వేల మైళ్ల ప్రయాణానికి సిద్ధమైన అరుదైన తాబేలు

ఫొటో సోర్స్, Anglesey Sea Zoo
- రచయిత, క్రిస్ డియర్డెన్
- హోదా, బీబీసీ ప్రతినిధి
- ప్రచురణ
- చదివే సమయం: 4 నిమిషాలు
వేల్స్ సముద్రతీరానికి కొట్టుకొచ్చిన అరుదైన తాబేలును దాని స్వస్థలమైన మెక్సికో గల్ఫ్‌కు 5,000 మైళ్లు, అంటే దాదాపు 8,047 కిలోమీటర్లు విమానంలో తరలించనున్నారు.
కెంప్స్ రిడ్లీ జాతికి చెందిన ఈ తాబేలు 'రోస్సీ'ని 2023 డిసెంబర్‌లో దాదాపు చనిపోయే పరిస్థితిలో గుర్తించారు. ఆ తర్వాత, ఆంగ్లెసీ సీ జూ సిబ్బంది సంరక్షణలో ఇది కోలుకుంది.
ఇప్పుడు రోస్సీని అట్లాంటిక్ సముద్రం మీదుగా విమానంలో తరలించేందుకు సంరక్షకుల బృందం ఏర్పాట్లు చేస్తోంది. ఈ ప్రయాణంలో తాబేలు శరీరం ఎండిపోకుండా ఉండేందుకు ప్రత్యేక జాగ్రత్తలు తీసుకుంటున్నారు.
"రోస్సీ చర్మానికి కేవై జెల్లీ రాస్తాం. దీనిని సాధారణంగా, లైంగిక చర్యల సమయంలో లూబ్రికెంట్‌గా వినియోగిస్తారు" అని ఆంగ్లెసీ సీ జూ క్యూరేటర్ మాట్ డేవిడ్సన్ తెలిపారు.
ఈ ప్రయాణ ఏర్పాట్లకు దాదాపు రెండేళ్ల సమయం పట్టింది. రోస్సీ కోసం ఉష్ణోగ్రతలను నియంత్రించే పెట్టె తయారీ, అలాగే రెండు దేశాల మధ్య ఉన్న సంక్లిష్టమైన పేపర్ వర్క్ పూర్తి చేసేందుకు ఇంత సమయం పట్టింది.

రోస్సీ సాధారణంగా సముద్రంలోనే ఉంటుంది. అయితే, ఈ ప్రయాణం వల్ల రోస్సీని నీళ్లలో నుంచి బయటకు తీయాల్సి ఉంటుంది. ఆంగ్లెసీ నుంచి లండన్‌కు హెలికాప్టర్‌లో, అక్కడి నుంచి అమెరికా, టెక్సస్‌లోని హ్యూస్టన్‌కు కార్గో విమానంలో తరలించనున్నారు.
అలాగే, ఈ ప్రయాణాన్ని వీలైనంత త్వరగా పూర్తి చేయాల్సి ఉంటుంది.
అంతేకాకుండా, ఈ సమయంలో రోస్పీ శరీరం ఎండిపోకుండా, డీహైడ్రేషన్‌కు గురికాకుండా చూసేందుకు సిబ్బంది అందుబాటులో ఉండాలి.

"తాబేలు పైపెంకు ఎప్పుడూ తేమగా ఉండేలా చూడాలి. అది ఎండిపోయి పొరలుపొరలుగా ఊడిపోకుండా ఉండేందుకు పెంకు అంతా వాసెలిన్ రాస్తాం. అలాగే, దాని చర్మం చాలా సున్నితంగా ఉంటుంది, చర్మానికి కూడా వాసెలిన్ రాయాలి. ముఖ్యంగా, కళ్లకు లూబ్రికెంట్ రాయాలి. లేకపోతే వేడికి దాని చర్మం పొరలుపొరలుగా ఊడిపోతుంది" అని డేవిడ్సన్ అన్నారు.
"ఒకసారి దాదాపు 8 ట్యూబుల కేవై జెల్లీ, మూడు డబ్బాల వాసెలిన్ తీసుకుని మందుల దుకాణం కౌంటర్ దగ్గరకు వెళ్లా. అక్కడ వాళ్లు వింతగా చూస్తున్నారు, దీంతో అవెందుకో వారికి వివరించాల్సి వచ్చింది."
రోస్సీకి ఆ పేరు ఎలా వచ్చిందంటే, 2023 డిసెంబర్‌లో ఆంగ్లెసీలోని రోస్‌నైగర్ సమీప సముద్ర తీరంలో మెగ్ అనే కుక్క ఈ తాబేలును గుర్తించింది. ఆ సమయంలో, మెగ్ తన యజమానితో వాకింగ్‌కు వెళ్లింది.
అప్పటికి రోస్సీ వయస్సు రెండేళ్లలోపే. దాదాపు చనిపోయే పరిస్థితిలో ఉంది. అది నివసించే ప్రాంతంలోని నీటి కంటే చాలా చల్లటి నీటిలో ఉండడంతో నిపుణులు "కోల్డ్ స్టన్డ్" అని పిలిచే స్థితికి చేరుకుంది.
సముద్రజలాల్లో ప్రయాణిస్తున్న సమయంలో బలమైన గాలుల కారణంగా అది దారితప్పి ఉండొచ్చని ఆంగ్లెసీ జూ సిబ్బంది భావిస్తున్నారు.

ఫొటో సోర్స్, Anglesey Sea Zoo
గత రెండున్నరేళ్లుగా వారు రోస్సీని సంరక్షిస్తున్నారు. ఈ సమయంలో, దాని పరిమాణం మూడు రెట్లు పెరిగింది. అప్పుడు కిలోలోపు బరువున్న ఈ తాబేలు ఇప్పుడు 21 కిలోలకు పెరిగింది.
"కోల్డ్ స్టన్డ్ స్థితికి చేరుకున్న తాబేళ్లు నిపుణుల పర్యవేక్షణ లేకుండా బతకడం చాలా అరుదు. అది బతుకుతుందో లేదో రెండు వారాల వరకు మాకు కూడా తెలియదు.
తాబేళ్లు స్వేచ్ఛగా తిరగాలి, బందీలుగా ఉండకూడదు. అందుకే ఇది మాకు ఎంతో భావోద్వేగపూరిత క్షణం. ఎందుకంటే, మేం రెండేళ్లకు పైగా కష్టపడింది ఈరోజు కోసమే" అని ఆంగ్లెసీ సీ జూ యజమాని ఫ్రాంకీ హోబ్రో అన్నారు.

"సంరక్షణ సమయంలో దాని గురించి బాగా తెలుసుకున్నాం. ఆ తాబేలు ప్రవర్తన, ప్రత్యేక అలవాట్లు మాకు తెలుసు. త్వరలోనే కరీబియన్ సముద్రంలోకి ఈదుకుంటూ వెళ్లిపోబోతోంది, ఆ తర్వాత, దానిని మళ్లీ మనం చూడలేం."
ఈ కెంప్స్ రిడ్లీ తాబేళ్లు అత్యంత అరుదైనవి. ఇవి మెక్సికోలోని రెండు బీచ్‌లతో పాటు అమెరికాలోని టెక్సస్ తీరంలో మాత్రమే గుడ్లు పెడతాయి.
రోస్సీని తిరిగి తన ఆవాసంలోకి సురక్షితంగా చేర్చడం ఆ జాతి మనుగడ కోసం చేసే ఒక చిన్న ప్రయత్నంగా ఆంగ్లెసీ సీ జూ భావిస్తోంది.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్, ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)





























