ది వాయిస్ ఆఫ్ హింద్ రజబ్: ఆ పాప చనిపోయిందని తెలుసు... కానీ బతికించాలని ఆరాటపడతారు

ఫొటో సోర్స్, Rajab Family
- రచయిత, వందన
- హోదా, న్యూస్ ఎడిటర్, బీబీసీ న్యూస్
- ప్రచురణ
- చదివే సమయం: 6 నిమిషాలు
‘‘నన్నిక్కడి నుంచి బయటకు తీసుకురండి.. నాకు భయమేస్తోంది. వాళ్లు నాపై కాల్పులు జరుపుతున్నారు’’ కారులో చిక్కుకుపోయిన ఆరేళ్ల చిన్నారి గొంతు ఇది. ఆ కారులోని ఆ చిన్నారి బంధువులందరూ చనిపోయారు.
తుపాకీ కాల్పులు, మృతదేహాల మధ్య నక్కి, ఆ చిన్నారి సాయం చేయమని తన మొబైల్ ఫోన్ ద్వారా వాలంటీర్లను వేడుకుంటోంది. భయంతో వణికిపోతున్నా, ఆ పాప పోరాడుతూనే ఉంది.
ఇది సినిమా సన్నివేశంలా అనిపించవచ్చు. కానీ మీరు థియేటర్‌లో ‘ది వాయిస్ హింద్ రజబ్’ సినిమా చూస్తున్నప్పుడు ఇది కల్పన కాదు, నిజమేనని, ఆ గొంతు సినిమా నటిది కాదని అర్ధమవుతుంది.
కొన్ని నెలలపాటు వివాదం కొనసాగిన తర్వాత ‘ఏ’ సర్టిఫికేట్‌తో 'ది వాయిస్ ఆఫ్ హింద్ రజబ్' సినిమా భారత్‌లో విడుదలైంది.


ఫొటో సోర్స్, Altitude
బహుశా వాళ్లేమైనా కాపాడతారేమో...
పాలస్తీనా చిన్నారి హింద్ రజబ్ జీవితంలోని కొన్ని గంటల ఆధారంగా 'ది వాయిస్ ఆఫ్ హింద్ రజబ్' అనే సినిమాని రూపొందించారు.
గాజా నుంచి పారిపోతున్నప్పుడు ఆ పాపతోపాటు, పాప బంధువులపై దాడి జరిగింది. ఆ తర్వాత హింద్ కొన్ని గంటల పాటు కారులో ఒంటరిగా దాక్కుని ఉండిపోయింది. ఆ చిన్నారి జ్రాయెల్ కాల్పుల్లో మరణించి ఉండవచ్చని పలు మీడియా సంస్థల దర్యాప్తు ద్వారా తెలుస్తోంది.
జనవరి 2024లో జరిగిన ఈ ఘటనలో హింద్ రజబ్‌ను కాపాడలేకపోయారనే విషయం సినిమా చూడటానికి ముందే ప్రేక్షకులకు తెలుసు. కానీ, ఆ చిన్నారి పరిస్థితిని, ఫోన్ ద్వారా ఆమెను కాపాడటానికి ప్రయత్నిస్తున్న వాలంటీర్లను చూసినప్పుడు, వారి మాటలు విన్నప్పుడు, ఆమె బతుకుతుందేమో... వారంతా కలిసి ఆమెను కాపాడతారేమోననే ఆశ కలుగుతుంది.
హింద్ చనిపోయిందని తెలిసినప్పటికీ, మనల్ని మాయ చేస్తున్నట్టుగా అనిపిస్తుంది. సమయం గడుస్తున్న కొద్దీ, పాపను కాపాడగలమనే భ్రమను, ఆశను మీలో నింపుతుందీ సినిమా. కానీ అది నిజం కాదు. అదే ఈ చిత్రంలోని అత్యంత హృదయవిదారకమైన విషయం.
ఒక ప్రేక్షకుడిగా మిమ్మల్ని తీవ్రంగా కదిలించి, కుంగదీస్తుంది. ఉత్కంఠభరితమైన థ్రిల్లర్‌ను చూస్తున్నట్లుగా మీ గుండె వేగంగా కొట్టుకుంటూనే ఉంటుంది.

