బిహార్‌లో అధికార బీజేపీ, జేడీయూ కూటమిలో మరోసారి పొరపొచ్చాలు తలెత్తాయి.
బిహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ పార్టీ, ప్రతిపక్ష రాష్ట్రీయ జనతాదళ్ (ఆర్జేడీ) తమ ఎమ్మెల్యేలతో విడివిడిగా సమావేశమయ్యాయి.
అలాగే, హిందుస్థానీ అవామ్ మోర్చా, కాంగ్రెస్ కూడా తమ ఎమ్మెల్యేల సమావేశాన్ని ఏర్పాటు చేశాయి.
హిందుస్థానీ అవామ్ మోర్చా కూడా ఎన్డీఏలో ఒక భాగస్వామ్య పార్టీ.
నితీశ్ కుమార్, కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ ఫోన్‌లో మాట్లాడుకున్నారని మీడియాలో వార్తలు వచ్చాయి. ఈ సంభాషణ తరువాతే నితీశ్ కుమార్ ఎమ్మెల్యేల సమావేశానికి పిలుపునిచ్చారు.
ఆర్జేడీ, నితీశ్ కుమార్ మధ్య ఇప్పటికే చర్చలు జరుగుతున్నాయని చెబుతున్నారు. ఈమధ్య కాలంలో ఇద్దరూ ఒకరిపై ఒకరు దాడి చేసుకున్న సందర్భాలు లేవు. బహిరంగ ప్రకటనలలో కూడా ఒకరి పట్ల ఒకరు సహనంతో ఉన్నారు.
నితీశ్ కుమార్ తేజస్వి నివాసానికి ఇఫ్తార్ పార్టీకి వెళ్లారు. తరువాత తేజస్వి కూడా ముఖ్యమంత్రి నివాసంలో కనిపించారు.
ఆర్జేడీ రాష్ట్ర అధికార ప్రతినిధి ఇక్బాల్ అహమ్ షమీ బీబీసీ హిందీతో మాట్లాడుతూ, బిహార్‌లో ఆర్జేడీ అధికారంలోకి రాబోతోందని చెప్పారు. బీజేపీపై కలిసికట్టుగా పోరాడతామని అన్నారు.
ఇటీవల తేజస్వి యాదవ్ బిహార్‌లో ద్రవ్యోల్బణంపై నిరసన ప్రదర్శన చేశారు. ఆయనకు నిరసన తెలిపే హక్కు ఉందని జేడీయూ తేజస్వికి మద్దతిచ్చింది.
లాలూ యాదవ్ సన్నిహితుడు భోలా యాదవ్ నివాసంపై సీబీఐ దాడులు చేసింది. అప్పుడు కూడా జేడీయూ ప్రతికూలంగా స్పందించకుండా, మౌనం వహించిది. సాధారణంగా ఇలాంటి సందర్భాల్లో జేడీయూ,ఆర్జేడీలో అవినీతి పేరుకుపోయిందని దాడికి దిగుతుంది. కానీ ఈసారి అలా జరగలేదు.
సోమవారం జేడీయూ జాతీయ అధ్యక్షుడు లలన్ సింగ్ మాట్లాడుతూ, పార్టీ ఎమ్మెల్యేల సమావేశం ఏర్పాటు చేశామని, ఆర్‌సీపీ సింగ్ రాజీనామా తరువాత పరిస్థితులపై ఎమ్మెల్యేల అభిప్రాయం తెలుసుకునేందుకే సమావేశాన్ని ఏర్పాటు చేసినట్లు తెలిపారు.
మరోవైపు, రాష్ట్రీయ జనతాదళ్ కూడా మంగళవారం తన ఎమ్మెల్యేలతో సమావేశాన్ని ఏర్పాటు చేసింది.
నితీశ్ కుమార్ ఆర్జేడీతో చేయి కలుపుతారన్న వార్తలపై బిహార్ ఆర్జేడీ చీఫ్ జద్గానంద్ సింగ్ మాట్లాడుతూ, అలాంటి ప్రతిపాదన ఏదీ రాలేదని, అవన్నీ ఊహాగానాలని అన్నారు.
మరోవైపు, ఒప్పందం దాదాపు ఖాయమైందని, నాయకత్వ విషయంలో స్వల్ప భిన్నాభిప్రాయాలు ఉన్నాయని ఆర్జేడీ వర్గాలు చెబుతున్నాయి. అయితే, తేజస్వి యాదవ్ ఈ విషయంపై ఇంతవరకు ఎలాంటి ప్రకటన చేయలేదు.
డీల్ దాదాపు ఖాయమని, నితీశ్ కుమార్, ఆర్జేడీతో చేతులు కలుపుతున్నారని బిహార్ ఆర్జేడీ నేత ఒకరు బీబీసీతో అన్నారు.
243 మంది సభ్యులున్న బిహార్ అసెంబ్లీలో బీజేపీకి 77, జేడీయూకి 45, జితన్ రామ్ మాంఝీకి 4, ఆర్జేడీకి 79, కాంగ్రెస్‌కు 19, సీపీఐ-ఎంఎల్‌కు 12, సీపీఐకి 4, ఒవైసీకి 4 స్థానాలు ఉన్నాయి. ఒక స్వతంత్ర అభ్యర్థి ఉన్నారు.