ఇరాన్‌తో ఒప్పందం అమెరికా బలహీనతను బయటపెట్టిందా-అభిప్రాయం

ఇరాన్ యుద్ధం, శాంతి ఒప్పందం, అమెరికా, లెబనాన్, ఆర్థిక వ్యవస్థ, చమురు, అరబ్ దేశాలు

ఫొటో సోర్స్, EPA

    • రచయిత, జెరిమీ బోవెన్, బేరూత్ నుంచి...
  • ప్రచురణ
  • చదివే సమయం: 6 నిమిషాలు

అమెరికా అధ్యక్షుడు డోనల్డ్ ట్రంప్ ఇప్పటివరకూ అనుసరించిన విదేశాంగ విధానంలో ఇరాన్‌ యుద్ధం ఒక ఘోరమైన వైఫల్యం.

ఈ ఫెయిల్యూర్ కారణంగా అమెరికా తన శత్రుదేశాలను అడ్డుకోవడం మరింత కష్టంగా మారుతుంది.

చమురు ఉత్పత్తిదారులైన అరబ్ రాజ్యాలతో అమెరికా సంబంధాలపై కూడా దీని ప్రభావం పడింది. మధ్యప్రాచ్యంలో అశాంతి నెలకొన్నప్పటికీ, స్థిరత్వానికి ప్రతీకగా నిలిచిన ఈ అరబ్ దేశాల బిజినెస్ మోడల్ ఈ దెబ్బ నుంచి తేరుకోవడానికి సంవత్సరాలు పడుతుంది.

ఈ దేశాల అధికారులు ఇప్పటికే తమ విదేశీ సంబంధాలను మరింత విస్తరించాల్సిన అవసరం గురించి ప్రైవేట్‌గా చర్చిస్తున్నారు. సముద్రం అవతల ఉన్న పొరుగుదేశం ఇరాన్‌తో కలిసి ఎలా ముందుకు సాగాలన్న దానిపైనా ఆలోచిస్తున్నారు.

మరోవైపు, అంత సులభంగా భర్తీ చేయలేని తన ఆయుధ నిల్వలను వేగంగా ఖాళీ చేసేస్తూ, తన పరిమితులేవో తెలుసుకుంటున్న అమెరికా తీరును చైనా నిశితంగా గమనిస్తూ ఉండొచ్చు.

ఇరాన్ యుద్ధం, శాంతి ఒప్పందం, అమెరికా, లెబనాన్, ఆర్థిక వ్యవస్థ, చమురు, అరబ్ దేశాలు

ఫొటో సోర్స్, Reuters

తెహ్రాన్‌లోని తమ ప్రత్యర్థి బలాన్ని అమెరికా, ఇజ్రాయెల్‌ దేశాలు తప్పుగా అంచనా వేయడం వల్లే ఈ యుద్ధం మొదలైంది. యుద్ధం కారణంగా తమ జీవితాలు తలకిందులైన లక్షలాది మందికి, ముఖ్యంగా నేరుగా యుద్ధ ప్రభావాన్ని ఎదుర్కొన్న సాధారణ ప్రజలకు ఒప్పందం పెద్ద ఊరటనివ్వనుంది.

ఈ ఒప్పందంతో హార్ముజ్ జలసంధి మళ్లీ తెరుచుకోనుందని ట్రంప్ అన్నారు. దీనివల్ల ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై ఉన్న ఒత్తిడి తగ్గడమే కాకుండా, ప్రపంచవ్యాప్తంగా, పెరిగిపోయిన జీవన వ్యయాల భారంతో ఇబ్బందులు పడుతున్న కోట్లాది మంది ప్రజలకు కూడా కొంత ఉపశమనం లభించచ్చు.

మధ్యప్రాచ్యంలో వేలమంది ప్రాణాలు కోల్పోయారు. ఇళ్లు, వ్యాపార భవనాలు ధ్వంసమయ్యాయి. హార్ముజ్ జలసంధి గుండా జరిగే సరఫరాలపై ఆధారపడిన ఎరువుల ఉత్పత్తి దెబ్బతినడం వల్ల ఈ ఏడాది చివర్లో పేద దేశాల్లో ఆహార కొరత తలెత్తే ప్రమాదం ఉంది. ముఖ్యంగా సహారా ఎడారికి దక్షిణంగా ఉన్న ఆఫ్రికా దేశాలు ఎక్కువగా ప్రభావితమయ్యే అవకాశం ఉంది.

