ముట్టుకుంటే ముడుచుకుపోయే 'అలుగు'ను ఎందుకు వేటాడుతున్నారు? ఆ పొలుసులే కారణమా?

పాంగోలిన్, అలుగు అక్రమ రవాణా

ఫొటో సోర్స్, Kelsey Skinner

ఫొటో క్యాప్షన్, పొలుసులు కలిగిన ప్రపంచంలోని ఏకైక క్షీరదం అలుగు.
    • రచయిత, కలిస్టస్ బోసలెస్వె
    • హోదా, బీబీసీ ప్రతినిధి
  • ప్రచురణ
  • చదివే సమయం: 6 నిమిషాలు

దక్షిణాఫ్రికాలోని జోహన్నెస్‌బర్గ్ వీధుల్లో 2021లో అక్రమ రవాణాదారుల నుంచి మూడు నెలల అలుగు (పాంగోలిన్) పిల్లను రక్షించారు. ఆ వయసులో తల్లి వద్ద ఉండాల్సిన ఆ పిల్లకు వైద్య నిపుణురాలు కెల్సీ స్కిన్నర్ ఆరు నెలల పాటు పిల్లి పాలు ఆహారంగా ఇచ్చారు. ఆ తర్వాత సొంతంగా ఆహారం వెతుక్కునేలా శిక్షణ ఇచ్చారు.

టెమ్మింక్స్ జాతికి చెందిన స్టీవీకి ఆ పేరు పెట్టడం వెనుక ఒక కారణం ఉంది. తప్పించుకు తిరుగుతున్న పాంగోలిన్ అక్రమ రవాణాదారుడు ఈ పిల్లను అమ్మడానికి ప్రయత్నిస్తున్నప్పుడు, ఆయన్ను పట్టుకోవడంలో దక్షిణాఫ్రికా పోలీస్ సర్వీస్ అధికారి స్టీవెన్ కోయెన్ కీలక పాత్ర పోషించారని స్కిన్నర్ చెప్పారు.

ప్రపంచంలో పొలుసులు కలిగిన ఏకైక క్షీరదం అలుగు. ఇవి చీమలు, చెదపురుగులను తింటాయి. ప్రపంచంలో అత్యధికంగా అక్రమ రవాణాకు గురవుతున్న వన్యప్రాణి కూడా ఇదే.

2000 నుంచి 2016 మధ్య అంతర్జాతీయంగా 10 లక్షలకు పైగా అలుగులు అక్రమ రవాణాకు గురైనట్లు అంచనా. అలాగే 2016 నుంచి 2024 వరకు పట్టుబడిన అలుగు ఉత్పత్తులను బట్టి చూస్తే, ఈ కాలంలో కనీసం మరో 5 లక్షల అలుగులు అక్రమ రవాణాకు గురైనట్లు తెలుస్తోంది.

అయితే, పట్టుబడిన అలుగులు బోనుల్లో ఎక్కువ కాలం జీవించలేవు. కాబట్టి వాటిని తిరిగి కోలుకునేలా చేయడం చాలా కష్టం. జోహన్నెస్‌బర్గ్ వన్యప్రాణి ఆసుపత్రిలో స్కిన్నర్ వంటి నిపుణుల పర్యవేక్షణలో, ఆ తర్వాత విడుదల చేసే పరిసరాలకు అలవాటు పడేలా చేసిన శిక్షణతో స్టీవీ 2022లో విజయవంతంగా తిరిగి అడవిలోకి చేరింది.

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్
ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి
పాంగోలిన్, అలుగు అక్రమ రవాణా

ఫొటో సోర్స్, Gareth Thomas

ఫొటో క్యాప్షన్, మన్యోని ప్రైవేట్ గేమ్ రిజర్వ్‌లో నడకకు వెళ్లినప్పుడు స్టీవీ తన పొడవైన నాలుకను బయటకు చాచింది. అలుగులు పుట్టల నుంచి చీమలు, చెదపురుగులను బయటకు తీయడానికి ఈ నాలుకను ఉపయోగిస్తాయి.

అలుగుల అక్రమ రవాణాకు కారణం?

