పీజీ మెడికల్ విద్యార్థిని ప్రియాంకకు బ్రెయిన్ డెడ్ : ‘‘ఏం పాపం చేసిందని నా కుమార్తెపైకి కారు ఎక్కిస్తారు’’- తండ్రి ఆవేదన

సీసీ ఫుటేజ్‌లో రికార్డైన ఘటన దృశ్యాలు

ఫొటో సోర్స్, UGC

ఫొటో క్యాప్షన్, మెడికో ప్రియాంక, పక్క చిత్రంలో సీసీ ఫుటేజ్‌లో రికార్డైన ఘటన దృశ్యాలు
    • రచయిత, గరికిపాటి ఉమాకాంత్‌
    • హోదా, బీబీసీ కోసం
  • ప్రచురణ
  • చదివే సమయం: 4 నిమిషాలు

"ఏ పాపం చేసిందని నా కుమార్తెను కారుతో తొక్కిస్తారు. వెనక్కి వెళ్లి, మళ్లీ ముందుకు వచ్చి కారుతో గుద్దారంటే ఏం చెప్పాలి? ఇలాంటి అన్యాయం ఎవరికీ జరగకూడదు'' అని పీజీ మెడికల్ విద్యార్థిని ప్రియాంక తండ్రి వెంకటేశ్ బీబీసీతో చెప్పారు.

‘‘జులై 3వ తేదీన రాజమండ్రిలో ఇద్దరు యువకులు కారుతో వెనక నుంచి మూడుసార్లు ఢీకొనడంతో స్కూటీ వెనుక కూర్చున్న ప్రియాంక తీవ్రంగా గాయపడి చికిత్స పొందుతోందని, ప్రస్తుతం 'బ్రెయిన్ డెడ్' అయి చికిత్సకు స్పందించడం లేదని’’ వెంకటేశ్ చెప్పారు.

"నేనో రైతును.. తెలంగాణ గద్వాల్‌ మా స్వస్థలం. కర్నూలులో ముప్పై ఏళ్లపాటు ఉన్నాం. ఈ మధ్యనే హైదరాబాద్‌కు వచ్చాం. పాప కష్టపడి పీజీ సీటు సాధించింది. ఫస్టియర్‌ చదువుతోంది. నాకు ఫోన్‌లో చెప్పి సినిమాకు వెళ్లారు. సినిమా టైం అయిన తర్వాత పాప ఫోన్ చేస్తుందని ఎదురుచూస్తుంటే వేరే వాళ్లు ఫోన్ చేసి 'మీ పాపకు యాక్సిడెంట్‌ అయింది' అని చెప్పారని'' ఆయన తెలిపారు.

''వెంటనే రాజమండ్రి వచ్చాం. పాపను వెంటిలేటర్‌పై హైదరాబాద్‌లోని కిమ్స్‌కు తరలించాం. డాక్టర్లు ఒక శాతం ఛాన్స్‌ ఉన్నా బతికిస్తామంటున్నారు. ఇంతటి కష్టం ఏ తండ్రికీ రాకూడదు'' అన్నారు వెంకటేశ్.

''నిందితులకు కఠిన శిక్ష పడేలా పోలీసులు చర్యలు తీసుకోవాలి'' అని ఆయన కోరారు.

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్
ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

అసలేం జరిగింది?

ఆగస్టు 3న తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో ఇద్దరు పీజీ మెడికల్ స్టూడెంట్లను వెనకనుంచి మద్యం మత్తులో ఉన్న యువకులు కారుతో ఢీకొన్న ఘటనకు సంబంధించిన వివరాలను ప్రకాశ్‌నగర్ సర్కిల్ ఇన్‌స్పెక్టర్ బాజీలాల్ బీబీసీకీ వివరించారు.

"ఆగస్టు 3వ తేదీ రాత్రి ఏవీఏ రోడ్‌లోని ప్రసాద్‌ ఆదిత్యా మాల్‌లో సెకండ్‌ షో చూడటానికి రాజమండ్రికి చెందిన సురావరపు దస్వంత్, ఆండ్రూ జోసెఫ్‌ ఎడ్వర్డ్ అనే ఇద్దరు యువకులు వచ్చారు. వీరిద్దరు మద్యం సేవించినట్టు సెక్యూరిటీ గేటు వద్ద బ్రీత్‌ అనలైజర్‌ టెస్ట్‌లో తేలింది’’

‘‘ మద్యం తీసుకున్నవారిని వారిని థియేటర్‌ లోపలికి అనుమతించలేమని సెక్యూరిటీ సిబ్బంది చెప్పారు. దీంతో ఆ యువకులిద్దరూ వాగ్వాదానికి దిగారు. కానీ సెక్యూరిటీ వారిని అనుమతించకపోవడంతో వారిద్దరూ పార్కింగ్‌లోని తమ కారును తీసుకుని బయటకు వెళతుండగా ఎంట్రన్స్ గేటు వద్ద ఆగాల్సి వచ్చింది’’