అయితే ఇది శాంతి ఒప్పందం కాదు. రెండు పేజీల్లో 14 అంశాలతో కూడిన ఈ అవగాహన ఒప్పంద వివరాలు ఇంకా విడుదల కాలేదు. అయినప్పటికీ హార్ముజ్ జలసంధిని తిరిగి తెరవడంతో పాటు కాల్పుల విరమణను పొడిగించడం, ఇరాన్ నౌకాశ్రయాలపై అమెరికా నౌకాదళం విధించిన దిగ్బంధనాన్ని ఎత్తివేయడం వంటి అంశాలు ఇందులో ఉన్నాయి.

అత్యంత క్లిష్టమైన అంశాలను మాత్రం భవిష్యత్‌లో జరిగే చర్చలకు వదిలేసింది. ఇరాన్ అణు కార్యక్రమం భవిష్యత్తు ఏంటి, రాయితీలకు బదులుగా ఆ దేశాంపై ఎంత మేర ఆంక్షల సడలింపు ఉంటుంది వంటి అంశాలు తదుపరి చర్చల్లో ప్రధానంగా ఉండనున్నాయి.

ఇరాన్ యుద్ధం, శాంతి ఒప్పందం, అమెరికా, లెబనాన్, ఆర్థిక వ్యవస్థ, చమురు, అరబ్ దేశాలు

ఫొటో సోర్స్, Getty Images

గుట్టు చప్పుడు కాకుండా దాడులను మొదలుపెట్టారు...

ఫిబ్రవరి 28న అమెరికా, ఇజ్రాయెల్‌ దేశాలు ప్రారంభించిన యుద్ధానికి ఎట్టకేలకు ఒక ముగింపు కార్డు పడింది.

అయితే గడియారాన్ని వెనక్కి తిప్పి ఫిబ్రవరి 27కు వెళితే పరిస్థితి పూర్తిగా భిన్నంగా కనిపిస్తుంది.

అమెరికా, ఇజ్రాయెల్ దళాలు అప్పటికే దాడులకు సిద్ధమవుతున్నాయి. యుద్ధ విమానాలకు ఆయుధాలను అమర్చడం, సిబ్బందికి సూచనలు ఇవ్వడం, క్షిపణులకు లక్ష్యాలను నిర్దేశించడం అప్పటికే జరుగుతోంది.

అదే సమయంలో జెనీవాలో ఇరాన్, అమెరికా ప్రతినిధులు ఇరాన్ అణు కార్యక్రమాన్ని నియంత్రించేందుకు ఉద్దేశించిన కీలక చర్చల్లో పాల్గొంటున్నారు. పలు వర్గాలు తెలిపిన సమాచారం ప్రకారం, ఇరాన్ ప్రతినిధులు ఆ చర్చలను సీరియస్‌గా తీసుకున్నారు. తమ డిమాండ్లతో పాటు కొన్ని రాయితీల ప్రతిపాదనలను కూడా చర్చకు పెట్టారు.

గల్ఫ్ ప్రాంత ప్రవేశ ద్వారంగా భావించే హార్ముజ్ జలసంధి అప్పటికి తెరిచే ఉంది. ప్రపంచ చమురు, సహజవాయువు అవసరాల్లో దాదాపు 20 శాతం ఆ మార్గం గుండానే సరఫరా అవుతోంది. ఆధునిక జీవితానికి అవసరమైన వ్యవసాయ ఎరువులు, సెమీకండక్టర్లు, పెట్రో కెమికల్ ఉత్పత్తుల రవాణా కూడా అదే మార్గంపై ఆధారపడి ఉంది.

ప్రస్తుత అవగాహన ఒప్పందం అణు చర్చలను మళ్లీ ప్రారంభించడానికి, నౌకలు జలసంధి గుండా సాధారణంగా ప్రయాణించడానికి మార్గం సుగమం చేసింది. అంటే యుద్ధం ప్రారంభానికి సరిగ్గా 24 గంటల ముందు ఉన్న పరిస్థితులకే మళ్లీ చేరుకున్నట్టైంది.

ఇరాన్ యుద్ధం, శాంతి ఒప్పందం, అమెరికా, లెబనాన్, ఆర్థిక వ్యవస్థ, చమురు, అరబ్ దేశాలు

ఫొటో సోర్స్, Abbas FAKIH / AFP via Getty Images

అమెరికా ప్లాన్ బోల్తా పడిందా?

వరుసగా జరిగిన ఆకస్మిక దాడుల్లో మొదటి దాడిలోనే ఇరాన్ సుప్రీం లీడర్ అయతొల్లా అలీ ఖమేనీ, ఆయన సన్నిహిత సలహాదారులను ఇజ్రాయెల్ హతమార్చింది. దాదాపు అదే సమయంలో దక్షిణ ఇరాన్‌లోని మీనాబ్ ప్రాంతంలో అమెరికా జరిపిన దాడిలో ఒక పాఠశాల పూర్తిగా ధ్వంసమైనట్లు పలు పరిశీలనల్లో బయటపడింది. ఆ ఘటనలో 150 మందికిపైగా పౌరులు మరణించారు. వారిలో ఆ పాఠశాల విద్యార్థులే కనీసం 120 మంది ఉన్నారు. ఎక్కువ మంది 12 ఏళ్లలోపు బాలికలే.