ఆఫ్రికా అలుగులు ప్రస్తుతం ప్రపంచంలోనే అతిపెద్ద వ్యవస్థీకృత నేర రంగాలలో ఒకటైన అక్రమ వన్యప్రాణి రవాణాకు ప్రధాన కేంద్రంగా మారాయి. వీటికి తూర్పు ఆసియా దేశాల్లో భారీ డిమాండ్ ఉంది. అక్కడ వీటి పొలుసులను సంప్రదాయ వైద్యంలో ఉపయోగిస్తారు, వీటి మాంసాన్ని విలాసవంతమైన ఆహారంగా భావిస్తారు. ఫ్యాషన్ పరిశ్రమ కారణంగా అమెరికా కూడా వీటికి పెద్ద మార్కెట్‌గా మారింది. అలుగుల అంతర్జాతీయ వాణిజ్యాన్ని పూర్తిగా నిషేధిస్తూ 2016లో దేశాలు చట్టం చేసినప్పటికీ, అక్రమ రవాణా మాత్రం కొనసాగుతూనే ఉంది.

అక్రమ రవాణా కారణంగా ఆసియా అలుగులు అంతరించిపోయే దశకు చేరుకున్నాయి. దీనివల్ల ఇప్పుడు ఆఫ్రికా ఖండం ఈ అక్రమ ప్రపంచ మార్కెట్‌కు ప్రధాన వనరుగా మారింది. అక్రమ రవాణా, నివాస ప్రాంతాల నాశనం, స్థానికుల వేట (సంప్రదాయ వైద్యం, మాంసం కోసం) వంటి కారణాల వల్ల ఇప్పుడు ఆఫ్రికాలోని నాలుగు పాంగోలిన్ జాతులు అంతరించిపోయే ప్రమాదంలో పడ్డాయి.

అలుగుల అక్రమ రవాణాకు, దేశీయ వినియోగానికి దక్షిణాఫ్రికా ఒక ప్రధాన కేంద్రంగా మారింది. ఆఫ్రికన్ పాంగోలిన్ వర్కింగ్ గ్రూప్ (ఏపీడబ్ల్యూజీ) వంటి స్వచ్ఛంద సంస్థలు దేశ రక్షణ విభాగాలకు అండగా నిలుస్తూ వేటగాళ్లను పట్టుకునే ఆపరేషన్లు నిర్వహిస్తున్నాయి. ఇటీవలి సంవత్సరాలలో ఈ దేశంలో పెద్ద సంఖ్యలో పాంగోలిన్‌లను స్వాధీనం చేసుకున్నారు.

ఇంటెలిజెన్స్ సమాచారం ఆధారంగా జరిపే దాడులు లేదా వాహనాల తనిఖీలలో రవాణాదారుల నుంచి అలుగులను రక్షిస్తామని ఏపీడబ్ల్యూజీ కో-చైర్, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ అలెక్సిస్ క్రిల్ చెప్పారు. అక్రమ రవాణాకు గురైన పాంగోలిన్‌లలో తాము చాలా తక్కువ శాతాన్ని మాత్రమే రక్షించగలుగుతున్నామని, మిగిలినవి ఎక్కడికి వెళ్తున్నాయో తెలియడం లేదని ఆమె అన్నారు.

2008లో తన వద్దకు వచ్చిన మొదటి పాంగోలిన్ గురించి ఏపీడబ్ల్యూజీ కో-చైర్, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ నిక్కీ రైట్ గుర్తు చేసుకున్నారు. అప్పట్లో అలుగుల సంరక్షణపై ఎలాంటి అనుభవం లేకపోవడం వల్ల, దాన్ని అడవిలో వదిలిపెట్టడం తప్ప ఏమీ చేయలేకపోయానని ఆమె చెప్పారు. అప్పటి నుంచి వన్యప్రాణి రవాణాదారుల నుంచి రక్షించిన అలుగులకు ఎలా సహాయం చేయాలో ఆమె ఆచరణాత్మకంగా అర్థం చేసుకున్నారు.

'కొంతమంది వీటిని సంచులలో కుక్కి కార్ల డిక్కీలో దాచిపెడతారు' అని రైట్ చెప్పారు.

ఇలాంటి పరిస్థితుల్లో వారాల తరబడి ఉంచడం వల్ల వాటికి గాయాలు కావడం, డీహైడ్రేషన్ రావడం, రోగనిరోధక శక్తి తగ్గిపోవడం జరుగుతుందని తెలిపారు.

సరైన వైద్యం అందించకుండా వాటిని నేరుగా అడవిలో వదిలేస్తే, అవి త్వరగా చనిపోయే ప్రమాదం ఉందని, అందుకే విడుదల చేయడానికి ముందు వాటికి చికిత్స, పునరావాసం అవసరమని ఆమె అన్నారు.

పాంగోలిన్, అలుగు అక్రమ రవాణా

ఫొటో సోర్స్, Claire West

ఫొటో క్యాప్షన్, పశువైద్య నిపుణురాలు కెల్సీ స్కిన్నర్ స్టీవీకి పిల్లి పాల ఫార్ములాను ఆహారంగా ఇస్తూ, కొన్ని నెలల పాటు దాని సంరక్షణ బాధ్యతలు చూసుకున్నారు.

