక్ష్యంగా చేసుకోవడమే తన ఉద్దేశమని నిందితుడు అంగీకరించినట్లు ముంబై పోలీసులు తెలిపారు. నిందితుడు 50 కిలోల జింక్ ఫాస్ఫైడ్, 30 వేల ఖాళీ క్యాప్సూల్స్‌ను కొనుగోలు చేసినట్లు పోలీసులు తెలిపారు. అతడి వద్ద నుంచి మొత్తం 14,900 క్యాప్సూల్స్‌ను స్వాధీనం చేసుకున్నారు.
మహారాష్ట్ర కాంగ్రెస్ నేత హుస్సేన్ దల్వీ ఈ ఘటనపై సమగ్ర, నిష్పాక్షిక దర్యాప్తు జరపాలని డిమాండ్ చేశారు.
"ఇది చాలా తీవ్రమైన విషయం. దీని వెనుకున్న నిజాలను వెలికితీయడం, బాధ్యులను గుర్తించడం అవసరం. ఓ పండుగ సందర్భంగా ఇలాంటి ఘటనలు జరగడం సమాజంలో విద్వేషం ఎంతగా పెరిగిందో సూచిస్తోంది" అన్నారు.
అయితే నిందితుడి ఈ చర్యకు ఎందుకు పాల్పడ్డాడు, అతని ఉద్దేశమేమిటనే విషయాలు ఏవీ వెల్లడి కాలేదు. దీనిపై పోలీసుల దర్యాప్తు కొనసాగుతోంది.
అసలింతకీ ఏం జరిగింది?
నిందితుడిని పుణెలోని విమాన్ నగర్‌కు చెందిన 39 ఏళ్ల ఫయాజ్ నిసార్ ప్రేమ్‌జీగా గుర్తించారు.
భారతీయ న్యాయసంహితలోని 109, 110, 123 సెక్షన్ల కింద కేసు నమోదు చేసి నిందితుడిని అరెస్టు చేశారు.
"జూన్ 27న జరిగిన ఊరేగింపులో మాత్రలు పంపిణీ చేస్తున్న వ్యక్తిని బైకుల్లా పోలీసులు అరెస్టు చేశారు. ఆ మాత్రలు నొప్పి నివారణవని అతడు పేర్కొన్నాడు. అయితే వాటిని తీసుకున్న ఒక వ్యక్తికి వాంతులు, అస్వస్థత కలిగినట్లు సమాచారం"అనిముంబై జోన్-1 డీసీపీ జయంత్ మీనా తెలిపారు.
పోలీసుల అప్రమత్తత కారణంగానే ఈ మాత్రల పంపిణీని అడ్డుకోగలిగామని ఆయన తెలిపారు.
అస్వస్థతకు గురైన వ్యక్తి ప్రస్తుతం ప్రమాదం నుంచి బయటపడ్డారు. ఆయన ఫిర్యాదు మేరకు బైకుల్లా పోలీస్ స్టేషన్‌లో బీఎన్ఎస్‌లోని సెక్షన్ 123 కింద కేసు నమోదు చేశారు.
ఇప్పటివరకు 14,900 క్యాప్సూల్స్‌ను స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు.
"ఉదయం 4 గంటల సమయంలో సల్మాన్ అనే వ్యక్తి క్యాప్సూల్ తీసుకున్న తర్వాత వాంతులు, కడుపు నొప్పితో బాధపడుతున్నట్లు ఫిర్యాదు చేశాడు. దీంతో పోలీసులు దర్యాప్తు ప్రారంభించి నిందితుడికోసం గాలించి అతనిని అరెస్టు చేశారు" అని డీసీపీ జయంత్ మీనా వార్తా సంస్థ ఏఎన్‌ఐతో అన్నారు.