ట్రంప్, ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు ఇద్దరూ వీడియో సందేశాల ద్వారా యుద్ధం ఆరంభాన్ని ప్రకటించారు. ఈ యుద్ధం ఎక్కువ కాలం కొనసాగదని తమకు వెంటనే విజయాన్ని తెచ్చిపెడుతుందని వారు భావించారు. కానీ అదొక పెద్ద తప్పుడు అంచనాగా తేలింది.

తెహ్రాన్ పాలనా వ్యవస్థ కూలిపోతుందని వారి ప్రసంగాలు సూచించాయి. కానీ జరిగింది దానికి పూర్తి భిన్నం. ఈ యుద్ధం నుంచి బయటపడటం ఇరాన్ పాలనా వ్యవస్థను మరింత బలపరిచింది. అమెరికా, ఇజ్రాయెల్‌ దేశాలు అధికార మార్పిడికి పూర్తి స్థాయిలో ప్రయత్నిస్తాయన్న భయం ఇరాన్ నాయకత్వాన్ని చాలా కాలంగా వెంటాడుతూ వచ్చింది. ఆ ప్రయత్నం జరిగింది నిజమే. కానీ ఫలించలేదు. ప్రాణాలతో బయటపడ్డ తెహ్రాన్ నాయకత్వం ఇప్పుడు మరింత ధైర్యంగా ముందుకు వస్తోంది.

ఖమేనీ, ఆయన సన్నిహితుల స్థానంలో కొత్త నాయకత్వం వేగంగా బాధ్యతల్లోకి వెళ్లింది. ఖమేనీ కుమారుడు మొజ్తబా సుప్రీంలీడర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా బాధ్యతలు స్వీకరించగా, ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్స్ కోర్‌కు చెందిన యువ కమాండర్లు కీలక స్థానాలను భర్తీ చేశారు.

సిద్ధాంతాల విషయంలో వారు పాత నాయకత్వానికి ఏమాత్రం తీసిపోరు. మరిన్ని రిస్కులు తీసుకునేందుకు సిద్ధంగా ఉన్నారు. ఇరాన్‌లోని ఇస్లామిక్ పాలన మనుగడ కోసం జరుగుతున్న పోరాటంగానే వారు ఈ యుద్ధాన్ని చూశారు.

హార్ముజ్‌ జలసంధిని మూసేయడం, ఇరాన్ పొరుగున ఉన్న అరబ్ దేశాలు, అమెరికా స్థావరాలు, ఏకంగా ఇజ్రాయెల్‌పై దాడులు చేయడం వంటి వ్యూహాలను వారు పూర్తిస్థాయిలో అమలు చేశారు. అమెరికా సైనిక శక్తి ఇరాన్‌ను పూర్తిగా బలహీనపరిచిందని అమెరికా రక్షణ మంత్రి పీట్ హెగ్సెత్ చేసిన వ్యాఖ్యలు అవాస్తవమని, అతిశయోక్తేనని తర్వాత తేలింది.

ఇరాన్ యుద్ధం, శాంతి ఒప్పందం, అమెరికా, లెబనాన్, ఆర్థిక వ్యవస్థ, చమురు, అరబ్ దేశాలు

ఫొటో సోర్స్, Getty Images

ఒప్పందంపై ఇజ్రాయెల్ అసహనం...

ఈ యుద్ధంలో అమెరికాకు ఇజ్రాయెల్ ఒక బలమైన భాగస్వామి. అయినప్పటికీ అవగాహన ఒప్పందంపై జరిగిన చర్చల్లో ఇజ్రాయెల్‌కు చోటు దక్కలేదు. దీంతో ఈ ఒప్పందంపై ఆ దేశం తీవ్రమైన అసంతృప్తిని వ్యక్తం చేస్తోంది.

ఇస్లామిక్ రిపబ్లిక్‌ను నాశనం చేసే అవకాశం కోసమే తన రాజకీయ జీవితమంతా ఎదురుచూశానని నెతన్యాహు ఫిబ్రవరి 28న ప్రకటించారు. ఇరాన్‌ను ఇజ్రాయెల్‌కు అత్యంత ప్రమాదకరమైన శత్రువుగా ఆయన భావిస్తున్నారు. అయితే ఇప్పుడు ఆయన ఇజ్రాయెల్ భద్రతను ప్రమాదంలోకి నెట్టారని, రాజకీయ ప్రత్యర్థులు విమర్శలు గుప్పిస్తున్నారు.

