ధన్యవాదాలు!
బీబీసీ న్యూస్ తెలుగు లైవ్ పేజీ అప్‌డేట్లను ఇక్కడితో ముగిస్తున్నాం.
You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
తైవాన్ ప్రజల మనోస్థైర్యాన్ని దెబ్బతీసేందుకు చైనా అన్ని ప్రయత్నాలు చేస్తోందని విదేశాంగ మంత్రి ఆరోపించారు.
బీబీసీ న్యూస్ తెలుగు లైవ్ పేజీ అప్‌డేట్లను ఇక్కడితో ముగిస్తున్నాం.
నేటి ముఖ్యాంశాలు బిహార్ ముఖ్యమంత్రి పదవికి నితీశ్ కుమార్ రాజీనామా చేశారు. తాము ఎన్డీయే కూటమి నుంచి తప్పుకుంటున్నట్లు ఆయన ప్రకటించారు. ఆర్జేడీ, కాంగ్రెస్‌లతో కూడిన మహఘట్‌బంధన్ సహకారంతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతున్నారు.
చైనా తమ దేశాన్ని ఆక్రమించేందుకు ప్రయత్నాలు చేస్తోందని తైవాన్ ఆరోపించింది. సైనిక విన్యాసాల పేరుతో తమ భూభాగంలో చైనా ఆయుధాలు ప్రయోగిస్తోందని తైవాన్ విదేశాంగ మంత్రి జోసెఫ్ వూ ఆరోపించారు.
తెలంగాణలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిశాయి. కుమ్రం భీము ఆసిఫాబాద్ జిల్లా వాంకిడి, కెరామెరి, కాగజ్ నగర్‌లలో అత్యధిక వర్షాపాతం నమోదయింది.
మహారాష్ట్రలో ఏక్‌నాథ్ షిండే ప్రభుత్వం మంత్రివర్గాన్ని విస్తరించింది. 18 మంది కొత్త మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు.
అమెరికా మాజీ అధ్యక్షుడు డోనల్డ్ ట్రంప్ ఇంట్లో ఎఫ్‌బీఐ సోదాలు చేసింది. ఒక బీరువాను బలవంతంగా తెరిచారని ట్రంప్ ఆరోపించారు.
బర్మింగ్‌హామ్ నుంచి పతకాలతో భారతదేశానికి తిరిగొచ్చిన ఆటగాళ్లకు దిల్లీ విమానశ్రయంలో ఘన స్వాగతం లభించింది.
అమెరికా హౌస్ స్పీకర్ నాన్సీ పెలోసీ రాకను సాకుగా పెట్టుకుని తమ దేశాన్ని ఆక్రమించుకునేందుకు చైనా ప్రయత్నిస్తోందని తైవాన్ విదేశాంగ మంత్రి జోసెఫ్ వూ ఆరోపించారు.
తమ దేశ సరిహద్దుల్లో చైనా భారీ సైనిక విన్యాసాలను కొనసాగిస్తోందని, ఇదే క్రమంలో తైవాన్ ను ఆక్రమించుకునేందుకు ప్రణాళికలు రచిస్తోందని జోసెఫ్ అన్నారు.
అయితే, తైవాన్ పై చైనా ఎప్పుడు దాడి చేయడానికి ప్లాన్ చేసిందన్న విషయాన్ని మాత్రం జోసెఫ్ వెల్లడించలేదు.
‘‘సైనిక విన్యాసాల పేరుతో చైనా తరచూ సరిహద్దులను దాటుతూ, మా ప్రాంతంలో ఆయుధాలను ప్రయోగిస్తోంది. తైవాన్ ప్రజల స్థైర్యాన్ని దెబ్బతీసేందుకు సాంకేతికంగా, ఆర్ధికంగా తైవాన్ ను బలహీన పరిచేందుకు చైనా సైబర్ దాడులు సహా అనేక ప్రయత్నాలు చేస్తోంది’’ అని జోసెఫ్ అన్నారు.
బిహార్ ముఖ్యమంత్రి పదవికి నితీశ్ కుమార్ రాజీనామా చేశారు. గవర్నర్ ఫాగు చౌహాన్‌ను కలిసి నితీశ్ తన రాజీనామాను సమర్పించారు.
గవర్నర్‌ను కలిసిన అనంతరం నితీశ్ కుమార్ విలేఖరులతో మాట్లాడుతూ, తాను రాజీనామా చేసినట్లు తెలిపారు. తమ పార్టీ ఎమ్మెల్యేలు, ఎంపీలంతా ఎన్డీయే నుంచి విడిపోవాలనే అభిప్రాయాన్ని వెలిబుచ్చినట్టు చెప్పారు.
