పీజీ వైద్య విద్యార్థిని ప్రియాంక మృతి

ప్రియాంక, పీజీ విద్యార్థిని మృతి

ఫొటో సోర్స్, UGC

ప్రచురణ
చదివే సమయం: 4 నిమిషాలు

తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో ఆగస్టు 3న ఇద్దరు పీజీ మెడికల్ స్టూడెంట్లను వెనకనుంచి మద్యం మత్తులో ఉన్న యువకులు కారుతో ఢీకొన్న ఘటనలో తీవ్రంగా గాయపడి కిమ్స్‌లో చికిత్స పొందుతున్న ప్రియాంక మృతి చెందారు.

‘ఆమె 9వ తేదీ మధ్యాహ్నం 3 గంటల 32 నిమిషాలకు మృతి చెందారు’ అని కిమ్స్ హాస్పిటల్ ఒక ప్రకటనలో తెలిపింది.

‘ఆగస్టు 6వ తేదీ మధ్యాహ్నం 2గంటల 12 నిమిషాలకు బాధితురాలిని కిమ్స్ ఆస్పత్రికి చికిత్స కోసం తీసుకొచ్చారు. ఇక్కడ ఆమెకు వెంటిలేటర్‌పై చికిత్స అందించాం. ఆమె ఈ రోజు (ఆగస్టు 9వతేదీ) మధ్యాహ్నం 3 గంటల 32 నిమిషాలకు మరణించారు’ అని కిమ్స్ విడుదల చేసిన ప్రకటన తెలిపింది.

‘‘ఎంతో భవిష్యత్ ఉన్న ఒక వైద్య విద్యార్థిని ప్రాణాలు కోల్పోవడం బాధాకరమని’’ ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు సంతాపం వ్యక్తం చేస్తూ. మృతురాలి కుటుంబానికి 20 లక్షల రూపాయల ఆర్థిక సాయం ప్రకటించారు.

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్
ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి
ప్రకటన , ప్రియాంక మృతి

ఫొటో సోర్స్, KIMS

ఏం జరిగింది?

ఆగస్టు 3న తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో ఇద్దరు పీజీ మెడికల్ స్టూడెంట్లను వెనకనుంచి మద్యం మత్తులో ఉన్న యువకులు కారుతో ఢీకొన్న ఘటనకు సంబంధించిన వివరాలను ప్రకాశ్‌నగర్ సర్కిల్ ఇన్‌స్పెక్టర్ బాజీలాల్ బీబీసీకీ వివరించారు.

"ఆగస్టు 3వ తేదీ రాత్రి ఏవీఏ రోడ్‌లోని ప్రసాద్‌ ఆదిత్యా మాల్‌లో సెకండ్‌ షో చూడటానికి రాజమండ్రికి చెందిన సురావరపు దస్వంత్, ఆండ్రూ జోసెఫ్‌ ఎడ్వర్డ్ అనే ఇద్దరు యువకులు వచ్చారు. వీరిద్దరు మద్యం సేవించినట్టు సెక్యూరిటీ గేటు వద్ద బ్రీత్‌ అనలైజర్‌ టెస్ట్‌లో తేలింది''

''మద్యం తీసుకున్నవారిని వారిని థియేటర్‌ లోపలికి అనుమతించలేమని సెక్యూరిటీ సిబ్బంది చెప్పారు. దీంతో ఆ యువకులిద్దరూ వాగ్వాదానికి దిగారు. కానీ సెక్యూరిటీ వారిని అనుమతించకపోవడంతో వారిద్దరూ పార్కింగ్‌లోని తమ కారును తీసుకుని బయటకు వెళతుండగా ఎంట్రన్స్ గేటు వద్ద ఆగాల్సి వచ్చింది''

''అలా ఆగిన కారు ముందు ఓ స్కూటీపై అప్పుడే ఫస్ట్ షో చూసి ఇంటికి తిరుగుముఖం పట్టిన ఉమేష్, ప్రియాంక అనే మెడికోలు ఉన్నారు. ఈ క్రమంలో మద్యం మత్తులో ఉన్న యువకులిద్దరూ కారుతో మెడికోల స్కూటీని ఢీకొట్టారు. తరువాత కారును కొంచెం వెనక్కు తీసుకువచ్చి స్కూటీపైకి వేగంగా నడుపుతూ రోడ్డుపైకి దూసుకొచ్చారు. ఆ సమయంలో వెనక కూర్చున్న ప్రియాంక కింద పడిపోయారు. అయినా కారు నడుపుతున్న సురవరపు దస్వంత్‌, జోసెఫ్ ఎడ్వర్డ్ మరోసారి కారుతో బలంగా గుద్ది పరారయ్యారు. తీవ్రంగా గాయపడిన ప్రియాంకతో పాటు ఉమేష్‌ను స్థానికులు రాజమండ్రి స్వతంత్ర హాస్పిటల్‌లో చేర్చారు'' అని బాజీలాల్‌ వివరించారు.