"ఊరేగింపును లక్ష్యంగా చేసుకుని భారీ స్థాయిలో నష్టం కలిగించేందుకు కుట్ర పన్నినట్లు నిందితుడు అంగీకరించాడు. ఇందుకోసం అతను 50 కిలోల జింక్ ఫాస్ఫైడ్, 30 వేల ఖాళీ క్యాప్సూల్స్‌ను సేకరించాడు. గత 15 రోజులుగా ముంబైలో ఉంటూ వాటిలో విషపదార్థాన్ని నింపాడు. వీటిని నొప్పి నివారణ మాత్రలుగా పంపిణీ చేయాలనుకున్నాడు" అని ఆయన చెప్పారు.
"ముంబై పోలీసుల సమయానికి స్పందించడం వల్లే పెద్ద ప్రమాదం, ప్రాణనష్టం తప్పింది. ఇప్పటివరకు 14,900 క్యాప్సూల్స్‌ను స్వాధీనం చేసుకున్నాం. మిగిలిన క్యాప్సూల్స్, రసాయనాలపై దర్యాప్తు కొనసాగుతోంది" అని తెలిపారు.
‘ప్రేమ్‌జీ ఓ పావు మాత్రమే’
రంగుల వ్యాపారం చేసే నిందితుడు తన వ్యాపారం ద్వారా ఈ రసాయనాలను తెప్పించుకున్నట్టు , క్యాప్సూల్స్‌ను ఆన్‌లైన్‌లో ఆర్డర్ చేసినట్లు డీసీపీ తెలిపారు. ఈ ఘటనకు, నిందితుడు చేసిన విదేశీ పర్యటనలకుసంబంధం ఉందా, ముంబైతో అతని సంబంధాలు ఏమిటనే విషయాలను దర్యాప్తు చేస్తున్నారు.
"ఆ ఊరేగింపులో నేను కూడా పాల్గొన్నాను.నేను కూడా దీని బారిన పడి ఉండొచ్చు. ఎవరైనా నాక్కూడా ఇలాంటి మాత్రలు ఇచ్చి ఉండవచ్చు. కానీ అల్లాహ్ దయతో నాకెవరూ అలాంటి క్యాప్సుల్స్ ఇవ్వలేదు’’ అని ఎమ్ఐఎమ్ నేత వారిస్ పఠాన్ అన్నారు.
"ఊరేగింపు సమయంలో ఫయాజ్ ప్రేమ్‌జీ అనే వ్యక్తి విషం కలిపిన క్యాప్సూల్స్‌ను ప్రజల్లో పంపిణీ చేశారు. వాటిని తీసుకున్న తర్వాత పలువురు అస్వస్థతకు గురయ్యారు. కొందరిని ఆసుపత్రికి తరలించారు. ప్రేమ్‌జీ కేవలం ఒక పావు మాత్రమే. అతడి వెనుక ఉన్న వారిని కూడా అరెస్టు చేయాలి" అని ఆల్ ఇండియా షియా పర్సనల్ లా బోర్డు ప్రధాన కార్యదర్శి మౌలానా యాసూబ్ అబ్బాస్ తెలిపారు.
జింక్ ఫాస్ఫైడ్ అంటే ఏంటి?
జింక్ ఫాస్ఫైడ్ అత్యంత విషపూరిత రసాయనం. ప్రధానంగా ఎలుకలు, ఇతర జంతువులను చంపడానికి దీన్ని ఉపయోగిస్తారు.
జింక్, ఫాస్ఫరస్ మూలకాలతో ఏర్పడే ఈ సమ్మేళనం రసాయన సూత్రం Zn₃P₂. ఇది నలుపు లేదా బూడిద రంగు పొడి రూపంలో ఉంటుంది. చిన్న గుళికలుగానూ లభిస్తుంది.
జింక్ ఫాస్ఫైడ్ కడుపులోని ఆమ్లాలతో కలిసి ఫాస్ఫిన్ అనే అత్యంత విషపూరిత వాయువును ఉత్పత్తి చేస్తుంది. ఈ వాయువు శక్తిని ఉత్పత్తి చేయకుండా శరీరాన్ని అడ్డుకుంటుంది. ఇది గుండె, ఊపిరితిత్తులు, కాలేయంపై తీవ్ర ప్రభావం చూపుతుందని నిపుణులు చెబుతున్నారు.