బీజేపీతో విభేదాల నేపథ్యంలో జేడీయూ మంగళవారం ఎమ్మెల్యేలు, ఎంపీలతో సమావేశాన్ని ఏర్పాటు చేసింది.
"ఎన్డీయే నుంచి బయటకు రావాలన్నదే అందరి కోరిక. మేం దానిని అంగీకరించాం. తరువాత గవర్నరును కలిసి నా రాజీనామా పత్రాన్ని అందించాను" అని నితీశ్ చెప్పారు.
రాజీనామా తరువాత ఆర్జేడీ మద్దతుతో నితీశ్ కుమార్ కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తారని విశ్వసిస్తున్నారు.నితీశ్ కుమార్ కొత్త ప్రభుత్వానికి మద్దతిస్తామని కాంగ్రెస్ సహా ప్రతిపక్ష పార్టీలు ఇప్పటికే సంకేతాలిచ్చాయి.
గవర్నర్‌కు రాజీనామా సమర్పించిన అనంతరం నితీశ్ కుమార్ మాజీ ముఖ్యమంత్రి రబ్రీదేవి ఇంటికి చేరుకున్నారు. కొత్త ప్రభుత్వ ఏర్పాటుపై నితీశ్, తేజస్వి యాదవ్‌తో చర్చిస్తారని భావిస్తున్నారు.
తమిళనాడులో 1971లో చోరీకి గురైన ఓ విగ్రహం న్యూయార్క్‌లో దొరికిందని పోలీసులు వెల్లడించారు. 12వ శతాబ్ధానికి చెందిన పార్వతీ దేవి విగ్రహాన్ని బోన్‌హామ్స్ ఆక్షన్ హౌస్‌లో గుర్తించారు.
లండన్ కేంద్రంగా బోన్‌హామ్స్ ఆక్షన్ హౌస్ ప్రైవేట్ వేలాలు నిర్వహిస్తుంటుంది.
ఈ విగ్రహాన్ని తిరిగి తమిళనాడుకు పంపేందుకు వీలుగా అన్ని ఏర్పాట్లు చేసినట్లు అమెరికా అధికారులు వెల్లడించారు.
దేశం నుంచి మాయమైన, ఎత్తుకుపోయిన విగ్రహాలు, విలువైన చారిత్రక సంపదను వెనక్కి తెప్పించేందుకు భారత ప్రభుత్వం కొన్నాళ్లుగా ప్రయత్నాలు చేస్తోంది.
2014 నుంచి దాదాపు 200కు పైగా విలువైన ప్రాచీన సంపదను వెనక్కి తెచ్చినట్లు ఈ ఏడాది ఫిబ్రవరిలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రకటించారు.
ప్రస్తుతం గుర్తించిన పార్వతి విగ్రహం తమిళనాడులోని నాదనపురేశ్వరర్ శివన్ ఆలయంలో 1971 నుంచి కనిపించడం లేదని పోలీసులు వెల్లడించారు.
2019 సంవత్సరంలో నాదనపురేశ్వరర్ ఆలయ అధికారులు ఈ విగ్రహం గురించి తమిళనాడు పోలీస్ శాఖలోని విగ్రహాల రికవరీ విభాగానికి ఫిర్యాదు చేశారు.
ఈ ఆలయం నుంచి కనిపించకుండా పోయిన 5 విగ్రహాలలో ఈ పార్వతీదేవి విగ్రహం ఒకటి. దీని విలువ సుమారు రూ.1 కోటి 69 లక్షలు ఉంటుందని అంచనా.
తెలంగాణలో పలు ప్రాంతాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి. గడిచిన 24 గంటల్లో అత్యధికంగా కుమ్రం భీము ఆసిఫాబాద్ జిల్లా వాంకిడిలో 9 సెం.మీ, కెరామెరిలో 7 సెం.మీ, కాగజ్ నగర్ 6 సెం.మీ వర్షాపాతం నమోదైంది.
ఎగువ మహారాష్ట్రలోని చంద్రపూర్, గడ్చిరోలి జిల్లాల నుంచి వరద ప్రవహాం వస్తుండటంతో, కాళేశ్వరం మేడిగడ్డ బ్యారేజ్ 85 గేట్లను ఎత్తి 7 లక్షల క్యూసెక్కుల నీటిని దిగువ గోదావరిలోకి వదులుతున్నారు.
