ఈసారి చెస్
ఒలింపియాడ్‌లో స్వర్ణ పతకం భారత మహిళల చెస్ జట్టుదేనని ఖాయంగా అనుకున్నారు. కానీ
ఒకటిన్నర రోజులో పరిస్థితి తారుమారైంది. భారత బృందం కాంస్య పతకంతో
సరిపెట్టుకోవాల్సి వచ్చింది.
అయినాసరే. భారత
మహిళల బృందం చరిత్ర సృష్టించింది. ఎందుకంటే చెస్ ఒలింపియాడ్‌లో భారత మహిళల జట్టు ఒక
పతకం గెలవటం ఇదే తొలిసారి.
గ్రాండ్‌మాస్టర్లు
కోనేరు హంపి, ద్రోణవల్లి హారికలతో పాటు.. తానియా సచ్‌దేవ్, ఆర్.వైశాలి, భక్తి
కులకర్ణి వంటి హేమాహేమీలు, యువ క్రీడాకారిణిలతో కూడి బృందం ఈ ఘనతను సాధించింది.
తమిళనాడులోని
మామళ్లపురంలో జరుగుతున్న 44వ చెస్ ఒలింపియాడ్‌లో.. రష్యా కానీ, చైనా కానీ ఈ
ఒలింపియాడ్‌లో పాల్గొనకపోవటం కూడా భారత జట్టుకు కలిసివచ్చింది. మొదటి నుంచీ అగ్రస్థానంలో
ఉన్న భారత క్రీడాకారిణిలదే బంగారు పతకమని అందరూ అంచనా వేశారు.
అయితే ఫైనల్
రౌండ్‌కు ముందు భారత జట్టు అమెరికా చేతిలో 1-3 పాయింట్లతో ఓడిపోయింది. హంపి,
వైశాలి తమ గేమ్‌లను డ్రా చేసుకుంటే.. తానియా, భక్తిలు ఓటమి పాలయ్యారు.
ఫైనల్ రౌండ్
ముగిశాక.. యుక్రెయిన్‌కు గోల్డ్ మెడల్, జార్జియాకు సిల్వర్ మెడల్ లభించాయి. అప్పుడు
కాంస్య పతకం భారత్‌కు దక్కాలా, అమెరికాకు ఇవ్వాలా అనే సందిగ్ధత తలెత్తింది.
చివరికి
పాయింట్లు ఇండియాకు ఫేవర్‌గా ఉండటంతో భారత్‌కు కాంస్య పతకం లభించింది. అమెరికా
నాలుగో స్థానంతో సరిపెట్టుకోవలసి వచ్చింది.
2012లో ఇస్తాంబుల్‌లో జరిగిన ఒలింపియాడ్‌లో.. భారత మహిళల
జట్టు నాలుగో స్థానంలో నిలిచింది. అక్కడి నుంచి ఒక స్థానం పెరిగి కాంస్య పతకం
గెలుచుకోవటానికి దశాబ్దం పట్టింది.