‘డ్యాన్సింగ్ గర్ల్’: టెక్ట్స్‌బుక్‌లో ఈ ఫోటోను ఎందుకు మాస్క్ చేశారు, మళ్లీ ఎందుకు తొలగించారు? వివాదానికి కారణమేంటి...

ఫొటో సోర్స్, NCERT
- రచయిత, శర్లీన్ మోలన్
- హోదా, బీబీసీ ప్రతినిధి
- ప్రచురణ
- చదివే సమయం: 3 నిమిషాలు
పాఠ్యపుస్తకాలలో మొహెంజొదారో ‘డాన్సింగ్ గర్ల్’ శిల్పం నగ్నభాగాలను కప్పిపుచ్చడంపై చరిత్రకారులు, విద్యావేత్తల నుంచి తీవ్ర వ్యతిరేకత రావడంతో ఆ చిత్రాన్ని ఉపసంహరించుకున్నారు.
‘డాన్సింగ్ గర్ల్’గా ప్రసిద్ధి చెందిన మొహెంజొదారోకు చెందిన ఈ కాంస్య శిల్పం ఓ అమ్మాయి తన చేతిని నడుముపై ఉంచి నిల్చున్న భంగిమలో ఉంటుంది. సింధులోయ నాగరికతకు చెందిన అత్యంత గుర్తింపు పొందిన కళాఖండాల్లో ఇది ఒకటి.
అయితే తాజాగా విడుదలైన 9వ తరగతి పాఠ్యపుస్తకంలో ఆ విగ్రహ భాగాలను ముదురు రంగుతో మాస్క్ చేసి శరీరాకృతి కనపడకుండా చేశారు.
దీనిపై వివాదం చెలరేగడంతో పుస్తకం డిజిటల్ వెర్షన్‌లో అసలు చిత్రాన్ని పునరుద్ధరించా మని, కొత్తగా ప్రింట్ చేసే ఎడిషన్స్‌లో కూడా ఎలాంటి మార్పులు చేయని అసలు ఫోటోనే ప్రచురిస్తామని అధికారులు తెలిపారు.
ఈ ఫోటోలో మార్పులు చేసిన విషయం బయటకు రాగానే చరిత్రకారులు ఎన్‌సీఈఆర్‌టీపై విమర్శలు చేశారు. ప్రసిద్ధ కళాఖండం అసలు రూపం మార్చి దాని సహజత్వాన్ని దెబ్బతీశారని ఆరోపించారు.

‘మార్చడానికి కారణం?’
కేంద్ర విద్యాశాఖ పరిధిలో స్వయంప్రతిపత్తి కలిగిన సంస్థ అయిన ఎన్‌సీఈఆర్‌టీ... సీబీఎస్ఈ సిలబస్ చదివే విద్యార్థులకు పాఠ్యాంశాలు, పాఠ్యపుస్తకాలను పర్యవేక్షిస్తుంటుంది.
మార్పులు చేసిన చిత్రాన్ని పాఠ్యపుస్తకం నుంచి తొలగిస్తున్నట్టు ఎన్‌సీఈఆర్‌టీ డైరెక్టర్ దినేశ్ సక్లాని చెప్పారు. ‘‘నిపుణులతో సంప్రదింపుల అనంతరం డ్యాన్సింగ్ గర్ల్ చిత్రాన్ని అసలు రూపంలోనే తిరిగి చేర్చాలని నిర్ణయించినట్టు’’ సక్లానీ ఏఎన్ఐ వార్తా సంస్థకు చెప్పారు. దీనిపై స్పందించాల్సిందిగా బీబీసీ సక్లానీని సంప్రదించింది.
దేశంలో స్కూల్ పిల్లల పాఠ్యాంశాల్లో సింధులోయ నాగరికతపై ఓ అధ్యాయం ఉంది. డ్యాన్సింగ్ గర్ల్ శిల్పం దశాబ్దాలుగా పాఠ్యపుస్తకాల్లో కనిపిస్తోంది. ఎన్‌సీఈఆర్‌టీ టెక్స్ట్ బుక్స్ తొలి వెర్షన్లలో కూడా ఇది ఉంది. కానీ ఇలా శరీరభాగాలను కప్పిన ఫోటో ప్రచురించడం గతంలో ఎప్పుడూ జరగలేదు. బొమ్మలో ఎందుకు మార్పులు చేశామో ఎన్‌సీఈఆర్‌టీ ఇంకా చెప్పడం లేదు. నగ్నత్వంపై ఉన్న అభ్యంతరాలతోనే అలా చేశారని మీడియాలో కథనాలు వచ్చాయి.

ఫొటో సోర్స్, ANI
‘విజ్ఞానానికి చిహ్నంగా’
ఈ విషయాన్ని ముందుగా వెలుగులోకి తెచ్చిన ఇండియన్ ఎక్స్‌ప్రెస్ పత్రిక తన సంపాదకీయంలో చిత్రంలో మార్పులు చేయడంపై విమర్శలు చేసింది.
‘‘డాన్సింగ్ గర్ల్ విలువలను మర్యాద పేరుతో సెన్సార్ చేయడం ద్వారా కొలవలేం. అది వ్యక్తం చేసే కళాత్మకత, ఆత్మవిశ్వాసం, వ్యక్తిత్వమే దాని అసలు విలువ. నిజమైన ప్రపంచంలో ఎలా బతకాలో నేర్పించడం విద్య అసలు ఉద్దేశం. ఈ కాలానికి చెందినవారినైనా, వేల సంవత్సరాల క్రితం వారినైనా విద్యార్థులను, మహిళలను ఎన్‌సీఈఆర్‌టీ మరింత స్వేచ్ఛ, ఆత్మవిశ్వాసం ఉన్నవారిగా చూడాలి'' అని ఇండియన్ ఎక్స్‌ప్రెస్ రాసింది.
ఎన్‌సీఈఆర్‌టీ కొత్తగా తీసుకొచ్చిన ఆర్ట్స్ ఎడ్యుకేషన్ సిరీస్‌లో ఈ టెక్స్ట్‌బుక్ భాగం. తాజా జాతీయ విద్యా విధానం(ఎన్ఈపీ)కింద దృశ్యం, సాహిత్యం వంటి వాటిని ప్రధాన విద్యావ్యవస్థలో భాగం చేయడానికి దీన్ని ప్రవేశపెట్టారు.
ప్రాచీన సింధులోయ నాగకరితలోని మొహంజొదారోలో బయటపడిన డ్యాన్సింగ్ గర్ల్ శిల్పం ఆభరణాలు వేసుకుని, జుట్టు ముడివేసుకుని కనిపిస్తుంది.
ఈ శిల్పంలో గొప్ప కళాత్మక విలువ ఉందని, లోహశాస్త్రంపై సింధులోయ నాగరికత అధునాతన జ్ఞానానికి ఇది నిదర్శనమని పురావస్తు శాస్త్రవేత్తలు చాలా కాలంగా భావిస్తున్నారు.
ప్రస్తుతం ఆ శిల్పం దిల్లీలోని జాతీయ మ్యూజియంలో ఉంది.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్, ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

