ఎస్సారెస్పీ (శ్రీరాంసాగర్) ప్రాజెక్ట్‌కు 43 వేల క్యూసెక్కుల వరద వస్తుండగా, 4 గేట్ల ద్వారా 16,656 క్యూసెక్కుల నీటిని దిగువకు వదులుతున్నారు.
తెలంగాణ అభివృద్ది, ప్రణాళిక సొసైటీ (TSDPS) అందించిన వివరాల ప్రకారం, గడిచిన 24 గంటలలో హైదరాబాద్ జీహెచ్ఎంసీ పరిధిలో అత్యధికంగా రాజేంధ్రనగర్‌లో 1.2 సెం.మీ వర్షం కురిసింది.
ఈ రోజు కుమ్రం భీము ఆసిఫాబాద్, అదిలాబాద్, నిర్మల్, జగిత్యాల, ములుగు, భద్రాద్రి జిల్లాలో అక్కడక్కడ భారీ వర్షాలు, తెలంగాణ వ్యాప్తంగా తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ, హైదరాబాద్ కేంద్రం తెలిపింది. రెంజు రోజుల పాటు ఈ తరహా వాతావరణం కొనసాగే అవకాశం ఉందని ఐఎండీ అధికారులు తెలిపారు.
TSDPS వివరాల ప్రకారం, ఈరోజు మధ్యాహ్నం 1.00 వరకు నిజామాబాద్ జిల్లా డిచ్ పల్లి 2.7 సెం.మీ, చీమన్ పల్లి 2.6 సెం.మీ, బెల్లాల్ 2.5 సెం.మీ, ఎడపల్లి 2.3 సెం.మీ వర్షం కురిసింది.
కాళేశ్వరం మేడిగడ్డ బ్యారేజ్‌కు వరద పెరిగే అవకాశం ఉండటంతో దిగువ ప్రాంతాలైన భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి జిల్లాల యంత్రాంగం అప్రమత్తమైంది.
ప్రస్తుతం కాళేశ్వరం వద్ద గోదావరి మట్టం 11 మీటర్లకు చేరింది. 12.5 మీటర్ల వద్ద మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేస్తారు.
బిహార్‌లో అధికార బీజేపీ, జేడీయూ కూటమిలో మరోసారి పొరపొచ్చాలు తలెత్తాయి.
బిహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ పార్టీ, ప్రతిపక్ష రాష్ట్రీయ జనతాదళ్ (ఆర్జేడీ) తమ ఎమ్మెల్యేలతో విడివిడిగా సమావేశమయ్యాయి.
అలాగే, హిందుస్థానీ అవామ్ మోర్చా, కాంగ్రెస్ కూడా తమ ఎమ్మెల్యేల సమావేశాన్ని ఏర్పాటు చేశాయి. హిందుస్థానీ అవామ్ మోర్చా కూడా ఎన్డీఏలో ఒక భాగస్వామ్య పార్టీ.
నితీశ్ కుమార్, కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ ఫోన్‌లో మాట్లాడుకున్నారని మీడియాలో వార్తలు వచ్చాయి. ఈ సంభాషణ తరువాతే నితీశ్ కుమార్ ఎమ్మెల్యేల సమావేశానికి పిలుపునిచ్చారు.
ఆర్జేడీ, నితీశ్ కుమార్ మధ్య ఇప్పటికే చర్చలు జరుగుతున్నాయని చెబుతున్నారు. ఈమధ్య కాలంలో ఇద్దరూ ఒకరిపై ఒకరు దాడి చేసుకున్న సందర్భాలు లేవు. బహిరంగ ప్రకటనలలో కూడా ఒకరి పట్ల ఒకరు సహనంతో ఉన్నారు.
నితీశ్ కుమార్ తేజస్వి నివాసానికి ఇఫ్తార్ పార్టీకి వెళ్లారు. తరువాత తేజస్వి కూడా ముఖ్యమంత్రి నివాసంలో కనిపించారు.
ఆర్జేడీ రాష్ట్ర అధికార ప్రతినిధి ఇక్బాల్ అహమ్ షమీ బీబీసీ హిందీతో మాట్లాడుతూ, బిహార్‌లో ఆర్జేడీ అధికారంలోకి రాబోతోందని చెప్పారు. బీజేపీపై కలిసికట్టుగా పోరాడతామని అన్నారు.
ఇటీవల తేజస్వి యాదవ్ బిహార్‌లో ద్రవ్యోల్బణంపై నిరసన ప్రదర్శన చేశారు. ఆయనకు నిరసన తెలిపే హక్కు ఉందని జేడీయూ తేజస్వికి మద్దతిచ్చింది.
