స్విట్జర్లాండ్‌లో అమెరికా, ఇరాన్ శాంతి చర్చలు ప్రారంభం

ఫొటో సోర్స్, Getty Images
- రచయిత, మాయా డేవిస్
- హోదా, బీబీసీ ప్రతినిధి
- ప్రచురణ
- చదివే సమయం: 3 నిమిషాలు
యుద్ధం ముగింపునకు గతవారం కుదిరిన ప్రాథమిక ఒప్పందం తర్వాత, ఆదివారం అమెరికా, ఇరాన్ అధికారుల మధ్య స్విట్జర్లాండ్‌లో ముఖాముఖి చర్చలు మొదలయ్యాయి.
ఈ ఒప్పందంలో 60 రోజుల్లోగా తుది అంగీకారానికి రావడం, లెబనాన్‌తో సహా సరిహద్దులలో శత్రుత్వాన్ని ముగించడం, హార్ముజ్ జలసంధిని తెరవడం వంటి కీలక అంశాలు ఉన్నాయి.
అయితే, లెబనాన్‌లో ఇజ్రాయెల్, ఇరాన్ మద్దతు గల హిజ్బొల్లా మధ్య కొనసాగుతున్న ఘర్షణల నేపథ్యంలో శనివారం హార్ముజ్ జలసంధిని మూసివేసినట్లు ఇరాన్ ప్రకటించింది. అయినప్పటికీ, నౌకల ట్రాకింగ్ డేటా ప్రకారం, ఆ మార్గం గుండా ఓడల రాకపోకలు కొనసాగుతున్నట్లు తెలుస్తోంది.
చర్చలు ప్రారంభమైన కొద్దిసేపటి తర్వాత, అమెరికా అధ్యక్షుడు డోనల్డ్ ట్రంప్ తన ట్రూత్ సోషల్ అకౌంట్‌లో ఒక పోస్ట్ చేశారు. "లెబనాన్‌లోని తన పెయిడ్ ప్రాక్సీలు(మద్దతు గల దళాల) అలజడులు సృష్టించకుండా ఇరాన్ తక్షణమే నిలువరించాలి" అని అందులో రాశారు.
ఒకవేళ అలా చేయకపోతే ఇరాన్‌పై మరోసారి భీకర దాడులు చేస్తామని హెచ్చరించారు.

చర్చల ప్రారంభానికి ముందు అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ మాట్లాడుతూ, అణు కార్యక్రమం, లెబనాన్ అంశాలపై పురోగతి ఉంటుందని ఆశిస్తున్నామన్నారు.
మరోవైపు, "అవతలి పక్షం ఇచ్చిన హామీలను నెరవేర్చాలని డిమాండ్ చేస్తాం" అని తెహ్రాన్ అంటోంది.
స్విట్జర్లాండ్‌లోని బర్గాన్‌స్టాక్ రిసార్ట్‌లో వాన్స్ మాట్లాడుతూ.. చర్చల ద్వారా ఒక కొత్త అధ్యాయాన్ని ప్రారంభించాలని ప్రతినిధులను ట్రంప్ కోరినట్లు తెలిపారు.
ఇరాన్ నాయకత్వం ప్రాంతీయ అస్థిరతకు కారణం కాకుండా, అణ్వాయుధ ఆకాంక్షలను వదులుకోవడానికి సిద్ధపడితే, ఆ దేశంతో తమ సంబంధాలను మార్చుకోవడానికి అమెరికా సిద్ధంగా ఉందని తెలిపారు.
అయితే, తమ అణు కార్యక్రమం పూర్తిగా శాంతియుతమైనదంటూ ఇరాన్ మొదటి నుంచీ వాదిస్తోంది.
తుది ఒప్పందం కోసం జరిగే చర్చలు, ప్రస్తుత హమీలను అమలు చేయడంపైనే (అన్ని సైనిక చర్యలను నిలిపివేయడంతో సహా) ఆధారపడి ఉంటాయని ఇరాన్ విదేశాంగ శాఖ ప్రతినిధి ఇస్మాయిల్ బఘేయ్ ఒక ప్రకటనలో తెలిపారు. ఆదివారం నాటి చర్చలు ప్రధానంగా ఈ నిర్ణయాల అమలుపైనే ఉంటాయని చెప్పారు.
బర్గాన్‌స్టాక్ రిసార్ట్‌లో జరుగుతున్న ఈ చర్చల్లో జేడీ వాన్స్‌తో పాటు డోనల్డ్ ట్రంప్ అల్లుడు జారెడ్ కుష్నర్, ప్రత్యేక రాయబారి స్టీవ్ విట్‌కాఫ్ కూడా పాల్గొన్నారు.
ఇరాన్ తరఫున పార్లమెంట్ స్పీకర్ మొహమ్మద్ బాగేర్ గాలిబాఫ్, విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాగ్చీ శనివారం అర్థరాత్రి స్విట్జర్లాండ్ చేరుకున్నారు.
ఈ ప్రతినిధి బృందాలతో పాటు పాకిస్తాన్ ప్రధాన మంత్రి షాబాజ్ షరీఫ్, ఫీల్డ్ మార్షల్ ఆసిమ్ మునీర్ కూడా చర్చల వేదికకు చేరుకున్నారు. ఈ యుద్ధంలో పాకిస్తాన్ మధ్యవర్తిగా వ్యవహరిస్తోంది. గతంలో అమెరికా, ఇరాన్ మధ్య జరిగిన ఒక విడత చర్చలకు కూడా పాకిస్తాన్ ఆతిథ్యమిచ్చింది.

