Gut Health అంటే ఏమిటి? ఈ మధ్య దీని గురించి ఎందుకు ఎక్కువగా మాట్లాడుతున్నారు?

ఫొటో సోర్స్, Getty Images
- రచయిత, డాక్టర్ హిమానీ, రేడియేషనల్ ఆంకాలజిస్ట్
- హోదా, బీబీసీ కోసం
- ప్రచురణ
- చదివే సమయం: 5 నిమిషాలు
మనిషి శరీరంలో ముఖ్యమైన అవయవాలు అనగానే సాధారణంగా గుండె, మెదడు, ఊపిరితిత్తులు, కాలేయం వంటి వాటి గురించి ఎక్కువగా మాట్లాడుతుంటాం.
అయితే శాస్త్రవేత్తలు ఇప్పుడు మన శరీరంలో మరో కీలక వ్యవస్థపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నారు.
అదే పేగుల ఆరోగ్యం (Gut Health).
ఒకప్పుడు ఆహారం జీర్ణం చేయడం మాత్రమే పేగుల పని అని భావించేవారు.
కానీ ఆధునిక పరిశోధనలు పేగులు మన రోగనిరోధక శక్తి, మానసిక ఆరోగ్యం, శరీర బరువు, మధుమేహం, గుండె జబ్బులు, క్యాన్సర్ వంటి అనేక ఆరోగ్య అంశాలపై ప్రభావం చూపుతాయని నిరూపిస్తున్నాయి.


ఫొటో సోర్స్, Getty Images
గట్ హెల్త్ అంటే ఏమిటి?
మన జీర్ణాశయంలో కొన్ని ట్రిలియన్ల సూక్ష్మజీవులు నివసిస్తుంటాయి. వీటిలో బ్యాక్టీరియా, వైరస్‌లు, ఫంగస్‌లు, ఇతర సూక్ష్మజీవులు ఉంటాయి. వీటి సముదాయాన్ని గట్ మైక్రోబయోమ్ (Gut Microbiome) అంటారు.
ఈ సూక్ష్మజీవులు ఆహారాన్ని జీర్ణం చేయడంలో, విటమిన్ల ఉత్పత్తిలో, రోగనిరోధక శక్తి పెంపులో, హానికర సూక్ష్మజీవులను నియంత్రించడంలో ముఖ్యపాత్ర పోషిస్తాయి.
ఆరోగ్యకరమైన సూక్ష్మజీవులు ఎక్కువగా ఉండి, హానికరమైనవి నియంత్రణలో ఉన్నప్పుడు పేగుల ఆరోగ్యం బాగుందని చెప్పవచ్చు.
శాస్త్రవేత్తలు పేగులను 'రెండో మెదడు'గా అభివర్ణిస్తున్నారు. కారణం పేగులు, మెదడు మధ్య నిరంతర సమాచార మార్పిడి జరుగుతుండటమే. దీనిని గట్-బ్రెయిన్ యాక్సిస్ (Gut-Brain Axis) అంటారు.
మన శరీరంలోని సెరోటోనిన్ అనే సంతోషం కలిగించే హార్మోన్‌లో సుమారు 90 శాతం పేగులలోనే ఉత్పత్తి అవుతుంది. అందువల్ల పేగుల ఆరోగ్యం దెబ్బతింటే ఆందోళన, నిరాశ, ఒత్తిడి, నిద్రలేమి వంటి సమస్యలు వచ్చే అవకాశం పెరుగుతుంది.