లాలూ యాదవ్ సన్నిహితుడు భోలా యాదవ్ నివాసంపై సీబీఐ దాడులు చేసింది. అప్పుడు కూడా జేడీయూ ప్రతికూలంగా స్పందించకుండా, మౌనం వహించిది. సాధారణంగా ఇలాంటి సందర్భాల్లో జేడీయూ,ఆర్జేడీలో అవినీతి పేరుకుపోయిందని దాడికి దిగుతుంది. కానీ ఈసారి అలా జరగలేదు.
సోమవారం జేడీయూ జాతీయ అధ్యక్షుడు లలన్ సింగ్ మాట్లాడుతూ, పార్టీ ఎమ్మెల్యేల సమావేశం ఏర్పాటు చేశామని, ఆర్‌సీపీ సింగ్ రాజీనామా తరువాత పరిస్థితులపై ఎమ్మెల్యేల అభిప్రాయం తెలుసుకునేందుకే సమావేశాన్ని ఏర్పాటు చేసినట్లు తెలిపారు.
మరోవైపు, రాష్ట్రీయ జనతాదళ్ కూడా మంగళవారం తన ఎమ్మెల్యేలతో సమావేశాన్ని ఏర్పాటు చేసింది.
నితీశ్ కుమార్ ఆర్జేడీతో చేయి కలుపుతారన్న వార్తలపై బిహార్ ఆర్జేడీ చీఫ్ జద్గానంద్ సింగ్ మాట్లాడుతూ, అలాంటి ప్రతిపాదన ఏదీ రాలేదని, అవన్నీ ఊహాగానాలని అన్నారు.
మరోవైపు, ఒప్పందం దాదాపు ఖాయమైందని, నాయకత్వ విషయంలో స్వల్ప భిన్నాభిప్రాయాలు ఉన్నాయని ఆర్జేడీ వర్గాలు చెబుతున్నాయి. అయితే, తేజస్వి యాదవ్ ఈ విషయంపై ఇంతవరకు ఎలాంటి ప్రకటన చేయలేదు.
డీల్ దాదాపు ఖాయమని, నితీశ్ కుమార్, ఆర్జేడీతో చేతులు కలుపుతున్నారని బిహార్ ఆర్జేడీ నేత ఒకరు బీబీసీతో అన్నారు.
243 మంది సభ్యులున్న బిహార్ అసెంబ్లీలో బీజేపీకి 77, జేడీయూకి 45, జితన్ రామ్ మాంఝీకి 4, ఆర్జేడీకి 79, కాంగ్రెస్‌కు 19, సీపీఐ-ఎంఎల్‌కు 12, సీపీఐకి 4, ఒవైసీకి 4 స్థానాలు ఉన్నాయి. ఒక స్వతంత్ర అభ్యర్థి ఉన్నారు.
ఎడతెరపి లేకుండా కురుస్తున్న వానలతో పాకిస్తాన్ అతలాకుతలం అవుతోంది. గత ఆరు వారాలుగా దేశవ్యాప్తంగా కురిసిన వర్షాలకు 500 మందికి పైగా ప్రజలు ప్రాణాలు కోల్పోయారు.
రోడ్లు, వంతెనలు, భవనాలు సహా వేల సంఖ్యలో ఇళ్లు కూడా దెబ్బతిన్నాయి.మారుమూల ప్రాంత ప్రజలకు సహాయ చర్యలు నెమ్మదిగా అందుతున్నాయి.
తీవ్రంగా ప్రభావితమైన బలూచిస్తాన్‌లో 160 మందికి పైగా ప్రజలు మరణించారు.
బిహార్‌లో రాజకీయ కలకలం ఊపందుకుంది. ముఖ్యమంత్రి నితీష్ కుమార్, గవర్నర్ ఫాగు చౌహాన్‌ను కలిసేందుకు అపాయింట్‌మెంట్ కోరారని ఏఎన్ఐ తెలిపింది.
నితీశ్ కుమార్ రాజీనామా చేయవచ్చనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. బీజేపీకి చెందిన మొత్తం 16 మంది మంత్రులు కూడా గవర్నర్‌ను కలిసేందుకు వెళ్లవచ్చు.
నితీశ్ కుమార్‌కు ఆర్జేడీ, కాంగ్రెస్, వామపక్షాలు మద్దతివ్వవచ్చని కూడా అంటున్నారు.
