తిరువళ్లూరులో అమ్మోనియా గ్యాస్ లీక్: 'విషవాయువు బారిన పడిన 64 మంది, ఇద్దరు మృతి', అసలేం జరిగింది?

ఫొటో సోర్స్, HANDOUT
తమిళనాడులోని తిరువళ్లూరు జిల్లా, కన్నికైపేర్ గ్రామంలో ఉన్న ఒక సీఫుడ్ ఎక్స్‌పోర్ట్ కంపెనీలో అమ్మోనియా గ్యాస్ లీకై కార్మికులు విషవాయువు బారిన పడ్డారు.
ఆదివారం ఉదయం 60 మందికిపైగా కార్మికులు విధుల్లో ఉన్న సమయంలో ఈ ప్రమాదం జరిగింది.
ఈ విషవాయువును పీల్చడంతో వాంతులు చేసుకోవడం, స్పృహ కోల్పోవడం వంటి లక్షణాలకు గురయ్యారు. దీంతో బాధితులను వెంటనే సమీపంలోని ప్రభుత్వ, ప్రైవేట్ ఆస్పత్రులకు తరలించారు.
బాధితుల్లో కొందరి పరిస్థితి విషమంగా ఉండటంతో చెన్నైలోని స్టాన్లీ ఆస్పత్రికి తరలించారు.
విషయం తెలుసుకున్న తిరువళ్లూరు జిల్లా కలెక్టర్ కవిత, కాంచీపురం డీఐజీ శేషసాయి, తిరువళ్లూర్ జిల్లా ఎస్పీ సాయి ప్రణీత్ చికిత్స పొందుతున్న బాధిత కార్మికులను పరామర్శించారు.

ఈ ఘటనపై జిల్లా కలెక్టర్ ఏం చెప్పారు?
"కన్నికైపేర్ గ్రామంలోని సీఫుడ్ ఎక్స్‌పోర్ట్ కంపెనీలో విధుల్లో ఉన్న కార్మికులు ప్రెజర్ వాల్వ్ నుంచి లీకైన అమ్మోనియా గ్యాస్‌ను పీల్చుకోవడంతో శ్వాస ఆడక ఇబ్బంది పడ్డారు" అని తిరువళ్లూరు జిల్లా కలెక్టర్ కవిత మీడియాతో చెప్పారు.
"స్పృహ కోల్పోవడం, వాంతులు, ఆయాసం వంటి లక్షణాలతో బాధపడుతున్న వారిని ఆసుపత్రులకు తరలించాం. ప్రభుత్వ ఆసుపత్రితో పాటు ప్రైవేట్ ఆస్పత్రిలోనూ వైద్య సేవలు అందిస్తున్నారు. అంతగా ప్రభావితం కాని, ఆరోగ్యం నిలకడగా ఉన్న వారిని సమీపంలోని కమ్యూనిటీ హాల్‌కు తరలించాం" అని కలెక్టర్ కవిత పరిస్థితిని వివరించారు.
"గ్యాస్ లీక్ ఘటనకు సంబంధించి సమగ్ర దర్యాప్తు చేపడతాం. ముందుగా, బాధితులకు మెరుగైన చికిత్స అందించడంపై దృష్టి సారించాం"

ఫొటో సోర్స్, HANDOUT
గ్యాస్ లీక్ ఘటనతో ప్రభావితమై ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న బాధితుల ఆరోగ్య పరిస్థితి గురించి ఆస్పత్రి హెడ్ డాక్టర్ కుముద విలేఖరులతో మాట్లాడుతూ, "కొందరికి వెంటిలేటర్‌పై చికిత్స అందిస్తున్నాం" అన్నారు.
"కొందరి ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉన్నప్పటికీ, ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఆస్పత్రిలో చేరిన వారిలో ఒకరు మాత్రమే పురుషుడు కాగా, మిగిలిన వారందరూ మహిళా కార్మికులే" అని డాక్టర్ కుముద చెప్పారు.
వారంతా సుమారు 20 నుంచి 23 సంవత్సరాల మధ్య వయసు వారేనని, అందువల్ల త్వరగానే కోలుకునే అవకాశముందని ఆమె అన్నారు.