ఫొటో సోర్స్, Getty Images
నా స్కూలు పేరు హ్యాపీ చైల్డ్ హుడ్, నా క్లాస్ పేరు బటర్‌ఫ్లై’
సినిమాలో ఒక వైపు హింద్ గొంతు వినిపిస్తుంటుంది, కానీ ఆమె కనిపించదు. ఫోన్‌లో రికార్డ్ చేసిన ఆమె నిజమైన గొంతులో భయం, నిస్సహాయత స్పష్టంగా వినిపిస్తాయి.
మరోవైపు ఫోన్ ద్వారా హింద్‌కు సాయం చేయడానికి ప్రయత్నించిన రెడ్ క్రెసెంట్ వాలంటీర్ల పాత్రలను పోషిస్తున్న నటులు కనిపిస్తారు.
ప్రతిక్షణం వారు హింద్‌తో మాట్లాడుతూనే ఉంటారు. మరణం ఆమె ఎదుట నిలబడి ఉన్నప్పటికీ, ఆమెకు ధైర్యం చెప్పేందుకు, ఓదార్చేందుకు ప్రయత్నిస్తూనే ఉంటారు.
ఈలోపు ఆమెకు ధైర్యం చెప్పేందుకు సహాయక సిబ్బంది కారులో రక్తంతో తడిసి శవాలుగా పడి ఉన్న చిన్నారి బంధువులు చనిపోలేదనే అబద్ధం చెబుతారు. కానీ యుద్ధం మధ్య జీవించడం అలవాటుపడిన హింద్, "లేదు, వాళ్ళు చనిపోయారు" అని చెప్పడంతో అందరూ నిశ్శబ్దంగా ఉండిపోతారు.
ఆ భయానక పరిస్థితుల మధ్య కూడా హింద్ తన అమాయకత్వాన్ని కనబరుస్తూ.. తన స్కూలు పేరు "ఏ హ్యాపీ చైల్డ్‌హుడ్", తన క్లాస్ పేరు "బటర్‌ఫ్లై" అని వాలంటీర్లకు చెప్పింది.

ఫొటో సోర్స్, Venice Film Festival
భారత్‌లో విడుదలపై వివాదం
మార్చిలో జరిగిన ఆస్కార్ వేడుకల సమయంలో ఈ చిత్రం భారత్‌లో విడుదల అవుతుందని భావించారు.
"నేను ఫిబ్రవరిలోనే ఈ సినిమాని భారత సెన్సార్ బోర్డుకు పంపించాను. ఈ చిత్రం గురించి మీడియాలో వార్తలు వచ్చినట్టుగానే, సెన్సార్ బోర్డు సభ్యులలో ఒకరు ఈ చిత్రం విడుదలైతే భారత్-ఇజ్రాయెల్ సంబంధాలు దెబ్బతింటాయని ఒకరు నోటిమాటగా చెప్పారు. కానీ ఆయన రాతపూర్వకంగా చెప్పలేకపోయారు" అని ఈ చిత్ర పంపిణీదారుడు మనోజ్ నంద్వానా బీబీసీతో చెప్పారు.
"చివరికి ఈ సినిమా ఎలాంటి కట్స్ లేకుండా విడుదల కావడం మంచి విషయం. ఏ పదాన్నీ బీప్ చేయలేదు. ఏ సర్టిఫికేట్ ఇచ్చారు" అని ఆయన తెలిపారు.
మార్చిలో సినిమా విడుదలను అడ్డుకున్నారనే ఆరోపణలపై స్పందన కోరినా, భారత సెన్సార్ బోర్డు నుంచి ఎలాంటి సమాధానం రాలేదు.
అయితే ఈ సినిమాను విడుదల చేయకపోవడంపై భారత్‌లోని పలువురు సినీ దర్శకులు, కళాకారులు, అలాగే పార్లమెంట్ సభ్యులు నిరసన వ్యక్తం చేశారు.
భారత మాజీ విదేశాంగ మంత్రి శశి థరూర్ దీన్ని "అవమానకరం" అని విమర్శించారు.
ఒక సినిమా ప్రదర్శనకు ఇతర దేశాలతో సంబంధాలకు ఎలాంటి సంబంధం ఉండదని, ఇలాంటి కారణాలతో సినిమాలను నిషేధించే పద్ధతిని ఆపాలని ఆయన చెప్పారు.

ఫొటో సోర్స్, Getty Images
సినిమా విషయానికి వస్తే, ట్యునీషియా దర్శకురాలు కౌథర్ బిన్ హానియా హింద్‌పై సినిమా తీయాలని ఎందుకు అనుకున్నారు? అని బీబీసీ ప్రశ్నిస్తే , 'సహాయం కోసం అర్ధిస్తున్న హింద్ రజబ్ ఆడియో నన్ను వెంటాడుతూనే ఉంది. చాలా నిస్సహాయంగా అనిపించింది. ఈ సినిమా తీయకపోయి ఉంటే, ఆ ఘటనలో నేను కూడా భాగమైనట్టు భావించేదాన్ని, అందుకే ఈ సినిమా తీశాను'.
గాజాలో జరిగిన ఈ దాడిలో హింద్ రజబ్ మాత్రమే కాదు, ఆమెను రక్షించడానికి వెళ్లిన అంబులెన్స్ సిబ్బందిలోని ఇద్దరు సభ్యులు కూడా మరణించారు.