అక్టోబర్ నెలాఖర్లో జరగాల్సిన సాధారణ ఎన్నికలు సమీపిస్తున్న వేళ, ఈ విమర్శలు, వాటి రాజకీయ ప్రభావాలను నెతన్యాహు ఎదుర్కోవాల్సి ఉంటుంది.

లెబనాన్ దక్షిణ ప్రాంతంలోని ఒక విస్తారమైన భూభాగాన్ని తమ ఆధీనంలోకి తీసుకోవాలనే ఇజ్రాయెల్ పట్టుదల మరో అడ్డంకిగా మారే అవకాశం ఉంది. ఆ ప్రాంతాల నుంచి పౌరులను వెళ్లగొట్టడమే కాకుండా వేలాది భవనాలను కూడా ఇజ్రాయెల్ ధ్వంసం చేసింది. లెబనాన్, సిరియా, గాజాలోని భూభాగాల ఆక్రమణను నిరవధికంగా కొనసాగిస్తామని ఇజ్రాయెల్ రక్షణ మంత్రి ప్రకటించారు.

లెబనాన్‌పై మరింత దూకుడుగా వ్యవహరించాలని నెతన్యాహుపై ఆయన మంత్రివర్గంలోని అతివాదులు, రాజకీయ ప్రత్యర్థులు ఒత్తిడి తెస్తున్నారు. లెబనాన్ దక్షిణ ప్రాంతాన్ని అధికారికంగా విలీనం చేసుకోవాలన్న డిమాండ్లు కూడా వినిపిస్తున్నాయి. అమెరికాలో ఇచ్చిన వరుస ఇంటర్వ్యూల్లో ట్రంప్ ఇప్పటికే నెతన్యాహుపై అసహనం వ్యక్తం చేశారు. అలాంటి పరిస్థితిలో ట్రంప్‌ను ధిక్కరించి అమెరికాతో సంబంధాలను మరింత దెబ్బతీసే ప్రమాదాన్ని తాను తీసుకోగలడా లేదా అన్నది నెతన్యాహు ఆలోచించాల్సి ఉంటుంది.

ఆదివారం బేరూత్ దక్షిణ శివార్లపై ఇజ్రాయెల్ జరిపిన వైమానిక దాడి, కీలకమైన చర్చలను భంగపరచాలన్న ప్రయత్నమేనని స్పష్టంగా తెలిస్తోంది. అయితే చర్చల గడువు ముగుస్తున్న పరిస్థితుల్లో జరిగిన ఆ దాడి, ఉద్దేశించిన దానికి విరుద్ధంగా చర్చల ప్రక్రియను మరింత వేగవంతం చేసినట్లు కనిపిస్తోంది.

ప్రస్తుతం పరిస్థితులు కొంత ప్రశాంతంగా మారే అవకాశం ఉంది. అయితే ఈ అవగాహన ఒప్పందం అమెరికా, ఇరాన్ మధ్య విస్తృత స్థాయి రాజకీయ ఒప్పందంగా మారుతుందని ఇప్పుడే చెప్పడం కష్టం. అలాంటి ఒప్పందం మధ్యప్రాచ్యాన్ని పూర్తిగా మార్చివేయగలదు. కానీ సిద్ధాంతపరమైన విభేదాలు, పరస్పర నమ్మకం పూర్తిగా లేకపోవడం వల్ల అది ఇప్పటికీ సుదూర లక్ష్యంగానే కనిపిస్తోంది.

ఈ యుద్ధం అన్ని వర్గాలకూ చేదు అనుభవాన్నే మిగిల్చింది. ఫిబ్రవరి 28న స్వేచ్ఛాయుతమైన భవిష్యత్తు గురించి ట్రంప్ హామీ ఇచ్చిన ఇరాన్ ప్రజలు ఇప్పటికీ అదే కఠిన పాలన కింద జీవిస్తున్నారు. జనవరిలో వీధుల్లో నిరసనలకు దిగిన వేలాది మందిని ఇరాన్ పాలక వ్యవస్థ హతమార్చింది.

అమెరికా ఇప్పటికీ అపారమైన ఆర్థిక, సైనిక శక్తి ఉన్న దేశమే. అయితే ఇరాన్‌పై యుద్ధానికి వెళ్లాలని ట్రంప్ హఠాత్తుగా తీసుకున్న నిర్ణయం, మారుతున్న ప్రపంచంలో తన ఆధిపత్యాన్ని నిలబెట్టుకునేందుకు కష్టపడుతున్న ఒక శక్తిమంతమైన దేశం వేసిన అడుగేనని స్పష్టమవుతోంది.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,  ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)