రాజానగరం జీఎస్ఎల్ వైద్య కళాశాలలో మల్లి వెంకట దుర్గ సాయి ఉమేష్ పీజీ రేడీయాలజీ చదువుతుండగా, ప్రియాంక డెర్మటాలజీ చదువుతున్నారు.

రాజమహేంద్రవరం  ఎస్పీ

ఫొటో సోర్స్, Screengrab

‘నిందితులకు త్వరగా శిక్షపడేలా చేస్తాం’

ఈ కేసులో తదుపరి దర్యాప్తును సమగ్రంగా నిర్వహించి చార్జిషీటు త్వరగా వేసి నిందితులకు శిక్ష పడేటట్లు చేయడానికి పోలీసు అధికారులు, స్పెషల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్లతో పాటు న్యాయకోవిదులతో సంప్రదింపులు జరుపుతున్నామని తూర్పుగోదావరి జిల్లా ఎస్పీ డి. నరసింహ కిషోర్ జిల్లా పోలీస్ కార్యాలయంలో మీడియాకు వెల్లడించారు.

‘‘ఈ ఘటనపై Cr.No.134/2026 U/s 125(b) BNS కింద కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు మొదలుపెట్టారు. దర్యాప్తులో లభించిన ఆధారాలను సమగ్రంగా పరిశీలించిన అనంతరం కేసును భారతీయ న్యాయసంహితలోని సెక్షన్ 110కిందకు మార్చి, ఘటనకు బాధ్యులైన ఇద్దరు నిందితులను గుర్తించి అరెస్ట్ చేశారు’’ అని ఎస్పీ వివరించారు.

నిందితులను రాజమహేంద్రవరం అదనపు జ్యుడీషియల్ ఫస్ట్ క్లాస్ మేజిస్ట్రేట్ కోర్టు ముందు హాజరుపరచగా, న్యాయస్థానం వారికి 14 రోజుల జ్యుడీషియల్ రిమాండ్ విధించినట్టు తెలిపారు.

నిందితులలో ఒకరైన సూరవరపు దస్వంత్ (24) రాజమహేంద్రవరంలోని మోరంపూడికి చెందినవారని, రెండో నిందితుడు దేశబత్తుల ఆండ్రూ జోసెఫ్ ఎడ్వర్డ్స్ (23) రాజమహేంద్రవరంలోని లాలాచెరువు ప్రాంతానికి చెందినవారని తెలిపారు.

ఈ కేసు దర్యాప్తులో పోలీసు శాఖపై ఎటువంటి రాజకీయ వత్తిళ్లు లేవని, కేసును నిష్పక్షపాతంగా, పారదర్శకంగా దర్యాప్తు చేస్తున్నామని నరసింహ కిషోర్ తెలిపారు.

ఘటనకు సంబంధించిన అన్ని ఆధారాలను సమగ్రంగా పరిశీలించిన అనంతరం, ఈ ఘటనను హత్యాయత్నం చర్యగా ధ్రువీకరించి, చట్టపరమైన నిబంధనల ప్రకారం దర్యాప్తు కొనసాగిస్తున్నామని ఎస్పీ తెలిపారు.

తీవ్ర విచారం కలిగించింది: సీఎం చంద్రబాబు

రాజమండ్రిలో యువకులు తీవ్ర నిర్లక్ష్యంతో, మద్యం మత్తులో కారుతో ఢీ కొట్టిన ఘటనలో గాయపడిన వైద్య విద్యార్థిని ప్రియాంక మృతి చెందిందనే వార్త తీవ్ర విచారం కలిగించిందని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఫేస్‌బుక్‌‌లో సంతాపం వ్యక్తం చేశారు.

‘‘ప్రియాంక మృతికి కారణమైన వారు ఇప్పటికే అరెస్టయి జైల్లో ఉన్నారు. తమ నిర్లక్ష్యంతో నిండు ప్రాణం తీసిన వారికి కఠిన శిక్షలు పడేలా చూస్తాం. ఈ విషయంలో పోలీసు అధికారులకు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చాం. కఠిన సెక్షన్లతో నిందితులకు శిక్షలు పడేలా చూస్తాం. బాధిత కుటుంబానికి 20 లక్షల ఆర్థిక సాయం అందిస్తాం. ఆ కుటంబానికి నా ప్రగాఢ సానుభూతి’’ అని తెలిపారు.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,  ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)