వారణాసిలోని మసీదుపై పాకిస్తాన్ అధ్యక్షుడి వ్యాఖ్యలు, తీవ్రంగా స్పందించిన భారత్

భారత్, పాకిస్తాన్, వారణాసి షహీదా మసీదు

ఫొటో సోర్స్, RK

ఫొటో క్యాప్షన్, మసీదును ఖాళీ చేయాలని కోరుతూ రైల్వే శాఖ గోడకు నోటీసు అంటించింది.
ప్రచురణ
చదివే సమయం: 4 నిమిషాలు

వారణాసిలోని చారిత్రాత్మక గంజ్ షహీదా మసీదు ప్రాంగణాన్ని ఖాళీ చేయాలంటూ రైల్వే పరిపాలనా విభాగం ఇటీవల నోటీసులు జారీ చేసింది. దీనిపై పాకిస్తాన్ అధ్యక్షుడు ఆసిఫ్ అలీ జర్దారీ స్పందించడంపై భారత్ అభ్యంతరం వ్యక్తం చేసింది.

విదేశాంగ శాఖ ప్రతినిధి రణధీర్ జైస్వాల్ శనివారం మీడియా అడిగిన ప్రశ్నకు సమాధానమిస్తూ, "పాకిస్తాన్ అధ్యక్షుడు చేసిన నిరాధారమైన వ్యాఖ్యలను భారత్ పూర్తిగా తిరస్కరిస్తోంది. అయినా, భారత అంతర్గత వ్యవహారాలపై మాట్లాడే చట్టబద్ధమైన హక్కు ఆయనకు లేదు" అని తెలిపారు.

అంతకుముందు, శనివారం పాకిస్తాన్ అధ్యక్షుడు ఆసిఫ్ అలీ జర్దారీ భారత్‌లోని వారణాసిలోని గంజ్ షహీదా మసీదు విషయాన్ని ప్రస్తావిస్తూ, ముస్లిం మతపరమైన స్థలాలపై ఒక ప్రకటన విడుదల చేశారు.

పాకిస్తాన్ అధ్యక్ష కార్యాలయం ఎక్స్‌లో విడుదల చేసిన ఆ ప్రకటనలో, "వారణాసిలోని వెయ్యేళ్ల నాటి గంజ్ షహీదా మసీదుతో పాటు భారతదేశంలోని చారిత్రాత్మక ముస్లిం మత ప్రార్థనా స్థలాల కూల్చివేత, వాటికి పొంచి ఉన్న ప్రమాదాలపై పాకిస్తాన్ అధ్యక్షుడు ఆసిఫ్ అలీ జర్దారీ తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. భారత్ ఇలాంటి చర్యలను తక్షణమే నిలిపివేయాలని ఆయన కోరారు. దీనివల్ల భారత దేశంలో విభజన, శాశ్వత అరాచక పరిస్థితులు ఏర్పడే ప్రమాదం ఉందని హెచ్చరించారు. ఇటువంటి చర్యలను తక్షణమే ఆపాలని పిలుపునిచ్చిన అధ్యక్షుడు, మైనారిటీల హక్కులు, ఉమ్మడి సాంస్కృతిక వారసత్వాన్ని రక్షించాలని డిమాండ్ చేశారు" అని తెలిపింది.

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్
ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి
భారత విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి రణధీర్ జైస్వాల్

ఫొటో సోర్స్, Getty Images/BBC

భారత్ ఏమన్నది?

భారత విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి రణధీర్ జైస్వాల్ ఈ అంశంపై ఓ ప్రకటనలో స్పందిస్తూ, పాకిస్తాన్ అధ్యక్షుడి వ్యాఖ్యలు అర్థరహితమని పేర్కొన్నారు.

"మానవ హక్కుల విషయంలో పాకిస్తాన్ చరిత్ర అత్యంత అధ్వానం. దీనిపై ప్రపంచవ్యాప్తంగా చర్చ జరుగుతోంది. విభిన్న మతాలకు చెందిన మైనారిటీలను వ్యవస్థీకృత పద్ధతిలో లక్ష్యంగా చేసుకోవడం, వారిని వేధించడం వంటి పాకిస్తాన్ సుదీర్ఘ చరిత్ర అందరికీ తెలిసిందే" అని తెలిపారు.

"ఈ వాస్తవాలను బట్టి చూస్తే, పాకిస్తాన్ అధ్యక్షుడి వ్యాఖ్యలు ఉద్దేశపూర్వకంగా చేసిన రాజకీయ దాడిగానే భావించవచ్చు" అని చెప్పారు.

ఇలాంటి ప్రకటనలు పాకిస్తాన్ మతోన్మాదం, ద్వేషపూరిత జాతీయ విధానాల ప్రేరణతోనే వచ్చాయని రణధీర్ జైస్వాల్ ఆరోపించారు.

భారత్, పాకిస్తాన్, వారణాసి శహీదా మసీదు, పాకిస్తాన్ అధ్యక్షుడు ఆసిఫ్ అలీ జర్దారీ

ఫొటో సోర్స్, @PresOfPakistan

ఫొటో క్యాప్షన్, పాకిస్తాన్ అధ్యక్షుడు ఆసిఫ్ అలీ జర్దారీ

అసలు వివాదం ఏమిటి?