ఫొటో సోర్స్, AFP via Getty Images
యుద్ధాన్ని తక్షణమే ముగించే లక్ష్యంతో ..
యుద్ధాన్ని తక్షణమే ముగించే లక్ష్యంతో అమెరికా, ఇరాన్ అధ్యక్షులు ఈ వారంలోనే ప్రాథమిక ఒప్పందంపై సంతకాలు చేశారు. ఇరాన్ 'పునర్నిర్మాణం' కోసం 300 బిలియన్ డాలర్ల ప్రణాళికతో పాటు, ఆ దేశంపై ఉన్న 'అన్ని రకాల ఆంక్షలను' అమెరికా రద్దు చేయడం కూడా ఇందులో ఉన్నాయి.
కానీ, ఈ సంఘర్షణకు ప్రధాన కారణంగా అమెరికా పేర్కొన్న ఇరాన్ అణు కార్యక్రమం అంశంపై మాత్రం.. 60 రోజుల వ్యవధిలో ఇంకా చర్చలు జరగాల్సి ఉంది. ఈ గడువు ఇంకా పొడిగించే అవకాశం కూడా ఉంది.
మరోవైపు, ఈ ఒప్పందం కుదిరినప్పటికీ.. ఇజ్రాయెల్, ఇరాన్ మద్దతు గల హిజ్బొల్లా సాయుధ దళాల మధ్య ఘర్షణలు కొనసాగాయి.
ఫిబ్రవరి 28న అమెరికాతో కలిసి ఇరాన్‌పై ప్రారంభించిన యుద్ధంతో హిజ్బొల్లాతో సాగుతున్న ఘర్షణకు సంబంధం లేదని, అది వేరని ఇజ్రాయెల్ స్పష్టం చేసింది.
ఇరాన్ సుప్రీం లీడర్ మరణానికి కారణమైన దాడికి ప్రతికారంగా హిజ్బొల్లా ఇజ్రాయెల్‌పైకి రాకెట్లు ప్రయోగించడంతో, ఆ వెంటనే లెబనాన్ కూడా ఈ యుద్ధంలో భాగమైంది.
దీనికి ప్రతికారంగా లెబనాన్ అంతటా బాంబుల వర్షం కురిపించిన ఇజ్రాయెల్, ఆ దేశ దక్షిణ ప్రాంతంలోని సుమారు 5 శాతం భూభాగాన్ని తన ఆధీనంలోకి తీసుకుంది. తమ ఉత్తర సరిహద్దుల నుంచి హిజ్బొల్లా ఫైటర్లను వెనక్కి పంపడమే లక్ష్యంగా ఈ చర్యలు చేపట్టినట్లు, ఆ ప్రాంతం నుంచి వెనక్కి తగ్గే ప్రసక్తే లేదని ఇజ్రాయెల్ స్పష్టం చేసింది.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్, ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)





