అడవిలోకి స్టీవీ

స్టీవీ(అలుగు) ఒక కారు డిక్కీలోని కార్డ్‌బోర్డ్ పెట్టెలో దొరికిందని రైట్ చెప్పారు. ఆ పెట్టెలో క్యాబేజీ ఆకు ఉందని, బహుశా దానికి ఆహారంగా వేసి ఉండవచ్చని, కానీ అలుగులు క్యాబేజీ తినవని ఆమె అన్నారు.

స్టీవీని జోహన్నెస్‌బర్గ్ వన్యప్రాణి ఆసుపత్రికి తరలించారు. అక్కడ వెటర్నరీ డాక్టర్ స్కిన్నర్ దానికి అవసరమైన అన్ని పరీక్షలు చేశారు. బరువు చూడటం, గాయాలు లేదా ఇన్ఫెక్షన్లను పరీక్షించడం, డీహైడ్రేషన్ తగ్గించడానికి ఫ్లూయిడ్ థెరపీ ఇవ్వడం, అవయవాల ఆరోగ్యాన్ని తెలుసుకోవడానికి రక్త పరీక్షలు చేయడం వంటివి నిర్వహించారు. రోగనిరోధక శక్తిని పెంచే మందులు, ట్యూబ్ ద్వారా ఎలక్ట్రోలైట్ ఆహారాన్ని అందించారు.

చాలా పాంగోలిన్‌లలా కాకుండా, స్టీవీ ఆరోగ్యంగా ఉండటం ఒక మంచి పరిణామం. అది చాలా చురుగ్గా ఉంటూ సులభంగా కదలగలిగింది. అయినప్పటికీ, ఆ పిల్ల పొలుసులు వేటాడే జంతువుల నుంచి రక్షించుకునేంత గట్టిగా లేవు. పైగా అది చాలా భయపడుతూ, ఎవరైనా దగ్గరకు వస్తే బంతిలా ముడుచుకునేదని స్కిన్నర్ చెప్పారు. అది తనతో అలవాటు పడటానికి ఆమె దానితో ఒంటరిగా చాలా సమయం గడిపారు.

అది ఇంకా తల్లి పాలు తాగే వయసులో ఉండటం వల్ల, స్కిన్నర్ దానికి పిల్లి పాల ఫార్ములాను బాటిల్ ద్వారా ఇచ్చారు. ఆరు నెలల వయసులో పాలు తాగడం మానేశాక అది రోజురోజుకూ బలంగా మారింది. తొమ్మిది నెలల వయసులో 6 కిలోల బరువుకు చేరుకున్నాక, దాన్ని జూలూలాండ్‌లోని 'మన్యోని ప్రైవేట్ గేమ్ రిజర్వ్' అనే ప్రాంతానికి మార్చారు. ఈ బరువు ఉన్నప్పుడు అలుగులు తమను తాము రక్షించుకోవడానికి బంతిలా గట్టిగా ముడుచుకోగలవని, శత్రువుల దాడులను తట్టుకునేలా వాటి పొలుసులు గట్టిపడతాయని స్కిన్నర్ చెప్పారు.

14 నెలల వయసు వచ్చేసరికి అది సొంతంగా జీవించగల సామర్థ్యాన్ని సాధించింది. దానికి రెండు టెలిమెట్రీ ట్రాకర్లను అమర్చి పూర్తిగా అడవిలోకి విడుదల చేశారు.

ఈ ట్రాకర్లు అలుగుల సహజ కదలికలు, ప్రవర్తనలు, వాటికి ఎదురయ్యే ప్రమాదాలను గమనించడానికి నిపుణులకు సహాయపడతాయి. విద్యుత్ కంచెలు పాంగోలిన్లకు పెద్ద ముప్పుగా మారాయని, అలాగే కొన్ని సహజ ప్రమాదాలు కూడా జరుగుతాయని రైట్ చెప్పారు.

''ఒక అలుగు ఏనుగు కాళ్ల కింద పడి చనిపోగా, మరొకటి మొసలికి ఆహారమైంది, ఈ టెలిమెట్రీ ట్యాగ్‌లు లేకపోతే ఈ సమాచారం తెలిసేది కాదు'' అని ఆమె అన్నారు.

