వరవరరావు బెయిల్‌పై విడుదల... ముంబయిలోనే ఉండాలని షరతు :ప్రెస్ రివ్యూ

ఫొటో సోర్స్, virasam.org
ప్రముఖ కవి, విరసన నేత వరవరరావు బెయిల్ మీద విడుదలయ్యారు. శనివారం రాత్రి 11.45 గంటలకు ముంబయిలోని నానావతి ఆస్పత్రి నుంచి వరవరరావు బయటికి వచ్చారని ఆయన న్యాయవాది ఇందిరా జైసింగ్ ట్విట్టర్‌లో పేర్కొన్నట్లు సాక్షిలో వార్త రాశారు.
భీమా కోరేగాం కేసులో ముంబైలోని తలోజా జైల్లో రెండున్నరేళ్లుగా ఆయన విచారణ ఖైదీగా ఉన్నారు. కొద్దినెలల కింద ఆయన తీవ్ర అనారోగ్యం బారినపడటంతో బాంబే హైకోర్టు ఆదేశాల మేరకు నానావతి ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నారు.
రెండు వారాల కిందట హైకోర్టు ఆయనకు బెయిల్ మంజూరు చేసింది. దానికి సంబంధించిన ప్రక్రియ పూర్తవడంతో శనివారం వరవరరావును విడుదల చేశారు. అయితే, బెయిల్ ఇచ్చేటప్పుడు బాంబే హైకోర్టు పెట్టిన షరతుల మేరకు ఆయన ముంబయి పరిధిలోనే ఉండాలి. దీంతో ఆయన హైదరాబాద్‌కు వచ్చే అవకాశం లేకుండాపోయింది.
ఈ బెయిల్ ఆరు నెలల కోసం మాత్రమేననీ, ఆరు నెలలు కాగానే ఆయన తలోజా జైలు అధికారులకు లొంగిపోవాలని, పాస్ పోర్ట్ ను ఎన్ ఐ కోర్టుకు అప్పగించాలని, వీటిలో ఏ ఒక్క షరతు ఉల్లంఘన జరిగినా బెయిల్ రద్దవుతుందని బొంబాయి హైకోర్టు బెయిల్ ఉత్తర్వులు నిర్దేశిస్తున్నాయి.

ఫొటో సోర్స్, TelanganCMO/FB
'కరోనా వల్ల రాష్ట్ర ఖజానాకు 50 వేల కోట్ల నష్టం' -కేసీఆర్
తెలంగాణ రాష్ట్రంలో గొర్రెల పంపిణి కార్యక్రమం విజయవంతమైనందున మరో మూడు లక్షల యూనిట్ల పంపిణీకి రానున్న బడ్జెట్‌లో ప్రతిపాదనలు పొందుపరచనున్నామని ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్‌రావు ప్రకటించారని నమస్తే తెలంగాణ ఒక కథనాన్ని ప్రచురించింది.
అదేవిధంగా చేపల పెంపకం కార్యక్రమాన్ని కూడా కొనసాగిస్తామని స్పష్టంచేశారు. త్వరలో ప్రవేశపెట్టనున్న రాష్ట్ర వార్షిక బడ్జెట్ ఆశాజనకంగా ఉండబోతున్నదని సూచనప్రాయంగా తెలిపారు. బడ్జెట్ ప్రతిపాదనలపై శనివారం ప్రగతిభవన్‌లో సీఎం కేసీఆర్ ఉన్నతస్థాయి సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా పలు శాఖలు అందించిన ఆర్థిక నివేదికలు, బడ్జెట్‌లో పొందుపరచాల్సిన శాఖలవారీ అంచనాలను సమీక్షించారు.
కరోనా ప్రభావం వల్ల రాష్ట్ర ఖజానాకు రూ.50 వేల కోట్ల మేర నష్టం వాటిల్లినట్లు సీఎం పేర్కొన్నారు. దీని ప్రభావం రూ.లక్ష కోట్లకు చేరుకున్నదని చెప్పారు. కరోనా అనంతరం రాష్ట్ర ఆర్థిక కార్యకలాపాలు పుంజుకొన్నాయని, వివిధ రూపాల్లో ఆదాయం పెరిగిందని తెలిపారు. గత బడ్జెట్ కంటే వచ్చే బడ్జెట్ కేటాయింపులు ఎక్కువగా ఉండే ఆస్కారమున్నదని వివరించారు. ఉన్నతస్థాయి సమావేశంలో బడ్జెట్ అంచనాలు, కేటాయింపులకో సం విధివిధానాలు ఖరారయ్యాయని, రేపటినుంచి ఆర్ అండ్ బీ, పంచాయతీరాజ్, ము న్సిపల్ పరిపాలన, విద్య, నీటిపారుదల తదితర శాఖలను వరుసగా పిలిచి ఆర్థికశాఖ అధికారులతో సమన్వయం చేసుకుంటూ ఆర్థిక శాఖ మంత్రి హరీశ్‌రావు సమావేశాలు నిర్వహిస్తారని సీఎం చెప్పారరని ఈ కథనంలో తెలిపారు.