ఫొటో సోర్స్, Altitude
దాడి జరిగిన సమయంలో ఇజ్రాయెల్ దళాలు ఆ ప్రాంతంలో లేవని ఇజ్రాయెల్ రక్షణ దళాలు (ఐడీఎఫ్) మొదట పేర్కొన్నాయి. అయితే కొన్ని స్వతంత్ర దర్యాప్తుల తర్వాత ఈ వాదనపై ప్రశ్నలు ఉత్పన్నమయ్యాయి.
తాము 'ఉగ్రవాద లక్ష్యాల'పై దాడి చేశామని, హింద్ అత్యవసర కాల్ చేసిన ప్రాంతానికి సమీపంలో తమ దళాలు లేవని ఐడీఎఫ్ తర్వాత తెలిపింది.
2024 అక్టోబర్‌లో హింద్ రజబ్‌తో పాటు ఆమెను రక్షించడానికి వెళ్లిన సహాయక సిబ్బందితో సహా గాజా ఆరోగ్య సంరక్షణ వ్యవస్థపై ఇజ్రాయెల్ దాడి చేసిందని ఐక్యరాజ్యసమితి కమిషన్ ఆరోపించింది.
ఇదిలా ఉండగా హింద్ తల్లి వెసామ్ హమాదా అడిగిన ప్రశ్నలకు ఇంతవరకూ జవాబు దొరకలేదు.
"నా కుమార్తె సాయం కోసం చేసిన విజ్ఞప్తిని విని కూడా ఆమెను కాపాడటానికి ఏమీ చేయని వారందరినీ దేవుడి ముందు ప్రశ్నిస్తాను. ఇంకా ఎంతమంది తల్లులు ఇలాంటి బాధ అనుభవించాలి?" అని బీబీసీకి ఇచ్చిన భావోద్వేగపూరిత ఇంటర్వ్యూలో ఆమె అన్నారు.
సినిమా ప్రీమియర్ సమయంలో హింద్ తల్లి కూడా వచ్చారని, కానీ ఆమెతో తాను మాట్లాడలేకపోయానని మనోజ్ నంద్వానా చెప్పారు.
"కూతురిని కోల్పోయిన బాధలో ఉన్న ఒక తల్లితో ఏం మాట్లాడగలం? తన బిడ్డను కాపాడలేకపోయాననే బాధ ఆమెను వెంటాడుతోంది. కొందరు దీనిని ప్రచారం అనవచ్చు. కానీ ఈ సినిమా యుద్ధం ఎలాంటి ప్రభావం చూపుతుందో చూపిస్తుంది..అది ఎక్కడ జరిగినా" అని ఆమె అన్నారు.

ఫొటో సోర్స్, Getty Images
రాజకీయాలు, మతం, ప్రాంతాలకతీతంగా హింద్ రజబ్ కథపై, అలాగే ఆమెను కాపాడేందుకు ప్రయత్నించిన అత్యవసర సహాయక సిబ్బందిపై దృష్టి పెడుతుందీ సినిమా. వారు సమయంతో, పరిస్థితులతో, కొన్నిసార్లు తమతో తామే పోరాడుతూ హింద్‌ను కాపాడాలని ఆశించారు.
ఆరేళ్ల హింద్ ఇక మన మధ్య లేదని మీరు అంగీకరిస్తున్న సమయంలో, చివరి కొన్ని నిమిషాల్లో హింద్‌ను నిజంగా తెరపై చూపిస్తారు. ఆమె నిజ జీవితంలోని ఇంటి వీడియోలో, బీచ్‌లో ఆడుకుంటూ కనిపిస్తుంది.
హింద్ చనిపోవడానికి ముందు వాలంటీర్లకు చెప్పినట్టుగానే.. "ఏ హ్యాపీ చైల్డ్‌హుడ్" అది.
నిజ జీవితానికి, డాక్యుమెంటరీని కలిపి ఈ సినిమాను చూపించిన విధానం మనసును కలిచివేస్తుంది, బాధపెడుతుంది, కన్నీళ్లు పెట్టిస్తుంది, గట్టిగా ఆలోచింపజేస్తుంది, కొన్నిసార్లు మాటలు రాకుండా చేస్తుంది. దీన్ని వర్ణించడానికి సరైన పదాలు లేవు.
పాకిస్తాన్, బంగ్లాదేశ్, శ్రీలంకలో విడుదల హక్కులను కూడా ఈ సినిమా భారతీయ పంపిణీదారు మనోజ్ నంద్వానా కొనుగోలు చేశారు
( బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్, ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)






