ఫొటో సోర్స్, HANDOUT
మంత్రి కుమార్ ఏమన్నారంటే..
ఈ ఘటనపై తిరువళ్లూరు ఇన్‌చార్జి మంత్రి కుమార్ మీడియాతో మాట్లాడుతూ, "వైద్య సేవల కోసం సీనియర్ వైద్యులను పిలిపించారు. ప్రతి పది నిమిషాలకు ముఖ్యమంత్రికి పరిస్థితిని వివరిస్తున్నాం. కొందరిని స్టాన్లీ ఆస్పత్రికి తరలించారు" అని తెలిపారు.
కార్మికులందరూ ఉత్తరాది రాష్ట్రాలకు చెందినవారేనని, బాధితుల్లో 60 మంది మహిళలు, నలుగురు పురుషులు ఉన్నారని మంత్రి చెప్పారు. వారిలో ఇద్దరు మరణించారని ఆయన తెలిపారు.
ప్రమాదానికి గల కారణాలను మంత్రి వివరించారు.
"ఇప్పటివరకూ అందిన సమాచారం ప్రకారం, రొయ్యలను నిల్వ చేసే ప్రాసెసింగ్ ప్లాంట్‌లో అమ్మోనియాతో పనిచేసే రిఫ్రిజిరేటర్ లీక్ అవడం వల్ల ఈ ప్రమాదం సంభవించింది. దీనిపై సమగ్ర విచారణ జరుపుతున్నాం, విచారణ అనంతరం పూర్తి సమాచారం తెలియజేస్తాం" అన్నారు.
ఇప్పటికే కంపెనీ యజమానులను అదుపులోకి తీసుకున్నామని, వారిపై ఎఫ్‌ఐఆర్ నమోదు చేసినట్లు మంత్రి కుమార్ తెలిపారు.
"23 మంది ఇంటెన్సివ్ కేర్ యూనిట్‌లో ఉన్నారు. మిగిలిన వారి పరిస్థితి కాస్త మెరుగ్గా ఉంది" అన్నారు.
ముఖ్యమంత్రి విజయ్ ప్రకటన
"ఈ ప్రమాదంలో ఇద్దరు మహిళలు చనిపోయారు. మరో 15 మంది బాధితులు ప్రభుత్వ ఆసుపత్రి ఐసీయూలో ఉన్నారు. ప్రైవేట్ ఆసుపత్రి ఐసీయూలో 23 మంది చికిత్స పొందుతున్నారు. మరో 24 మందిని ప్రైవేట్ ఆసుపత్రికి తరలించి వైద్యుల పర్యవేక్షణలో ఉంచారు" అని ముఖ్యమంత్రి కార్యాలయం ఒక ప్రకటనలో పేర్కొంది.
"పారిశ్రామిక భద్రతా విభాగం డైరెక్టర్, ఆరోగ్య శాఖ అడిషనల్ డైరెక్టర్, తమిళనాడు కాలుష్య నియంత్రణ మండలి కార్యదర్శి నేతృత్వంలో గ్యాస్ లీక్ ఘటనపై విచారణకు ఆదేశించాను. 24 గంటల్లోగా ప్రాథమిక నివేదికను, మూడు రోజుల్లోగా పూర్తి నివేదికను సమర్పించాలని కోరాను" అని ముఖ్యమంత్రి పేరిట విడుదలైన ఆ ప్రకటనలో పేర్కొన్నారు.
మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపిన సీఎం జోసెఫ్ విజయ్, కుటుంబానికి రూ. 2 లక్షల చొప్పున పరిహారం ప్రకటించారు.
అలాగే, రాష్ట్ర కార్మిక బీమా పథకం కింద మరణించిన వారి కుటుంబాలకు, గాయపడిన కార్మికులకు తగిన నష్టపరిహారం అందేలా చర్యలు చేపట్టాలని ఆదేశించారు.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్, ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)






