ఫొటో సోర్స్, http://hc.ap.nic.in/
కారుణ్య నియామకానికి కూతురు కూడా అర్హురాలే -ఏపీ హైకోర్టు
సర్వీస్‌లో ఉండగా ప్రభుత్వ ఉద్యోగి మరణిస్తే కారుణ్య నియామకం కింద పెళ్లయిన కుమార్తె కూడా అర్హురాలేనని ఆంధ్ర ప్రదేశ్ హైకోర్టు తీర్పు చెప్పిందని ప్రజాశక్తి పత్రిక ఒక వార్తను ప్రచురించింది.
ఇప్పటివరకు కుమారుడు, పెళ్లికాని కుమార్తె మాత్రమే కారుణ్య నియామకాలకు అర్హులంటూ ఆర్టీసీలో ఉన్న నిబంధనను కొట్టివేసింది. న్యాయమూర్తి జస్టిస్ బి.దేవానంద్ ఈ తీర్పు చెప్పారు. 'కుమారులు లేనప్పుడు పెళ్లయిన కుమార్తె తల్లిదండ్రులకు తలకొరివి పెడుతున్న మానవీయ సంఘటనలను నేడు చూస్తున్నాం. ఈ రోజుల్లో ఆ నిబంధన వివక్ష కిందకే వస్తుంది. ఇది రాజ్యాంగ వ్యతిరేకం' అని కోర్టు ప్రకటించింది.
శ్రీకాకుళం జిల్లాకు చెందిన సీహెచ్ పెంటయ్య ఆర్టీసీలో డ్రైవర్‌గా పనిచేస్తుండగా 2009లో మరణించారు. కారుణ్య నియామకం కింద కండక్టర్ లేదా నాలుగో తరగతి క్యాటగిరీ ఉద్యోగం ఇవ్వాలని అతనికి భార్య చిన్నమ్మడు చేసుకున్న దరఖాస్తును ఆర్టీసీ తిరస్కరించింది. దీంతో తనకు కారుణ్య నియామకం ఇవ్వాలని కుమార్తె సీహెచ్ దమయంతి చేసుకున్న దరఖాస్తును పరిశీలించాలని గతంలో ఆర్టీసీని హైకోర్టు ఆదేశించింది.
పెళ్లి అవడంతో కూతురుకు తనను కన్న వాళ్ల కుటుంబంతో బంధం తెగిపోదని, కుటుంబ పోషణను కుమార్తెలు కూడా చూస్తున్నారనే విషయాన్ని విస్మరించరాదని హైకోర్టు అభిప్రాయపడింది. ఈ కేసులో చనిపోయిన డ్రైవర్ ఏకైక కుమార్తె దమయంతి, ఏవిధమైన శాశ్వత ఆదాయం లేని వృద్ధురాలైన తన తల్లి పోషణ బాధ్యతలు చూసుకోవాలని, దమయంతికి కారుణ్య నియామకం కింద ఉద్యోగం ఇవ్వకపోతే ఆ తల్లి దారిద్య్రాన్ని అనుభవించాల్సి వస్తుందని ఆందోళన వ్యక్తం చేశారని తెలిపింది. అందుకే ఆర్టీసీ కారుణ్య నియమాక నిబంధనల్లో వివాహిత అర్హురాలు కాదన్నది రాజ్యాంగ వ్యతిరేకమని ప్రకటిస్తున్నామని న్యాయమూర్తి తన తీర్పులో పేర్కొన్నట్లు ఈ వార్తలో రాశారు.

ఫొటో సోర్స్, Janasena/fb
ప్రజాస్వామ్యబద్ధంగా తిరగబడాలి.. పవన్ కల్యాణ్
"మున్సిపల్ ఎన్నికల్లో దయచేసి వైకాపా నాయకులకు ఓటు వేయవద్దు. వాళ్లు ఇచ్చే నోట్లకు ఆశపడి ఓట్లు వేస్తే మనల్ని యాచించే స్థాయికి తీసుకువెళ్తారు. ప్రతి ఒక్కరూ ప్రజాస్వామ్యబద్ధంగా తిరగబడాలి. ఓటు అనే ఆయుధంతో బుద్ధి చెప్పాలి’’ అని జనసేన అధినేత పవన్‌కల్యాణ్ ఆంధ్ర ప్రదేశ్ ప్రజలకు పిలుపునిచ్చారని ఈనాడు ఒక కథనంలో పేర్కొంది.