ఫొటో సోర్స్, Getty Images
గట్ హెల్త్ ఎందుకు ముఖ్యమంటే..
రోగనిరోధక శక్తికి ఆధారం
మన రోగనిరోధక వ్యవస్థలో సుమారు 70 శాతం భాగానికి పేగులతో సంబంధం ఉంటుంది. ఆరోగ్యకరమైన పేగులు హానికర సూక్ష్మజీవులను అడ్డుకొని శరీరాన్ని రక్షిస్తాయి.
పోషక పదార్థాల శోషణ
ఆహారంలో ఉన్న విటమిన్లు, ఖనిజాలు, ప్రోటీన్లు, కొవ్వులు శరీరానికి అందాలంటే పేగులు సక్రమంగా పనిచేయాలి.
బరువు నియంత్రణ
పేగులలోని సూక్ష్మజీవుల సమతుల్యత శరీర బరువుపై ప్రభావం చూపుతుంది. కొన్ని రకాల బ్యాక్టీరియా ఊబకాయం ప్రమాదాన్ని పెంచుతాయని పరిశోధనలు సూచిస్తున్నాయి.
మధుమేహం ప్రమాదం
టైప్-2 మధుమేహం, ఇన్సులిన్ నిరోధకత వంటి సమస్యలకు పేగుల ఆరోగ్యంతో సంబంధం ఉందని అనేక అధ్యయనాలు వెల్లడించాయి.
గుండె ఆరోగ్యం
పేగులలో ఉండే సూక్ష్మజీవులు కొలెస్ట్రాల్ జీవక్రియను ప్రభావితం చేస్తాయి. జీవక్రియలో కొన్ని హానికర ఉత్పత్తులు గుండె జబ్బుల ప్రమాదాన్ని పెంచవచ్చు.
పేగుల ఆరోగ్యం దెబ్బ తింటే తరచూ కడుపు ఉబ్బరం, మలబద్ధకం లేదా విరేచనాలు, గ్యాస్ సమస్య, అజీర్ణం, తరచూ అలసట, నిద్ర సమస్యలు, చర్మ సమస్యలు, తరచూ ఇన్ఫెక్షన్లు వంటి లక్షణాలు కనిపిస్తాయి.
ఈ లక్షణాలు ఇతర వ్యాధుల వల్ల కూడా రావచ్చు. కాబట్టి దీర్ఘకాలంగా ఉంటే వైద్యులను సంప్రదించడం మంచిది.

ఫొటో సోర్స్, Getty Images
గట్ హెల్త్ చెడటానికి కారణాలు
అధిక ప్రాసెస్డ్ ఆహారం
ప్యాకెట్లలో లభించే ఆహారాలు, జంక్ ఫుడ్, చక్కెర ఎక్కువ ఉన్న పదార్థాలు పేగులలోని మంచి బ్యాక్టీరియాను తగ్గిస్తాయి.
యాంటీ బయాటిక్స్ దుర్వినియోగం
యాంటీబయాటిక్స్ హానికర బ్యాక్టీరియాతో పాటు పేగులలో ఉండే ప్రయోజనకరమైన బ్యాక్టీరియాను కూడా నాశనం చేస్తాయి.
ఒత్తిడి
దీర్ఘకాలిక మానసిక ఒత్తిడి పేగుల పనితీరును ప్రభావితం చేస్తుంది.
నిద్రలేమి
తగినంత నిద్ర లేకపోవడం మైక్రోబయోమ్ సమతుల్యతను దెబ్బతీస్తుంది.
వ్యాయామం లేకపోవడం
శారీరక చురుకుదనం తక్కువగా ఉండటం కూడా పేగుల ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావం చూపుతుంది.

ఫొటో సోర్స్, Getty Images
గట్ హెల్త్ బాగుండాలంటే తీసుకోవాల్సిన ఆహార పదార్థాలు
పీచు పదార్థాలు
పండ్లు, కూరగాయలు, సంపూర్ణ ధాన్యాలు, ఓట్స్, చిరుధాన్యాలు, పప్పుధాన్యాలు వంటి పీచు అధికంగా ఉండే ఆహారం మంచి బ్యాక్టీరియాకు ఆహారంగా పనిచేస్తుంది.
పెరుగు
పెరుగులో ఉండే ప్రోబయోటిక్ బ్యాక్టీరియా పేగుల ఆరోగ్యానికి ఉపయోగపడుతుంది.
పులియబెట్టిన ఆహారాలు ( Fermented foods)
పెరుగు, మజ్జిగ, ఇంట్లో తయారు చేసే ఇతర పులియబెట్టిన ఆహార పదార్థాలలో పేగులకు మంచి చేసే బ్యాక్టీరియా ఉంటుంది.
నీరు
తగినంత నీరు జీర్ణక్రియకు, మల విసర్జనకు సహాయపడి పేగులను ఆరోగ్యంగా ఉంచుతుంది.
ప్రోబయోటిక్స్
ఉల్లిపాయలు, వెల్లుల్లి, అరటిపండ్లు, సంపూర్ణ ధాన్యాలు వంటివి మంచి బ్యాక్టీరియా పెరుగుదలకు సహాయపడే పీచు పదార్థాలు.