2017 మొదట్లో ఉప రాష్ట్రపతి పదవికి ముప్పవరపు వెంకయ్య నాయుడు పేరును పరిశీలిస్తున్నట్లు చాలా వార్తలు వచ్చాయి. దీనిపై బీజేపీ నుంచి ఎలాంటి అధికారిక ప్రకటనా వెలువడలేదు. దీంతో మీరు ఉప రాష్ట్రపతి పదవికి రేసులో ఉన్నారా? అని మీడియా ఆయన్ను ప్రశ్నించింది.
దీనిపై వెంకయ్య నాయుడు స్పందిస్తూ.. ‘‘నేను రాష్ట్రపతినో లేదా ఉప రాష్ట్రపతినో కావాలని అనుకోవడం లేదు. ఉషాపతిగా ఇప్పుడు నేను సంతోషంగానే ఉన్నాను’’అని ఆయన వ్యాఖ్యానించారు.
అయితే, వెంకయ్య నాయుడు భార్య పేరు ఉష అని ఇప్పటికీ చాలా మందికి తెలియదు.
‘‘ఉషాపతి’’ లాంటి చతుర్లు, కవితాత్మక పదప్రయోగాలకు వెంకయ్య నాయుడు పెట్టింది పేరు. రాజకీయ వర్గాల్లో దీని గురించి తరచూ మాట్లాడుకునేవారు.
మహారాష్ట్రలో ఏక్‌నాథ్ షిండే నేతృత్వంలో ఏర్పాటైన ప్రభుత్వం నేడు మంత్రివర్గాన్ని విస్తరించింది. అందులో భాగంగా 18 మంది మంత్రులు ప్రమాణ స్వీకారం చేయనున్నారు.
తొలుత రాధాకృష్ణ విఖే పాటిల్ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. తొలుత కాంగ్రెస్‌లో ఉన్న విఖే పాటిల్, 2019 అసెంబ్లీ ఎన్నికల సమయంలో బీజేపీలో చేరారు. 2014లో ప్రతిపక్ష నేతగా ఉన్నారు.
బీజేపీ సీనియర్ నేత సుధీర్ ముంగ్తివార్ మరోసారి మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. బల్లార్‌పూర్ నుంచి ఎమ్మెల్యే అయిన ముంగ్తివార్ గత ప్రభుత్వంలో అటవీశాఖ మంత్రిగా పనిచేశారు.
బీజేపీ నేతలు చంద్రకాంత్ పాటిల్, గిరీశ్ మహాజన్, శివసేన నేత గులాబ్రావ్ పాటిల్, సంజయ్ రాథోడ్, మిరాజ్ ఎమ్మెల్యే సురేష్ ఖాడే, సందీపన్ బుమ్రే మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు.
ప్రభుత్వం ఏర్పాటు చేసిన 38 రోజుల తర్వాత ఈ మంత్రివర్గ విస్తరణ జరుగుతోంది.
ఇవాళ ప్రమాణస్వీకారం చేసిన మంత్రుల్లో ఒక్క మహిళ కూడా లేరు.
ఫ్లోరిడాలోని తన నివాసంలో ఎఫ్‌బీఐ సోదాలు చేసిందని అమెరికా మాజీ అధ్యక్షుడు డోనల్డ్ ట్రంప్ తెలిపారు. ఇంట్లోని ఒక బీరువాను కూడా వారు బలవంతంగా తెరిచారని చెప్పారు.
'పామ్ బీచ్‌లోని నా నివాసం మార్ ఎ లాగోను పెద్ద సంఖ్యలో ఎఫ్‌బీఐ ఏజెంట్లు ఆక్రమించుకున్నారు' అంటూ ట్రంప్ ఒక ప్రకటన విడుదల చేశారు.
అధికారిక పత్రాల దుర్వినియోగం ఆరోపణల నేపథ్యంలో ఎఫ్‌బీఐ ఈ సోదాలు చేసినట్లు చెబుతున్నరు.
2024లో జరగబోయే అమెరికా అధ్యక్ష ఎన్నికలలో పోటీ చేయడానికి ట్రంప్ సిద్ధమవుతున్న తరుణంలో ఆయనపై చట్టాన్ని ఉపయోగించడం పెరుగుతోంది.
సోమవారం ఫ్లోరిడాలో ఈ సోదాలు జరిగే సమయానికి ట్రంప్ న్యూయార్క్‌లోని ట్రంప్ టవర్‌లో ఉన్నారని సీబీఎస్ న్యూస్ తెలిపింది.