జింక్ ఫాస్ఫైడ్‌ను ప్రధానంగా పంటలకు నష్టం చేసే ఎలుకల నియంత్రణకు ఉపయోగిస్తారు.
ధాన్యం నిల్వ కేంద్రాలు, పొలాలు, తోటలు, రహదారుల పక్కన ఉన్న బహిరంగ ప్రదేశాల్లో కూడా దీన్ని వినియోగిస్తారు.
చాలా సందర్భాల్లో దీన్ని ధాన్యం, పశుగ్రాసంతో కలిపి ఉపయోగిస్తారు.
జింక్ ఫాస్ఫైడ్ అనుకోకుండా మింగినా, ఫాస్ఫిన్ వాయువును పీల్చినా ప్రాణాంతకంగా మారే అవకాశం ఉంది.
అందుకే అనేక దేశాల్లో దీని వినియోగంపై కఠిన నిబంధనలు అమల్లో ఉన్నాయి. సాధారణ ప్రజలకు ఇది సులభంగా అందుబాటులో ఉండదు.
గతంలో ముంబైలోని పైధుని ప్రాంతంలో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మరణించిన ఘటనలో కూడా ఫోరెన్సిక్ నివేదికలో జింక్ ఫాస్ఫైడ్ ప్రస్తావన వచ్చింది.
వైద్యులేమంటున్నారు?
"జింక్ ఫాస్ఫైడ్ అత్యంత విషపూరిత రసాయనం. దీన్ని ఎలుకలను చంపడానికి ఉపయోగిస్తారు" అని ముంబైకు చెందిన డాక్టర్ భూషణ్ రోక్డే తెలిపారు.
"ఇది సాధారణంగా నలుపు లేదా బూడిద రంగు పొడి రూపంలో ఉంటుంది. అయితే వినియోగాన్ని బట్టి వివిధ రూపాల్లో మార్కెట్లో లభిస్తుంది" అని ఆయన చెప్పారు.
"గిడ్డంగులు, ధాన్య నిల్వ కేంద్రాలు, వ్యవసాయ క్షేత్రాల్లో ఎలుకలను చంపడానికి, వాటివల్ల కలిగే నష్టాన్ని తగ్గించడానికి దీన్ని ఉపయోగిస్తారు. ఇది మనుషులు, పెంపుడు జంతువులకు అత్యంత హానికరం" అని ఆయన తెలిపారు.
"ఈ రసాయనం శరీరంలోకి ప్రవేశించిన తర్వాత తేమతో కలిసినప్పుడు ఫాస్ఫిన్ వాయువును ఉత్పత్తి చేస్తుంది. ఈ వాయువు అత్యంత ప్రమాదకరం" అని డాక్టర్ రోక్డే పేర్కొన్నారు.
"ఈ వాయువు ఆక్సిజన్‌ను వినియోగించకుండా శరీరాన్ని అడ్డుకుంటుంది. దీంతో అనేక అవయవాలు తీవ్రంగా దెబ్బతింటాయి. వాంతులు, వెల్లుల్లి వాసన రావడం, ఛాతీలో బరువుగా అనిపించడం, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, షాక్ లాంటి లక్షణాలు కనిపిస్తాయి. చిన్న మోతాదులు కూడా ప్రాణాంతకంగా మారవచ్చు" అని ఆయన వివరించారు.
"దీనికి ప్రత్యేకంగా విరుగుడు మందంటూ ఏదీ లేదు. అందువల్ల రోగిని ఆసుపత్రిలో చేర్చి అవసరమైన సహాయక చికిత్స మాత్రమే అందిస్తారు. ఈ రసాయనాన్ని పిల్లలకు, ఆహార పదార్థాలకు దూరంగా ఉంచాలి" అని ఆయన సూచించారు.
"అనుకోకుండా మింగినా లేదా విషప్రయోగం జరిగిందనే అనుమానం ఉన్నా, వాంతులు చేయించడానికి ప్రయత్నించకూడదు. బాధితులని వెంటనే సమీప ఆసుపత్రికి తరలించాలి" అని డాక్టర్ రోక్డే తెలిపారు.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్, ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)