ప్రశాంతంగా ఏపీ బంద్, రాజకీయ పార్టీలు, ప్రజాసంఘాల ఆధ్వర్యంలో నిరసనలు, మళ్లీ రోడ్డెక్కిన ఆర్టీసీ బస్సులు

రాస్తారోకో
    • రచయిత, శంకర్. వి
    • హోదా, బీబీసీ కోసం
  • ప్రచురణ

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బంద్ ప్రశాంతంగా ముగిసింది. వివిధ రాజకీయ పక్షాలు, ప్రజా సంఘాలు పాల్గొని రాష్ట్రవ్యాప్తంగా నిరసనలు చేపట్టాయి. ప్రభుత్వం కూడా బంద్‌కు మద్దతు ప్రకటించడంతో ఆర్టీసీ బస్సులు ఎక్కడివక్కడే నిలిచిపోయాయి. రాష్ట్రంలోని 128 డిపోల నుంచి బస్సులు కదలలేదు.

ప్రభుత్వ కార్యాలయాలన్నీ దాదాపుగా మూతపడ్డాయి. ప్రభుత్వ, ప్రైవేటు విద్యాసంస్థలకు ముందస్తుగా సెలవులు ప్రకటించారు.

వాణిజ్య, వ్యాపార సంస్థలు కూడా పలు చోట్ల తెరుచుకోలేదు. ప్రైవేటు వాహనాలు మాత్రం తిరిగాయి.

కొన్ని చోట్ల రాస్తారోకోలు నిర్వహించడంతో రవాణాకు ఆటంకం ఏర్పడింది. కొన్ని ప్రాంతాల్లో ప్రైవేటు లారీ ట్రాన్స్ పోర్టు ఆపరేటర్లు, ఆటో కార్మిక సంఘాలు కూడా బంద్‌లో పాల్గొనడంతో అవి కూడా నిలిచిపోయాయి.

ఖాళీగా ఉన్న పాడేరు బస్ స్టాండ్

అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు భద్రతా చర్యలు ఏర్పాటు చేశారు.

విశాఖ ఉక్కు పరిరక్షణ సమితి పిలుపు మేరకు ఈ బంద్ పాటించారు. పాలక వైసీపీ, ప్రధాన ప్రతిపక్షం టీడీపీతో పాటు కాంగ్రెస్, కమ్యూనిస్టు పార్టీలు, ఉద్యోగ సంఘాలు, జర్నలిస్టులు, ఇతర ప్రజా సంఘాలు కూడా బంద్‌లో పాల్గొన్నారు. నిరసనలు చేపట్టారు. పలు ప్రాంతాల్లో ప్రదర్శనలు జరిగాయి.

విశాఖలో కూర్మన్నపాలెం, అగనంపూడి ప్రాంతాల్లో జాతీయ రహదారి మీద బైఠాయించారు. ఉత్తరాంధ్ర, కోస్తా ప్రాంతాల్లో కూడా బంద్ ప్రభావం కనిపించింది. రాయలసీమలో విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ నిలిపివేయాలని, కడప స్టీల్ నిర్మాణం చేపట్టాలనే నినాదాలు చేస్తూ బంద్ నిర్వహించారు. పట్టణాలు, నగరాల్లో బంద్ ప్రభావం కనిపించింది.

విజయవాడలో

విశాఖ ఉక్కు కోసం పాదయాత్ర చేయండి..

బంద్‌లో భాగంగా విజయవాడలో నిర్వహించిన కార్యక్రమాలో టీడీపీ నేతలు పాల్గొన్నారు. పాలక వైసీపీ నేతల తీరుని మాజీ మంత్రి దేవినేని ఉమా విమర్శించారు. ఆయన మాట్లాడుతూ "విశాఖ స్టీల్ ప్లాంట్ ఏర్పాటు వెనుక అనేక మంది ప్రాణ త్యాగాలు, వేల మంది నిర్వాసితులు సర్వం త్యాగం చేసిన నేపథ్యం ఉంది. స్టీల్ ప్లాంట్ వస్తే మా పిల్లలకు ఉద్యోగాలు వస్తాయి మా పిల్లల భవిష్యత్తు బాగుంటుంది అని నాడు పోరాటాలు చేసి తెచ్చుకున్నారు. ఎన్నో పోరాటాలు చేసి తెచ్చుకున్నా కంపెనీని సీఎం జగన్మోహన్ రెడ్డి నేడు తాకట్టు పెట్టారు. తాడేపల్లి రాజా ప్రసాదం లో పోస్కో ప్రతినిధులు ముఖ్యమంత్రిని కలిశారు ఏ లాలూచీ చేసుకున్నారో ప్రజలకు చెప్పాలి ?ముఖ్యమంత్రి గారు ఎవరికి చెప్పి ఒప్పందాలు చేసుకున్నారు ? విశాఖ కార్మికులకు చెప్పారా ? ప్రజా ప్రతినిధులకు చెప్పారా ? "అని ఉమా ప్రశ్నించారు.

