ప్రధాని చేసిన అవినీతి, బంధుప్రీతి వ్యాఖ్యలపై స్పందించేందుకు నిరాకరించిన రాహుల్
అవినీతీ, బంధుప్రీతి అనే రెండు అంశాలు దేశానికి ప్రధాన సమస్య మారాయంటూ స్వాతంత్ర్య దినోత్సవ ప్రసంగంలో ప్రధాని చేసిన ప్రసంగంపై స్పందించేందుకు రాహుల్ గాంధీ నిరాకరించారని ఏఎన్ఐ వార్తా సంస్థ తెలిపింది. తాను ఈ విషయం పై మాట్లాడబోనని, అందరికీ స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు అంటూ రాహుల్ గాంధీ స్పందించకుండా వెళ్లిపోయారని వెల్లడించింది.
మరోవైపు నరేంద్ర మోదీ ప్రసంగం నిరాశాపూరిత ప్రసంగమని కాంగ్రెస్ నేత పవన్ ఖేరా వ్యాఖ్యానించారు.
రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేస్తామని, అందరికీ ఇళ్లు ఇస్తామని, నల్లధనం వెనక్కి తెస్తామని, ఉపాధి కల్పిస్తామని ప్రధాని నరేంద్ర మోదీ వాగ్దానాలు చేశారని, ఈ వాగ్దానాలు నెరవేర్చలేకపోవడంతో నిద్రపట్టక ఆయన నిరాశాపూరిత ప్రసంగాలు చేస్తున్నారని ఖేరా అన్నారు.
బీజేపీలోనే అసలైన కుటుంబవాదం, బంధు ప్రతీ ఉన్నాయని ఖేరా ఆరోపించారు. లార్డ్స్ మైదానంలో సెంచరీ చేసిన వ్యక్తి క్రికెట్‌లో అత్యున్నత పదవి పొందినట్లు తనకు గుర్తు లేదని అన్నారు.
ఓ మంత్రి కొడుకు ఫారిన్ సర్వీస్ ఎగ్జామ్ పాస్ కాలేదని, కానీ ఆయనిప్పుడు ఒక థింక్ ట్యాంక్ అధినేతగా వ్యవహరిస్తున్నారని ఖేరా అన్నారు. మోదీ తన మంత్రుల మీద తానే విమర్శలు చేసుకున్నారని ఆయన అన్నారు.