ఫొటో సోర్స్, Getty Images
ఇటీవలి పరిశోధనల ప్రకారం పేగులలోని సూక్ష్మజీవులు మెదడు పనితీరును ప్రభావితం చేయగలవని తేలింది. ఆందోళన, నిరాశ, ఆటిజం, అల్జీమర్స్ వంటి వ్యాధులపై కూడా మైక్రోబయోమ్ ప్రభావం ఉండవచ్చని అధ్యయనాలు సూచిస్తున్నాయి.
పిల్లలలో పేగుల ఆరోగ్యం జీవితాంతం ఆరోగ్యాన్ని ప్రభావితం చేస్తుంది కాబట్టి తల్లి పాలు కచ్చితంగా ఇవ్వాలి. ఇవి మంచి సూక్ష్మజీవుల పెరుగుదలకు తోడ్పడతాయి. తరువాత మనం చేర్చే ఆహారాన్ని బట్టి పేగులలో మైక్రోబయోమ్ మారుతూ ఉంటుంది కాబట్టి ఎక్కువగా పీచు పదార్థాలు, పండ్లు, కాయగూరలు ఇవ్వాలి.
అధిక జంక్ ఫుడ్‌ను నివారించాలి. అనవసర యాంటీబయాటిక్స్ వాడకాన్ని తగ్గించాలి.
వయస్సు పెరిగే కొద్దీ మైక్రోబయోమ్ వైవిధ్యం తగ్గవచ్చు. దీని వల్ల రోగనిరోధక శక్తి బలహీనపడే అవకాశం ఉంటుంది. కాబట్టి పెద్దవారు పీచు అధికంగా ఉండే ఆహారం తీసుకోవడం, వ్యాయామం చేయడం, తగినంత నిద్రపోవడం చాలా ముఖ్యం.
పెద్ద పేగు క్యాన్సర్‌లో ఈ మైక్రోబయోమ్ పాత్రపై పరిశోధనలు జరుగుతున్నాయి. అధిక పీచు ఆహారం తీసుకోవడం, ఎర్ర మాంసం(Read meat) అధిక వినియోగాన్ని తగ్గించడం, ధూమపానం నివారించడం వల్ల ఈ పెద్ద పేగు క్యాన్సర్ ప్రమాదం తగ్గవచ్చు.

ఫొటో సోర్స్, Getty Images
పేగుల ఆరోగ్యానికి 10 ముఖ్య సూచనలు
1. రోజూ కూరగాయలు, పండ్లు ఎక్కువగా తినాలి.
2. పీచు అధికంగా ఉండే ఆహారం తీసుకోవాలి.
3. తగినంత నీరు తాగాలి.
4. రోజూ వ్యాయామం చేయాలి.
5. ఒత్తిడిని తగ్గించుకోవాలి.
6. తగినంత నిద్రపోవాలి.
7. ధూమపానం మానేయాలి.
8. మద్యపానాన్ని మానేయాలి.
9. యాంటీబయాటిక్స్‌ను వైద్యుల సూచన మేరకు మాత్రమే వాడాలి.
10. ప్రాసెస్డ్ ఫుడ్, జంక్ ఫుడ్‌ను తగ్గించాలి.
ఆరోగ్యకరమైన పేగులు కేవలం జీర్ణక్రియకే కాదు, మన శరీరంలోని దాదాపు ప్రతి వ్యవస్థ ఆరోగ్యానికి కీలకం.
రోగనిరోధక శక్తి నుండి మానసిక ఆరోగ్యం వరకు, బరువు నియంత్రణ నుండి గుండె ఆరోగ్యం వరకు పేగుల పాత్ర ఎంతో ముఖ్యమైనది.
సరైన ఆహారం, క్రమమైన వ్యాయామం, తగిన నిద్ర, ఒత్తిడి నియంత్రణ ద్వారా పేగుల ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు. పేగులు ఆరోగ్యంగా ఉంటే ఆరోగ్యకరమైన జీవితం సాధ్యమవుతుంది.
(గమనిక: రచయిత ఓ డాక్టర్. వైద్యపరమైన విధానాలు, చికిత్సలపై అవగాహన కల్పించడమే ఈ ఆర్టికల్ ఉద్దేశం. ఆరోగ్యపరమైన ఏ నిర్ణయమైనా డాక్టర్‌ను సంప్రదించి మాత్రమే తీసుకోగలరు)
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్, ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)





