వారణాసిలోని కాశీ రైల్వే స్టేషన్ విస్తరణ, పునరాభివృద్ధి ప్రాజెక్టులో భాగంగా రైల్వే పరిపాలనా విభాగం స్టేషన్ ప్రధాన ప్రవేశ ద్వారానికి సమీపంలో ఉన్న గంజ్ షహీదా మసీదుకు నోటీసు జారీ చేసింది. జూన్ 20 లోగా ఆ ప్రాంగణాన్ని ఖాళీ చేయాలని ఆదేశించింది.

వార్తాసంస్థ పీటీఐ కథనం ప్రకారం, కాశీ రైల్వే స్టేషన్ ప్రధాన ప్రవేశ ద్వారం వద్ద ఉన్న గంజ్ షహీదా మసీదు గోడకు ఒక నోటీసు అంటించినట్లు రైల్వే అధికారులు గురువారం తెలిపారు. స్టేషన్ విస్తరణ ప్రక్రియలో భాగంగా జూన్ 20లోగా స్థలాన్ని ఖాళీ చేయాలని ఈ నోటీసులో తెలిపారు.

స్టేషన్ విస్తరణ, ప్రతిపాదిత నిర్మాణ పనుల కోసం కాశీ రైల్వే స్టేషన్ పరిసర ప్రాంతాల భూములను ఆక్రమణల నుంచి విడిపించడం అవసరమని కంటోన్మెంట్ రైల్వే స్టేషన్ సూపరింటెండెంట్ అర్పిత గుప్తా పేర్కొన్నారు.

భారత్, పాకిస్తాన్, వారణాసి షహీదా మసీదు

ఫొటో సోర్స్, RK

ఫొటో క్యాప్షన్, గంజ్ షహీదా మసీదుపై అంటించిన నోటీసును చదువుతున్న స్థానికులు

మసీదు కమిటీ ఏమంటోంది?

షహీదా మసీదు నిర్వహణ కమిటీ అయిన 'ఇంతేజామియా మసీదు కమిటీ' ఈ నోటీసును చట్టవిరుద్ధమని పేర్కొంది. కోర్టులో సవాల్ చేస్తామని తెలిపింది.

ఈ విషయంపై అంజుమన్ ఇంతేజామియా మసీదు కమిటీ జాయింట్ సెక్రటరీ ఎస్.ఎమ్. యాసీన్‌తో బీబీసీ ప్రతినిధి ప్రేరణ మాట్లాడారు.

''ఈ మసీదు సుమారు వెయ్యేళ్ల నాటిది. దీనిని 1034లో నిర్మించారు. ఇక్కడ సమాధులు ఉన్న వారిలో చాలామంది స్వాతంత్య్ర పోరాటంలో పాల్గొన్నవారు కావడంతో దీనికి 'గంజ్ షహీదా' అనే పేరు వచ్చింది. అందుకే దీనికి చారిత్రక ప్రాధాన్యత కూడా ఉంది" అని యాసీన్‌ చెప్పారు.

"రైల్వే విభాగం 1887లో వచ్చింది. వారి నోటీసుకు మేం సమాధానం ఇస్తున్నాం. డీఎం గారి నుంచి కూడా మాకు హామీ లభించింది. మూడు రోజుల కిందట మేం ఆయనను కలిశాం. మసీదును బలవంతంగా కూల్చివేయబోమని ఆయన మాకు భరోసా ఇచ్చారు" అని తెలిపారు.

పాకిస్తాన్ అధ్యక్షుడి ప్రకటనపై యాసీన్ స్పందిస్తూ "పాకిస్తాన్ అధ్యక్షుడు వారి దేశ సమస్యలను చూసుకోవాలి, మా విషయాలలో జోక్యం చేసుకోకూడదు. మా సమస్యలను మేం స్వయంగా చూసుకోగలం. ఆయన ఈ విషయాన్ని మరింత క్లిష్టంగా మారుస్తున్నారు'' అన్నారు.

అంజుమన్ ఇంతేజామియా మసీదు కమిటీ జాయింట్ సెక్రటరీ ఎస్.ఎమ్. యాసీన్‌
భారత్, పాకిస్తాన్, వారణాసి శహీదా మసీదు

ఫొటో సోర్స్, RK

ఫొటో క్యాప్షన్, షహీదా మసీదుపై రైల్వే శాఖ నోటీసు

1883-84 సెటిల్‌మెంట్ మ్యాప్‌తో పాటు అంతకుముందు మ్యాప్‌లలో కూడా మసీదు ప్రస్తావన ఉందని ఇంతేజామియా మసీదు కమిటీ అంటోంది.

ఏ కేసైతే కొట్టివేసినట్లు నోటీసులో ప్రస్తావించారో అది మసీదు వెలుపల తూర్పు వైపు భూమికి సంబంధించినదని, దాంతో మసీదుకు ఎలాంటి సంబంధం లేదని కమిటీ తెలిపింది. ఈ నోటీసు తప్పుదోవ పట్టించేలా ఉందని ఆరోపించింది.

బీబీసీ ఈ విషయంపై రైల్వే అధికారులతో మాట్లాడటానికి ప్రయత్నించింది. రైల్వే ప్రకటన అందిన వెంటనే ఈ వార్త అప్‌డేట్ చేస్తాం.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,  ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)