వామపక్షాల నిరసన

ఫొటో సోర్స్, ugc

ఐక్యపోరాటాలతోనే సాధ్యం

విశాఖ స్టీల్ కోసం ఐక్యంగా పోరాడాల్సిన అవసరం ఉందని సీపీఐ జాతీయ కార్యదర్శి కె.నారాయణ అన్నారు. ఆయన బీబీసీతో మాట్లాడుతూ "టీడీపీ నేతలు వైసీపీని విమర్శించడం, వైసీపీ ప్రభుత్వ పెద్దలు చంద్రబాబుని తప్పుపట్టడం సరికాదు. ముఖ్యమంత్రి చొరవ తీసుకుని అఖిలపక్షం ఏర్పాటు చేయాలి. సమష్టిగా కేంద్రంపై ఒత్తిడి పెంచాలి. అప్పుడే మోదీ దిగివస్తారు. విశాఖ ఉక్కు పరిరక్షణ అందరి బాధ్యత " అని పేర్కొన్నారు.

ఎంతటి పోరాటానికైనా సిద్ధమే. .

విశాఖ ఉక్కు పరిశ్రమ కోసం ఎలాంటి పోరాటానికైనా తాము సిద్ధంగా ఉన్నామని ఏపీ ఎన్జీవో సంఘం నేతలు ప్రకటించారు. బంద్‌లో ఏపీ ఎన్జీవో అసొసియేషన్ తో పాటుగా జర్నలిస్ట్ సంఘాల నేతలు కూడా పాల్గొన్నారు.

విజయవాడలో జరిగిన కార్యక్రమాలో ఎన్జీవో నేత ఎన్.చంద్రశేఖర్ రెడ్డి మాట్లాడుతూ "దాదాపు 26,000 వేల ఎకరాలలో ఉన్న కర్మాగారాన్ని ప్రేవేటీకరించి అందులో ఉన్న 16,000 మంది శాశ్వత ఉద్యోగులను, 17,500 మంది కాంట్రాక్టు కార్మికులను రోడ్డుకి నెట్టేసే ప్రయత్నం తగదు. మరొక లక్ష మంది పరోక్షంగా ఈ కర్మాగారం వలన ఉపాధి పొందుతున్నారు. విశాఖ ఉక్కును కాపాడుకోవడానికి తమ సంఘం ఎంతటి పోరాటానికైనా వెనుకంజ వేయదు" అని తెలిపారు.

సీఎం సూచించిన ప్రత్యామ్నాయాలు మేలు

విశాఖ స్టీల్ పరిరక్షణ ఏపీ ప్రయోజనాల రీత్యా అత్యవసరం అని ఏపీ స్టేట్ ఫైబర్ నెట్ లిమిటెడ్ చైర్మన్ గౌతమ్ రెడ్డి అన్నారు. ఏపీ బంద్‌లో భాగంగా నిర్వహించిన కార్యక్రమాల్లో ఆయన పాల్గొన్నారు.

"ముఖ్యమంత్రి జగన్ కేంద్రానికి పలు మార్గాలు సూచించారు. స్టీల్ ప్లాంట్ పరిరక్షణకు వాటిని అనుసరించాలి. నవరత్న కంపెనీని కాపాడాలి. కార్మికులకు ఉద్యోగభద్రత లేకుండా చేసి విశాఖ అభివృద్ధిని అడ్డుకోవాలనే యత్నం సరికాదు. ఆంధ్రప్రదేశ్ కి తలమానికంగా ఉన్న స్టీల్ ప్లాంట్ కాపాడుకోవడానికి కలిసికట్టుగా ఉద్యమిస్తాం. టీడీపీ నేతలు విశాఖలో ఒకమాట, ఢిల్లీలో మరో మాట మాట్లాడుతున్నారంటూ " విమర్శించారు.