ఈ నెల 10న మున్సిపల్ ఎన్నికల సందర్భంగా శనివారం రాత్రి పవన్ వీడియో సందేశాన్ని విడుదల చేశారు. జనసేన పార్టీని ఎందుకు స్థాపించారో పేర్కొంటూ తాను కోరుకునే మార్పు పంచాయతీ ఎన్నికల్లో కనిపించిందన్నారు.
‘‘పంచాయతీ ఎన్నికల్లో జనసేన 27శాతం ఓట్లు సాధించింది. ఆ ఎన్నికల్లో మేం బలంగా నిలబడటం వల్లే వైకాపా నాయకులు జనసేన కార్యకర్తలపై దాడులకు పాల్పడుతున్నారు. ప్రధాని మోదీ నాయకత్వంలోని భారతీయ జనతాపార్టీతో కలిసి జనసేన మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేస్తోంది. మా కూటమికి మద్దతు ఇవ్వండి.. మేము అండగా నిలబడతాం’’ అని పవన్ కల్యాణ్ అన్నారు.
ప్రజలు పన్నులు కడితే ఆ సొమ్ములు తీసుకువెళ్లి వారి ఓటు బ్యాంకు కాపాడుకోవడానికి కొందరికి పెన్షన్లు ఇస్తున్నారని అన్నారు. ఓట్లు వేయకపోతే సంక్షేమ పథకాలు ఆపివేస్తామని బెదిరిస్తున్నారని, కేంద్రం నుంచి వచ్చే పథకాలు నిలిపివేయడానికి వీరెవరని పవన్ నిలదీశారని ఈ కథనంలో తెలిపారు.
ఇవి కూడా చదవండి:
- కోవిడ్-19 ఎఫెక్ట్ : నలుగురితో కలిసిపోవడం ఎలా? మనం మళ్లీ ఈ పాఠాలు నేర్చుకోవాలా?
- ‘ఒకప్పుడు పోలీసులను చూసి భయపడేవారు.. ఇప్పుడు వారూ యూనిఫాం ధరించారు’.. రక్షకభటులుగా ట్రాన్స్జెండర్లు
- కబడ్డీ ఆట పట్ల మహిళల్లో ఆసక్తి పెరుగుతోందా... క్రీడాకారిణులు ఏమంటున్నారు?
- ఘోస్ట్ హ్యూమన్స్.. అంతు చిక్కని మానవ జాతి ఆధారాలు కనుగొన్న పరిశోధకులు
- అంగారక గ్రహంపై పరిశోధన ప్రారంభించిన నాసా రోవర్ 'పెర్సెవీరన్స్'
- మనిషికి, కుక్కకు మధ్య మంచు యుగంలోనే స్నేహం.. ఎలా సాధ్యమైంది? శునకాల డీఎన్ఏ ఏం చెప్తోంది?
- మోదీ పాలనలో భారతదేశం ‘పాక్షిక స్వతంత్ర దేశం’గా మారిపోయింది: ఫ్రీడమ్ హౌస్ నివేదిక
- మహిళలు వీర్యాన్ని దాచుకుని, తమకి కావలసినప్పుడు గర్భం ధరించే అవకాశం వస్తే ఈ ప్రపంచం ఎలా మారుతుంది?
- ‘మిస్సింగ్ 54’ మిస్టరీ: ఆ భారత సైనికులు ఏమయ్యారు... దశాబ్దాలుగా పాకిస్తాన్‌లోనే మగ్గుతున్నారా?
- విక్టోరియా మహారాణి, ఆమె భారత గుమస్తా అబ్దుల్ కరీమ్ మధ్య అంతుపట్టని ఆ బంధాన్ని ఏమనాలి
- కరీమ్ లాలా: ఈ ముంబయి మాఫియా డాన్‌ను ఇందిరా గాంధీ ఎందుకు కలిశారు?
- గాంధీ బ్రహ్మచర్య ప్రయోగాల గురించి మనూ గాంధీ డైరీల్లో ఏముంది
- డొమినిక్ ఒంగ్వెన్: కిడ్నాప్‌కు గురైన పిల్లాడు ఆ కిడ్నాపర్ల ముఠాకే కమాండర్‌గా ఎలా మారాడంటే..
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)