స్టీవీ ఇప్పుడు క్రమం తప్పకుండా ఆడ అలుగులను కలుస్తోందని, వాటి నివాసాలకు వెళ్తోందని ట్రాకర్ ఆధారంగా రైట్ చెప్పారు. స్టీవీ ఇప్పుడు కొన్ని పాంగోలిన్ పిల్లలకు తండ్రి అయి ఉంటుందని స్కిన్నర్ నమ్మకంగా చెప్పారు.

'పాంగలోరియం' కేంద్రం

ఏనుగులు, బిగ్ క్యాట్స్ (సింహాలు, పులులు) వంటి వన్యప్రాణులకు లభించే నిధులు, చట్టపరమైన రక్షణలు పాంగోలిన్ల వంటి జీవులకు లభించడం కష్టమని అమెరికాకు చెందిన స్వచ్ఛంద సంస్థ 'వైల్డ్‌లైఫ్ కన్జర్వేషన్ నెట్‌వర్క్' పాంగోలిన్ క్రైసిస్ ఫండ్ డైరెక్టర్ అరలుయెన్ షున్‌మాన్ చెప్పారు.

దక్షిణాఫ్రికాలోని 'లపలాలా వైల్డర్నెస్ రిజర్వ్'లో అలుగుల కోసం 2025 ఫిబ్రవరిలో 'పాంగలోరియం' అనే ప్రత్యేక పునరావాస కేంద్రాన్ని ఏపీడబ్ల్యూజీ సంస్థ ఏర్పాటు చేసింది. ఇందులో స్కిన్నర్ మొదటి వెటర్నరీ డాక్టర్‌గా బాధ్యతలు చేపట్టారు. ఈ కేంద్రం అక్రమ రవాణా నుంచి రక్షించిన అలుగులకు ప్రత్యేక సంరక్షణ అందించడమే కాకుండా, పరిశోధనలకు, అవగాహన కార్యక్రమాలకు వేదికగా పనిచేస్తోంది.

అలుగు జాతులను అంతరించిపోకుండా కాపాడటానికి ఆఫ్రికాలోని ఇతర దేశాలతో కలిసి పనిచేయడం, జ్ఞానాన్ని పంచుకోవడం చాలా ముఖ్యమని రైట్ చెప్పారు.

పాంగోలిన్, అలుగు అక్రమ రవాణా

ఫొటో సోర్స్, Kelsey Skinner

ఫొటో క్యాప్షన్, ప్రపంచంలోని ఎనిమిది అలుగు జాతులు కూడా అంతరించిపోయే ముప్పులో ఉన్నట్లు ఇంటర్నేషనల్ యూనియన్ ఫర్ కన్జర్వేషన్ ఆఫ్ నేచర్ రెడ్ లిస్ట్‌లో నమోదయ్యాయి.

'దిట్సి' కథ

2021లో వాయువ్య దక్షిణాఫ్రికాలోని వ్రైబర్గ్ పట్టణానికి సమీపంలో రక్షణ విభాగం అధికారులు 'దిట్సి' అనే మరో అలుగు పిల్లను ఒక రవాణాదారుడి నుంచి రక్షించారు. దిట్సికి ఎలాంటి గాయాలు కాలేదని, కానీ అది తీవ్రమైన మానసిక ఆందోళన, ఒత్తిడికి గురైందని రైట్ చెప్పారు.

దిట్సి మొదట్లో భయపడినప్పటికీ, ప్రతిరోజూ బయటకు తీసుకెళ్లినప్పుడు సొంతంగా ఆహారాన్ని వెతుక్కోగలిగిందని రైట్ తెలిపారు. ఆ తర్వాత దిట్సిని కూడా మన్యోని ప్రైవేట్ గేమ్ రిజర్వ్‌లో ఉన్న స్టీవీ వద్దకు చేర్చారు. అడవిలోకి విడుదల చేయడానికి అవసరమైన 6 నుంచి 6.5 కిలోల బరువుకు అది చేరుకునేలా జాగ్రత్తలు తీసుకున్నారు. దానికి టెలిమెట్రీ ట్యాగ్‌ను అమర్చి, 2023 ఫిబ్రవరిలో అడవిలోకి విడుదల చేశారు.

''దిట్సి విడుదలైన రెండేళ్ల తర్వాత, దాని నివాసం వెలుపల ఏర్పాటు చేసిన కెమెరా ట్రాప్‌లలో ఒక దృశ్యం రికార్డైంది. దిట్సితో కలిసి ఒక చిన్న అలుగు పిల్ల గుహ నుంచి బయటకు రావడం కనిపించింది. అలా దిట్సి ఇప్పుడు ఒక తల్లిగా మారింది" అని రైట్ తెలిపారు.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,  ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)