వివిధ సంఘాలతో పాటుగా ప్రభుత్వం కూడా మద్ధతుగా నిలవడంతో ఉదయం నుంచి ఆర్టీసీ బస్సులను నిలిపివేశారు. దాంతో దూర ప్రాంతాలకు వెళ్లాల్సిన వారు ఇబ్బందులు పడ్డారు. అనేక చోట్లు చిక్కుకుపోయి సతమతమయ్యారు. చివరకు మధ్యాహ్నం ఒంటి గంట తర్వాత ఆర్టీసీ బస్సులను మళ్లీ అనుమతించడంతో రోడ్డెక్కాయి.

బంద్‌కు మద్ధతుగా ఒకపూట బస్సులు నిలిపేస్తామని ఏపీ ప్రభుత్వం ప్రకటించింది

ఫొటో సోర్స్, I&PR

ఫొటో క్యాప్షన్, బంద్‌కు మద్ధతుగా ఒకపూట బస్సులు నిలిపేస్తామని ఏపీ ప్రభుత్వం ప్రకటించింది

సర్కారు తరఫున ఆర్టీసీ బంద్

విశాఖ స్టీల్‌ప్లాంట్‌ కార్మిక సంఘాలు ఇచ్చిన బంద్‌కి ఏపీ ప్రభుత్వం తరఫున మద్ధతు ఇస్తున్నామని సమాచార, రవాణా శాఖ మంత్రి పేర్ని నాని బంద్‌కి ముందు రోజున ప్రకటించారు. విశాఖ ఉక్కును ప్రైవేటుపరం చేయాలన్న కేంద్ర ప్రభుత్వ నిర్ణయాన్ని రాష్ట్ర ప్రభుత్వం వ్యతిరేకిస్తోందన్నారు.

బంద్‌కు సంఘీభావంగా ఆర్టీసీ బస్సుల్ని శుక్రవారం మధ్యాహ్నం ఒంటి గంట వరకు నడపరాదని ప్రభుత్వం నిర్ణయించిందని తెలిపారు. ఆ తర్వాత బస్సులను అడ్డుకోకుండా ఆందోళనకారులు సహకరించాలని కోరారు. ఆర్టీసీ కార్మికులందరూ నల్లబ్యాడ్జీలు ధరించి విధులకు హాజరవుతారని మంత్రి ప్రకటించారు.

"వ్యాపారం చేయడం కేంద్ర ప్రభుత్వం బాధ్యత కానప్పటికీ, ప్రతి వస్తువు ప్రైవేటు చేతుల్లో ఉంటే ధరలను కంట్రోల్ కష్టం. ప్రజలకు అవసరమైనవి కొన్ని కచ్చితంగా ప్రభుత్వం చేతుల్లోనే ఉండాలన్నది మా ప్రభుత్వ విధానం. విశాఖ ఉక్కు అప్పుల ఊబిలో ఉంటే, దాని నుంచి బయటపడే మార్గాలను ఇప్పటికే సీఎం జగన్ సూచించారు." అన్నారు మంత్రి పేర్ని నాని.

స్టీల్‌ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా వివిధ పార్టీలు నిరసనలు కార్యక్రమాలు నిర్వహిస్తున్నాయి.
ఫొటో క్యాప్షన్, స్టీల్‌ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా వివిధ పార్టీలు నిరసనలు కార్యక్రమాలు నిర్వహిస్తున్నాయి.

వారం రోజులుగా పరిరక్షణ సమితి ఆందోళనలు

విశాఖ స్టీల్‌ప్లాంట్‌ పరిరక్షణ సమితి పేరుతో విశాఖలో గడిచిన పక్షం రోజులుగా వివిధ రూపాల్లో నిరసన కార్యక్రమాలు సాగుతున్నాయి. ప్లాంట్ వద్ద నిర్వహించిన బహిరంగసభకు అధికార వైసీపీ, ప్రధాన ప్రతిపక్షం టీడీపీ నేతలతోపాటు వామపక్షాలు, కాంగ్రెస్‌ సహా వివిధ సంఘాలు నేతలు, కార్యకర్తలు హాజరయ్యారు.

రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో కొద్ది రోజులుగా రాస్తారోకోలు జరుగుతున్నాయి. వాటికి కొనసాగింపుగా జరుగుతున్న బంద్ కార్యక్రమం రాష్ట్రమంతా విశాఖ ఉక్కు ఉద్యమానికి తోడ్పడుతుందని పరిరక్షణ సమితి నేతలు బీబీసీతో అన్నారు.

బంద్‌కు ప్రజల నుంచి మద్ధతు లభిస్తోందని సమితి ప్రతినిధి జె.అయోధ్యరామ్‌ అన్నారు. ‘‘ఇప్పటికే ఛాంబర్ ఆఫ్ కామర్స్‌ వ్యాపార సంస్థలు మూసివేతకు పిలుపునిచ్చింది. ప్రైవేటు విద్యాసంస్థలు సెలవు ప్రకటించారు. ప్రభుత్వ రవాణాను కూడా నిలిపివేస్తున్నారు. బంద్‌ సంపూర్ణంగా జరగబోతోంది.’’ అని ఆయన అన్నారు.

ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా స్టీల్‌ప్లాంట్ పరిరక్షణ సమితి ఉద్యమిస్తోంది
ఫొటో క్యాప్షన్, ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా స్టీల్‌ప్లాంట్ పరిరక్షణ సమితి ఉద్యమిస్తోంది

టీడీపీ మద్దతు

విశాఖ ఉక్కు పరిరక్షణ సమితి, కార్మిక సంఘాల బంద్ పిలుపుకు తెలుగుదేశం పార్టీ సంపూర్ణ మద్దతు తెలుపుతోందని ఆ పార్టీ ఏపీ శాఖ అధ్యక్షుడు కె.అచ్చెన్నాయుడు ముందే ప్రకటించారు. గ్రామస్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకూ బంద్‌ను టీడీపీ శ్రేణులు విజయవంతం చేయాలని ఆయన పిలుపునిచ్చారు.

స్టీల్‌ప్లాంట్‌ కార్మికుల ఆందోళనకు సంఘీభావం తెలిపారు. "తెలుగు ప్రజల ఆత్మగౌరవానికి ప్రతీకగా నిలిచిన విశాఖ ఉక్కు పరిశ్రమను పరిరక్షించుకునేందుకు సమైక్యంగా పోరాడతాం. స్టీల్‌ప్లాంట్‌ లేకపోతే విశాఖ ఉనికికే ప్రమాదం.’’ అని అచ్చెన్నాయుడు పేర్కొన్నారు.

మరోవైపు టీడీపీ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ విశాఖలో పర్యటించారు.

విశాఖ స్టీల్‌ ప్లాంట్

బీజేపీ, జనసేన

అయితే ఏపీ బంద్‌ని బీజేపీ నేతలు తప్పుబడుతున్నారు. విశాఖ ఉక్కు కార్మికుల ప్రయోజనాల కోసమే కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని ఆ పార్టీ ఎంపీ జీవీఎల్‌ నరసింహరావు అన్నారు. కార్మికులను రెచ్చగొట్టేందుకు కొన్ని పార్టీలు ప్రయత్నిస్తున్నాయని ఆయన ఆరోపించారు.

"ప్రైవేటీకరణ దేశ ప్రయోజనాలకు అనుగుణంగా తీసుకున్న నిర్ణయం. ఉద్యోగులకు ఎటువంటి సమస్య రాదు. బంద్, ఇతర నిరసనలతో ఒరిగేదేమీ ఉండదు. ఇలాంటి ఆందోళనలు రాజకీయ ప్రయోజనాల కోసం విపక్షాలు వేసే ఎత్తుగడలు మాత్రమే" అని నరసింహారావు వ్యాఖ్యానించారు.

బీజేపీ, జనసేన మినహా మిగిలిన అన్నిపార్టీలు బంద్‌కి సంఘీభావం ప్రకటించాయి. వివిధ వ్యాపార,వాణిజ్య సంఘాలు కూడా మద్ధతు తెలిపాయి.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)