‘‘అలా ఆగిన కారు ముందు ఓ స్కూటీపై అప్పుడే ఫస్ట్ షో చూసి ఇంటికి తిరుగుముఖం పట్టిన ఉమేష్, ప్రియాంక అనే మెడికోలు ఉన్నారు. ఈ యువకులిద్దరూ కారుతో ముందుగా వారి స్కూటీని ఢీకొట్టారు. తరువాత తమ కారును కొంచెం వెనక్కు తీసుకువచ్చి స్కూటీపైకి వేగంగా నడుపుతూ రోడ్డుపైకి దూసుకొచ్చారు. ఆ సమయంలో వెనక కూర్చున్న ప్రియాంక కింద పడిపోయారు. అయినా కారునడుపుతున్న సురవరపు దస్వంత్‌, జోసెఫ్ ఎడ్వర్డ్ మరోసారి కారుతో బలంగా గుద్ది పరారయ్యారు. తీవ్రంగా గాయపడిన ప్రియాంకతో పాటు ఉమేష్‌ను స్థానికులు రాజమండ్రి స్వతంత్ర హాస్పిటల్‌లో చేర్చారు'' అని బాజీలాల్‌ వివరించారు.

ఈ ఘటనలో గాయపడి ఆస్పత్రిలో చికిత్స పొందిన ఉమేష్ ఇచ్చిన వాంగ్మూలం ఆధారంగానూ, థియేటర్ మేనేజర్ విజయ్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్టు సీఐ బీబీసీకీ వివరించారు.

ఈ కేసులో ఏ-1గా సురావరపు దస్వంత్‌, ఏ-2గా ఆండ్రూ జోసెఫ్‌ ఎడ్వర్డ్స్‌పై భారతీయ న్యాయ సంహితలోని 118(1), 351(2), సెక్షన్ల కింద, 3(5) రెడ్ విత్ కింద కేసులు నమోదు చేసి అరెస్టు చేశామని పోలీసులు తెలిపారు.

నిందితులిద్దరినీ రాజమహేంద్రవరంలోని 2వ ఫస్ట్‌క్లాస్‌ మెజిస్ట్రేట్‌ ముందు హాజరుపరచగా, ఈ నెల 21వ తేదీ వరకు రిమాండ్‌ విధించారని చెప్పారు.

తీవ్ర గాయాలపాలైన ప్రియాంక పరిస్థితి విషమించడంతో ఆమెను రాజమండ్రి నుంచి హైదరాబాద్‌ కిమ్స్‌కు తరలించారని , అక్కడ చికిత్స జరుగుతోందని సీఐ బాజీలాల్‌ తెలిపారు.

ఉమేష్‌ స్థానిక ఆస్పత్రిలో చికిత్స తీసుకుని డిశ్చార్చ్ అయ్యారని చెప్పారు.

రాజానగరం జీఎస్ఎల్ వైద్య కళాశాలలో మల్లి వెంకట దుర్గ సాయి ఉమేష్ పీజీ రేడీయాలజీ చదువుతుండగా, ప్రియాంక డెర్మటాలజీ చదువుతున్నారు.

రాజమండ్రి, వైద్య విద్యార్థిని యాక్సిడెంట్, ప్రియాంక బ్రెయిన్ డెడ్

ఫొటో సోర్స్, UGC

‘బాధితులకు, నిందితులకు సంబంధం లేదు’

ఆగస్టు 3వ తేదీన ఈ ఘటన జరిగితే 6వ తేదీవరకు పోలీసులు నిందితులను అరెస్ట్ చేయలేదని సామాజిక మాధ్యమాలలో చర్చ నడిచింది. స్కూటీనీ కారు ఢీకొట్టిన దృశ్యాలు వైరల్ అయ్యాయి.

"పోలీసులు వెంటనే స్పందించారు. మొదట యాక్సిడెంట్‌ కేసు అనుకున్నాం. సీసీ ఫుటేజ్‌ పరిశీలించాక, వాళ్లు ఉద్దేశపూర్వకంగానే ఢీకొట్టినట్టు అర్థమైంది. అందుకే హత్యాయత్నం కేసు నమోదు చేశాం" అని తూర్పుగోదావరి జిల్లా ఎస్పీ కిషోర్‌ బీబీసీతో చెప్పారు.

"నిందితులకు, బాధితులకు గతంలో ఎప్పుడూ పరిచయం లేదని మా విచారణలో కూడా తేలింది. కేసు నమోదులో కానీ, నిందితుల అరెస్టులో కానీ ఎక్కడా జాప్యం జరగలేదు. కేసు నమోదు చేసి విచారణ జరిపి, పరారీలో ఉన్న నిందితులను అరెస్టు చేసేందుకు కొద్దిగా సమయం పట్టింది అంతే తప్ప జాప్యం లేదు. నిందితులను 6వ తేదీన అరెస్టు చేసి కోర్టులో హాజరుపరిచాం'' అన్నారు.

మరోవైపు నిందితుల కుటుంబ సభ్యులతో మాట్లాడేందుకు బీబీసీ యత్నించింది, అయితే వారు అందుబాటులోకి రాలేదు.

వైద్య విద్యార్థులను ఢీకొట్టిన ఘటనలో నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారులను ఆదేశించారు.

తీవ్ర గాయాల పాలైన ప్రియాంకకు అవసరమైన వైద్య సహాయం అందేలా చూడాలని సూచించారు.

ఈ ఘటనపై ఉప ముఖ్యమంత్రి పవన్‌ కల్యాణ్ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ఏలూరు రేంజ్‌ డీఐజీతో మాట్లాడి ఈ ఘటనను తీవ్రంగా పరిగణించాలని చెప్పారు.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,  ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)